Jump to content

కృష్ణాపత్రిక

వికీపీడియా నుండి
కృష్ణాపత్రిక
రకంపక్షపత్రిక (1902 ఫిబ్రవరి 2)
వారపత్రిక (1907 మార్చి 1)
దినపత్రిక
రూపం తీరుబ్రాడ్ షీట్
యాజమాన్యంకృష్ణాజిల్లా సంఘము
ముట్నూరి కృష్ణారావు
శ్రీ గానకృష్ణా ఎంటర్ప్రైజెస్
ప్రచురణకర్తకృష్ణాజిల్లా సంఘము
ముట్నూరి కృష్ణారావు
ఆర్‌. డి.ఎల్‌. నరసింహమూర్తి
రామకృష్ణారావు
వి.వై.ఎల్.నరసింహారావు
శ్రీ గానకృష్ణా ఎంటర్ప్రైజెస్
సంపాదకులుకొండా వెంకటప్పయ్య & దాసు నారాయణరావు
భోగరాజు పట్టాభి సీతారామయ్య
ముట్నూరి కృష్ణారావు
కాటూరి వెంకటేశ్వరరావు
కోలవెన్ను రామకోటేశ్వరరావు
కమలాకర వెంకటరావు
ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ
పిరాట్ల వెంకటేశ్వర్లు
స్థాపించినది1902 ఫిబ్రవరి 2
కేంద్రంమచిలీపట్నం
మద్రాసు
హైదరాబాదు
విజయవాడ

కృష్ణాపత్రిక బందరు కేంద్రంగా వెలువడిన వారపత్రిక. 1902 లో పక్షపత్రికగా మొదలై, 1907 మార్చి 1 న వారపత్రికగా ఆపై 1984 లో దినపత్రికగా మారింది. కృష్ణాజిల్లా సంఘము దీనిని నెలకొల్పింది. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు దీనికి తొలి సంపాదకులు. ఈ పత్రిక విశాలాంధ్రకు మద్ధతుగా పనిచేసింది. ప్రత్యేక ఆంధ్రప్రాంతం కావాలని వ్యాసాలు రాసింది. వెంకటప్పయ్య తరువాత కృష్ణాపత్రికను ముట్నూరి కృష్ణారావు నడిపారు. కృష్ణారావు రెండుసార్లు పత్రిక సంపాదకత్వం నుండి తప్పుకుని కొంత వ్యవధానం తరువాత మళ్ళీ చేపట్టి 1945 వరకూ సంపాదకత్వం నిర్వహించాడు.

కృష్ణాపత్రిక సాహిత్యం, రాజకీయాలు, వేదాంతం, హాస్యం, సినిమా, రంగస్థల కార్యక్రమాల సమీక్షలు, స్థానిక వార్తలు వగైరాలుండేవి. 1000 సర్క్యులేషను సాధించిన తొలి తెలుగు రాజకీయ పత్రిక కృష్ణాపత్రిక. ముట్నూరి తమ అమూల్యమైన రచనలతో కృష్ణాపత్రికకు అపారమైన విలువను సంపాదించి పెట్టాడు. 1984 లో పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు దీనిని దినపత్రికగా పునరుద్ధరించాడు.

చరిత్ర

[మార్చు]
1907 నుండి 1945 వరకు మరణించేవరకు నాలుగు దశాబ్దాల పాటు కృష్ణాపత్రిక సంపాదకునిగా పనిచేసిన ముట్నూరి కృష్ణారావు దృశ్యచిత్రం

కృష్ణాపత్రిక 1899 లో కృష్ణా జిల్లా సంఘం చేసుకున్న తీర్మానానికి అనుగుణంగా 1902 ఫిబ్రవరి 2 న మచిలీపట్నంలో పక్షపత్రికగా ప్రారంభమైంది. రాజకీయంగా ప్రజలను చైతన్యవంతులను చేయుటకు ప్రారంభించబడిన తొలి వార్తాపత్రికగా మొదటి సంచికలో పేర్కొంటూ ఇలా రాసారు:[1]

"రాజ్యపద్ధతులను, వాని లోపములను నివృత్తి చేయు మార్గములను సంఘ సంస్కరణ రీతులను, రసవాద, ప్రకృతిశాస్త్ర విశేషములను, వ్యవసాయమును చేతిపనులు మొదలుగాగల నుపయుక్త విషయముల నిందు వ్రాయుచుంటిమి"

ముట్నూరి తొలి సంపాదకత్వం

[మార్చు]

1903 లో ముట్నూరి కృష్ణారావు పత్రిక ఉపసంపాదకుడిగా చేరాడు. 1905 లో కొండా వెంకటప్పయ్య గుంటూరు వెళ్ళిపోవడం తోను, అదే సంవత్సరం దాసు నారాయణరావు మరణించడం తోనూ పత్రిక బాధ్యతలు కృష్ణారావుపై పడ్డాయి. అయితే 1906 లో కృష్ణారావు బిపిన్ చంద్ర పాల్ వెంట బెంగాల్లో పర్యటించాడు. ఆ సమయంలో అవటపల్లి నారాయణరావు పత్రిక బాధ్యతలు తీసుకున్నాడు. 1907 లో కృష్ణారావు వెనక్కి వచ్చాక, తిరిగి సంపాదకత్వాన్ని చేపట్టాడు.[2] 'కృష్ణా స్వదేశీ ముద్రాక్షరశాల' అనే ప్రెస్సును కొని అక్కడే ముద్రించడం మొదలుపెట్టాడు.[1]

వారపత్రికగా మారింది

[మార్చు]

బ్రిటిషు ప్రభుత్వ నెలవారీ నివేదికల ప్రకారం, 1907 మార్చి 1 న కృష్ణాపత్రిక వారపత్రికగా మారింది. అప్పటి సర్క్యులేషను 500.[3] 1908 ఏప్రిల్ నాటికి పత్రిక సర్క్యులేషను 1600.[4] ఆ సంవత్సరం జూలైకి ఇది 1850 కి చేరింది.[5]

ముట్నూరి రాజీనామా

[మార్చు]

1908 లో బ్రిటిషు ప్రభుత్వ దమననీతి విమర్శిస్తూ "తెల్లవారిని తుపాకితో కాల్చుట" అనే శీర్షికన రాసిన సంపాదకీయానికి గాను కృష్ణాపత్రిక మూసివేత అంచుదాకా వెళ్ళింది. అయితే, స్థానిక బ్రిటిషు అధికారి పెట్టిన షరతు మేరకు పత్రిక యజమాని అయిన కృష్ణా జిల్లా సంఘం, అధ్యక్షుడైన శెడింబి హనుమంతరావు ద్వారా ఆ సంపాదకీయం రాసిన ముట్నూరి కృష్ణారావు, సహసంపాదకుడైన అవటపల్లి నారాయణరావుల చేత 1908 జూలై 18 న రాజీనామా చేయించడంతో పత్రిక ఆ అవాంతరం నుండి బయటపడింది.[6][7]

పత్రిక నిర్వహణ, సంపాదకత్వం ఎవరు చెయ్యాలనే విషయమై కృష్ణా జిల్లా సంఘం ఆలోచిస్తున్నపుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆ బాధ్యతను తీసుకున్నాడు. అయితే ఆయన సి. వి. రామాచారి అనే ప్లీడరు పేరు మీద పత్రికను నిర్వహించాడు. అలా మూడేళ్ళ పాటు పట్టాభి నిర్వహణలో ఉన్న కృష్ణాపత్రిక ఆర్థికంగా స్థిమితపడింది. 2 వేల రూపాయల లాభంతో వాళ్ళు పత్రికను కృష్ణారావుకు అమ్మేసారు.[1]

ముట్నూరి రెండవసారి సంపాదకత్వం

[మార్చు]

1912 జనవరి 4 న పత్రిక యాజమాన్యంతో సహా సంపాదకత్వం కృష్ణారావు చేతికి వచ్చింది.[8] 1945 లో తాను మరణించేవరకు ఆ పదవిలో కొనసాగాడు. వ్యక్తిగా కాక ఈ పత్రిక తాలూకు శక్తిగా పేరుపొందాడు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కృష్ణాపత్రిక ముఖ్యమైన పాత్ర పోషించింది. పట్టణాలకే పరిమితమవకుండా గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలకు ఉచితంగా పంచబడి విద్యార్థుల ద్వారా గ్రామీణులందరని చైతన్య పరచింది. ఎన్.జి.రంగా, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య, తెన్నేటి విశ్వనాధం తమ చదువులకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో చేరటానికి ఈ పత్రిక, ఆంధ్రపత్రికల ప్రభావం వుందని తెలిపారు. బ్రిటిషు ప్రభుత్వం తమ నివేదికలలో ఈ రెండు పత్రికల ప్రభావాన్ని గుర్తించాయి. 1929 లో ఈ పత్రికలకు గుర్తింపుగా విజయవాడలో సెప్టెంబరు 9 న స్వాతంత్ర్య సమరయోధులు ఎన్.వి.ఎల్ నరసింహారావు అధ్యక్షతన సన్మానం చేశారు. అదే సమయంలో ఆంధ్ర జనసంఘం హైదరాబాదులో గుర్తింపుగా తీర్మానం చేసింది. ఆర్థిక ఇబ్బందులకు గురైనా దాతల విరాళాలతో నడిచింది.[9]

మూడవసారి ముట్నూరి

[మార్చు]

1930, 32 లలో కృష్ణారావు శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని అరెస్టై, జైలుకు వెళ్ళినపుడు మూడేళ్ళపాటు కోట సుబ్బారావు పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఆయనకు సహాయంగా విశ్వనాథ వేంకటేశ్వర్లు, నార్ల వెంకటేశ్వరరావు ఉండేవారు. 1935 లో కృష్ణారావు జైలు నుంచి విడుదలయ్యాక, తిరిగి సంపాదకత్వ బాధ్యతలు చేపట్టి 1945 లో తన మరణం వరకూ నిర్వహించాడు.

కృష్ణారావు మరణం తరువాత కాటూరు వెంకటేశ్వరరావు, కోలవెన్ను రామకోటీశ్వరరావులు సంపాదకత్వం నెరపారు. 1952 లో కమలాకర వెంకటరావు సంపాదకుడయ్యాడు. 1960 లో ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ సంపాదకత్వ, ప్రచురణ బాధ్యతలు తీసుకుని తొలుత మద్రాసులో ఆ తరువాత హైదరాబాదులో 1970 వరకు నడిపాడు. 1970 జూన్‌లో పత్రికను విజయవాడకు, 1971 అక్టోబరులో తెనాలికీ తరలించాడు.[10] 1984 లో పాత్రికేయుడు పిరాట్ల వెంకటేశ్వర్లు దీనిని దినపత్రికగా పునరుద్ధరించి, హైదరాబాదు నుండి ప్రచురించడం మొదలుపెట్టాడు.[10] దీనిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణకుమార్ రెడ్డి సోదరుడు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇతర విశేషాలు

[మార్చు]

కృష్ణాపత్రికలో సహాయ సంపాదకులుగా కమలాకర వెంకట్రావు, రావూరు సత్యనారాయణరావు చాలాకాలం పనిచేసారు. రావూరు 12 ఏళ్ళు పైనే "వడగళ్ళు" అనే శీర్షికలో హస్యపు చినుకులు కురిపించి తెలుగు పాఠకులకు నవ్వుల విందు చేశారు. అంతేకాక నవలలు, కథలు, రాజకీయ వ్యాసాలు, సినిమా, నాటకాల విమర్శలు ఇంకా ఎన్నో వ్రాసి పత్రికకు ప్రాచుర్యం కలిగించారు. కాజ శివరామయ్య మేనేజరుగా, అద్దేపల్లి మల్లిఖార్జునరావు అకౌంటంట్ గా పనిచేసారు. 'వడగళ్ళు' శీర్షికలో ఈయన మల్లినాధ సూరి దాదాపు వారం వారం దర్శనమిచ్చేవారు. ఏ విషయమైనా కృష్ణాపత్రికలో ప్రచురించిందంటే అది ప్రజలు ఎంతో విశ్వాసంగా స్వీకరించేవారు. ముట్నూరి వ్యాసాలు కృష్ణాపత్రికకి కలికితురాయిలా భాసించేవి. కృష్ణాపత్రికలో తోట వెంకటేశ్వరరావు గారు చిత్రకారునిగా పనిచేసేవారు. ఆయన సృష్టించిన చిత్రాలు కృష్ణాపత్రికకు సొగసులు దిద్దేవి.

దక్షిణాఫ్రికాలో భారతీయులపై, ముఖ్యంగా గాంధీపై, జరిగిన దౌష్ట్యాల గురించి 1914 ప్రాంతంలో కృష్ణాపత్రికలో ఒక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసాన్ని ఇంగ్లీషు లోకి అనువదించి, "సౌత్ ఆఫ్రికన్ హారర్" అనే పేరుతో ఐదు అంకాల నాటికగా దక్షిణాఫ్రికాలో ప్రచురించారు. బ్రిటిషు ప్రభుత్వం దాన్ని నిషేధించింది. అపుడు తెలిసింది, ఒరిజినలుగా అది కృష్ణాపత్రికలో ప్రచురితమైనదని.[11]

దర్బారు

[మార్చు]

పత్రిక ఆవరణలో సాయంకాలాలలో "దర్బారు" నిర్వహించేవారు. బందరు లోని కవులు పండితులు, నటులు, గాయకులు, సంగీతకారులే కాక బయటనుంచి కూడా వచ్చి ఈ దర్బారులో పాల్గొని ఆనందించేవారు. వారందరూ విసిరిన చెణుకుల్ని మరుసటి వారం పత్రికలో "పన్నీటి జల్లు" అనే పేరుతో ప్రచురించేవారు. కృష్ణాపత్రికలో తమ రచనలు ప్రకటిస్తే ఎంతో గొప్పగా భావించేవారు. సమాజంలో దేశభక్తిని, కళాకారుల్లో ఉత్తేజాన్ని నింపిన ఉత్తమ స్థాయి పత్రిక కృష్ణాపత్రిక.

పత్రిక సంపాదకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 యం., దత్తాత్రేయశర్మ (1992). ముట్నూరి కృష్ణారావుగారి సంపాదకీయాలు. హైదరాబాదు: శ్రీరామ సిద్ధాంతి ప్రచురణలు. p. 13.
  2. సాదనాల, వెంకటస్వామి నాయుడు (1994). కృష్ణాపత్రిక సాహిత్యసేవ ఒక పరిశీలన. రాజమహేంద్రి: సాదనాల ప్రచురణలు. pp. 13, 14.
  3. Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1907-1908 (in English). Internet Archive. [Publishers vary]. 1907–1908.{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  4. Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1907-1908 (in English). Internet Archive. [Publishers vary]. 1907–1908.{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  5. Indian Newspaper Reports, c1868-1942, from the British Library, London, Part 5: Madras, 1876-1921 1907-1908 (in English). Internet Archive. [Publishers vary]. 1907–1908.{{cite book}}: CS1 maint: date format (link) CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  6. సాదనాల, వేంకటస్వామి నాయుడు (1994). కృష్ణాపత్రిక సాహిత్యసేవ ఒక పరిశీలన. ROP HYDERABAD, HYDERABAD PAR INFORAMTICS. రాజమండ్రి: సాదనాల ప్రచురణలు. p. 16.{{cite book}}: CS1 maint: date and year (link)
  7. తుమ్మల, వెంకటరామయ్య (1984). భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర మొదటి భాగం. విజయవాడ: కృష్ణాజిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం. p. 18.
  8. Indian Newspaper Reports, c1868-1942 from the British Library, London Part 5: Madras, 1876-1921 1913 (in English). Internet Archive. [Publishers vary]. 1913.{{cite book}}: CS1 maint: others (link) CS1 maint: unrecognized language (link)
  9. "About us". కృష్ణాపత్రిక. Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-16.
  10. 10.0 10.1 సాదనాల, వేంకటస్వామి నాయుడు (1994). కృష్ణాపత్రిక సాహిత్యసేవ ఒక పరిశీలన. ROP HYDERABAD, HYDERABAD PAR INFORAMTICS. రాజమండ్రి: సాదనాల ప్రచురణలు. p. 20.{{cite book}}: CS1 maint: date and year (link)
  11. బ్యారియర్, ఎన్. జెరాల్డ్. బ్యాన్‌డ్ కంట్రావర్సియల్ లిటరేచర్ అండ్ పొలిటికల్ కంట్రోల్ ఇన్ బ్రిటిష్ ఇండియా 1907-1947. న్యూఢిల్లీ: మనోహర్ బుక్ సర్వీస్. p. 229.

ఉపయుక్త గ్రంథ సూచి

[మార్చు]