Jump to content

కృష్ణ చివుకుల

వికీపీడియా నుండి

కృష్ణ చివుకుల అమెరికాలో స్థిరపడిన, ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యాపారవేత్త, దాత. బాపట్ల వాస్తవ్యుడైన ఆయన ఐఐటీ బాంబేలో బి.టెక్ చదివాడు. ఐఐటీ మద్రాసులో ఎంటెక్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఎ, తుముకూరు విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి చేశాడు. అమెరికా, బెంగళూరుల్లో వ్యాపార సంస్థలు నెలకొల్పాడు. పేద విద్యార్థులకు చదువుకోవడానికి విరాళాలు ఇచ్చాడు. తాను చదివిన ఐఐటీ మద్రాసుకు 228 కోట్ల రూపాయల విరాళం అందించాడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

బాపట్లలో ఓ మధ్యతరగతి విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి లలితాశ్రీ ఒక న్యాయవాది. ఆయన ఐఐటీ బాంబేలో బి.టెక్ చదివాడు. ఐఐటీ మద్రాసులో 1970 లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఎంటెక్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఎ, తుముకూరు విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి చేశాడు.

ఈయన కర్ణాటకకు చెందిన జగదాంబను వివాహం చేసుకున్నాడు. ఈమె వృత్తి రీత్యా వైద్యురాలు. బెంగళూరులో ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత ఎండీ కోసం అమెరికాకు వెళ్ళిన ఆమెకు కృష్ణ పరిచయమై ఆపై ప్రేమ వివాహం చేసుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసి మెలిసి పాల్గొంటారు.[2]

కెరీర్

[మార్చు]

కేవలం 37 ఏళ్ళ వయసుకే అమెరికాలోని హాఫ్‌మన్ ఇండస్ట్రీస్ కి తొలి భారతీయ గ్రూప్ ప్రెసిడెంట్ గానూ, సీఈవోగా పనిచేశాడు. అందులోనుంచి బయటకు వచ్చి న్యూయార్క్ కేంద్రంగా శివ టెక్నాలజీస్ అనే సంస్థను స్థాపించాడు. మాస్ స్పెక్ట్రోస్కోపీ సాంకేతికత అందించడంలో ఈ సంస్థను ప్రపంచ స్థాయికి చేర్చాడు. ఇదే సంస్థ బెంగళూరులోనూ ఏర్పాటు చేశారు. 1997 లో భారతదేశంలో ఇండో ఎంఐఎం సంస్థ ద్వారా మొదటిసారిగా మెటల్ ఇంజెక్షన్ మౌల్డింగ్ ను పరిచయం చేశాడు. ప్రస్తుతం ఇండో యూఎస్ ఎంఐఎం టెక్నాలజీస్ ప్రైవేట్ టెక్నాలజీస్ సంస్థకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సంస్థకు భారతదేశంలో వెయ్యికోట్లకు పైగా టర్నోవరు సాధించింది. 2009 లో రేణిగుంట సమీపంలో గౌరి వెంచర్స్ అనే పేరుతో సంస్థను ప్రారంభించాడు.

దాతృత్వం

[మార్చు]

తాను చదివిన ఐఐటీ మద్రాసులో 60 ఏళ్ళ నాటి హాస్టల్ ను 5.5 కోట్ల రూపాయలతో ఆధునీకరించాడు. 2014 లో ఐఐటీ ఎంశాట్ పేరుతో విద్యార్థులు శాటిలైట్ తయారు చేయడానికి 1.5 కోట్ల రూపాయలను వితరణగా ఇచ్చాడు. ఆ ప్రాంగణంలో స్పేస్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు.

పురస్కారాలు

[మార్చు]

ఈయనకు 2015లో ఐఐటీ మద్రాసు, 2016 లో ఐఐటీ బాంబే వారు డిస్టింగ్విష్డ్ అలమ్నస్ (ఉత్తమ పూర్వవిద్యార్థి) అవార్డును ప్రధానం చేశారు.[3]

మూలాలు

[మార్చు]
  1. "Krishna Chivukula: ఐఐటీ మద్రాస్‌కు తెలుగు తేజం భూరి విరాళం.. ఏకంగా రూ.228 కోట్లు!". Samayam Telugu. Retrieved 2024-08-05.
  2. "Dr. Jagadamba Chivukula: అంత డబ్బు మాకొద్దు... అందుకే ఇచ్చేస్తున్నాం". EENADU. Retrieved 2024-08-14.
  3. "Krishna Chivukula: మద్రాస్‌ ఐఐటీకి కృష్ణా చివుకుల భూరి విరాళం". EENADU. Retrieved 2024-08-05.