Jump to content

కర్నూలు కడప కాలువ

వికీపీడియా నుండి
(కె.సి.కాలువ నుండి దారిమార్పు చెందింది)
కర్నూలువద్ద కె.సి.కెనాల్

కర్నూలు కడప కాలువ రాయలసీమ లోని ఒక ప్రధాన పంట కాలువ.[1][2][3] దీన్ని కే సి కెనాల్ లేదా కే సి కాలువ అంటారు. దీన్ని ఆంగ్లేయుల కాలములో 19 వ శతాబ్దంలో నిర్మించారు.[4] కర్నూలు, కడప జిల్లాల గుండా సాగుతూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న కాలువ ఇది. సాగునీటి కే కాకుండా తాగునీటికి కూడా ఇది ప్రధాన వనరు.

చారిత్రిక నేపథ్యం

[మార్చు]

ఈ కాలువను 1866 లో బ్రిటిషు వారి హయాంలో మద్రాస్ ఇరిగేషన్ కంపెనీ నిర్మించింది. 1882 లో బ్రిటిషు ప్రభుత్వం ఈ కాలువను తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిలో భాగంగా కర్నూలు నగరంలో తుంగభద్ర నదిపై 8.23 మీటర్ల ఆనకట్ట నిర్మించారు. 304 కిలోమీటర్ల కాలువను సెకండుకు 84.9 క్యూబిక్ మీటర్ల ప్రవాహ సామర్థ్యంతో 52.746 హెక్టారుల సాగుభూమికి నీరందించే విధంగా ఈ కాలువను నిర్మించారు. ఇది కృష్ణా నది పరీవాహక ప్రాంతం నుండి పెన్నా పరీవాహక ప్రాంతానికి నీటిని తరలిస్తుంది.[5] కరువు కాటకాలతో అల్లాడిపోతున్న కడప, కర్నూలు రైతాంగానికి ఈ కాలువ నిర్మాణం ఒక వరప్రసాదంగా మారింది.

కె.సి.కెనాల్ పథకం,130 ఏళ్ళ క్రితం, ఉపతుంగభద్ర పరీవాహకప్రాంతం, కృష్ణాపరీవాహక ప్రాంతానికి సంబంధించిన నౌకాయానం, వ్యవసాయభూములకు నీటి సదుపాయం కల్పించుటకై ఉద్దేశించి ఆంధ్రలో ప్రారంభించిన నీటి కాలువ. డచ్ దేశానికి చెందిన మద్రాసు ఇరిగేషను అండ్‌ కెనాల్ కంపెనీ లిమిటెడ్ అను ఒక ప్రైవేటు సంస్థ ఈ కాలువ నిర్మాణం చేపట్టింది. కాలువ త్రవకాన్ని 1870లో ప్రరంభించి1883 నాటికి పూర్తిచేసారు (కాని కాలువ పనులన్నీ పూర్తికాలేదు). ఇది సుంకేసుల అనకట్ట కుడి పార్శం వద్ద మొదలై కర్నూలు, కడప నగారాల మీదుగా సాగి, కడప జిల్లాలోని కృష్ణపురం వద్ద అంతమవుతుంది. నిర్మాణ సమయంలో కాలువ నిర్మాణం జాప్యం అవ్వడంతో, 1882లో ఈ ప్రాజెక్టు పనిని బ్రీటిష్‌ ఇండియా 3.02 (£1,700,000) కోట్ల రూపాయలకు తన స్వాధీనంలోకి తీసుకున్నది. సర్ అర్థర్ కాటన్ సలహా ప్రకారం, కాలువలో నౌకాయానాన్ని క్రమంగా తగ్గిస్తూ, వ్యవసాయ భూములకు నీటి పారుదలను పెంచుతూ వచ్చారు. 1933 నాటికి కాలువలో నౌకా యానం పూర్తిగా నిలిచిపోయింది.[6]

సంభవించే కరువును దృష్టిలో పెట్టుకొని కర్నూలు విభాగంలో కాలువ నిర్మాణ పనులను 1860లో ప్రారంభించారు. తొందపాటువలన, అనుభవరాహిత్యం వలన, కొన్నిచోట్ల త్రవ్వకంలో వచ్చిన ఇబ్బందులవలన, అధికంగా నిర్లక్ష్యంగా ఖర్చుచెయ్యడం వలన, సగం కాలువ పని అయ్యేటప్పటికి, కేటాయించిన నిధులు ఖర్చు అయ్యిపొయాయి. మళ్ళీ కొత్తగా నిధులు సమీకరించి గుత్తేదారులను పిలిచి 1871 నాటికి ప్రాజెక్టును పూర్తి చెయ్యగలిగారు[7]

ఈ కాలువ సముద్రమట్టంనుండి 134 మీటర్ల ఎత్తున ఉంది. [8]

నీటి పారుదల

[మార్చు]

కె.సి కెనాల్ జమ్మలమడుగు తాలుకా సుద్దపల్లి వద్ద కడప జిల్లాలో ప్రవేశిస్తుంది. ప్రొద్దటూరులో పెన్నానదిని 182 వ మైలు వద్ద దాటి కడప వైపు కొనసాగుతుంది.[9] ఈ కాలవక్రింద మొదటగా 122200 హెక్టారుల భూమికి నీటి సదుపాయం లభించింది. తరువాత శ్రీశైలం ప్రాజెక్టు ముంపుప్రాంతాలను, శ్రీశైల నగర సమీప ప్రాంత భూములను తప్పించగా చివరకు 110482 హెక్టార్ల భూమికి నీటి సదుపాయం అందుతున్నది. ఇందులో కర్నూలు జిల్లాక్రింద 75879 హెక్టరులు, కడప జిల్లాక్రింద 34603 హెక్టరులు సాగులో ఉన్నాయి.ఈ కాలువకు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ KWDT కేటాయించిన నీటి పరిమాణం 39.9 టి ఎం.సి. అంతే కాకుండా తుంగభద్ర ఆనకట్టలో 230 టి.ఎం.సి ల నీరు ఉంటే అదనంగా 10 టి ఎం.సి నీరు కాలువకు ఇచ్చేలా KWDT అనుమతి మంజూరు చేసింది[10]

కడప జిల్లా లో కెసి కాలువ

[మార్చు]

కడప జిల్లాలో కేసీ కాల్వ కింద 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో జలవనరుల శాఖ మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలో 82 వేల ఎకరాలు సాగవుతోంది. జిల్లాలో కుందూనదిపై ఉన్న రాజోలి ఆనకట్ట వద్ద 234.640 కి.మీ నుంచి ప్రారంభమయ్యే కేసీ ప్రధాన కాల్వ 305.860 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీనికి అనుబంధంగా 40.70 కి.మీ చాపాడు కాల్వతో పాటు 16 కి.మీ ఏటూరు కాల్వ, 24 కి.మీ కొండపేట ఉపకాల్వలు ఉన్నాయి. ప్రధానకాల్వ అడుగడుగునా గండ్లుపడి, లైనింగ్ దెబ్బతిని దారుణంగా తయారైంది. ఏటా విలువైన సాగునీరు భారీమొత్తంలో వృథాగా పోతోంది. 1998లో ఆధునికీకరణ పనులు చేపట్టారు. లైనింగ్‌తో పాటు అడుగుభాగంలో కాంక్రీట్ పరుపు వేశారు. చివరి ఆయకట్టు వరకు నీరందేలా చేశారు. 1996-2004 సంవత్సర మధ్యకాలంలో 2000 కోట్ల రూపాయల ఖర్చుతో నవీకరించడమైనది.[7]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "KC Canal's share in Rajolibanda scheme: Byreddy calls for stir". hindu.com. July 23, 2006. the original నుండి 2008-04-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  2. "KC Canal reopened". hindu.com. Jul 20, 2005. the original నుండి 2006-09-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  3. "Ryots picket KC Canal engineer's office". hindu.com. Jul 23, 2004. the original నుండి 2004-08-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  4. "development of kc canal area". news.google.com. Jun 13, 1953. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  5. "Hydrology and Water Resources of India". books.google.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  6. "K.C. CANAL". irrigation.cgg.gov.in. 2004-06-01. the original నుండి 2015-04-14 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  7. 1 2 "KC Canal – A major source of Irrigation". kadapa.info. 9 April 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  8. "Kurnool Cuddapah Canal". in.geoview.info. the original నుండి 2024-12-18 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  9. "District Gazetteer, Cuddapah". books.google.co.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.
  10. "Irrigation Planning And Command Area Development" (PDF). nwda.gov.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-04-09.