కె. కుసుమారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కె. కుసుమారెడ్డి
జననం
కె. కుసుమారెడ్డి

వృత్తివిశ్రాంత తెలుగు ఆచార్యులు
తల్లిదండ్రులు
  • జయరామిరెడ్డి (తండ్రి)

కొండూరు కుసుమారెడ్డి (కుసుమాబాయి), తెలంగాణకు చెందిన విశ్రాంత తెలుగు ఆచార్యులు.[1] సంగీతం, నృత్యం, వాద్య పరికరాల గురించి పరిశోధన చేసింది. రెండు పీహెచ్‌డీలతోపాటు డి.లిట్‌ డిగ్రీ చేసి వాచస్పతి బిరుదును పొందిన ఏకైక వ్యక్తిగా నిలిచింది. ముప్ఫైమందికి పైగా పరిశోధనా విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసర్చ్‌ సంస్థ నుండి జాతీయ స్థాయిలో సీనియర్‌ అకడమిక్‌ ఫెలోషిప్‌ పొందడంతోపాటు 2012లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గ్రంథ రచయిత్రిగా సాహితీ పురస్కారం అందుకుంది.[2]

జననం, విద్య[మార్చు]

తండ్రి జయరామిరెడ్డి తెలుగు పండితుడు, కవి. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ పొందాడు. పాఠశాల విద్య అయిపోయిన తర్వాత బీఎస్సీ ఇంగ్లీష్‌ మీడియంలో చేరింది. బీఎస్సీలో ఉన్నప్పుడే తెలుగు సాహిత్యంపై అభిరుచి ఏర్పడడంతో ఎంఏ తెలుగులో చేరి ఫస్ట్‌ క్లాస్‌లో పాసయ్యింది.

ఉద్యోగం[మార్చు]

మొదటి పీహెచ్‌డీ పూర్తిచేయగానే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరి, 30 ఏళ్ళపాటు పనిచేసి తెలుగు శాఖ అధ్యక్షురాలిగా పదవీ విరమణ పొందింది.[3] ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆర్‌జీయూకేటీ ఐఐఐటి మూడు సెంటర్లకు తెలుగు ప్రొఫెసర్‌గా, కో - అర్డినేటర్‌గా, ఇంటర్‌ బోర్డులో పాఠ్యప్రణాళిక సంఘం సభ్యురాలిగా పనిచేసింది.

పరిశోధనలు-ప్రచురణలు[మార్చు]

ఆ తరువాత తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీలలో మొట్టమొదట కనకాభిషేక సత్కారం పొందిన రంగాజమ్మ అనే కవయిత్రి గురించి 'రంగాజమ్మ కృతుల్లోని భాష'పై ఎంఫిల్‌ పట్టా పొందింది. 'మడికి సింగన కృతుల పరిశీలన' అనే అంశంపై పరిశోధన చేసి మొదటి పీహెచ్‌డీ, 'ఏన్షియంట్‌ ఇండియన్‌ హిస్టరీ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌' నుండి నాయకరాజులు పోషించిన సంగీత, నృత్య రీతులపై పరిశోధన చేసి రెండవ పీహెచ్‌డీలను పొందింది.

తెలుగులో పద్యరూపంలో రచింపబడిన శాస్త్ర గ్రంథాలన్నింటినీ పరిశోధించి యూజీసీ తొలి ప్రాజెక్ట్‌గా 'శాస్త్ర గ్రంథ సమాలోచనం' అనే గ్రంథాన్ని రాసి ప్రచురించింది. పురాతన పుస్తకాల్లో ప్రస్తావించిన అనేక రకాల నృత్య రీతులపై యూజీసీ రెండో ప్రాజెక్ట్‌గా 'తెలుగు నృత్య కళా సంస్కృతి' పేరుతో గ్రంథంగా తీసుకొచ్చింది. ఈ గ్రంథానికే తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ గ్రంథ పురస్కారం అందుకుంది.[4] పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉపయోగపడేలా పరిశోధనా గ్రంథాలు ఎలా రాయాలి, పరిశోధన ఎలా చేయాలి అనే దానిపై 'తెలుగు పరిశోధనా పద్ధతులు (రీసర్చ్‌ మెథడాలజీ) అనే గ్రంథాన్ని రాసింది. సంస్కృతంలో ''నాట్య శాస్త్ర దిశా, రసతత్త్వ పరంపరాయాహా: సమీక్షణం'' అనే గ్రంథాన్ని రాసి వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం నుండి డి.లిట్‌ డిగ్రీ, వాచస్పతి అనే బిరుదు పొందిన మొదటి వ్యక్తిగా నిలిచింది.

'ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసర్చ్‌' అనే సంస్థవారు సీనియర్‌ అకడమిక్‌ ఫెలోషిప్‌ను అందుకొని 'తెలంగాణ గిరిజనుల సంస్కృతి, సంగీతం, నృత్యం, సంగీత వాద్యాలు' అనే అంశంపై పరిశోధన చేసింది. జాతీయ స్థాయిలో 10 అవార్డులకుగాను తెలంగాణ నుండి కుసుమారెడ్డి అవార్డు పొందింది.[2]

మూలాలు[మార్చు]

  1. "తెలుగు భాషా సేవలో వైఎస్‌ ఆదర్శప్రాయుడు". Sakshi. 2019-04-03. Archived from the original on 2019-04-02. Retrieved 2023-02-21.
  2. 2.0 2.1 అయినంపూడి, శ్రీలక్ష్మి (2023-02-15). "భాష ప్రాణమై.. కళలు ఊపిరై... | మానవి". NavaTelangana. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.
  3. "ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ అధ్యక్షులు". www.osmania.ac.in. Archived from the original on 2022-09-26. Retrieved 2023-02-21.
  4. "ఇకపై మన భాష.. మన సంస్కృతి". Sakshi. 2015-09-23. Archived from the original on 2023-02-21. Retrieved 2023-02-21.