Jump to content

కొడకొండ్ల

అక్షాంశ రేఖాంశాలు: 17°51′42″N 78°45′13″E / 17.8615436°N 78.7536108°E / 17.8615436; 78.7536108
వికీపీడియా నుండి

కొడకొండ్ల, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ మండలంలోని గ్రామం.[1]

కొడకొండ్ల
—  రెవెన్యూ గ్రామం  —
కొడకొండ్ల is located in తెలంగాణ
కొడకొండ్ల
కొడకొండ్ల
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°51′42″N 78°45′13″E / 17.8615436°N 78.7536108°E / 17.8615436; 78.7536108
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట
మండలం గజ్వేల్
ప్రభుత్వం
 - సర్పంచి తేరాల విజయ
జనాభా (2011)
 - మొత్తం 2,268
 - పురుషుల సంఖ్య 1,150
 - స్త్రీల సంఖ్య 1,118
 - గృహాల సంఖ్య 543
పిన్ కోడ్ 502312
ఎస్.టి.డి కోడ్ 08454

ఇది మండల కేంద్రమైన గజ్వేల్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది.హైదరాబాదు - రామ‌గుండం రాజీవ్ ర‌హ‌దారిపై ప్రజ్ఞాపూర్ నుండి 7 కిలోమీటర్ల దూరములో ఉంది.గజ్వేల్ మండలానికి చివరన ఉన్న గ్రామం.గ‌జ్వేల్ శాసనసభ నియోజ‌క వర్గం పరిధిలోకి వ‌స్తుంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 543 ఇళ్లతో, 2268 జనాభాతో 1089 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1150, ఆడవారి సంఖ్య 1118. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 659 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 36. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 573641[3].పిన్ కోడ్: 502312.కొడ‌కండ్ల గ్రామం స‌ముద్ర మ‌ట్టానికి 528 మీట‌ర్ల ఎత్తులో ఉంది.

గ్రామ విశేషాలు

[మార్చు]

కొడకండ్ల గ్రామాన్ని ఆనుకొని కుడలియార్ వాగు ప్రవహిస్తుంది. కొడ‌కండ్ల‌లో ప్ర‌ఖ్యాతిగాంచిన 400 కేవీ స‌బ్‌స్టేష‌న్ ఉంది. ఈ సబ్‌స్టేష‌న్ ద్వారా నాలుగైదు జిల్లాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతోంది. గ‌తంలో ఉన్న చ‌క్కెర ఖండ‌సార ఫ్యాక్టరీ మూత‌ప‌డినా కొత్తగా వెల‌సిన ప‌రిశ్రమ‌లు గ్రామంలోనే వారికే కాకుండా చుట్టుప‌క్కల వారికి ఉపాధిని క‌ల్పిస్తున్నాయి. 400కేవీ విద్యుత్ సబ్‌స్టేషను‌తో సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలిగితే కొడ‌కండ్ల గ్రామం పారిశ్రామికంగా, ఇతర రంగాలు మరింత అభివృద్ధి చెందే అవ‌కాశం ఉంది. కొడ‌కండ్ల‌లో మూడు విత్త‌న ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి. ఈ ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేసేందుకు చాలా మంది ఇక్క‌డికి వచ్చి ఉంటున్నారు. చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాల వారే కాకుండా మ‌హారాష్ట్ర, ఒడిశా ప్రాంతాల నుంచి వ‌చ్చి ఇక్క‌డ ఉంటూ ఈ ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేస్తున్నారు.

సమీప గ్రామాలు

[మార్చు]

రిమ్మన‌గూడ‌, కుక్కునూర్‌ప‌ల్లి, రామ‌చంద్రపురం, రాయ‌వ‌రం, బూరుగుపల్లి

సమీప మండలాలు

[మార్చు]

కొడ‌కండ్ల గ్రామానికి స‌మీపంగా ఉన్న మండ‌లాలు: జ‌గ‌దేవ్‌పూర్‌, ములుగు, కొండ‌పాక‌, తొగుట‌, వ‌ర్గ‌ల్. .

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో జిల్లా పరిష‌త్ ఉన్నత పాఠ‌శాల‌, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లు ఉన్నాయి. కొడ‌కండ్లలో ప్రైవేట్ స్కూల్స్ లేవు. కొడ‌కండ్లకు స‌మీపంలోనే కుకునూర్‌ప‌ల్లి, ప్రజ్ఞాపూర్, గ‌జ్వేల్ ఉండ‌టం వ‌ల్ల కొంత‌మంది త‌మ పిల్లల‌ను అక్కడికి పంపి చ‌దివిస్తున్నారు. ఈ మధ్యే ఓ ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేశారు.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

కొడ‌కండ్ల గ్రామం గుండా రాజీవ్ ర‌హ‌దారి వెళ్తుంది. ఈ మ‌ధ్యే నాలుగు లైన్ల ర‌హ‌దారిగా మార్చి మ‌ధ్యలో డివైడ‌ర్లు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఆర్డిన‌రీ బ‌స్సులకు స్టాప్ ఉంటుంది. ఎక్స్‌ప్రెస్‌ల‌కు కూడా ఈ మధ్య స్టాప్ ఏర్పాటు చేశారు. కానీ అన్ని బస్సులు ఆగవు. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక డిపోలకు చెందిన బస్సులు మాత్రమే ఆగుతాయి. సైదయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్స్‌ప్రెస్‌ల‌కు స్టాప్ ఉండేది. ఆ తర్వాత రద్దు చేశారు. మళ్లీ ఈ మధ్యే ఏర్పాటు చేశారు. గ‌జ్వేల్‌, జ‌గ‌దేవ్‌పూర్‌, వర్గ‌ల్‌, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, మెద‌క్‌, సంగారెడ్డి, వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్‌లు కొండ‌కండ్ల‌కు స‌మీపంగా ఉన్న ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు. కొడ‌కండ్ల నుంచి సిద్దిపేట 32 కి.మీ దూరంలో ఉంది. భువ‌నగిరికి 48 కి.మీల దూరంలో, మెద‌క్‌కు 55 కి.మీల దూరంలో, హైద‌రాబాద్‌కు 59 కి.మీల దూరంలో ఉంది. కొడ‌కండ్ల నుంచి క‌రీంన‌గ‌ర్ 90 కి.మీల దూరంలో ఉంది. నాగార్జున సాగ‌ర్ 175 కి.మీల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డికి 79 కి.మీల దూరంలో కొడ‌కండ్ల గ్రామం ఉంది.

రైల్వే సౌక‌ర్యం

[మార్చు]

కొడ‌కండ్ల గ్రామానికి రైల్వే కల త్వరలో తీరనుంది. సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్, గజ్వేల్ మీదుగా రైల్వేమార్గం (మనోహరబాద్ నుండి పెద్దపల్లి వరకు) త్వరలో రానుంది. కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేటకు రైలుమార్గం త్వరలో పూర్తికానుంది. కొడకండ్లలో స్టాప్ ఉంటుందట. ఇప్పటికే గజ్వేల్ వరకు రైలు మార్గం పూర్తయింది. అంతకు ముందు బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి, మాసాయిపేట రైల్వేస్టేష‌న్లు కొడ‌కండ్ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. బ్రాహ్మ‌ణ‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ 25 కి.మీల దూరంలో, మాసాయిపేట రైల్వేస్టేష‌న్ 26 కి.మీల దూరంలో ఉన్నాయి.

స‌మీప ఎయిర్‌పోర్టులు

[మార్చు]

రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు (శంషాబాద్‌) 80 కి.మీల దూరంలో, నాందేడ్ ఎయిర్‌పోర్టు 232 కి.మీల దూరంలో, లాతూరు ఎయిర్‌పోర్టు 271 కి.మీల దూరంలో, విజ‌య‌వాడ ఎయిర్‌పోర్టు (గ‌న్న‌వ‌రం) 300 కి.మీల దూరంలో ఉన్నాయి.

గ్రామములో మౌలిక వసతులు

[మార్చు]

ఆరోగ్య సంరక్షణ

[మార్చు]

గ్రామంలో ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం ఉన్నా సేవ‌లు అంతంత మాత్రమే. పీహెచ్‌సీ సేవ‌లు ఎక్కువ‌గా గ‌ర్బిణిలు, చిన్న పిల్లల‌కు టీకాలు, పోలియో డ్రాప్స్ వాటిల్లోనే ఉప‌యోగ‌ప‌డ‌తాయి. చిన్న చిన్న వ్యాధుల‌కు ఆర్ఎంపీ డాక్టర్ల సేవ‌లే ఆధారం. అంత‌కంటే పెద్ద జ‌బ్బులు, ప్రమాదాల వంటివి జ‌రిగితే గ‌జ్వేల్ ప్రభుత్వాసుప‌త్రి, హైద‌రాబాద్‌లోని గాంధీ, ఇత‌ర ప్రైవేట్ ఆస్పత్రుల‌కు వెళ్లాల్సిందే.

మంచినీటి వసతి

[మార్చు]

స‌మైక్య రాష్ట్రంలో చెన్నారెడ్డి సీఎంగా ఉన్నపుడు నిర్మించిన ట్యాంక్ గ్రామ మంచినీటి అవ‌స‌రాల‌ను తీర్చలేక‌పోయింది. కొత్తగా మిషన్ భగీరథలో భాగంగా మరో రెండు మంచినీటి ట్యాంకులను నిర్మించారు.

రోడ్దు వసతి

[మార్చు]

గ్రామం గుండా రాజీవ్ ర‌హ‌దారి వెళ్తున్నా ఊర్లో మ‌ట్టి రోడ్లే ఎక్కువ.. మెయిన్‌రోడ్ నుంచి ఊళ్లోకి వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారితో కొన్ని చోట్ల సిమెంట్ రోడ్ ఉంది. అవి కూడా ఇటీవలే వేశారు.

గ్రామములో రాజకీయాలు

[మార్చు]

ప్రస్తుతం గ్రామ స‌ర్పంచిగా తేరాల విజయ ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై గెలిచారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మొద‌టి నుంచే ఉంది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన త‌ర్వాత టీడీపీ క్ర‌మంగా కాంగ్రెస్‌కు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. బీజేపీ, వైసీపీ, వామ‌ప‌క్ష పార్టీల‌కు కొడ‌కండ్ల‌లో నామ‌మాత్ర ఉనికి కూడా లేదు. టీఆర్ఎస్ ఏర్పాటు త‌ర్వాత కండక్ట‌ర్‌గా ఉన్న భూమ‌య్య ప‌ద‌వికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి స‌ర్పంచ్‌గా ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా అయిన త‌ర్వాత గ్రామంలో రాజ‌కీయ ప‌రిస్థితులు మారిపోయాయి. గ్రామ స‌ర్పంచ్ మ‌హేంద‌ర్‌రెడ్డితో పాటు వార్డు మెంబ‌ర్లు, ఎంపీటీసీ అంజ‌య్య‌యాద‌వ్‌తో పాటు కాంగ్రెస్ కార్య‌కర్త‌లంతా టీఆర్ఎస్‌లో చేరారు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో వెంక‌టేశ్వ‌ర ఆల‌యం ఉంది. ఈ ఆలయానికి పక్కనుంచే కాళేశ్వరం కాలువ వెళ్లింది. ఈ కాలువ కొండ పోచమ్మ సాగర్ కు వెళ్లే కాలువ. ఇప్పుడిది ఈ గ్రామానికే పెద్ద దర్శనీయ ప్రదేశంగా మారింది. కాలువ పక్కనే నిర్మించిన వెంకటేశ్వర ఆల‌యంలో ప‌చ్చ‌ని పూల‌ చెట్లు, నీడ‌నిచ్చే చెట్లు ఉండ‌టంతో ఆ వైపున వెళ్లేవారు ఇక్క‌డ ఆగి స్వామిని ద‌ర్శించుకుని కాసేపు సేద దీరి వెళ్తుంటారు. పాత హ‌నుమాన్ టెంపుల్‌, ఎల్ల‌మ్మ ఆల‌యం కూడా గ్రామంలో ప్ర‌సిద్ధి గాంచిన‌వి. ఇవి కాకుండా కొడ‌కండ్ల చెరువు స‌మీపంలో కొత్త‌గా శివాల‌యం, పెద్ద‌మ్మ ఆల‌యం నిర్మించారు.

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

ఈ గ్రామంలో ప్రధానంగా వరి, మొక్కజొన్న పంట‌లను పండిస్తారు. కొంత‌మంది పచ్చజొన్న, రాగులు, ఉల‌వలు వంటి పంట‌ల‌ను అంత‌ర పంట‌లుగా పండిస్తారు. గ్రామానికి ద‌గ్గర‌లో షుగ‌ర్‌ ఫ్యాక్టరీ అందుబాటులో ఉన్నపుడు చెరకు పంట‌ను పండించేవారు, ఆ ఫ్యాక్టరీ మూత ప‌డ‌టంతో చెరుకు వేయ‌డం మానేశారు. కొంద‌రు టమాట, మిర‌ప‌, చిక్కుడు వంటి కూర‌గాయ‌ల‌ను పండిస్తున్నారు.

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

గ్రామంలో ఎక్కువ శాతం మంది ప్ర‌జ‌ల ప్ర‌ధాన వృత్తి వ్య‌వ‌సాయ‌మే. మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌హిళ‌లు బీడీలు చుట్ట‌డం, కూలీ పనుల ద్వారా జీవ‌నోపాధి పొందుతున్నారు. గ్రామంలో కొత్త‌గా పరిశ్ర‌మ‌లు వెలుస్తుండ‌డంతో కొంద‌రు ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేస్తున్నారు.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

[మార్చు]

కొడ‌కండ్ల గ్రామానికి చెందిన గజ్వేల్ సైదయ్య నాలుగు సార్లు ఎస్సీల‌కు కేటాయించిన గ‌జ్వేల్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1962 వ‌ర‌కు గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం జ‌న‌ర‌ల్‌గా ఉండేది. నియోజ‌క‌వర్గాల పున‌ర్ విభ‌జ‌న‌తో గ‌జ్వేల్ ఎస్సీల‌కు కేటాయించ‌డంతో కాంగ్రెస్ నేత రంగారెడ్డి త‌న అనుచ‌రుడు సైద‌య్య‌ను ఇండిపెండెంట్‌గా నిల‌బెట్టి గెలిపించారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెంక‌ట‌స్వామిపై సైద‌య్య విజ‌యం సాధించారు. ఆ తర్వాత సైద‌య్య‌ను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుంది. నాటి నుంచి 1967, 1972, 1977 ఎన్నికల్లో సైద‌య్య కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా విజ‌యం సాధించారు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-08-17.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]