కొత్త సత్యనారాయణ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త సత్యనారాయణ చౌదరి
Ksc-b.jpg
కొత్త సత్యనారాయణ చౌదరి
జననంకొత్త సత్యనారాయణ చౌదరి
డిసెంబరు 31, 1907
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు
మరణండిసెంబరు 15, 1974
ఇతర పేర్లుకొత్త సత్యనారాయణ చౌదరి
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిసాహితీ విమర్శకుడు,
పండిత కవి ,
హేతువాది
ఉభయ భాషా ప్రవీణుడు.

కొత్త సత్యనారాయణ చౌదరి (డిసెంబరు 31, 1907 - డిసెంబరు 15, 1974) సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది, ఉభయ భాషా ప్రవీణుడు.

జీవిత చరిత్ర[మార్చు]

చౌదరి గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు గ్రామంలో బుచ్చయ్య చౌదరి, రాజరత్నమ్మ దంపతులకు డిసెంబరు 31, 1907 సంవత్సరంలో జన్మించాడు. స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు. ఇతడు ప్రాథమిక విద్య అమృతలూరు సంస్కృత పాఠశాలలో గావించాడు. అక్కడ భాషా ప్రవీణ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, చిట్టిగూడూరులోని నరసింహ సంస్కృత కళాశాలలో చేరి 1929లో ఉభయ భాషా ప్రవీణ పట్టా ప్రథమ శ్రేణిలో పొందినాడు. ఆయన విద్యాభ్యాసం అంతా సంస్కృతాంధ్రాల్లోనే సాగింది.1930 లోభాషా పోషక గ్రంథమండలిని స్థాపించారు.డెబ్బై గ్రంథాలు ప్రచురించారు.


తిరుమల గుదిమెళ్ళ వరదాచారి, దువ్వూరి వెంకటరమణ శాస్త్రి ఇతడి గురువులు. కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సాంగత్యంలో ఇతడి లోని సంఘ సంస్కరణ భావాలు బలపడ్డాయి. ఇతడు నిడుబ్రోలు ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా, అనంతరం పాములపాటి బుచ్చినాయుడు కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగం చేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించాడు. 1930 లోనే భాషా పోషక గ్రంథ మండలి స్థాపించి దాని ద్వారా తన రచనలను ప్రకటించడం ప్రారంబించాడు. రామాయణ రహస్యాలు లాంటి ఇతడి విమర్శక రచనలు జనసామాన్యంలోనే కాక, సాహితీలోకంలో సంచలనం సృష్టించాయి. తొలుత తెలుగు విద్యార్థిమాసపత్రిక లోను, తదుపరి 1961 జూన్ నుంచి భారతి మాసపత్రికలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షం పై విమర్శల పరంపర కొనసాగించాడు. తదనంతరం కల్పవృక్ష ఖండనంగా ప్రచురించాడు.


ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో తెలుగునేల నాలుగు చెరగులా పునర్వికాసనోద్యమానికి దోహదకారిగా జాతీయవాదం వెల్లివిరిసింది. అదేసమయంలో సూతాశ్రమ స్థాపకులు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి హేతువాదతత్వం వేళ్ళూనుకొంటున్నది. ఇందులో రెండవ దానికి కార్యరంగం తెనాలి సీమయే కావడంతో, నాటి భావకులెందరిపైననో పై రెండింటి ప్రభావం విశేషంగా ప్రసరించింది, ప్రభావితంచేసింది. అట్టి ప్రభావితుల కోవలోని కోవిద్రగ్రామణులలో అగ్రేసరులు శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి గారు హేతువాద తత్వ ప్రభావంతో నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఈఅన్వేషణ, అనంతర కాలంలో వీరు సంతరించిన రచనలలో స్పష్టంగా కానవస్తుంది . కలిపురాణం, రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనం మొదలైన గ్రంథాలు వీరి సత్యాన్వేషణకు, తత్వాన్వేషణకు మారు రూపాలు.


ఇతడికి ఆరుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆదర్శ ఉపాధ్యాయులు, ఉత్తమ పండితులు, ఉదాత్త విమర్శకులు అయిన ఇతడు డిసెంబరు 15, 1974 సంవత్సరంలో పరమపదించాడు.

రచనలు[మార్చు]

  • మొత్తము రచనలు: 71

ముద్రితములు; 47 (1974)[మార్చు]

అముద్రితములు[మార్చు]

ప్రముఖుల ప్రశంసలు[మార్చు]

కొత్త సత్యనారాయణ గురించి సీతారామమూర్తి

తెనుగులెంకగా ప్రశస్తుడైన తుమ్మల సేతారామమూర్తి కొత్త సత్యనారాయణ గురించి హిత వాణి అనే ప్రశంసను అందించారు

కొత్త సత్యనారాయణ కోవిదుండు|
గురుఁడు, కవి, విమర్శకుఁడుగా గరిమనందె |
నిన్నినేరుపు లొక్కచో నిరపుకొంట|
యబ్బురం బని భావించు నంధ్రజగము|(1)

అస్తికతయందు నితఁడు ప్ర|
శస్తిం గనె వేంకటేశచరణార్చకతన్,|
స్రస్తాఖిలవేదనుఁడై|
స్వస్తిం గను నితఁడు నేఁడు జలజాక్షు కడన్|(2)

పున్నెములకున్ గొటారగు|
నన్నయ తిక్కన్న యెఱ్ఱనయు సోమనయున్|
జిన్నయసూరి యుఁగన్పడ|
మిన్నందిన తనివి నితఁడు మెలఁగుచునుండున్|(3)

నా కథాసరిత్సాగరవాకు నీదు|
గద్యమునఁదోఁచు నని యనవద్యుఁడైన|
వేదము బుధుండు కొనియాడ వినతుఁడగుచు|
బాష్పములు రాల్చి యుండు నీపండితుండు|(4)

మానవత్వ దృష్టిలేని పురాణముల్|
త్రచ్చి నిజము వెలికిఁదెచ్చి తనుచుఁ|
ద్రిపురనేని సుకవి దీవింప నిది నీదు|
కరుణ యని యతండు కరఁగియుండు|

తెలుగు పలుకు - ౨౦౦౭, ౧౬వ తానా సమావేశాల జ్ణాపకసంచిక నుండి
Ksc.psd.jpg
"కళాప్రపూర్ణులు" - రచన-కొమ్మనేని వెంకట రామయ్య'

అలతియలంతి వాక్యాలతో కథాగమనము సాగించుటలో వీరి భాషాపటిమ యాంధ్రినలంకరింపచేసినది. సరళము, సరసము, శయ్యా సౌలభ్యముగల వచన రచన సాగించిన కవులలో ప్రథమ శ్రేణికి చెందినవారు.

పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి - రచన-ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు

సాహితి సమారాధకులుగా, సాహితీరంగంలో వారు మెట్టని చోటు, పట్టని ప్రక్రియ లేదు . కవిగా, పండితుడుగా, నాటక కర్తలుగా, కథకులుగా, సరస విమర్శకులుగా, సాహిత్యాభిలాషులందరకూ చిరపరిచితులు. అన్నింటికంటె మిన్న "దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు". ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా, ఉపాద్యక్షులుగా, స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.....

ఈకోవకి చెందినవే రామాయణ రహస్యాలు, కల్పవృక్ష ఖండనమనేవి కూడా. రాముడు పురుషోత్తముడనీ, దేవుడనీ, సత్యవ్రతుడనీ, ప్రజల నమ్మకం. అయితే అలాంటిదేమీ లేదని, అతడు కూడా మన లాంటి మనిషేననే పచ్చి నిజాన్ని, వాల్మీకాన్ని బట్టే ఆయన ఱుజువు చేశారు. ఇక కల్పవృక్షఖండనం, విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంపై విపులమైన సమీక్ష.

ఇంకా వీరు వెలువరించిన వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగిన వాటిలో మరొకటి కామశాస్త్రం . ఇది వాత్స్యాయనుని కామసూత్రాలకు తెలుగు సేత. శాస్త్ర గ్రంథాల ఆవశ్యకాన్ని, రచనా విధానాన్ని నిర్ధారించే రచన.

వీరి మొత్తం రచనలు డెబ్బదికి పైమాటే. వీటిలో పద్య కావ్యాలున్నాయి, గద్య కావ్యాలున్నాయి, విమర్శనలున్నాయి, వ్యాఖ్యానాలున్నాయి, నవలలు, నాటకాలు, కథలు, గాథలూ ఉన్నాయి. ఈ విధంగా అన్ని సాహితీ రంగాల లోను వీరికి ప్రవేశం ఉంది. అన్ని చోట్ల తమదైన ఒక బాణీ నెలకొల్పారు. వీరు రచించిన జీవిత చరిత్రల్లో కవిరాజు (త్రిపురనేని రామస్వామి జీవితం, కులపతి (వరదాచార్యుల వారి జీవితం ) పేరెన్నిక గన్నవి. పంచదశి, శకున్తల అనేవి వీరి సంస్కృత రచనలు.

సన్మానాలు[మార్చు]

వీరి విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలుగునాట పలు తావుల సభలు, సన్మానాలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గవి (వారు పనిచేసిన నిడుబ్రోలులో ) గజారోహణం, వీరి పట్ల విద్యార్థులకు, సహోపాధ్యాయులకు పురజనులకున్న గౌరవాదరాభిమానాలకు ప్రత్యక్ష నిదర్శనం. అట్టి వీరికి ఆంధ్ర విశ్వ విద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు నిచ్చి సత్కరించటం తెలుగు వారికి, ఆంధ్ర విశ్వ విద్యాలయానికి కూడా గర్వకారణం. (తెలుగు పలుకు - 16వ తానా సభల జ్ఞాపక సంచిక నుండి)

ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ఇతడిని 1974లో కళా ప్రపూర్ణ పురస్కారంతో సన్మానించింది. పొన్నూరు, నిడుబ్రోలు పట్టణ ప్రజలు గజారోహణ సత్కారం చేశారు.

మూలాలు[మార్చు]

  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
  • తెలుగు పలుకు - 2007, 16వ తానా సమావేశాల జ్ణాపకసంచిక