కొన్స్టన్టిన్ (థెయొఫిలొస్ కొడుకు)
కొన్స్టన్టిన్ | |
---|---|
రోమన్ల చక్రవర్తి | |
![]() కొన్స్టన్టిన్ తండ్రి థెయొఫిలొస్ ముద్రించిన సొలిడస్[గమనిక 1](Solidus) వెనుక భాగంలో కనిపిస్తోన్న కొన్స్టన్టిన్ (కుడి పక్క), ఇంకా అతని తాత రెండవ మిఖియేలు. | |
బిజన్టియొన్ సహ-చక్రవర్తి (థెయొఫిలొస్‌తో పాటు) | |
పరిపాలన | 830లు |
పూర్వాధికారి | థెయొఫిలొస్ |
ఉత్తరాధికారి | థెయొఫిలొస్ |
జననం | 820లు లేదా 830లు |
మరణం | 836కు ముందు |
Burial | అగియొయ్ అపొస్టొలొయ్ (Ἅγιοι Ἀπόστολοι, అర్థం: సంతు అపొస్తలుల చర్చి) |
రాజవంశం | అమొరియొన్ వంశం |
తండ్రి | థెయొఫిలొస్ |
తల్లి | థెయొడోర |
కొన్స్టన్టీన్ (ఆంగ్లం:Constantine) లేదా కొన్స్టన్టినొస్ (గ్రీకు:Κωνσταντῖνος)[గమనిక 2] అమొరియొన్ (Ἀμόριον) వంశపు శైశవ రాజకుమారుడు. సుమారుగా 820లు/830లులో పుట్టి, 836 ముందు వరకు బతికిన ఇతను బిజన్టియొన్ (Βυζάντιον) సామ్రాజ్య మహారాజు ఐన వాళ్ళ నాన్న థెయొఫిలొస్‌తో (Θεόφιλος) పాటు సహ చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని జీవిత విశేషాలపై అంత స్పష్టత లేదు కానీ 820ల్లోనో, 830ల్లోనో పుట్టాడు అనీ, పుట్టిన వెంటనే సహ-చక్రవర్తిగా నియమితుడు అయ్యాడనీ తెలుస్తోంది. ఇతను 836లో చనిపోయాడు. బహుశా నీటితొట్టిలో పడి చనిపోయి ఉండొచ్చు.
జీవితం
[మార్చు]కొన్స్టన్టిన్ తల్లిదండ్రులు బిజన్టియొన్ సామ్రాజ్య మహారాజు థెయొఫిలొస్, మహారాణీ థెయొడోరలు (Θεοδώρα). అమొరియొన్ రాజవంశానికి చెందిన ఇతని కుటుంబం, 820లో కొన్స్టన్టిన్ పితామహుడు రెండవ మిఖయేల్[గమనిక 3](Μιχαὴλ) సింహాసనం అధిష్టించిన నాటి నుండి బిజన్టియొన్ సామ్రాజ్యాన్ని పాలిస్తోంది.[1] అప్పటి నామకరణ పద్ధతుల ప్రకారం ఇతనికి రెండవ మిఖియేలు జ్ఞాపకార్థం పేరు పెట్టాలి. కానీ థెయొఫిలొస్ వాటిని అనుసరించకుండా, తన కొడుక్కి కొన్స్టన్టిన్ అని పేరు పెట్టాడు. బిజన్టియొన్ చరిత్ర నిపుణురాలు జుడిత్ హెరిన్ (Judith Herrin) ప్రకారం ఈ పేరు కొన్స్టన్టీన్ మహావీరుడి గౌరవార్థం పెట్టి ఉండొచ్చు లేదా కొన్స్టన్టిన్ అనే పేరు ఉన్న మునుపటి మహారాజుల వలే ఇతను కూడా ప్రతిమాభంజనం అనే మతపరమైన పద్ధతిని కొనసాగిస్తాడని ఆశించి పెట్టి ఉండొచ్చు.[2][a]
నాటి నాణేల ప్రకారం ఈ కొన్స్టన్టిన్ రాజదంపతులకు పుట్టిన మొదటి కొడుకు అని తెలుస్తోంది. ఇతనికి ఐదుగురు సోదరిలు. వీరి పేర్లు థెక్ల (Θέκλα), అన్నా (Ἄννα), అనస్టసియ (Ἀναστασία), పూల్ఖెరియ (Πουλχερία), మరియ (Μαρία).[4] కొన్స్టన్టిన్ వీళ్ళందరికంటే పెద్దవాడు అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఇతను తన తల్లిదండ్రులకు ఎన్నో సంతానం అని తెలిపేందుకు ఆధారాలు ఏమీ లేవు.[4]
సింహాసనానికి ప్రత్యక్ష వారసుడైన కొన్స్టన్టిన్, పుట్టిన కొన్నాళ్ళకే సహ-చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. నాటి నాణేలలో బంగారు నాణేల మీద ఇతను డెస్పొటేస్‌గా (ప్రత్యక్ష వారసుడికి[గమనిక 4] ఇచ్చే గౌరవ సభా పదవి, δεσπότης)[5] పేర్కొనబడగా, క్యాంస నాణేలపై ఎలాంటి పదవి ప్రస్తావనా లేదు.[6] తరువాత కొన్నాళ్ళకే, శైశవ దశలోనే కొన్స్టన్టిన్ చనిపోయాడు.[4] కొన్స్టన్టిన్ పీనుగ పెట్టె మీద లర్నకియొన్ (λαρνάκιον) అని చెక్కబడి ఉన్నది. దీని అర్థం చిన్న పీనుగ పెట్టె అని. దీన్ని బట్టి ఆంగ్ల చరిత్రాకారుడు ఫిలిప్ గ్రెయర్సన్ (Philip Grierson), కొన్స్టన్టిన్ శిశువుగానే చనిపోయాడు అని అర్థం చేసుకోవాలని పేర్కొన్నాడు.[7][8]
కొన్స్టన్టిన్ చావుపుట్టుకలూ, పట్టాభిషేకం తేదీలపై స్పష్టత లేదు. ప్రొసపొగ్రఫి అఫ్ మిడౢ బిజన్టిన్ పిరియడ్లో (Prosopography of middle byzantine period) బిజన్టినిస్ట్ రెల్ఫ్-జొహెనస్ లీల్యతో (Ralph-Johannes Lilie) పాటు ఇతర రచయితలు కొన్స్టన్టిన్ 820ల్లో పుట్టి, 834కు ముందే చనిపోయు ఉంటాడని పేర్కొన్నారు.[4] కొన్స్టన్టిన్ పుట్టిన వెంటనే పట్టాభిషిక్తుడు అయ్యాడు అనుకుంటే, 834లో పుట్టి, రెండేళ్ళ వయసులో చనిపోయి ఉంటాడని చరిత్రాకారిణి లిన్డ గార్లన్డ్ (Lynda Garland) వాదన.[9] హెరిన్ కూడా ఈ వాదనతో ఏకీభవించింది.[10] ఏడవ కొన్స్టన్టిన్ బిజన్టియన్ సభా పద్ధతులూ, చరిత్రపై వ్రాసిన డె కేరిమోనీస్ (De Ceremoniis) అనే 10వ శతాబ్దపు రచనలో 831 సంవత్సరానికి ఒక మహారాజు పేరునే నమోదు చేసాడు. 831/32, 832/33 సంవత్సరాల్లో ముద్రించిన నాణేలలో కూడా కొన్స్టన్టిన్ పేరు కనబడదు. కనుక కొన్స్టన్టిన్ 833లోనే సహ-చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు అయ్యుండొచ్చు. చరిత్రాకారుడు వొరన్ థ్రెడ్‌గోల్డ్ (Warren Threadgold) కొన్స్టన్టిన్ 835 ప్రాంతంలో చనిపోయాడని పేర్కొన్నాడు. 836 నాటికి కొన్స్టన్టిన్ చనిపోయు ఉండాలి. ఎందుకంటే చరిత్రలో ఆ సంవత్సరంలో థెయొఫిలొస్‌కి వారసుడు లేడని నమోదు చేయబడింది (కొన్స్టన్టిన్ తమ్ముడు మూడవ మిఖియేల్ 840లో పుట్టాడు).[4] వారసుడు లేనందున థెయొఫిలొస్ సుమారు 831లో అప్పటికి శిశువు ఐన తన కూతురు మరియని, తన కైసర్[గమనిక 5] (Καῖσαρ) అలెక్సియొస్ మోసేలెకి (Ἀλέξιος Μωσηλέ) ఇచ్చి పెళ్ళి చేయబోయాడు.[11]
సుమారు 10వ శతాబ్దికి చెందిన సునెఖిస్టె థెయొఫెనస్ (συνεχισταί Θεοφάνους, అర్థం: థెయొఫెనేస్‌కు/థెయొఫెనుడికి కొనసాగింపు) అనే రచన ప్రకారం, బ్లఖెర్నైస్ (Βλαχέρναις) రాజప్రాసాదంలో కొన్స్టన్టిన్ తన సంరక్షకురాలి దగ్గర నుండి పక్కకి తప్పించుకుని వెళ్ళిపోయినప్పుడు, ఒక నీటి తొట్టెలో పడి చనిపోయాడు.[4][10] బాధతో అతని తండ్రి ఆ ప్రదేశంలో ఉద్యానవనాలు కట్టించాడు.[11] ఐతే ప్రొసపొగ్రఫి అఫ్ మిడౢ బిజన్టిన్ పిరియడ్‌లో ఈ కథ వేరే మహారాజు కొడుకుది అయ్యుండొచ్చు అని కూడా పేర్కొన్నారు.[4] కొన్స్టన్టిన్ పీనుగును అతని తల్లిదండ్రులు థెసలీ చలువరాతి పెట్టెలో పెట్టి, అగియొయ్ అపొస్టొలొయ్‌లో (Ἅγιοι Ἀπόστολοι, అర్థం: సంతు అపొస్తలుల చర్చి) సమాధి చేసారు.[4][10] డె కేరిమోనీస్‌లో కొన్స్టన్టిన్ సమాధి తన సోదరి మరియ సమాధి పక్కన ఉన్నట్టు పేర్కొనబడింది.[7]
గమనికలు
[మార్చు]- ↑ నాటి బిజన్టియొన్ సామ్రాజ్యంలో ఒక రకమైన నాణెం
- ↑ కొన్స్టన్టిన్ అన్నది పేరు కాగా -ఒస్ అన్నది గ్రీకు భాష ప్రథమా విభక్తి ప్రత్యయం. ఆంగ్లంలో విభక్తి ప్రత్యయాన్ని వదిలేసి, ఉచ్ఛారణలో కొంత మార్పుతో కొన్స్టన్టీన్ అని గానీ కొన్స్టన్టైన్ అని గానీ పిలుస్తారు. తెలుగు వ్యాకరణాన్ని అనుసరించి ఈ పేరు కొన్స్టన్టినుడు అవ్వగా, ఇతని నాన్నగారి పేరు థియొఫిలుడు అవుతుంది. నేటి తెలుగు వారి పేర్ల శైలి ప్రకారం ఐతే వీరి పేర్లు కొన్స్టన్టిన్, థియొఫిల్ అవుతాయి. కొన్స్టన్టిన్ అంటే స్థైర్యవంతుడు అని అర్థం
- ↑ ఈ పేరుకు ఆంగ్ల రూపం మైఖల్ (Michael)
- ↑ యువరాజు లాంటి వాడు. రాజ సింహాసనానికి వారసుడు.
- ↑ కైసర్ అనే పదవిని రాజు తరువాత సింహాసనం అందుకోబోయే వ్యక్తి అని సూచించేందుకు ఇస్తారు
- ↑ ప్రతిమాభంజనం అంటే మతపరమైన కళారూపాలకి పవిత్రతను ఆపాదించడాన్ని వ్యతిరేకించే ఒక మతోద్యమం. ఈ ఉద్యమకారులు మతసంబంధ ప్రతిమలూ, చిహ్నాలూ, బొమ్మలూ, చిత్రాల వంటి వాటిని నాశనం చేస్తుంటారు. బిజన్టిన్ సామ్రాజ్యంలో 726లో ప్రతిమాభంజనం మొదలయ్యి, 787 వరకు కొనసాగింది. 787లో మహారాజు ఆరవ కొన్స్టన్టిన్, మహారాణీ, రాజమాతా ఐన ఐరేనేలు నికయ రెండవ సమావేశంలో ఈ పద్ధతికి ముగింపు పలికారు. మళ్ళీ 815లో మహారాజు ఐదవ లెయోన్ (Λέων) ఈ ఉద్యమాన్ని తిరిగి మొదలుపెట్టాడు. తరువాత రెండవ మిఖియేల్, అతని కొడుకు థియొఫిలొస్‌లు కూడా ఇదే బాటలో వెళ్ళారు. థియొఫిలొస్ కొత్త కళారూపాల తయారీని నిషేధించి, వాటికి పవిత్రతను ఆపాదించే వారిని అణిచివేసాడు. తరువాత మూడవ మిఖియేలుకు రాజ్యప్రతినిధిగా రాజ్యాన్ని పాలించిన విధవ థెయొడోర 843లో ట్రయంఫ్ అఫ్ ఓర్థడక్సి (Triumph of Orthodoxy) అనే ఉత్సవంలో ప్రతిమాభంజనానికి స్వస్తి పలికింది. తరువాత 9వ శతాబ్దం చివర్లో చర్చ్ ఈ పద్ధతిని నిషేధించడంతో దీనికి ప్రాముఖ్యత లేకుండా పోయింది.[3]
ఉల్లేఖనలు
[మార్చు]- ↑ Hollingsworth 1991.
- ↑ Herrin 2002, pp. 191–192.
- ↑ Hollingsworth & Cutler 1991.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 Prosopographie der mittelbyzantinischen Zeit, Konstantinos (#3931)
- ↑ Grierson 1973, p. 178.
- ↑ Foss 2005, p. 97.
- ↑ 7.0 7.1 Treadgold 1975, p. 330.
- ↑ Grierson 1973, p. 407.
- ↑ Garland 1999, pp. 98–99.
- ↑ 10.0 10.1 10.2 Herrin 2002, p. 192.
- ↑ 11.0 11.1 Treadgold 1975, p. 334.
మూలాలు
[మార్చు]- Foss, Clive (2005). "Emperors Named Constantine". Revue numismatique. 6 (161): 93–102. doi:10.3406/numi.2005.2594.
- Garland, Lynda (1999). Byzantine Empresses: Women and Power in Byzantium AD 527–1204. Routledge. ISBN 0-415-14688-7.
- Grierson, Philip (1973). Catalogue of the Byzantine Coins in the Dumbarton Oaks Collection and in the Whittemore Collection, 3: Leo III to Nicephorus III, 717-1081. Vol. III. Dumbarton Oaks Papers. pp. 406–452. ISBN 9780884020455.
- Herrin, Judith (2002) [2001]. Women in Purple: Rulers of Medieval Byzantium. London: Phoenix Press. ISBN 1-84212-529-X.
- Hollingsworth, Paul A. (1991). "Amorian or Phrygian Dynasty". In Kazhdan, Alexander (ed.). Oxford Dictionary of Byzantium. Oxford: Oxford University Press. p. 79. ISBN 978-0-19-504652-6.
- Hollingsworth, Paul A.; Cutler, Anthony (1991). "Iconoclasm". In Kazhdan, Alexander (ed.). Oxford Dictionary of Byzantium. Oxford: Oxford University Press. pp. 975–976. ISBN 978-0-19-504652-6.
- మూస:Prosopographie der mittelbyzantinischen Zeit
- Treadgold, Warren (1997). A History of the Byzantine State and Society. Stanford: Stanford University Press. ISBN 978-0-8047-2630-6.
- Treadgold, Warren (1975). "The Problem of the Marriage of the Emperor Theophilus". Greek, Roman, and Byzantine Studies. 16: 325–341.
కొన్స్టన్టిన్ (థెయొఫిలొస్ కొడుకు) అమొరియొన్ వంశం
| ||
Regnal titles | ||
---|---|---|
అంతకు ముందువారు థెయొఫిలొస్ as ఏకఛత్రాధివతి |
బిజన్టియొన్ చక్రవర్తి 830లు Served alongside: థెయొఫిలొస్ |
తరువాత వారు థెయొఫిలొస్ as ఏకఛత్రాధివతి |