కొలనోస్కోపీ

కొలనోస్కోపీ[1] (బృహదాంత్ర దర్శనం) అనేది పెద్దప్రేగు, లేదా బృహదాంత్రం (కోలన్), పురీషనాళాల (రెక్టమ్) లోపలి శ్లేష్మపుపొరను (మ్యూకస్ మెంబ్రేన్)) పరీక్షించడానికి వైద్యులు చేసే ఒక వైద్య ప్రక్రియ[2]. దీనిని సాధారణంగా పురీషనాళం, పెద్దప్రేగులలో కర్కటవ్రణాల (కోలోరెక్టల్ క్యాన్సర్) కోసం పరీక్షించడానికి లేదా కడుపు నొప్పి, మల రక్తస్రావం, మలవిసర్జన అలవాట్లలో మార్పులు, ప్రయత్నం లేకుండానే బరువు తగ్గడం వంటి లక్షణాలను పరిశోధించడానికి నిర్వహిస్తారు[3][4].
కొలనోస్కోప్ పరికరం
[మార్చు]కొలనోస్కోపీ సమయంలో, వైద్యనిపుణులు బృహదాంత్రదర్శిని (కొలనోస్కోప్) అని పిలువబడే పొడవైన, వంపులు తిరిగే గొట్టపు పరికరాన్ని పాయువు ద్వారా చొప్పిస్తారు[3]. పురీషనాళం ద్వారా చొప్పించి పెద్దప్రేగులోకి ప్రత్యక్షంగా చూస్తూ, పరీక్షిస్తూ, చివరకు చేరి, చిన్నపేగులో చివరి భాగం శేషాంత్రంను (ఇలియం) కూడా పరీక్షిస్తారు[2]. పెద్దప్రేగు దర్శినిలో లోపలికి తీగెల ద్వారా కాంతిని ప్రసరింపజేసే అవకాశం, లోపలి భాగాల చిత్రాలను గ్రహించి ప్రసరించుటకు చివర చిన్న చిత్రగ్రాహకం (కెమెరా) కూడా ఉంటాయి, ఇవి దూరదర్శిని తెరపై (మానిటర్‌లొ) పెద్దప్రేగు, పురీషనాళాల లోపలి భాగాలను ప్రదర్శించడానికి వైద్యుడికి అనుకూలిస్తాయి. కొలనోస్కోప్ పై భాగంలో ఉండే చోదక చక్రాలను తిప్పుతూ కొలనోస్కోప్ కొనను క్రిందకు, పైకి, రెండు ప్రక్కలకు మళ్ళిస్తూ వైద్యనిపుణులు పెద్ద ప్రేవుల నాళపు కుహరాన్ని అనుసరించ గలుగుతారు. కొలనోస్కోప్ పై భాగంలో ప్రేవులలో గాలి చొప్పించడానికి, గాలిని, ద్రవాలను పీల్చివేయుటకు ఏర్పాట్లు ఉంటాయి. పరికరం ద్వారా కంతులను ఛేదించడానికి, కణపరీక్షలకు తునుకలు తీసుకొనుటకు సాధనాలు చొప్పించే మార్గం ఉంటుంది.
సిగ్మాయిడోస్కోపీ
[మార్చు]సిగ్మాయిడోస్కోపీలో వైద్యులు పురీషనాళాన్ని, పెద్దపేగులో ఎడమవైపు భాగాన్ని (సుమారు 60 సెం.మీ) మాత్రమే పరీక్షిస్తారు[5]. ఎక్కువశాతం మందిలో పెరుగుదలలు ఎడమవైపున ఉండడం వలన పెరుగుదలల శోధనకు సిగ్మాయిడోస్కోపీ మంచిఫలితాలే ఇస్తుంది. కాని కొలనోస్కోపీలో పెద్దపేగును పూర్తిగా పరీక్షించడం వలన కుడిభాగంలో ఉండే పెరుగుదలలు కూడా కనుగొనబడుతాయి.
కొలనోస్కోపీకి సంసిద్ధమగుట
[మార్చు]ప్రక్రియకు ముందు, రోగి కొన్ని ఆహార పరిమితులను అనుసరించాలి, కొలనోస్కోపీకి ముందు మూడు రోజులు పీచుపదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎఱుపు, ఊదారంగు, కాషాయరంగు ఆహారపదార్థాలు తీసుకోకూడదు. ముందురోజు ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలి[2]. లవణాలు ఉండే ద్రవపదార్థాలు కొన్ని తీసుకోవడం వలన శుష్కించిపోవుటను (డీహైడ్రేషన్) అరికట్టవచ్చు. ముందురోజున సాయంత్రం తరువాత పెద్దప్రేగులో మలం తొలగించి శుభ్రపరచడానికి వైద్యులు సూచించిన విరేచనకారి మందులు తీసుకోవాలి. ప్రేగు సంసిద్ధత (కోలన్ ప్రెప్) అని పిలువబడే ఈ ప్రక్షాళన ప్రక్రియ, పెద్దప్రేగు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది[6], అప్పుడు వైద్యులు చిన్న చిన్న పెరుగుదలలను కూడా బాగా చూడగలుగుతారు. కోలనోస్కోపీలో మెరుగైన వీక్షణకు తోడ్పడుతుంది. పరీక్ష రోజున పరీక్షకు ఆరు గంటల ముందునుంచి నోటి ద్వారా ఏ పదార్థాలు తీసుకోకూడదు.
కొలనోస్కోపీ ప్రక్రియ
[మార్చు]
కోలనోస్కోపీ సమయంలో, వైద్యుడు పాలీప్స్ (కంతులు/ నిరపాయకరమైన పెరుగుదలలు) లేదా అసాధారణమైన మార్పుల కోసం పెద్దప్రేగు లోపలిపొరను జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఏవైనా అనుమానాస్పదంగా ఉన్న పెరుగుదలలు లేదా అసాధారణతలు కనబడితే, వైద్యుడు వాటిని తీసివేయవచ్చు లేదా కణజాల పరీక్ష కోసం చిన్న తునుకల నమూనాలను (బయాప్సీలు) తీసుకోవచ్చు[6].
ఈ ప్రక్రియ సాధారణంగా అసౌకర్యాన్ని తగ్గించడానికి మత్తులో నిర్వహిస్తారు. ఇది పూర్తి చేయడానికి సాధారణంగా 30 నిమిషాల నుండి గంట వరకు పడుతుంది[7], అయితే వ్యక్తిని ప్రక్రియకు సిద్ధంచేయడానికి, మత్తునుండి, ప్రక్రియనుండి ఆ వ్యక్తి పూర్తిగా కోలుకొనడానికి అదనపు సమయం పడుతుంది.
పెద్దప్రేగు చూసిన తర్వాత, రోగి కొంత తేలికపాటి తిమ్మిరి లేదా ఉబ్బరం అనుభవించవచ్చు[6], కానీ ఈ లక్షణాలు

సాధారణంగా త్వరగా పరిష్కరించబడతాయి. డాక్టర్ రోగితో కనుగొన్న విషయాలను చర్చిస్తారు, అవసరమైన తదుపరి సంరక్షణ కోసం సిఫార్సులను అందిస్తారు.
శోధన బృహదాంత్ర దర్శనం
[మార్చు]పెద్దప్రేగులలో 80 శాతపు కర్కటవ్రణాలు (కాన్సర్స్) అంతకుముందున్న ప్రమాదకరం కాని కంతులు (బోళా పెరుగుదలలు / పోలిప్స్) పరిణామం చెందడం వలన ఏర్పడుతాయి. అందువలన ఏ లక్షణాలు లేనివారిలో కొలనోస్కోపీ శోధనపరీక్షగా (స్క్రీనింగ్ టెస్ట్) చేసి కంతులను కనుగొని వాటిని నిర్మూలించడం వలన పెద్దపేగులో కర్కటవ్రణాలను నిరోధించుటకు, త్వరగా గుర్తించి చికిత్స చేసి మరణాలు అరికట్టడానికి తోడ్పడతుందని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. శోధన పరీక్షలు చేయడం వలన పెద్దపేగులో

కర్కటవ్రణాలను 60 శాతం నివారించవచ్చు. అమెరికాదేశంలో 45 సంవత్సరాల వయస్సు తరువాత మొదటిసారిగాను, ఆపై ప్రతి పది సంవత్సరాలకు బృహదాంత్ర దర్శనాన్ని శోధనపరీక్షగా (స్క్రీనింగ్ టెస్ట్ ) నిర్వహించాలని నిర్ణయించారు[3][8]. క్రోన్స్ వ్యాధి, పెద్దప్రేవుల పుళ్ళవ్యాధి (అల్సరేటివ్ కొలైటిస్) వంటి తాపక వ్యాధులు గలవారిలోను, కుటుంబంలో కర్కటవ్రణాల వైద్య చరిత్ర గలవారిలోను ఈ శోధనపరీక్షలను ఇంకా చిన్నవయసులోనే మొదలుపెట్టి, తఱచుగా కూడా చేయవలసిన అవసరం ఉంది[8].
ఇతర శోధన పరీక్షలు
[మార్చు]పెద్దప్రేవులలో పెరుగుదలలకై వెదుకుటకు ఇతర శోధన పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో విరివిగా

వాడుకలో ఉన్న పరీక్ష మలములో అగోచర రక్తపు పరీక్ష (hemoccult test). కంతులు (బోళా గడ్డలు/పోలిప్స్) గాని, కర్కటవ్రణములు (కాన్సర్స్) గాని ఉన్నవారిలో వాటినుండి కంటికి కనిపించే రక్తస్రావం కొందఱిలో కలిగితే, చాలామందిలో తక్కువ పరిమాణంలో అగోచర[9] రక్తస్రావం కలుగుతుంది. ఆ అగోచర రక్తాన్ని రసాయనిక పరీక్షతో కనుక్కోవచ్చు[8]. ఈ పరీక్ష చౌకగా తేలికగా చేయవచ్చు. అగోచర రక్తస్రావం ఉన్నవారిలో కొలనోస్కోపీ చేయవచ్చు.
మలంలో కర్కటవ్రణాల అసాధారణ డి.ఎన్.ఎ. కు కూడా పరీక్షలు చేసి అసాధారణ డి.ఎన్.ఎ ఉన్నవారిలో కొలనోస్కోపీ చేయవచ్చు[8]. కొంతమంది పూర్తి కొలనోస్కోపీ బదులు సిగ్మాయిడోస్కోపీ మాత్రమే చేయించుకునుటకు ఇష్టపడతారు. కాని వారిలో కంతులు కనిపిస్తే వారికి పూర్తి కొలనోస్కోపీ చేయాలి. కొలనోస్కోపీ బదులు పెద్దపేగులకు గణనయంత్ర త్రిమితీయ చిత్రీకరణతో (computed tomographic colonography - CT colonography) బోళా పెరుగుదలలను (Benign growths), కర్కటవ్రణాలను కనుగొనవచ్చు[8].
ఉపద్రవాలు
[మార్చు]కొలనోస్కోపీ చేయించుకొనేవారిలో 1000 మందిలో ముగ్గురిలో ఉపద్రవాలు జరిగే అవకాశం ఉంటుందని అమెరికా జఠరాంత్ర అంతర్దర్శన సంఘం వారి అంచనా[7]. వీరిలో కొందఱికి మత్తుమందు వలన అసహనం, హృదయసంబంధ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు కలుగవచ్చు. 1000 మందిలో ఒకరికి ప్రేవులో చిల్లుపడే అవకాశం ఉంది[6][10]. కాని కొత్త పరికరాలతో నిపుణులు అంతర్దర్శిని ద్వారానే ఆ చిల్లులను క్లిప్పులు పెట్టి మూసివేయగలరు[11]. కొందఱిలో శస్త్రచికిత్స అవసరం కలుగుతుంది[11]. చాలా అరుదుగా (వేయిమందిలో ఒకరిలో) కంతులు తొలగించిన తర్వాత అచట తాపము కలిగి కడుపునొప్పి, జ్వరం, రక్తంలో తెల్లరక్తకణాల సంఖ్య పెరగడం కలుగవచ్చు[7]. వారికి సిర ద్వారా ద్రవములు, సూక్ష్మజీవ నాశకాలు ఇవ్వవలసిన అవసరం ఉంటుంది[12].
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Dictionary.com | Meanings & Definitions of English Words". Dictionary.com (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ 2.0 2.1 2.2 "colonoscopy", The Free Dictionary, retrieved 2025-10-10
- ↑ 3.0 3.1 3.2 "Colonoscopy - Mayo Clinic". www.mayoclinic.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ "Colorectal Cancer Signs and Symptoms | Signs of Colorectal Cancer". www.cancer.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ "Flexible sigmoidoscopy". www.cancerresearchuk.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Colonoscopy: Prep & Procedure Details". Cleveland Clinic (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ 7.0 7.1 7.2 "Are Colonoscopies Dangerous? | Colorectal Cancer Alliance". colorectalcancer.org (in ఇంగ్లీష్). 2025-09-25. Retrieved 2025-10-10.
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 "Colorectal Cancer Guideline | How Often to Have Screening Tests". www.cancer.org (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ Shabdkosh.com. "అగోచరమైన - Meaning in English - అగోచరమైన Translation in English". SHABDKOSH (in ఇంగ్లీష్). Retrieved 2025-10-10.
- ↑ Tomaszewski, Marcel; Sanders, David; Enns, Robert; Gentile, Laura; Cowie, Scott; Nash, Carla; Petrunia, Denis; Mullins, Paul; Hamm, Jeremy; Azari-Razm, Nazanin; Bykov, Dmitriy; Telford, Jennifer (2021). "Risks associated with colonoscopy in a population-based colon screening program: an observational cohort study". CMAJ open. 9 (4): E940 – E947. doi:10.9778/cmajo.20200192. ISSN 2291-0026. PMC 8513602. PMID 34642256.
{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link) - ↑ 11.0 11.1 Jung, Yunho (2020-01). "Endoscopic Management of Iatrogenic Colon Perforation". Clinical Endoscopy. 53 (1): 29–36. doi:10.5946/ce.2019.061. ISSN 2234-2400. PMC 7003013. PMID 31266269.
{{cite journal}}: Check date values in:|date=(help) - ↑ Sartelli, Massimo; Viale, Pierluigi; Catena, Fausto; Ansaloni, Luca; Moore, Ernest; Malangoni, Mark; Moore, Frederick A.; Velmahos, George; Coimbra, Raul; Ivatury, Rao; Peitzman, Andrew; Koike, Kaoru; Leppaniemi, Ari; Biffl, Walter; Burlew, Clay Cothren (2013-01-08). "2013 WSES guidelines for management of intra-abdominal infections". World journal of emergency surgery: WJES. 8 (1): 3. doi:10.1186/1749-7922-8-3. ISSN 1749-7922. PMC 3545734. PMID 23294512.
{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)