కొల్లూరి సూర్యనారాయణ మూర్తి
| కొల్లూరి సూర్యనారాయణ మూర్తి | |
|---|---|
| జననం | 1958 అమలాపురం |
| మరణం | అక్టోబర్ 16 2025 విజయవాడ |
| మరణ కారణం | కిడ్నీ సమస్యలతో |
| ప్రసిద్ధి | కవి, సంపాదకుడు |
| భార్య / భర్త | కనకవల్లి |
| పిల్లలు | కుమార్తె |
కొల్లూరి సూర్యనారాయణ మూర్తి కవి, సంపాదకుడు. సాహితీరంగంలో కొల్లూరి గా ప్రసిద్ధుడు.
జననం
[మార్చు]కొల్లూరి 1958, అమలాపురంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.
జీవిత విశేషాలు
[మార్చు]ప్రాథమిక, కళాశాల విద్య అమలాపురంలో పూర్తిచేసి తర్వాత ఆంధ్రాబ్యాంకు అధికారిగా జీవితం ఆరంభించిన కొల్లూరి అమలాపురంలో వంశపారంపర్య కొల్లూరి సత్రం నిర్వహించేవాడు. ప్రముఖ సినీ దర్శక, రచయిత విజయ బాపినీడు ప్రచురించిన చిరంజీవి పత్రికకు సహ సంపాదక సారథ్యం వహించేందుకు ఆంధ్రా బ్యాంకు ఉద్యోగం వదిలిపెట్టి మద్రాసు వెళ్ళాడు. 1993లో విజయవాడకు చేరుకుని తన సంపాదకత్వంలో ‘అంజలి’ వారపత్రిక ను నడిపారు. అంతకుముందే ఎక్స్‌రే పేరుతో అచ్చంగా కవిత్వం కోసం ఓ మాసపత్రిక నడిపాడు.
సాహిత్య ప్రస్థానం
[మార్చు]మినీ కవితా సారథిగా పేరు గడించారు. సాంస్కృతిక రాజధానిగా పేరుందిన విజయవాడలో 90 వ దశకంలో ఉన్న పళంగా స్తబ్ధత ఆవరించగానే 'ఎక్స్‌రే' పేరుతో సాహిత్య సేవా సంస్థను ఏర్పాటు చేసి 'నెలనెలా వెన్నెల'తో పాటు మరెన్నో పెద్ద కార్యక్రమాలు చేపడుతూ సాహిత్య వాతావరణం ఉట్టిపడేలా చేశాడు. దిగంబర కవులు నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, నగ్నమునితో పాటు ఇంకా కె.శివారెడ్డి వగైరా ప్రముఖ తెలుగు కవులతో మాంటిస్సోరి కళాశాలలో 24 గంటల కవి సమ్మేళనం నిర్వహించాడు కొల్లూరి. ఏటా పది ఉత్తమ కవితలకు 'ఎక్స్‌రే' అవార్డులు ఇస్తూ వస్తున్నాడు. కమ్యూనిస్టుల కంచుకోట బెజవాడలో మహాకవి శ్రీశ్రీకి విగ్రహం లేకపోవడం గుర్తించి తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి శ్రీశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 2010 లో శ్రీశ్రీ శత జయంతి మహాసభలు ఘనంగా నిర్వహించాడు.
సామాజిక సేవ
[మార్చు]కరోనా కష్టకాలంలో నిత్యాన్నదానంతో అలసటెరగకుండా శ్రమించాడు. వేసవికాలం వచ్చిందంటే చాలు కొన్ని వేల మజ్జిగ ప్యాకెట్లతో పాదచారుల దాహార్తిని తీర్చేవారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలి చార్టర్ అధ్యక్షులుగా సేవలందించాడు. వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గా చేశాడు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యవర్గ సభ్యుడిగా కూడా చురుగ్గా వ్యవహరించాడు.