కోసూరి సుబ్బరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోసూరి సుబ్బరాజు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్వాతంత్ర్యసమరయోధులు, గాంధేయవాది. 16ఏళ్ళ అతి చిన్న వయసులోనే జాతీయోద్యమంలోకి అడుగుపెట్టారు ఆయన. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న సుబ్బరాజు, 16వ ఏటనే మద్యపాన నిషేధ ఉద్యమం సందర్భంగా జైలుకు కూడా వెళ్ళారు. శాసనోల్లంఘన ఉద్యమ సమయంలో కూడా మద్యపాన నిరోధం చేస్తున్న ఆయనను పోలీసులు రెండురోజుల పాటు జైలులో లాఠీఛార్జి చేశారు. తరువాత 1932లోనూ రెండుసార్లు పోలీసులు సుబ్బరాజును బంధించి తీవ్రంగా లాఠీఛార్జీ చేసిన సందర్భాలున్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెరవక జాతీయోద్యమంలో పోరాడారు ఆయన. ఎన్నో సార్లు జైలు శిక్ష అనుభవించారు, లాఠీఛార్జీలు తిన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో భారతీయులు ఆంగ్ల సైన్యంలో చేరవద్దంటూ యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు సుబ్బరాజు. హిందీ, ఖాదీ ప్రచారాల్లోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు.[1]

జీవిత సంగ్రహం[మార్చు]

కోసూరి సుబ్బరాజు 1914 ఆగస్టు 13 న మాతామహుల ఇంటిలో తణుకు తాలూకా ఖండవల్లి గ్రామంలో సీతారామరాజు, చంద్రమ్మలకు జన్మించారు. వీరి అసలు ఊరు నరసాపురం తాలూకా జిన్నూరు. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించారు సుబ్బరాజు. తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్న సుబ్బరాజు తరువాత హిందీ ప్రచారక పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.[1] ఆయన 15వ ఏట 1929లో గాంధీ పాలకొల్లు వచ్చినప్పుడు ఆయనను సందర్శించిన సుబ్బరాజు గాంధీ ఆదర్శాలకు ఆకర్షితులయ్యారు. తన 16వ ఏటనే జాతీయోద్యమంలోకి ప్రవేశించారు సుబ్బరాజు.

జాతీయోద్యమం[మార్చు]

16 జూన్ 1930న పాలకొల్లు సంతలో మద్యపానం చేయవద్దంటూ కల్లు దుకాణం వద్ద స్నేహితులతో కలసి పికెటింగ్ నిర్వహించారు సుబ్బరాజు. ఆ గొడవలో దుకాణదారు చేతిలో కల్లు కుండను పగులగొట్టిన కారణంగా వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. నరసాపురం జాయింటు మెజిస్ట్రేట్ వీరికి 2 సంవత్సరాల కారాగార శిక్ష విధించి, తిర్చునాపల్లిలోని బాల నేరస్థుల స్కూలుకు పంపించారు. కానీ ఆరోగ్యం పాడైపోవడంతో జూలై 24 1930న సుబ్బరాజులు విడదల చేశారు అధికారులు.[1]

1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా నరసాపురం తాలూకా బల్లిపాడు గ్రామంలో అల్లూరిసత్యనారాయణరాజు, చెరుకూరి నరసింహరాజు వంటి ఐదుగురు స్నేహితులతో కలసి సుబ్బరాజు మద్యపాన నిషేధం చేయాలని తాగుబోతుల్ని కోరుతుండగా వీరవాసరం పోలీసులు అరెస్టు చేసి రెండు రోజులపాటు లాకప్ లో లాఠీఛార్జి చేసి వదిలిపెట్టారు. సుబ్బరాజును తిరిగి ఫిబ్రవరి 12 1932లో గుంటూరు జైలులో 45 రోజులు పెట్టి తీవ్రంగా కొట్టి వదిలారు. జూలైలో మదరాసులో జరుగుతున్న రాజకీయ సదస్సుకు హాజరైన సుబ్బరాజును పోలీసులు పట్టుకుని లాఠీఛార్జి చేసి 25మైళ్ళ దూరం తీసుకెళ్ళి నిర్జన ప్రదేశంలో వదిలేశారు. ఇలా ఎన్నోసార్లు పోలీసుల దాష్టీకానికి గురయ్యారు సుబ్బరాజు.[1]

సుబ్బరాజుకు 14 సెప్టెంబరు 1932న నిడదవోలు వద్ద పాసింజరు రైలును చైను లాగి ఆపిన కేసులో 6 నెలల కఠిన కారాగార శిక్ష, 250 రూపాయల జరిమానా వేశారు. బలవంతంగా జరిమానా వసూలు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయనను ఉంచారు. కొత్తపట్నంలో నిర్వహించిన నిషేధిత రాజకీయ పాఠశాలపై దాడి చేసి, పోలీసులు అక్కడ హాజరైన సుబ్బరాజును కూడా అరెస్టు చేసి, 17 జూన్ 1937నుండి 6 నెలల పాటు రాజమండ్రి జైలులో ఉంచారు. కానీ మద్రాసులో కాంగ్రెస్ మంత్రివర్గం అధికారంలోకి రావడంతో 1 ఆగస్టు 1937న శిక్షాకాలం పూర్తవకుండానే విడుదల చేశారు ఆయనను.

ఆ తరువాత 1939లో రెండో ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండు ప్రభుత్వం భారతదేశం కూడా యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా ప్రకటన చేసింది. దాంతో భారత ప్రజలు ఎవరూ ఆంగ్ల సైన్యంలో చేరకూడదని, వారికి ఈ యుద్ధంలో సాయం చేయకూడదనీ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సుబ్బరాజు తన మిత్రులతో కలసి యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా సుబ్బరాజు తదితరులను 21 నవంబరు 1940 నుండి 15 డిసెంబరు 1941 వరకు డిటెన్యూగా బంధించారు. ఆయన నెల్లూరులోని జైలులో తన శిక్షను అనుభవించారు. విడుదలైన తరువాత కూడా జాతీయోద్యమంలో పాల్గొంటూ, గాంధేయవాదిగా మంచి పేరు సంపాదించుకున్నారు సుబ్బరాజు.

గాంధీ హత్య జరిగినప్పుడు ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు.[1]

సుబ్బరాజు హిందీ ప్రచార ఉద్యమం, ఖాదీ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1937 నుండి 1948 వరకు తాలూకా కాంగ్రెస్ కార్యదర్శి, దక్షిణ భారత హిందీ ప్రచారక సభకు ఆంధ్ర ప్రాంత సభ్యునిగానూ పనిచేశారు. పాలకొల్లులో ఆంధ్రపత్రిక విలేకరిగా పనిచేశారు ఆయన.

మరణం[మార్చు]

సుబ్బరాజు చాలాకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. 4 ఆగస్టు 1976న తన 62వ ఏట కాకినాడ రంగరాయ మెడికల్ హాస్పటల్ లో కన్నుమూశారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 గాదం, గోపాలస్వామి (ఆగస్టు 2016). భారత స్వాతంత్య్రోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు. అత్తిలి: శ్రీసత్య పబ్లికేషన్స్. More than one of |author1= and |last1= specified (help); Check date values in: |date=, |archivedate= (help)