క్రికెట్ నియమాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పలు నిబంధనలతో కూడిన క్రికెట్‌ నియమాలు ను మెరైల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) రూపొందించింది. క్రికెట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఏకరూపత, కచ్చితత్వం ఉండేవిధంగా ఈ నియమాలను రూపొందించినట్లు ఎంసీసీ పేర్కొంది. ప్రస్తుతం ఈ నిబంధనావళిలో 42 నియమాలు ఉన్నాయి. ఇందులో క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా ఆడాలి, ఒక జట్టు ఎలా విజయం సాధిస్తుంది, బ్యాట్స్‌మన్‌ అవుటయ్యే తీరు, పిచ్‌ను రూపొందించడానికి అనుసరించాల్సిన విధానాలు, దాని నిర్వహణ తీరు తదితర అంశాలు ఉంటాయి. ఎంసీసీ ఇంగ్లండ్‌లో లండన్‌లోని ఓ ప్రైవేట్‌ క్లబ్‌. ఈ క్లబ్బు క్రికెట్‌కు అధికారిక గవర్నింగ్‌ బాడీ. గేమ్‌ నియమాలపై ఎంసీసీకి కాపీరైట్‌ హక్కు ఉంది.ఎంసీసీయే ఈ నియమాలను మార్చగలదు. అయితే ప్రస్తుతం క్రికెట్‌ విశ్వవ్యాప్త పాలన సంస్థ అయిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) యే పలు చర్చల అనంతరం ఈ నియమావళిని మారుస్తుంది.

నియమ నిబంధనల ఆధారంగా రూపొందించిన కొన్ని క్రీడల్లో క్రికెట్‌ ఒకటి. నిబంధనలు క్రీడలకు పరిపూర్ణతను చేకూరుస్తాయి. కొన్ని నిర్దిష్ట పోటీల్లో మాత్రమే వీటికి స్థానం ఉంటుంది.

చరిత్ర[మార్చు]

క్రికెట్‌ పుట్టుక అనేది చర్చనీయాంశం. కానీ బ్యాట్‌తో బంతిని కొట్టే చాలా గేమ్స్‌, ఆటల నుంచి క్రికెట్‌ పుట్టుకను కనుక్కోవచ్చు (క్రికెట్‌ చరిత్రను చూడండి). పద్దెనిమిదో శతాబ్దంలో ఇది బెట్టింగ్‌ గేమ్‌గా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా బ్రిటీష్‌ కులీన పాలనలో క్రికెట్‌ బాగా ప్రాచుర్యం పొందింది. పెద్ద మొత్తాలు పందాలుగా కాసే ఈ గేమ్‌ను నియంత్రించేందుకు తొలినాళ్లలో నియమాలు రూపొందాయి. మొట్టమొదటి క్రికెట్‌ కోడ్‌ను 1744లో 'నోబుల్‌మెన్‌, జెంటిల్‌మెన్‌' రచించారు. 1755లో ఈ కోడ్‌ను పలు క్రికెట్‌ క్లబ్‌లు మార్చాయి. ముఖ్యంగా ద స్టార్‌ అండ్‌ గార్టెర్‌ ఇందులో ప్రముఖ పాత్ర వహించింది. 1774లో కెంట్‌కు చెందిన నోబుల్‌మెన్‌, జెంటిల్‌మెన్‌ కమిటీ రూపొందించిన నియమాలను హాంప్‌షైర్‌, సర్రే, ససెక్స్‌, మిడిలెసెక్స్‌, లండన్‌ క్లబ్‌లు సవరించాయి. 1775లో నియమాలను ముద్రించడంతో వాటి అచ్చుకాపీ రూపొందింది. తర్వాత ఈ నిబంధనల సవరణ బాధ్యతను 1786లో నోబుల్‌మెన్‌, జెంటిల్‌మెన్‌ లాంటి కమిటీలే చేపట్టాయి. హాంప్‌షైర్‌, సర్రే, ససెక్స్‌, మిడిలెసెక్స్‌, లండన్‌ క్లబ్‌లకు చెందిన కమిటీలు వీటిని సవరించేందుకు పూనుకున్నాయి.

ఏదేమైనా ఈ నియమాలు విశ్వవ్యాప్తంగా ఒకేలా ఉండేవి కావు. వివిధ కమిటీల మార్గదర్శకత్వంలో విభిన్న రకాలుగా మ్యాచ్‌లు జరిగేవి. నోబుల్‌మెన్‌, జెంటిల్‌మెన్‌ స్థాపించిన మెరైల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఎట్టకేలకు 1788 మే 30న తొలిసారిగా క్రికెట్‌కు పూర్తిస్థాయి నిబంధనావళిని రూపొందించింది. అయితే ఎంసీసీ నియమాలను అందరూ పూర్తిగా వెంటనే ఆమోదించలేదు. అయితే ఇప్పుడు గేమ్‌ అనుసరిస్తున్న నియమాలకు అవే పునాది. తర్వాత 1809లో ప్రధాన మార్పు జరిగింది. బంతి బరువు 5, 6 ఔన్సుల (142 నుంచి 170 గ్రాములు) నుంచి 5.5, 5.75 ఔన్సుల (156 నుంచి 163 గ్రాములు) వరకు ఉండాలని, నిర్దిష్టమైన క్రికెట్ బ్యాట్‌ వెడల్పును సూచిస్తూ తొలిసారిగా ప్రమాణాలు ఏర్పాటుచేశారు. బంతి నాన్‌స్ట్రైకర్‌ స్టంప్స్‌ను తాకితే పరుగులు రావడమనే నిబంధన రద్దైంది. అంతేకాదు బౌలర్లకు ఉపయోగపడే విధంగా స్టంప్స్‌ పొడవు 22 నుంచి 24 అంగుళాలకు, బెయిల్స్‌ పొడవు 6 నుంచి 7 అంగుళాలకు పెంచారు. దాంతో అంపైర్ల ప్రాముఖ్యం మరింత పెరిగింది. చివరగా బ్యాట్స్‌మన్‌ను కొత్తపద్ధతిలో తొలగించే విధానం ప్రవేశపెట్టారు. అంతకుముందు గట్టి బంతిని ఉపయోగించేప్పుడు లెగ్‌ ప్యాడ్స్‌ ఉపయోగించేవారు కాదు. వికెట్ల ముందు వట్టి కాళ్లతోనే నిలబడి ఆడేవారు. బ్యాట్స్‌మెన్‌ ప్యాడ్స్‌ ధరించడం మొదలుపెట్టినప్పటి నుంచీ తమ కాళ్లతో బంతి స్టంప్స్‌ను తాకకుండా, తాము బౌల్‌ కాకుండా కవర్‌ చేసుకునేవారు. అందువల్ల 'లెగ్‌ బిఫోర్‌ వికెట్‌' నియమం ప్రవేశపెట్టారు. దీంతో బంతి స్టంప్స్‌ను తాకకుండా బ్యాట్స్‌మన్‌ తమ కాళ్లతో నిరోధించినా అవుటే.

1829లో బౌలర్లకు ఉపయోగపడే విధంగా స్టంప్స్‌ పొడవు 24 to 27 inches (610 to 690 millimetres), బెయిల్స్‌ పొడవు 7 to 8 inches (180 to 200 millimetres)పెంచారు. తొలిసారిగా స్టంప్స్‌ ఎంత మందం ఉండాలో సూచించారు. 1835లో మే 19న ఎంసీసీ కమిటీ కొత్త నిబంధనావళికి ఆమోదముద్ర వేసింది. ఆ తర్వాత సవరించిన క్రికెట్‌ కోడ్‌ను 1884లో ఏప్రిల్‌ 21న మళ్లీ ఆమోదించింది. 1884 నిబంధనల్లో తొలిసారిగా ఆటగాళ్ల సంఖ్య (ఒకవైపు పదకొండు మంది సభ్యులు) ను, బంతి సైజును అధికారికంగా నిర్ణయించారు. ఫాలో-ఆన్‌ రూల్‌ ప్రవేశపెట్టారు. ఒక జట్టు మ్యాచ్‌ గెలవాలంటే ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఓడించాలనే సమస్య తలెత్తడంతో దానికి విరుగుడుగా ఈ నిబంధన రూపొందింది. ఒక జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి ప్రత్యర్థి జట్టుపై భారీ స్కోరు సాధించి టాప్‌లో ఉన్నప్పటికీ.. ప్రత్యర్థిని రెండోసారి ఓడించేవరకూ నిరీక్షించాల్సి వచ్చేది. క్రికెట్‌ మ్యాచ్‌ నిర్ణీత కాలవ్యవధిలో ఆడే ఆట. ఫలితంగా ప్రత్యర్థిపై భారీ స్కోరు చేసిన జట్టు అయినా డ్రా అయ్యే పరిస్థితికి తలెత్తేది. అయితే తొలినాటి ఫాలో ఆన్‌ నిబంధన తప్పుగా ఉండేది. అయినప్పటికీ పరుగుల విషయంలో వెనకబడిన జట్టు ఫాలో ఆన్ ఆడాల్సి ఉండేది. కొన్ని సందర్భాలలో జట్లు కావాలని చివరి వికెట్లను వేగంగా పోగొట్టుకుని ఫాలో ఆన్ ఆడేవి. దీనివల్ల ఆఖరి ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసి, పిచ్ పరిస్థితులను ఉపయోగించుకోవాలని చూసేవి. తర్వాత ఫాలో ఆన్ నిబంధనలను మార్చారు. మొదట ఆధిక్యం సాధించిన జట్టు ఫాలో ఆన్ ఆడించాలా లేదా అనే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చు.

ఎంసీసీ 1947లో మే7న కొత్త కోడ్‌ను ఆమోదించింది. ఈ కోడ్‌కు చిన్న చిన్న మార్పులు చాలా చేసి 1979 నవంబరు 21న జరిగిన ఎంసీసీ ప్రత్యేక సాధారణ సమావేశంలో సరికొత్త కోడ్‌ను ఆమోదించింది. ఇది 1980 కోడ్‌గా పేరొందింది. ఇతర మార్పుల విషయానికొస్తే, ప్రస్తుతం స్పెషిఫికేషన్స్ విషయంలో ఇంపీరియల్ యూనిట్స్ ను మెట్రిక్ యూనిట్స్ అనుసరిస్తున్నాయి.

1992లో 1980 కోడ్‌ రెండో ఎడిషన్‌ తయారుచేశారు. 2000లో వచ్చిన కొత్త కోడ్‌కు తొలిసారిగా క్రికెట్‌ స్ఫూర్తిని నిర్వచిస్తూ ముందుమాటను చేర్చారు. ఈ కోడ్‌ను ఆ ఏడాది మే 3న ఆమోదించారు. ఈ కోడ్‌ను స్వచ్ఛమైన ఆంగ్లబాషలో తిరగరాయడంతో ముందు కోడ్‌ల కంటే మరింత వివరంగా, అర్థమయ్యేలా రూపుదిద్దుకుంది. ఇందులో అన్ని మ్యాచ్‌లకూ ఓవర్‌కు ఆరు బంతులను వేయాలని నిర్ణయించారు. ఆరు బంతులనే చాలా ఏళ్లుగా పలు మ్యాచ్‌ల్లో పలువురు అనుసరిస్తున్నప్పటికీ ఈసారి అధికారికంగా దీన్ని ధ్రువీకరించారు. 2000 కోడ్‌ అమలులో తలెత్తిన ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన సవరణలు చేసి ఈ కోడ్‌ సెకండ్‌ వెర్షన్‌ను 2003లో తయారుచేశారు.

త్రోయింగ్‌ను 1829లో రూపొందించిన నిబంధనల్లోనే నియంత్రించారు. 1864లో ఓవర్‌ ఆర్మ్‌ బౌలింగ్‌ను తొలిసారిగా అనుమతించారు.

1889లో నాలుగు బంతులుండే ఓవర్‌ను ఐదు బంతులకు విస్తరించారు. 1900లో ఓవర్‌ను ఆరు బంతులకు విస్తరించారు. 1922లో ఓవర్‌కు ఎన్ని బంతులుండాలనే విషయంలో తేడాలుండేవి (ఆస్ట్రేలియన్లు ఓవర్‌కు ఎనిమిది బంతులు వేసేవారు). అయితే 1947 కోడ్‌ దీనిపై స్పష్టతను ఇచ్చింది. ఓవర్‌కు ఆరు బంతులుండాలో, ఎనిమిది బంతులుండాలో ఇరు కెప్టెన్లు ముందే ఒప్పందం చేసుకోవాలని అది స్పష్టీకరించింది.

ప్రస్తుత నియమాలు[మార్చు]

మెరైల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఆట నియమాల నిబంధనావళి రూపకర్త. ఈ నియమాలు అన్ని రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌లకూ ఉద్దేశించినవి. ఈ నిబంధనలకు అనుబంధంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి 'టెస్టులకు నిర్దిష్ట సూత్రాలు', 'వన్డేలకు నిర్దిష్ట సూత్రాలు' వేర్వేరుగా అమలుచేసింది. ఇదేవిధంగా క్రికెట్‌ ఆడే ప్రతి దేశమూ దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన సూత్రాలను అమలుపరిచాయి. క్రికెట్‌ నియమావళి వన్డేలకు లేదా పరిమిత ఓవర్ల క్రికెట్‌ (ట్వంటీ20లతో కలిపి) కు ప్రతి ఇన్నింగ్స్‌కు గరిష్ఠ ఓవర్లు, గరిష్ఠ కాలవ్యవధిని నిర్ణయించి నియంత్రణ విధించింది. ఇందులో నిర్ణయించిన ఇన్నింగ్స్‌ ఒకటి లేదా రెండైనా ఇదే సూత్రం అమలవుతుంది.

ఈ నియమాలలో ఇంపీరియల్ యూనిట్స్ ను కొనసాగించారు. కానీ ఇప్పుడు మెట్రిక్ కన్వర్షన్స్ ను కూడా కలిపారు.

ఈ నియమావళిలో ముందుమాట, ఉపోద్ఘాతంతో కలిపి నాలుగు అధ్యాయాలు 42 నియమాలు ఉంటాయి. ముందుమాట మెరైల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌, నియమావళి చరిత్రకు సంబంధించింది. కొత్తగా చేర్చిన ఉపోద్ఘాతం 'క్రీడాస్ఫూర్తి'కి సంబంధించింది. ఆటగాళ్లు అనుచిత ప్రవర్తన, అక్రమ మార్గాలు అనుసరించకుండా ఉండేందుకు ఈ ఉపోద్ఘాతాన్ని ప్రవేశపెట్టారు.

నియమావళికి 2010 సెప్టెంబరు 30న ఎనిమిది సవరణలు చేశారు. బ్యాడ్‌ లైట్‌ (వెలుతురు మందగింపు), టాస్‌, క్రికెట్‌ స్ఫూర్తి, ప్రాక్టీస్‌ సెషన్‌, ఫీల్డింగ్‌ అథ్లెటిసిజమ్‌, రేర్‌ డిస్మిసల్స్‌కు సంబంధించి ఈ సవరణలు జరిగాయి. ఇవి 2010 అక్టోబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. మొత్తం తాజా సవరణలను ఇక్కడ చదవొచ్చు.

ఈ నియమాలు కింది అంశాలకు సంబంధించి డీల్ చేస్తాయి.

ఆటగాళ్లు, అధికారులు[మార్చు]

పురుషుల క్రికెట్‌లో బంతి బరువు 5.5 నుంచి 5.75 ఔన్సుల (155.9 నుంచి 163 గ్రాములు) మధ్య ఉండాలి. చుట్టుకొలత 8 13/16 నుంచి 9 (22.4 నుంచి 22.9 సెం.మీ.) మధ్యలో ఉండాలి.
క్రికెట్‌ పిచ్‌ డైమన్షన్స్
వికెట్‌లో మూడు స్టంప్స్‌ ఉంటాయి. గ్రౌండ్‌లో అమర్చిన ఈ వుడెన్‌ పోల్స్‌పై మరో రెండు చిన్న కర్రలను అమర్చాలి. వీటిని బెయిల్స్‌ అంటారు.

మొదటి నాలుగు నియమాలు ఆటగాళ్లు, అంపైర్లు, స్కోరర్లకు సంబంధించినవి.

నియమం 1: ఆటగాళ్లు ఒక క్రికెట్‌ జట్టులో కెప్టెన్‌తో కలిపి పదకొండు మంది ఆటగాళ్లుంటారు. అనధికారిక పోటీల్లో ఒక జట్టు పదకొండు మంది కంటే ఎక్కువమందితో ఆడటానికి ఆమోదించవచ్చు. అయితే పదకొండు మంది కంటే ఎక్కువమంది బరిలో దిగే అవకాశం లేదు.

నియమం 2: సబ్‌స్టిట్యూట్స్‌. క్రికెట్‌లో గాయపడిన ఫీల్డర్‌కు ప్రత్యామ్నాయంగా సబ్‌స్టిట్యూట్‌ను తెచ్చుకోవచ్చు. అయితే సబ్‌స్టిట్యూట్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌, వికెట్‌ కీపింగ్‌, సారథ్యం చేయరాదు. గాయపడిన అసలైన ఆటగాడు రికవరీ అయితే సబ్‌స్టిట్యూట్‌ స్థానంలో మళ్లీ తిరిగి రావచ్చు. బ్యాట్స్‌మన్‌ పరుగులు చేయలేని పక్షంలో రన్నర్‌ను పెట్టుకోవచ్చు. అతను పరుగులు తీస్తుంటే బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ కొనసాగించవచ్చు. అంతేకాకుండా బ్యాట్స్‌మన్‌ రిటైర్‌హర్ట్‌, లేక అనారోగ్యానికి గురైనప్పుడు వైదొలగొచ్చు. తర్వాత తేరుకుంటే తన ఇన్నింగ్స్‌ కొనసాగించడానికి మళ్లీ బరిలో దిగొచ్చు.

నియమం 3: అంపైర్లు. మ్యాచ్‌కు ఇద్దరు అంపైర్లుంటారు. వీరు నియమాలను వర్తింపజేయడం, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం, స్కోరర్లకు నిర్ణయాలు తెలపడం చేస్తుంటారు. క్రికెట్‌ నియమావళి ప్రకారం అవసరం లేనప్పటికీ, ఉన్నత స్థాయి క్రికెట్‌లో థర్డ్‌ అంపైర్‌ ఉంటారు (ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లకు సహకరించేందుకు మైదానానికి ఆవల అందుబాటులో ఉంటారు). ఈ అంపైర్‌ను ప్రత్యేక మ్యాచ్‌కు లేదా ప్రత్యేకమైన టోర్నీకి ప్రత్యేక పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు.

నియమం 4: స్కోరర్లు. అంపైర్‌ సంజ్ఞలకు అనుగుణంగా స్కోరును వేసేందుకు ఇద్దరు స్కోరర్లు ఉంటారు.

క్రీడాసామగ్రి, పిచ్‌ తయారీ[మార్చు]

ఆటగాళ్ల తర్వాత క్రీడా సామగ్రి గురించి, పిచ్‌ తీరుతెన్నుల గురించి నియమావళి వివరిస్తుంది.అయితే వికెట్‌ కీపర్‌ గ్లోవ్స్‌కు సంబంధించిన సూత్రాలు ఇందులో ఉండవు. అవి 40వ నియమంలో ఉంటాయి. ఈ నియమాలు ఎ, బి అధ్యాయాల్లో ఉంటాయి (కింద చూడండి).

నియమం 5: బంతి. క్రికెట్‌ బంతి చుట్టుకొలత 8 13/16 అంగుళాల నుంచి 9 అంగుళాల మధ్యలో (22.4 సెం.మీ. నుంచి 22.9 సెం.మీ. మధ్యలో) ఉండాలి. బరువు 5.5 ఔన్సుల నుంచి 5.75 ఔన్సుల మధ్యలో (155.9 గ్రా. నుంచి 163 గ్రా. మధ్యలో) ఉండాలి. ఒక బంతిని ఒకేసారి ఉపయోగించాలి. అది పాడైనప్పుడు అలాంటిదే మరో బంతిని వాడాలి. అది కూడా ప్రతిఇన్నింగ్స్‌ ప్రారంభంలో రీప్లేస్‌ చేయాలి. ఫీల్డింగ్‌ జట్టు అభ్యర్థన మేరకు నిర్ణీత ఓవర్ల బౌలింగ్‌ (టెస్టుల్లో అయితే 80 ఓవర్లు, వన్డేల్లో అయితే 34 ఓవర్లు) పూర్తయిన తర్వాత కొత్త బంతిని రీప్లేస్‌ చేయవచ్చు. ఇన్నింగ్స్‌లో బంతి పాతదవుతూ ఉండటం గేమ్‌లో ప్రాధాన్యతాంశం.

నియమం 6: బ్యాట్‌. క్రికెట్‌ బ్యాట్‌ పొడవు 38 inches (97 centimetres)మించకుండా వెడల్పు 4.25 inches (10.8 centimetres) మించకుండా ఉండాలి. హ్యాండిల్‌ కూడా బ్యాట్‌లో భాగంగానే పరిగణించాలి. హెవీ మెటల్ సంఘటనలో డెన్నిస్‌ లిల్లీ అంతర్జాతీయ మ్యాచ్‌లో అల్యూమినియం బ్యాట్‌తో ఆడి సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. బ్యాట్‌ బ్లేడ్‌ కచ్చితంగా కర్రతోనే తయారుచేయాలని నియమాన్ని రూపొందించారు (వాస్తవానికి బ్యాట్లను వైట్‌ విల్లీవుడ్‌తో చేస్తారు).

నియమం 7: పిచ్‌. మైదానంలో 22 yards (20 m) పొడవు, 10 ft (3.0 m) వెడల్పుతో పిచ్‌ దీర్ఘచతురస్రాకారంగా ఉండాలి. గ్రౌండ్‌ అధికారులు పిచ్‌ ఎంపిక, తయారీ పనులను చూస్తారు. అయితే ఒకసారి మ్యాచ్‌ ప్రారంభమైన తర్వాత పిచ్‌కు ఏం జరిగినా నియంత్రించేది అంపైర్లే. పిచ్‌ ఆడేందుకు వీలైనదా కాదా అనేది కూడా అంపైర్లు జడ్జ్‌ చేస్తారు. ఒకవేళ పిచ్‌ పనికిరానిదని వారు భావిస్తే.. ఇరు జట్ల కెప్టెన్ల సమ్మతితో పిచ్‌ను మారుస్తారు. ప్రొఫెషనల్‌ క్రికెట్‌ దాదాపుగా ఎప్పుడూ గడ్డి ఉన్న ఉపరితలంపైనే ఆడతారు. ఒకవేళ ఏదైనా మ్యాచ్‌కు నాన్‌ టర్ఫ్‌ పిచ్‌ ఉపయోగిస్తే కృత్రిమ ఉపరితలం కనీసం పొడవు 58 ft (18 m), వెడల్పు 6 ft (1.8 m) ఉండాలి.

నియమం 8: వికెట్లు. వికెట్‌లో మూడు చెక్క స్టంప్స్‌ 28 inches (71 centimetres) పొడవుతో కలగలిసి ఉంటాయి. ఈ స్టంప్స్‌ను బ్యాటింగ్‌ క్రీజ్‌లో అమర్చుతారు. ఇలా అమర్చినప్పుడు వాటి మధ్య సమాన దూరం ఉండాలి. అలా ఉంచినపుడు అవి 9 inches (23 centimetres) వైడ్‌ ఉండాలి. స్టంప్స్‌పైన రెండు వుడెన్‌ బెయిల్స్‌ ఉంచాలి. బెయిల్స్‌ పెట్టినప్పుడు స్టంప్స్‌ 0.5 inches (1.3 centimetres) కంటే ఎత్తుగా కనిపించరాదు. పురుషుల క్రికెట్‌కైతే కచ్చితంగా 4 516 inches (10.95 centimetres) పొడవు ఉండాలి. బెయిల్‌ బారెల్‌, స్పైగోట్స్‌కు కూడా నిర్ధారిత కొలతల్లో ఉండాలి. జూనియర్‌ క్రికెట్‌లో వికెట్లు, బెయిల్స్‌కు వేరే ప్రమాణాలు ఉంటాయి. పరిస్థితులు బాగోలేదనుకుంటే (గాలి వీస్తే వాటంతట అవే పడిపోయే విధంగా ఉంటే) అంపైర్లు బెయిల్స్‌ను తొలగించవచ్చు. వికెట్లకు సంబంధించిన ప్రమాణాల గురించి మరిన్ని విషయాలు నియమావళి అనుబంధం 'ఎ' లో ఉన్నాయి.

నియమం 9: బౌలింగ్‌, పాపింగ్‌, రిటర్న్‌ క్రీజ్‌లు. ఈ నియమం క్రీజుల కొలతలు, లొకేషన్స్‌ను గురించి తెలియజేస్తుంది. పిచ్‌కు అటు నుంచి ఇటు వరకు స్టంప్స్‌ మధ్యలో నుంచి గీసిన లైన్‌నే బౌలింగ్‌ క్రీజ్‌ అంటారు.రెండు వైపులా స్టంప్స్ దగ్గర ఈ క్రీజును గీయాలి. పిచ్ కు చివరన ఇవి ఉండాలి. ప్రతి బౌలింగ్‌ క్రీజ్‌ 8 feet 8 inches (2.64 metres) పొడవు ఉంటుంది. మిడిల్‌ స్టంప్‌కు ఇది సరిగ్గా మధ్యలోకి వస్తుంది. ఈ బౌలింగ్‌ క్రీజ్‌.. రిటర్న్‌ క్రీజ్‌ల వరకు ఉండి, అక్కడితో ముగుస్తుంది. పాపింగ్‌ క్రీజ్‌ బ్యాట్స్‌మన్‌ తన గ్రౌండ్‌లో ఉన్నాడా లేదా అన్నది నిర్ణయిస్తుంది. దీన్ని ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్స్‌ (24వ నియమం చూడండి) నిర్ణయించడంలో ఉపయోగిస్తారు. ఈ లైన్‌ను రెండు సెట్ల స్టంప్స్‌ ముందు పిచ్‌కు అటు నుంచి ఇటు వరకు గీస్తారు. పాపింగ్‌ క్రీజ్‌ కచ్చితంగా 4 feet (1.2 metres) బౌలింగ్‌ క్రీజ్‌కు ముందు దానికి సమాంతరంగా ఉంటుంది. పాపింగ్‌ క్రీజ్‌ పొడవుఎంత ఉన్నా ఫర్వాలేదని భావిస్తున్నప్పటికీ, మిడిల్‌ స్టంప్స్‌ మధ్యలో వచ్చే విధంగా గీత కనీసం 6 feet (1.8 metres) గీయాలి. బౌలర్‌ బంతిని వేసేప్పుడు కచ్చితంగా రిటర్న్‌ క్రీజుల్లో నుంచే వేయాలి. వీటిని రెండు సెట్ల స్టంప్స్‌ ముందు పిచ్‌ వైపు గీయాలి (రెండు సెట్ల స్టంప్స్‌కు ఇరు పక్కలా ఒక్కోటి చొప్పున మొత్తంగా నాలుగు రిటర్న్‌ క్రీజులు ఉంటాయి). రిటర్న్‌ క్రీజ్‌లు... పాపింగ్‌ క్రీజ్‌, బౌలింగ్‌ క్రీజ్‌లకు భిన్నంగా ఉంటాయి. స్టంప్స్‌ మధ్య్లలో వచ్చేలా వాటికి రెండు వైపులా సమాంతరంగా 4 feet 4 inches (1.32 metres)గీసిన లైన్లే ఇవి. ప్రతి రిటర్న్‌ క్రీజు లైన్‌ ఒకవైపు పాపింగ్‌ క్రీజు లైన్‌ వరకు వెళ్లి ఆగిపోతుంది. మరోవైపు పొడవు ఎంత ఉన్నా ఫర్వాలేదు. అయినప్పటికీ పాపింగ్‌ క్రీజు నుంచి కొంతవరకైనా 8 feet (2.4 metres) మార్క్‌ చేయాలి.

నియమం 10: ప్లేయింగ్‌ ఏరియా తయారీ, నిర్వహణ. క్రికెట్‌లో బంతి వేసినప్పుడు దాదాపు అన్నివేళలా పిచ్‌పై బౌన్స్‌ అవ్వాలి. అయితే పిచ్‌ కండిషన్‌ను బట్టి బంతి బౌన్స్‌ అయ్యే తీరు ఆధారపడి ఉంటుంది. అందువల్ల పిచ్‌కు వివరణాత్మక నియమాలు తప్పనిసరి. ఈ నియమం పిచ్‌లను ఎలా తయారుచేయాలి. ఎలా రోల్‌ చేయాలి. గడ్డిని ఏమేరకు ఉంచాలి తదితర విషయాలను తెలియజేస్తుంది.

నియమం 11: కవరింగ్‌ ద పిచ్‌. పిచ్‌ కవరింగ్‌ను బట్టి బంతి బౌన్స్‌ అయ్యే తీరు ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు తడి నేలపై బంతి బౌన్స్‌ అయ్యే తీరుకు, పొడి నేలపై బంతి బౌన్స్‌ అయ్యే తీరుకు చాలా తేడా ఉంటుంది. పిచ్‌ కవరింగ్‌కు సంబంధించిన నిబంధనలు ముందే అంగీకరించాలని నియమావళి తెలుపుతుంది. బౌలర్ల రనప్స్‌ పొడిగానే ఉంచాలి. వారు జారిపోయే అవకాశం లేకుండా ఉండేందుకు ఈ ముందుజాగ్రత్త చర్య ఉపయోగపడుతుంది. ఎక్కడ తడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నా పిచ్‌ను కవర్‌ చేయాల్సిన అవసరం ఉందని నియమావళి సూచిస్తోంది.

ఆట నిర్మాణం[మార్చు]

12 నుంచి 17 వరకు ఆట ఎలా సాగాలనే అంశానికి సంబంధించిన నియమాలు

నియమం 12: ఇన్నింగ్స్‌. గేమ్‌ ఆడటానికి ముందు ఇరు జట్లు ఒక ఇన్నింగ్స్‌ మ్యాచా, రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచా అనేది నిర్ణయించుకోవాలి. అలాగే ఇన్నింగ్స్‌ను నిర్ణీత కాలవ్యవధిలో ముగించాలా, ఓవర్ల పరిమితితో ముగించాలా అనేది కూడా ముందే నిర్ణయించుకోవాలి. సహజంగా మ్యాచ్‌లాడేప్పుడు ఈ నిర్ణయాలు టోర్నీ రెగ్యులేషన్స్‌లో పొందుపరచి ఉంటాయి. లేకుంటే మ్యాచ్‌కు ముందు వీటి గురించి రెండు జట్లు ఒప్పందం చేసుకుంటాయి. రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌ల్లో ఫాలో ఆన్‌ వస్తే తప్ప (నియమం 13) రెండు జట్లు ఒకదాని తర్వాత ఒకటి బ్యాటింగ్‌ చేస్తాయి. బ్యాట్స్‌మెన్‌ అంతా అవుటైనప్పుడు, ఆడేందుకు ఇక ఏ బ్యాట్స్‌మన్‌ ఫిట్‌గా లేనప్పుడు, బ్యాటింగ్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినప్పుడు లేదంటే ముందుగా అనుకున్న కాలవ్యవధి లేదా ఓవర్‌ లిమిట్‌ పూర్తయినప్పుడు ఒక ఇన్నింగ్స్‌ ముగుస్తుంది. టాస్‌ గెలిచిన కెప్టెన్‌ మొదట బ్యాటింగ్‌ చేయాలా, ఫీల్డింగ్‌ చేయాలా అనేది నిర్ణయిస్తాడు.

నియమం 13: ఫాలో ఆన్‌. రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్టు చెప్పుకోదగ్గ స్థాయిలో స్కోరులో వెనకబడితే.. మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు వారిని మళ్లీ వెంటనే బ్యాటింగ్‌ చేయమని ఒత్తిడి చేయొచ్చు. ఫాలో ఆన్‌లో పడే ప్రమాదమున్న జట్టు వెంటనే బ్యాటింగ్‌ చేయకుంటే గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐదు లేదా అంతకన్నా ఎక్కువ రోజుల మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు కనీసం 200 పరుగుల స్కోరు అధికంగా ఉంటే ఫాలో ఆన్‌ ప్రకటించొచ్చు. మూడు లేదా నాలుగు రోజుల గేమ్‌కు 150 పరుగులు; రెండు రోజుల గేమ్‌కు 100 పరుగులు; ఒకరోజు గేమ్‌కు 75 పరుగులు ఉండాలి. గేమ్‌ ప్రారంభం అయినప్పటి నుంచీ ఆడాల్సిన రోజులు ఎన్ని మిగిలాయన్నదాన్ని బట్టి గేమ్‌ లెంగ్త్‌ నిర్ణయమవుతుంది.

నియమం 14: డిక్లరేషన్‌, ఫోర్‌ఫీచర్‌. బ్యాటింగ్‌ కెప్టెన్‌ బాల్‌ డెడ్‌ అయినప్పుడు ఒక ఇన్నింగ్స్‌ను ఏ సమయంలోనైనా ముగించవచ్చు. ప్రారంభం కాకముందే ఇన్నింగ్స్‌ను స్వాధీనపరచవచ్చు కూడా.

నియమం 15: విరామాలు. ప్రతిరోజు ఆటలోనూ విరామాలు ఉంటాయి. ఇన్నింగ్స్‌ మధ్యలో పదేసి నిమిషాల చొప్పున లంచ్‌, టీ, డ్రింక్స్‌ విరామాలు ఉంటాయి. ఈ విరామాలు ఎంతసేపు ఉండాలనేది మ్యాచ్‌కు ముందే నిర్ణయించుకుంటారు. కొన్ని పరిస్థితుల్లో విరామాలు, విరామ సమయాలను మార్చుకోవచ్చు. ముఖ్యంగా తొమ్మిది వికెట్లు పడిపోయిన సందర్భంలో.. మరో వికెట్‌ కోసం వేచిచూసేందుకు 30 నిమిషాల పాటు టీ విరామం ఆలస్యం చేయవచ్చు.

నియమం 16: ఆట ప్రారంభం; ఆట ముగింపు. విరామం తర్వాత అంపైర్‌ కాల్‌ ఆఫ్‌ ప్లేతో ఆట మొదలవుతుంది. టైమ్‌తో సెషన్‌ ముగుస్తుంది. మ్యాచ్‌ చివరి గంట కనీసం 20 ఓవర్లు ఆడాలి. సమయాన్ని పెంచితే అవసరమైతే 20 ఓవర్లు చేర్చాలి.

నియమం 17: ప్రాక్టీస్‌ ఆన్‌ ద ఫీల్డ్‌. పిచ్‌పై బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేయరాదు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు గాని మ్యాచ్‌ అయిన తర్వాత గాని అయితే ప్రాక్టీస్‌ చేయవచ్చు. సమయం వృథా కాదని అంపైర్లు భావించినట్లైతే బౌలర్లు ట్రయల్‌ రనప్స్‌ చేయొచ్చు.

స్కోర్‌ చేయడం, విజయం సాధించడం[మార్చు]

ఈ నియమాలు పరుగులెలా స్కోర్‌ చేస్తారు, ఏదైనా జట్టు ప్రత్యర్థిని ఎలా ఓడిస్తుంది అనేది తెలియజేస్తాయి.

నియమం 18: రన్స్‌ స్కోర్‌చేయడం. బరిలో దిగిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ పిచ్‌పై పరస్పరం ఒకరి ఎండ్‌కు మరొకరు మారితే పరుగులు వస్తాయి. ఒకే బంతిని కొట్టి పలు పరుగులు తీయొచ్చు.

నియమం 19: బౌండరీలు. ఆడే మైదానానికి వృత్తాకారంలో ఏర్పాటుచేసే సరిహద్దునే బౌండరీ అంటారు. బంతి ఈ సరిహద్దులో నేలను గాని, బౌండరీ లైన్‌ను గాని తాకి బయటికి వెళ్తే నాలుగు పరుగులు లేదా నేలను, బౌండరీని తాకకుండా గాల్లోంచే బయటకు వెళ్తే ఆరు పరుగులు ఇస్తారు.

నియమం 20: బంతి పోతే‌. ఆడుతున్న బంతి పోయినా, దొరకకపోయినా ఫీల్డింగ్‌ జట్టు దాన్ని 'లాస్ట్‌ బాల్‌' అని పిలుస్తారు. అలాంటప్పుడు బ్యాటింగ్‌ జట్టుకు ఏవైనా పెనాల్టీ రన్స్‌ (నో బాల్స్‌, వైడ్స్‌ వంటివి) ఉంటే వర్తిస్తాయి. వారు పరుగెత్తిన రన్స్‌తో పాటు అత్యధికంగా ఆరు పరుగులు లభిస్తాయి.

నియమం 21: రిజల్ట్‌. ఏ జట్టు అత్యధిక పరుగులు స్కోర్‌ చేస్తే ఆ జట్టు మ్యాచ్‌ను గెల్చుకుంటుంది. ఒకవేళ రెండు జట్లు సమానమైన స్కోర్లు సాధిస్తే మ్యాచ్‌ టై అవుతుంది. నిర్ణీత కాలవ్యవధిలో ఇన్నింగ్స్‌ పూర్తికాకపోయినా మ్యాచ్‌ డ్రా అయినట్లే.

నియమం 22: ఓవర్‌. ఓవర్‌లో వైడ్స్‌, నో బాల్స్‌ కాకుండా ఆరు బంతులు వేయాలి. వరుస ఓవర్లు పిచ్‌ ఆపోజిట్‌ ఎండ్స్‌ నుంచి వేయాలి. ఒక బౌలర్‌ వరుసగా రెండు ఓవర్లు ఒకే ఎండ్‌ నుంచి వేయరాదు.

నియమం 23: డెడ్‌బాల్‌. బౌలర్‌ రనప్‌ ప్రారంభించి బంతిని వేసే సమయంలో అది డెడ్‌ అయితే ఆ బంతికి సంబంధించిన అన్ని యాక్షన్లూ రద్దయినట్లే. ఒకసారి బాల్‌ డెడ్‌ అయిన తర్వాత పరుగులేవీ లెక్కలోకి రావు. బ్యాట్స్‌మన్ అవుట్‌ కాడు. బాల్‌ చాలా కారణాల వల్ల డెడ్‌ అవుతుంది. సర్వసాధారణంగా బ్యాట్స్‌మన్‌ అవుటైనప్పుడు, బౌండరీ కొట్టినప్పుడు, బంతి బౌలర్‌ వద్ద గాని వికెట్‌ కీపర్‌ వద్ద గాని ఉన్నప్పుడు బంతి డెడ్‌ అవుతుంది.

నియమం 24: నో బాల్‌. బంతి చాలా కారణాల వల్ల నో బాల్‌ అవుతుంది. బౌలర్‌ బంతిని రాంగ్‌ ప్లేస్‌ నుంచి వేసినా, బంతి వేసేప్పుడు మోచేయిని నిటారుగా చాపినా, ప్రమాదకరంగా బౌలింగ్‌ చేసినా, బంతి రెండుసార్లు కంటే ఎక్కువగా బౌన్స్‌ అయినా, బ్యాట్స్‌మన్‌ను చేరకముందే బంతి నేలపై దొర్లుకుంటూ వెళ్లినా, ఫీల్డర్లు నిబంధనలకు విరుద్ధమైన ప్రాంతాల్లో నిలబడినా అప్పుడు వేసే బంతి నో బాల్‌ అవుతుంది. నో బాల్‌ వల్ల బ్యాటింగ్‌ జట్టుకు వారు చేసిన పరుగులతో పాటు అదనంగా ఒక పరుగు లభిస్తుంది. రనౌట్‌, హ్యాండ్లింగ్‌ ద బాల్‌, హిట్టింగ్‌ ద బాల్‌ ట్వైస్‌, అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ వంటి సందర్భాలను మినహాయించి నో బాల్‌తో బ్యాట్స్‌మన్‌ అవుట్‌ కాడు.

నియమం 25: వైడ్‌ బాల్‌. బ్యాట్స్‌మన్‌ స్కోర్‌ చేయడానికి తగ్గట్టుగా బౌలర్‌ బంతిని వేయలేదని భావించినప్పుడు అంపైర్‌ ఆ బంతిని 'వైడ్‌'గా ప్రకటిస్తాడు. బౌలర్‌ వేసిన బంతి బ్యాట్స్‌మన్‌ తలపై నుంచి వెళ్తే దాన్ని వైడ్‌ అని పిలుస్తారు. వైడ్‌ బాల్‌కు బ్యాట్స్‌మెన్‌ చేసిన పరుగులతో పాటు బ్యాటింగ్‌ జట్టుకు ఒక పరుగు అదనంగా లభిస్తుంది. రనౌట్‌, స్టంప్డ్‌, హ్యాండ్లింగ్‌ ద బాల్‌, హిట్టింగ్‌ హిజ్‌ వికెట్‌, అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌ తదితర సందర్భాల్లో మినహాయించి.. వైడ్‌ బాల్‌కు బ్యాట్స్‌మన్‌ అవుట్‌ కాడు.

నియమం 26: బై, లెగ్‌ బై. నో బాల్‌ లేదా వైడ్‌ కాని బంతి స్ట్రైకర్‌ వద్దకు చేరి పరుగులు లభిస్తే వాటిని బైస్‌ అంటారు. నో బాల్‌ కాని బంతి బ్యాట్‌ను కాకుండా స్ట్రైకర్‌ను తాకినప్పుడు, పరుగులేమీ చేయకుంటే వాటిని లెగ్‌ బైస్‌గా పిలుస్తారు. అయితే స్ట్రైకర్‌ బంతిని కొట్టడానికి ప్రయత్నించడం గాని, లేదా తనను తాకుండా తప్పించుకోవడం గాని చేయకుంటే లెగ్‌ బైస్‌ ఇవ్వరు. బైస్‌, లెగ్‌ బైస్‌ ద్వారా లభించిన పరుగులు జట్టు ఖాతాలోకి వెళ్తాయి తప్ప బ్యాట్స్‌మన్‌స్కోరులో కలవవు.

డిస్మిసల్ కు సంబంధించిన అంశాలు[మార్చు]

27 నుంచి 29 వరకు గల నియమాలు బ్యాట్స్‌మన్‌ ఎన్ని రకాలుగా అవుట్‌ అయ్యే అవకాశాలున్నాయో చర్చిస్తాయి.

నియమం 27: అప్పీల్స్‌. బ్యాట్స్‌మన్‌ అవుటయ్యాడని భావించిన ఫీల్డరు తర్వాతి బాల్‌ వేయముందే అంపైర్‌ను హౌ ఈజ్‌ దట్‌ అని అడగవచ్చు. సాధారణంగా చేతులు పైకెత్తి అరుస్తారు. అప్పుడు అంపైర్‌ బ్యాట్స్‌మన్‌ అవుట్‌ అయితే అంపైర్‌ తన నిర్ణయం చెబుతాడు. కచ్చితంగా చెప్పాలంటే ఫీల్డింగ్‌ జట్టు బౌల్డ్‌తో సహా అన్ని అవుట్లకూ తప్పక అప్పీల్‌ చేయాలి. అలాగే అవుటైన బ్యాట్స్‌మన్‌ అప్పీల్‌ కోసం, అంపైర్‌ నిర్ణయం కోసం వేచిచూడకుండా పిచ్‌ను వదిలి వెళ్లాలి.

నియమం 28: వికెట్‌ డౌన్‌. వికెట్‌ను పడేయడానికి చాలా పద్ధతులున్నాయి. బంతి లేదా బ్యాట్స్‌మన్‌ వికెట్లను పడేయవచ్చు. లేదా బంతి పట్టుకున్న చేతితో ఫీల్డర్‌ వికెట్లను తాకి ఒక్క బెయిల్‌నైనా కింద పడేస్తే బ్యాట్స్‌మన్‌ అవుట్‌.

నియమం 29: బ్యాట్స్‌మెన్‌ అవుట్‌ ఆఫ్‌ హిజ్‌ గ్రౌండ్‌. బ్యాట్స్‌మెన్‌ తమ గ్రౌండ్‌ను వీడి వెళ్తే రనౌట్‌ గాని, స్టంపౌట్‌ గాని అవ్వొచ్చు. బ్యాట్స్‌మన్‌ తన శరీర అవయవాల్లో ఏదో భాగం గాని, తన బ్యాట్‌ను గాని తన గ్రౌండ్‌లో పాపింగ్‌ క్రీజ్‌ వెనుక నేలకానుకుని ఉండాలి. బ్యాట్స్‌మన్‌లిద్దరూ పిచ్‌ మధ్యలో ఉన్నప్పుడు వికెట్‌ పడిపోతే, ఆ ఎండ్‌కు దగ్గరగా ఉన్న బ్యాట్స్‌మన్‌ అవుట్‌ అవుతాడు.

అవుట్‌ చేసే పద్ధతులు[మార్చు]

30 నుంచి 39 వరకు గల నియమాలు బ్యాట్స్‌మన్‌ అవుటయ్యే పలు పద్ధతులను చర్చిస్తుంది. ఈ పది పద్ధతులకు తోడు బ్యాట్స్‌మన్‌ రిటైర్‌ కావొచ్చు. ఇందుకు నియమం 2లో అవకాశం ఉంది. సాధారణంగా బ్యాట్స్‌మన్‌ కాట్‌, బౌల్డ్‌, లెగ్‌ బిఫోర్‌ వికెట్‌, రనౌట్‌, స్టంప్డ్‌ తదితర సందర్భాల్లో అవుటవుతాడు. ఇతర పద్ధతుల్లో అవుటవడం అరుదు.

నియమం 30: బౌల్డ్‌. బౌలర్‌ వేసిన బంతి తన వికెట్‌ను పడేస్తే బ్యాట్స్‌మెన్‌ అవుట్‌. బంతి వికెట్లను పడేసేముందు బ్యాట్‌ను, గ్లోవ్‌ను బ్యాట్స్‌మన్‌ శరీరాన్ని తాకిందా లేదా అనేది అనవసరం. వికెట్‌ పడగొట్టడానికి ముందు బంతి ఇతర ఆటగాణ్ని గాని, అంపైర్‌ను గాని తాకకపోవచ్చు.

నియమం 31: టైమ్డ్‌ ఔట్‌. అవుటైన బ్యాట్స్‌మన్‌ వెళ్లిన మూడు నిమిషాలలోపు ఇన్‌కమింగ్‌ బ్యాట్స్‌మన్‌ బంతిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి. లేకుంటే ఇన్‌కమింగ్‌ బ్యాట్స్‌మన్‌ అవుట్‌ అవుట్‌ అవుతాడు.

నియమం 32: కాట్‌. బంతి బ్యాట్‌ను గాని, బ్యాట్‌ను పట్టుకున్న చేతిని గాని తాకిన తర్వాత నేలపై పడక ముందే మైదానంలో ప్రత్యర్థి జట్టు పట్టుకుంటే బ్యాట్స్‌మన్‌ అవుట్‌.

నియమం 33: హ్యాండిల్డ్‌ ద బాల్‌. ప్రత్యర్థి జట్టు అనుమతి లేకుండా బ్యాట్స్‌మన్‌ బంతిని పట్టుకోకూడదు. అలాకాకుండా అతను బ్యాట్‌తో కాకుండా ఉద్దేశపూర్వకంగా బంతిని చేతితో పట్టుకుంటే అవుటే.

నియమం 34: బంతిని రెండుసార్లు కొట్టడం వికెట్‌ను కాపాడుకునేందుకు కాకుండా బ్యాట్స్‌మన్‌ బంతిని రెండు సార్లు కొట్టరాదు. ప్రత్యర్థి జట్టు అనుమతి లేకుండా అలాచేస్తే బ్యాట్స్‌మన్‌ అవుటే.

నియమం 35: హిట్‌ వికెట్‌. బౌలర్‌ బౌలింగ్‌ చేసినప్పుడు బంతి ప్లేలో ఉండగా బ్యాట్స్‌మన్‌ వికెట్లను బ్యాట్‌తో గాని, తన శరీరంతో గాని పడేస్తే అతను అవుటే. స్ట్రైకర్‌ తొలి రన్‌ చేసే క్రమంలో తన బ్యాట్‌తో గాని, బాడీతో గాని వికెట్లను పడేస్తే హిట్‌ వికెట్‌గా అవుటవుతాడు. బ్యాట్స్‌మన్‌ దుస్తులు, క్రీడాసామగ్రి కూడా బాడీ పరిధిలోకే వస్తాయి.

నియమం 36: లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ (ఎల్బీడబ్ల్యూ). బంతి మొదటిగా బ్యాట్‌ను కాకుండా బ్యాట్స్‌మన్‌ను తాకి వికెట్‌కు లెగ్‌సైడ్‌లో పడకపోతే బ్యాట్స్‌మన్‌ అవుట్‌. ఎందుకంటే బ్యాట్స్‌మన్‌ అక్కడ లేకుంటే ఆ బంతి వికెట్లను తాకి ఉండేది. అయితే ఆఫ్‌ స్టంప్‌ లైన్‌కు అవుట్‌ సైడ్‌లో బంతి బ్యాట్స్‌మన్‌ను తాకితే, అప్పుడతను బంతిని ఆడేందుకు ప్రయత్నిస్తే మాత్రం నాటౌటే.

నియమం 37: అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌. బ్యాట్స్‌మన్‌ ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి జట్టును మాటల ద్వారా గాని, యాక్షన్‌ ద్వారా గాని అడ్డుకుంటే అతను అవుట్‌.

నియమం 38: రనౌట్‌. బంతి ఆటలో ఉండగా.. పాపింగ్‌ క్రీజ్‌ వెనుక బ్యాట్స్‌మన్‌ బ్యాట్‌ గాని, అతను గాని లేనప్పుడు, ప్రత్యర్థి జట్టు వికెట్‌ కూలదోస్తే బ్యాట్స్‌మన్‌ అవుటే.

నియమం 39: స్టంప్డ్‌. రన్‌ కోసం ప్రయత్నించని సందర్భంలో బ్యాట్స్‌మన్‌ క్రీజు బయట ఉన్నప్పుడు కీపర్‌ వికెట్లను పడగొడితే (నియమం 40 చూడండి) అతను అవుటే.

ఫీల్డర్లు[మార్చు]

నియమం 40: వికెట్‌ కీపర్‌. బ్యాట్స్‌మన్‌ స్టంప్స్‌ వెనుక నిలబడటానికి అనుమతి ఉన్న బౌలింగ్‌ జట్టుకు చెందిన వ్యక్తి వికెట్‌ కీపర్‌. తన జట్టులో ఇతనికి మాత్రమే గ్లోవ్స్‌ వేసుకోవడానికి, ఎక్స్‌టెర్నల్‌ లెగ్‌ గార్డ్స్‌ ధరించడానికి అనుమతి ఉంది.

నియమం 41: ఫీల్డర్‌. బౌలింగ్‌ జట్టులో పదకొండు మంది ఆటగాళ్లలో ఎవరైనా ఫీల్డర్‌ కావొచ్చు. మైదానంలో ఫీల్డర్లు బంతిని నియంత్రించి పరుగులను, బౌండరీలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. బ్యాట్స్‌మన్‌ ఆడిన బంతులను క్యాచ్‌ చేయడం, రనౌట్‌ చేయడం చేసి వారిని అవుట్‌ చేస్తారు.

ఫెయిర్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ ప్లే[మార్చు]

నియమం 42: ఫెయిర్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ ప్లే.

అనుబంధాలు[మార్చు]

నియమావళికి సంబంధించిన ఐదు అనుబంధాలివీ:

అనుబంధం ఎ: స్టంప్స్‌, బెయిల్స్‌ స్పెసిఫికేషన్స్‌, డయాగ్రమ్స్‌
అనుబంధం బి: పిచ్‌, క్రీజెస్‌ స్పెసిఫికేషన్స్‌, డయాగ్రమ్స్‌
అనుబంధం సి: గ్లోవ్స్‌ స్పెసిఫికేషన్స్‌, డయాగ్రమ్స్‌
అనుబంధం డి: నిర్వచనాలు
అనుబంధం ఇ: బ్యాట్‌

వీటిని కూడా చూడండి[మార్చు]

సూచనలు[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]