క్షీరదాలు
| క్షీరదాలు Temporal range: Late Triassic–Recent
| |
|---|---|
| Scientific classification | |
| Kingdom: | |
| Phylum: | |
| Subphylum: | |
| (unranked): | |
| Class: | Mammalia |
| Subclasses & Infraclasses | |
| |
క్షీరదాలు[1] సకశేరుక జంతువులు. తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి పాలు ఉత్పత్తి చేసే క్షీర గ్రంధులు ఉండడం వీటి విశిష్టత. మెదడులో విశాలమైన నియోకార్టెక్స్ ప్రాంతం, రోమాలు లేదా జుట్టు, మధ్య చెవిలో మూడు ఎముకలు ఉండడం ఇతర విశిష్ట లక్షణాలు. ఈ లక్షణాలు వాటిని సరీసృపాలు, పక్షుల నుండి వేరు చేస్తాయి. క్షీరదాల పూర్వీకులు, ఈ రెండింటి పూర్వీకుల నుండి 30 కోట్ల సంవత్సరాల నాటి కార్బోనిఫెరస్ కాలంలో విడివడ్డారు. క్షీరదాల్లో దాదాపు 6,640 జాతులు ఉన్నాయి. వీటిని 27 క్రమాలుగా విభజించారు.[2] క్షీరదాల అధ్యయనాన్ని క్షీరదశాస్త్రం (మమ్మాలజీ) అంటారు.
జాతుల సంఖ్య పరంగా క్షీరదాలలో అతిపెద్ద క్రమాలు ఎలుకలు, గబ్బిలాలు, యూలిపోటిఫ్లాన్‌లు (ముళ్లపందులు, అడవి ఎలుకలు, చిట్టెలుకలతో సహా). తరువాత వచ్చే మూడు క్రమాలు - ప్రైమేట్‌లు (మానవులు, కోతులు, లెమర్‌లతో సహా), కాలివేళ్ళు సమానంగా ఉండే జంతువులు (పందులు, బోవిడ్‌లు, తిమింగలాలు సహా), కార్నివోరా (పిల్లులు, కుక్కలు, సీల్స్‌తో సహా)లు.
ప్రాథమికంగా క్షీరదాల శరీర నిర్మాణం నాలుగు కాళ్ళ మీద నడిచే జంతువుల లాగా ఉంటుంది. చాలా క్షీరదాలు భూమ్మీద చలనానికి నాలుగు అవయవాలను ఉపయోగిస్తాయి; కానీ కొన్నింటిలో, సముద్రంలో, గాలిలో, చెట్లపైన, భూగర్భంలో జీవించడానికి అనుగుణంగా ఈ అవయవాలు మార్పులు చెందాయి. రెండు కాళ్ళ మీద నడిచే క్షీరదాలు, రెండు దిగువ అవయవాలను మాత్రమే ఉపయోగించి కదలడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాయి. అయితే సెటాసియన్లు, సముద్ర ఆవుల వెనుక అవయవాలు కేవలం అంతర్గత అవశేషాలు. క్షీరదాల పరిమాణం 30-40 మిల్లీమీటర్లుండే బంబుల్బీ గబ్బిలం నుండి 30 మీటర్ల పొడవుండే నీలి తిమింగలం వరకూ ఉంటుంది. ఇప్పటివరకు మనుగడ సాగించిన జంతువులన్నింటిలో బహుశా నీలి తిమింగలమే అతిపెద్దది. గరిష్ట జీవితకాలం రెండు సంవత్సరాల (ష్రూ) నుండి 211 సంవత్సరాల (బౌహెడ్ తిమింగలం) వరకు ఉంటుంది. అన్ని ఆధునిక క్షీరదాలన్నీ పిల్లలను కంటాయి. మోనోట్రీమ్‌ల లోని ఐదు జాతులు మాత్రం గుడ్లు పెడతాయి. అత్యంధిక సంఖ్యలో జాతులు ఉన్న సమూహం - వివిపరస్ జరాయు క్షీరదాలు. తల్లి గర్భంలో ఉన్నపుడు తల్లి నుండి పోషకాలను పొందడానికి శిశువులు ఉపయోగించే తాత్కాలిక అవయవం (జరాయువు) పేరుమీద ఈ పేరు వచ్చింది.
చాలా క్షీరదాలు తెలివైనవి. కొన్నింటికి పెద్దదైన మెదడు, స్వకీయ-స్పృహ, పరికరాలను వాడే కుశలత ఉంటాయి. క్షీరదాలు అల్ట్రాసౌండ్లు, సువాసన గుర్తులు, అలారం సంకేతాలు, గానం, ఎకోలొకేషన్ వంటి అనేక విధాల ద్వారా సంభాషించగలవు; మానవులైతే, సంక్లిష్టమైన భాష సహాయంతో సంభాషిస్తారు. క్షీరదాలు, కలుస్తూ-విడిపోతూ ఉండే సమాజాలు, అంతఃపురాలు, సోపానక్రమాలను ఏర్పాటు చేసుకోగలవు. అలాగే ఒంటరిగానూ, ప్రాదేశికంగానూ కూడా ఉండగలవు. చాలా క్షీరదాలు బహుభార్యాత్వం పాటిస్తాయి. అలాగే కొన్ని ఏకస్వామ్యాన్ని కొన్ని బహుభర్తృత్వాన్నీ పాటిస్తాయి.
నియోలిథిక్ విప్లవంలో ప్రధాన పాత్ర, మానవులు అనేక రకాల క్షీరదాలను మచ్చిక చేసుకోవడం. ఫలితంగా, వేటాడి సేకరించుకునే జీవనం స్థానంలో వ్యవసాయం వచ్చి చేరింది. ఇది సంచార జాతుల నుండి నిశ్చల సమాజాల వరకు మానవ సమాజాల పునర్నిర్మాణానికి ఇది దారితీసింది. పరస్పర సహకారం, సమన్వయం ఉండే సమూహాలు క్రమేపీ పెద్దవి అవుతూ, చివరికి మొట్టమొదటి నాగరికతల అభివృద్ధికి దారితీసింది. మచ్చికైన క్షీరదాలు రవాణాకూ వ్యవసాయానికీ, ఆహారం గానూ (మాంసం, పాల ఉత్పత్తులు) ఉపయోగపడడమే కాకుండా, వాటి నుండి ఉన్ని, తోలూ కూడా లభించాయి. లభిస్తున్నాయి. వినోదం కోసమూ ఆటగానూ క్షీరదాలను వేటాడతారు, పందెం వేస్తారు. పెంపుడు జంతువులుగా, వివిధ రకాల పనులు చేసే జంతువులుగా ఉపయోగిస్తారు, శాస్త్రపరిశోధనల్లో నమూనా జీవులుగా ఉపయోగిస్తారు. పాలియోలిథిక్ కాలం నుండి కళల్లో క్షీరదాలను చిత్రీకరించారు. సాహిత్యం, చలనచిత్రం, పురాణాలు, మతాల్లో క్షీరదాలు కనిపిస్తాయి. అనేక క్షీరదాల సంఖ్య తగ్గడానికి, కొన్ని అసలే విలుప్తమవడానికీ ప్రధాన కారణాలు, మానవులు వేటాడడం, అటవీ నిర్మూలన కారణంగా ఆవాసాల నాశనమవడం.

సామాన్య లక్షణాలు
[మార్చు]- అంతరోష్ణ లేదా స్థిరోష్ణ జీవులు.
- చర్మము బహిస్తర రోమాలతో కప్పి ఉంటుంది. తిమింగలాల్లో రోమాలు ఉండవు. ముళ్ళపందిలో రోమాలు ముళ్ళ రూపంలో ఉంటాయి.
- చర్మగ్రంధులు ఉంటాయి. ఇవి క్షీర గ్రంధులుగా రూపాంతరం చెందడం వల్ల ఈ విభాగానికి క్షీరదాలుగా నామకరణం జరిగింది.
- కండరయుత విభాజక పటలం (Diaphragm) ఉరఃకుహరాన్ని ఉదరకుహరాన్ని వేరుచేస్తుంది.
- డైకాండైలిక్ కపాలం, కింది దవడ అర్ధభాగం ఒకే ఒక్క ఎముక, దంతస్థితిని కలిగి ఉంటుంది. ఇది కపాలంలో గల శల్కలాస్థితో సంధానింపబడి ఉంటుంది. పూర్వ జంబికలు, జంబికలు కలయిక వల్ల ఎముకతో ఏర్పడిన తాలువు (అంగిలి) ఏర్పడుతుంది. ఇది నాశికా మార్గాన్ని, ఆస్యకుహరాన్ని వేరుచేస్తుంది.
- ఏడు గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) ఉంటాయి.
- దంతవిన్యాసం విషమదంతి. దంతాలు దవడ ఎముకలో గుంటలలో మదరి ఉంటాయి (ధీకోడాంట్) . బాల్యదశలో గల పాలదంతాల స్థానంలో, ప్రౌఢ దశలో శాశ్వత దంతాలు ఏర్పడతాయి (ద్వివార దంతి) .
- ఆస్యకుహరంలో నాలుగు జతల లాలాజల గ్రంధులు ఉంటాయి. అవి 1. నిమ్ననేత్రకోటర, 2. పెరోటిడ్, అధోజంబిక, 4. అధో జిహ్వ గ్రంధులు. మానవుడిలో నిమ్ననేత్రకోటర గ్రంధులు ఉండవు.
- ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. కంఠబిలం ఉపజిహ్వాకతో రక్షింపబడి ఉంటుంది.
- నాలుగు గదుల గుండె ఉంటుంది. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. రెండు లయారంబకాలు 1. సిరాకర్ణికా కణుపు (Sino-atrial Node), 2. కర్ణికాజఠరికా కణుపు (Atrio-ventricular Node) .
- ఎర్ర రక్తకణాలు, కేంద్రక రహితంగా, ద్విపుటాకార గుండ్రంగా ఉంటాయి
- మస్తిష్క అర్ధగోళాలు పెద్దవి, ముడుతలను ప్రదర్శిస్తాయి. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో అడ్డగా పట్టీ వంటి నాడీ పదార్థం (కార్పస్ కల్లోసమ్) ఉంటుంది. అనుమస్తిష్కం పెద్దది, దృఢంగా ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి.
- బాహ్య, మధ్య, అంతర్ చెవి అని మూడు భాగాలుంటాయి.
- మూత్రపిండాలు అంత్యవృక్కాలు.
- ముష్కాలు ముష్కకోశాల్లో అమరి ఉంటాయి. కానీ తిమింగలాలు, ఏనుగు లలో ముష్కకోశాలు ఉండవు.
- అండోత్పాదక మోనోట్రీమ్ లు మినహా క్షీరదాలన్నీ శిశూత్పాదక జీవులు. పెరుగుతున్న పిండం జరాయువు ద్వారా తల్లి గర్బాశయ కుడ్యానికి అతికి పెట్టుకొంటుంది. యూథీరియా జీవులలో ఆళింద జరాయువు కొన్ని శిశుకోశ క్షీరదాఅలలో సొనసంచి జరాయువు ఉంటుంది.
వర్గీకరణ
[మార్చు]- ఉపవిభాగం 1: ప్రోటోథీరియా
- ఉపవిభాగం 2: ధీరియా
- నిమ్నభాగం 1: మెటాథీరియా
- క్రమం: మార్సుపీలియా: ఉ. అపోజమ్, కంగారు, కోలా
- నిమ్నభాగం 2: యూథీరియా
- 1. కైరాప్టిరా : ఉ. గబ్బిలాలు
- 2. ప్రైమేట్స్ : ఉ. దేవాంగిపిల్లులు, కోతులు, గొరిల్లా, చింపాంజీ, మానవులు
- 3. రోడెన్షియా : ఉ. చిట్టెలుక, ఎలుకలు, ఉడుతలు, ముళ్ళపందులు
- 4. లాగోమార్ఫా : ఉ. కుందేలు, చెవుల పిల్లులు
- 5. సిటేసియా : ఉ. తిమింగలాలు, డాల్ఫిన్
- 6. ప్రోబోసిడా : ఉ. ఏనుగులు
- 7. పెరిసోడాక్టిలా : ఉ. గుర్రాలు, గాడిదలు, జీబ్రాలు, ఖడ్గమృగాలు
- 8. ఆర్టియోడాక్టిలా : ఉ. పశువులు, మేకలు, ఒంటెలు, దుప్పి
- 9. ఇన్సెక్టివోరా :
- 10. కార్నివోరా : ఉ. కుక్కలు, పిల్లులు, నక్కలు, అలుగులు, సీల్స్
- 11. సిరేనియా : ఉ. సముద్రపు ఆవులు
- 12. హైరకాయిడియా : ఉ. హైరాక్స్
- నిమ్నభాగం 1: మెటాథీరియా
మూలాలు
[మార్చు]- ↑
{{cite encyclopedia}}: Empty citation (help) - ↑ "ASM Mammal Diversity Database". mammaldiversity.org. Retrieved 9 February 2025.