ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Khadi and Village Industries Commission
AbbreviationKVIC
ఆవిర్భావం1956
ప్రధానకార్యాలయాలుMumbai
మూల సంస్థMinistry of Micro, Small and Medium Enterprises
సిబ్బంది76.78 lakh (2004-2005) [1]
జాలగూడుKVIC Official website

ఖాదీ అభివృద్ధి, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ (కేవీఐసీ) పార్లమెంటు చట్టం, 'ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ చట్టం 1956' కింద భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ (భారత ప్రభుత్వం) పరిధిలో పని చేసే కేవీఐసీ, భారతదేశ పరిధిలోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల విషయంలో అత్యున్నత సంస్థ. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు పథకాలు రూపొందించడం, వాటిని ప్రోత్సహించడం, వాటికి సదుపాయాలు కల్పించడం, సమీకృతం చేయడం, స్థాపన, అభివృద్ధి తదితరాలకు సాయం చేయడం, అందుకోసం గ్రామీణాభివృద్ధిలో నిమగ్నమైన ఇతర సంస్థలతో సమన్వయంతో పని చేయడం సంస్థ విధులు.[2]. 1957 ఏప్రిల్‌లో అంతకు ముందు దాకా ఉన్న అఖిల భారత ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు నుంచి ఈ బాధ్యతలను కేవీఐసీ స్వీకరించింది.[3]

కేవీఐసీ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. ఢిల్లీ, భోపాల్‌, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, గౌహతిల్లో జోనల్‌ కార్యాలయాలున్నాయి. ఈ జోనల్‌ కార్యాలయాలతో పాటుగా తాను చేపట్టే పలు కార్యక్రమాల అమలు కోసం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా సంస్థకు కార్యాలయాలున్నాయి.

ముఖ్యమైన పదాలు[మార్చు]

ఖాదీ[మార్చు]

'రంగులకు సంబంధించిన స్వాతంత్య్రం - మహాత్మా గాంధీ[4]

ఖాదీ (ఖాదీగా పిలుస్తారు) అంటే చేతితో నేసిన, లేదా వడికిన వస్త్రం. దీనికి కావాల్సిన ముడి సరుకులు పత్తి, పట్టు, ఉన్ని వంటివేవైనా అయి ఉండవచ్చు. వాటిని చరకా (సంప్రదాయ నేత పరికరం) పై దారాలుగా వడుకుతారు.

స్వదేశీ ఉద్యమంలో అతి శక్తిమంతమైన రాజకీయ ఆయుధంగా ఖాదీని 1920లో మహాత్మాగాంధీ తెరపైకి తీసుకొచ్చారు.

ముడి సరుకుపై ఆధారపడి ఖాదీ భారత్‌లోని పలు ప్రాంతాల నుంచి వస్తుంది. పట్టు మాత్రం ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌, బీహార్‌, ఒడిషా, ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తుంది. ఇక పత్తి ఆంధ్రప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌ల నుంచి వస్తుంది. ఖాదీ పాళీని గుజరాత్‌, రాజస్థాన్, లలో వడుకుతారు. ఇక హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌ ఉన్నికి బాగా ప్రసిద్ధి.

గ్రామీణ పరిశ్రమ[మార్చు]

ఒక్కో వృత్తి పనివారికి (చేనేత కార్మికునికి) స్థిర మూలధన పెట్టుబడి మొత్తం లక్ష రూపాయలకు మించకుండా, గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటైన ఏ పరిశ్రమ అయినా గ్రామీణ పరిశ్రమే.[5] స్థిర మూలధన పెట్టుబడిని భారతదేశ కేంద్ర ప్రభుత్వం అవసరమైన చోటల్లా మార్చవచ్చు.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఆవశ్యకత[మార్చు]

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు రెండింట్లోనూ కార్మికుల ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఇదే ఆ రెండింట్లోనూ సామాన్యంగా కన్పించే లక్షణం. పారిశ్రామికీకరణ, దాదాపుగా ప్రక్రియలన్నీ యాంత్రీకరణగా మారిపోయిన నేపథ్యంలో భారత్‌ వంటి కార్మికుల సంఖ్య అత్యధికంగా ఉన్న దేశానికి ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు అతికినట్టుగా సరిపోయాయి.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల్లో మరో సానుకూలత కూడా ఉంది. వాటి స్థాపనకు అతి కొద్ది మొత్తం పెట్టుబడి మాత్రమే అవసరం. ఒకోసారి అది కూడా అవసరముండదు. కాబట్టి గ్రామీణ నిరుపేదలకు ఇది ఆర్థికంగా బాగా వీలయ్యే సావకాశం. అరకొర వ్యక్తిగత ఆదాయం, ప్రాంతీయ గ్రామీణ/పట్టణ అసమానతలు మరీ ఎక్కువగా ఉండే భారత్‌కు ఇది చాలా ముఖ్యమైన విషయం.

కమిషన్‌ లక్ష్యాలు[మార్చు]

కమిషన్‌కు మూడు ముఖ్య లక్ష్యాలు [6] న్నాయి. దాని పనితీరును అవే నిర్దేశిస్తాయి. ఆ లక్ష్యాలు...

 • సామాజిక లక్ష్యం - గ్రామీణ ప్రాంతాలకు ఉపాధి కల్పించడం
 • ఆర్థిక లక్ష్యం - అమ్ముడవగలిగే వస్తువులను అందుబాటులో ఉంచడం
 • విస్తృత లక్ష్యం - ప్రజల్లో స్వయం సమృద్ధిని ఏర్పాటు చేయడం. పటిష్ఠమైన, గ్రామీణ సామాజిక స్ఫూర్తిని ఏర్పాటు చేయడం.

పలు పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడం, పర్యవేక్షించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించేందుకు కమిషన్‌ ప్రయత్నిస్తుంది.

పథకాలు, కార్యక్రమాల అమలు[మార్చు]

పథకాలు, కార్యక్రమాల అమలు ప్రక్రియ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ నుంచి మొదలవుతుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ యంత్రాంగపరమైన సారథ్యం ఆ శాఖదే. భారత కేంద్ర ప్రభుత్వం నుంచి శాఖ నిధులు స్వీకరిస్తుంది. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల సంబంధిత కార్యక్రమాలు, పథకాల అమలు కోసం వాటిని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌కు అందజేస్తుంది.[7]

అలా వచ్చిన నిధులను పథకాల అమలుకు నేరుగా గానీ, తన 29 [8] రాష్ట్ర కార్యాలయాల ద్వారా గానీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ వెచ్చిస్తుంది. ఖాదీ, గ్రామీణ సంస్థలు, సహకార సంస్థలకు నేరుగా నిధులు కేటాయించడం ద్వారా గానీ, 33 [9] ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డుల ద్వారా పరోక్షంగా గానీ ఈ పనిచేస్తుంది. ఈ బోర్డులు భారత్‌లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే చట్టబద్ధమైన సంస్థలు. ఆయా రాష్ట్రాల్లో ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అలా తమకు అందిన నిధులను ఖాదీ, గ్రామీణ సంస్థలు/సహకార సంస్థలు/ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డులు అందజేస్తాయి.

ప్రస్తుతం కమిషన్‌ తాలూకు అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న 5,600 నమోదైన సంస్థలు, 30,138 సహకార సంఘాలు[10], దాదాపు 94.85 లక్షల మంది ప్రజల ద్వారా అమలవుతున్నాయి.[11]

కమిషన్‌ పథకాలు, కార్యక్రమాలు[మార్చు]

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ)[మార్చు]

ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) రెండు పథకాల విలీన ఫలస్వరూపం. అవి ప్రధానమంత్రి రోజ్‌గార్‌ యోజన (పీఎంఆర్‌వై), గ్రామీణ ఉపాధి కల్పన పథకం (ఆర్‌ఈజీపీ).

ఈ పథకం కింద లబ్ధిదారు తన సొంత వాటాగా ప్రాజెక్టు వ్యయంలో కనీసం 10 శాతాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీలు, ఇతర వెనకబడ్డ వర్గాలకు చెందిన లబ్ధిదారుల విషయంలో వారు ప్రాజెక్టు వ్యయంలో 5 శాతాన్ని కేటాయిస్తే చాలు. ప్రాజెక్టు వ్యయంలో మిగతా 90, లేదా 95 శాతాన్ని ఈ పథకం కింద పేర్కొన్న బ్యాంకులు అందజేస్తాయి. ఈ పథకం లబ్ధిదారులకు రుణంలో కొంత మొత్తాన్ని (సాధారణంగా 25 శాతం, గ్రామీణ ప్రాంతంలోని బలహీన వర్గాల వారికి 35 శాతం) తిరిగి చెల్లిస్తారు. దాన్ని రుణాన్ని పొడిగించిన రెండేళ్ల తర్వాత వారి ఖాతాకు జమ చేస్తారు.[12]

రుణ సబ్సిడీ అర్హత సర్టిఫికేషన్‌ పథకం (ఐఎస్‌ఈసీ)[మార్చు]

రుణ సబ్సిడీ అర్హత సర్టిఫికేషన్‌ పథకం (ఐఎస్‌ఈసీ) పథకం ఖాదీ కార్యక్రమాలకు నిధులు కల్పించే అతి పెద్ద, ప్రధాన పథకం. వాస్తవిక నిధుల అవసరానికి, బడ్జెట్‌ కేటాయింపులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు వీలుగా బ్యాంకుల నుంచి నిధులను సమీకరించేందుకు 1977 మే నెలలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

ఈ పథకం కింద సభ్యులకు అవసరమైన నిర్వహణ/స్థిర మూలధన అవసరాలను అందుకునేందుకు వీలుగా బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. వాటిని 4 శాతం వార్షిక వడ్డీకే అందిస్తాయి.[13] వాస్తవ వడ్డీ రేటు, ఈ రరిబేటు రేటు మధ్య ఉన్న తేడాను కమిషనే తన బడ్జెట్‌లోని గ్రాంట్ల ఖాతా కింద భరిస్తుంది. అయితే, ఖాదీ, పాలివస్త్రం (ఒకరకమైన ఖాదీ) ని ఉత్పత్తి చేసే సభ్యులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

రిబేటు పథకం[మార్చు]

ఇతర దుస్తులు, వస్త్రాలతో పోలిస్తే ఖాదీ, ఖాదీ ఉత్పత్తులు అందరికీ చవకలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఖాదీ, ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలను రిబేటుపై ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. సాధారణ రిబేటు (10 శాతం) ను ఏడాది పొడవునా అందిస్తారు. దాంతోపాటు అదనపు రిబేటు (మరో 10 శాతం) ను ఏటా 108 రోజుల పాటు వినియోగదారులకు అందిస్తారు.[14]

కమిషన్‌, లేదా రాష్ట్ర బోర్డుల ఆధ్వర్యంలో నడిచే సంస్థలు/కేంద్రాలు, ఖాదీ, పాలీవస్త్రం ఉత్పత్తి చేసే నమోదైన సంస్థలు నిర్వహించే విక్రయ కేంద్రాల్లో జరిపే విక్రయాలపై మాత్రమే ఈ రిబేటు అందుబాటులో ఉంటుంది.

ఖాదీ, గ్రామీణ పరిశ్రమలకు రిబేటు పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరించాల్సిందిగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖను కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవలే కోరింది. దాని ఉద్దేశం ఒక్కటే. ఈ పథకానికి ఏ ఏడాదికి ఆ ఏడాది పొడిగింపులు కోరడానికి బదులుగా శాఖ ప్రణాళికా సంఘాన్ని సంప్రందించాలి. పైగా, ఇప్పటిదాకా జరుగుతున్న మాదిరిగా కాకుండా విక్రయదారుకు కాకుండా కార్మికునికే లబ్ధి చేకూర్చేలా పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని ఎంఎస్‌ఎంఈ శాఖను ఆర్థిక శాఖ కోరింది. అమ్మకాలపై రిబేటు పథకానికి బదులుగా మారె ్కట్‌ అభివృద్ధి సాయం పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కమిషన్‌ నుంచి వచ్చిన ప్రతిపాదన కేంద్రం పరిశీలనలో ఉంది.[15]

కమిషన్‌కు బడ్జెటరీ మద్దతు[మార్చు]

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ ద్వారా కమిషన్‌కు రెండు పద్దుల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది: ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు. ప్రణాళిక పద్దు కింద కేటాయించే నిధులను కమిషన్‌ తన అమలు సంస్థలకు అందజేస్తుంది. ఇక ప్రణాళికేతర పద్దు కింద వచ్చే నిధులను ప్రధానంగా కమిషన్‌ తన నిర్వహణ పరమైన ఖర్చుల కోసం వాడుకుంటుంది. ఈ నిధులను ప్రధానంగా గ్రాంట్లు, రుణాల రూపంలో కేటాయిస్తారు.

గ్రాంట్లు[మార్చు]

ఖాదీ గ్రాంట్లలో ప్రధాన భాగాన్ని రిబేటుపై అమ్మకాలకు చెల్లించేందుకు వాడతారు. దీన్ని ప్రోత్సాహక ఖర్చుగా పరిగణిస్తారు. ఈ పద్దు కింద జరిగే ఇతర ఖర్చులు: శిక్షణ, ప్రచారం, మార్కెటింగ్‌, ఐఎస్‌ఈఈ పథకం కింద బ్యాంకు రుణాలకు రుణ సబ్సిడీ.

రుణాలు[మార్చు]

ఈ పద్దు కింది ఖర్చుల్లో ఇవి ఉంటాయి: నిర్వహణ మూలధన ఖర్చులు, స్థిర మూలధన ఖర్చు. స్థిర మూలధన ఖర్చులో ఇంకా ఈ కిందివాటిపై చేసే ఖర్చులు కూడా కలిసి ఉంటాయి:

ఏ) యంత్రాలు: 1,00,000 బీ) అమలు: 50,000 సీ) వర్క్‌ షెడ్లు: 25,000 డీ) అమ్మకపు కేంద్రాల వంటివి: 25,000

ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలు[మార్చు]

ఈ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులను చిల్లర, టోకు వర్తకుల ద్వారా అవే నేరుగా గానీ, లేదా ఖాదీ బండార్‌ (ప్రభుత్వ యాజమాన్యంలోని ఖాదీ అమ్మకపు కేంద్రాలు) ద్వారా పరోక్షంగా గానీ విక్రయిస్తారు.

మొత్తంమీద 15,431[10] ఔట్‌లెట్లున్నాయి. వీటిలో 7,050[16] ఔట్‌లెట్లు కమిషన్‌ యాజమాన్యంలో ఉన్నాయి. ఇవన్నీ భారతదేశ వ్యాప్తంగా విస్తరించాయి.

ఈ ఉత్పత్తులను కమిషన్‌ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్ల ద్వారా అంతర్జాతీయంగా కూడా విక్రయిస్తారు.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ

బాహ్య లింకులు[మార్చు]

గమనికలు[మార్చు]

 1. statistics KVIC official website.
 2. http://www.ari.nic.in/RevisedKVICACT2006.pdf - రెండో అధ్యాయం, కమిషన్‌ విధులు, పుట 7
 3. పార్లమెంటు చట్టం (1956 నంబర్‌ 61, 1987 చట్టం నంబర్‌ 12లో సవరించిన ప్రకారం, 2006 చట్టం నంబర్‌ 10)
 4. గాంధీ
 5. అధ్యాయం 1, పుట 1
 6. [1] విహంగ వీక్షణం/1} కేవీఐసీ వెబ్‌సైట్‌
 7. కేవీఐసీకి బడ్జెట్‌ మద్దతు, పుట 6 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
 8. పుట 65 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
 9. పుట 66 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
 10. 10.0 10.1 మా గురించి - ఢిల్లీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు, ఢిల్లీ ప్రభుత్వం
 11. పుట 67 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ
 12. పీఎంఈజీపీ పథకం కేవీసీ నుంచి అన్ని గణాంకాలు
 13. - పుట 70
 14. పుట 71 నుంచి అన్ని గణాంకాలు
 15. రిబేటు పథకాన్ని పునర్‌ వ్యవస్థీకరించాల్సిందిగా ఎంఎస్‌ఎంఈ శాఖ కోరింది, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌
 16. ఖాదీ బండార్‌లతో కలిపి http://dkvib.delhigovt.nic.in/aboutus.html