గగన్‌యాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇస్రో కక్ష్యా వాహనం
Crew module infographic zoomed.jpg
గగన్‌యాన్ అంతరిక్ష నౌక
తయారీదారుహిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇస్రో
తయారీ దేశంభారత్
ఆపరేటరుభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
అప్లికేషన్లుమానవ సహిత అంతరిక్ష నౌక
సాంకేతిక వివరాలు
డిజైను జీవిత కాలం7  రోజులు
ప్రయోగ సమయంలో ద్రవ్యరాశి3.7 టన్నులు
రెజీమ్భూ నిమ్న కక్ష్య
ఉత్పత్తి
స్థితిఅభివృద్ధిలో ఉంది
నిర్మించినది1
ప్రయోగించినది2014 డిసెంబరు 18
(experimental, unmanned)

కక్ష్యా వాహనం (Orbital Vehicle) భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ తన మానవ సహిత అంతరిక్ష యాత్రా వాహనానికి పెట్టిన తాత్కాలిక పేరు. ఈ వాహనం ముగ్గురు వ్యోమనాట్లను (అమెరికా ఏస్ట్రోనాట్, రష్యా కాస్మోనాట్ ల తరహాలోనే ఇస్రో భారతీయ వ్యోమగామికి పెట్టిన పేరు వ్యోమనాట్[1]) తీసుకువెళ్ళే సామర్థ్యం కలిగినది. దీని ఉన్నతీకరించిన కూర్పు అంతరిక్ష కేంద్రాలతో అనుసంధానమయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది. దాని మొదటి యాత్రలో ఈ 3.7 టన్నుల కాప్స్యూలు ముగ్గురు వ్యోమనాట్లతో 400 కిమీల కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఈ క్రూ వాహనం జిఎస్‌ఎల్‌వి మార్క్ 2 తో ప్రయోగిస్తారు.[2][needs update] హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఈ క్రూ మాడ్యూలు మొదటి మానవ రహిత పరీక్ష 2014 డిసెంబరు 18 న నిర్వహించారు.[3]

చరిత్ర[మార్చు]

కక్ష్యా వాహనం అభివృద్ధి 2006 లో మొదలైంది. మెర్క్యురీ లాంటి నౌకను ఒక వారం పాటు అంతరిక్షంలో ఉండేలాగా తయారు చెయ్యాలనేది ప్రణాళిక. దాని డిజైను ప్రకారం అది ఇద్దరు  వ్యోమనాట్లను మోసుకుని వెళ్ళి, తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించాక, నీటిలో దిగాలి. 2008 మార్చి నాటికి డిజైను పూర్తై, భారత ప్రభుత్వానికి నిధుల కోసం సమర్పించబడింది. 2009 ఫిబ్రవరిలో నిధులు మంజూరయ్యాయి.[4] తొలుత, కక్ష్యా వాహనపు మొదటి మానవ రహిత యాత్ర 2013 లో జరుగుతుందని భావించారు.[5]

ఇస్రో కక్ష్యా వాహనపు డిజైనును SRE పై ఆధారపడి తయారు చేసారు. ఇస్రో 2007 జనవరిలో 550 కిలోల ఈ అంతరిక్ష రికవరీ కాప్స్యూలును ప్రయోగించింది. పూర్తి స్థాయి మానవ సహిత క్యాప్స్యూలు  దీని నుండే  ఉద్భవిస్తుందని అనుకున్నారు. కానీ ఇస్రో ప్రచురించిన భావన, SRE కంటే భిన్నంగా ఉంది.

వివరం[మార్చు]

కక్ష్యా వాహనం సర్వ స్వతంత్రమైన, 3 టన్నుల క్యాప్స్యూలు. ముగ్గురు వ్యోమనాట్లను తీసుకుని వెళ్ళి, కక్ష్యలో పరిభ్రమించి, రెండు పరిభ్రమణాల నుండి, రెండు రోజుల వరకు పరిభ్రమించ గలిగే సామర్థ్యంతో దీన్ని డిజైను చేసారు.

ఈ క్యాప్స్యూల్లో ప్రాణ నియంత్రణ, పర్యావరణ నియంత్రణ వ్యవస్థలు ఉంటాయి. అత్యవసర పరిస్థితిలో యాత్రను రద్దు చెయ్యడానికి, బయట పడడానికీ దానిలో ఏర్పాట్లున్నాయి. ఈ ఏర్పాట్లు రాకెట్ మొదటి, రెండవ దశల్లో పని చేస్తాయి.[6] వాహనం బొమ్మలో ప్రధాన ఇంజను, దిశను ఆర్చేందుకు ఉపయోగపడే చిన్న ఇంజన్లు, కాప్స్యూలు పీఠం వద్ద ఉన్నాయి. వ్యోమనాట్లు లోపలికి వెళ్ళేందుకు పక్కన ప్రవేశాన్ని ఏర్పాటు చేసారు.[7] కక్ష్యా వాహనంలో రెండు మాడ్యూళ్ళుంటాయి.[8] - క్రూ మాడ్యూలు, సర్వీసు మాడ్యూలు. క్రూ మాడ్యూల్లో వ్యోమనాట్లు ప్రయాణిస్తారు.

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పైకి లేచిన 16 నిముషాల తరువాత, 300-400 కి.మీ. ఎత్తున రాకెట్ కక్ష్యా వాహనాన్ని అంతరిక్షంలోకి ప్రక్షేపిస్తుంది. అది అక్కడినుండి తిరిగి భూ వాతావరణంలోకి  ప్రవేశించి బంగాళాఖాతంలో దిగుతుంది.

ఈ కక్ష్యా వాహనం రష్యా సోయుజ్ వాహనం కంటే, చైనా షెన్‌జౌ కంటే, అమెరికా అభివృద్ధి చేస్తోన్న ఓరియన్ కంటే, అపోలో కంటే చిన్నదిగాను, అమెరికా వారి జెమిని కంటే పెద్దది గానూ ఉంటుంది.

మానవ సహిత యాత్రకు అవసరమైన సాంకేతికతలు ఈసరికే ఉన్నప్పటికీ, ఇస్రో ఇంకా అనేక ఇతర సాంకేతికతలను అభివృద్ధి చెయ్యాల్సి ఉంది. ఏ లొసుగులూ లేని ప్రాణ రక్షణ వ్యవస్థను, సిబ్బంది భద్రత, తప్పించుకునే వ్యవస్థల నిర్మాణానికి ఇవి అవసరం. మానవ సహిత యాత్రకు కీలకమైన పునఃప్రవేశాన్ని కరతలామలకం చేసుకునే క్రమంలో మరో మూడు అంతరిక్ష రికవరీ కాప్స్యూలు ప్రయోగాలు జరిపేందుకు, కొన్ని మానవ రహిత కక్ష్యా వాహన ప్రయోగాలు జరిపేందుకూ ఇస్రో ప్రణాళికలు తయారుచేసింది.[9]

నిధులు, మౌలిక వసతులు[మార్చు]

ఇద్దరు మనుష్యులను భూ నిమ్న కక్ష్యలోకి మోసుకువెళ్ళగలిగే సామర్థ్యం గల సర్వ స్వతంత్ర కక్ష్యా వాహనం అభివృద్ధి మొదలైంది. తొలి ప్రకటనల్లో మొదటి ప్రయోగం 2016 లో ఉంటుందని ఇస్రో తెలిపింది. 2007-08 లో ఈ ప్రాజెక్టు సన్నాహాల కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లు కేటాయించింది. మానవ సహిత యాత్ర కోసం రూ 12,400 కోట్లు ఖర్చవుతుంది. ఏడేళ్ళ సమయం పడుతుంది. 11 వ పంచవర్ష ప్రణాళికలో ఈ ప్రాజెక్టు కోసం రూ. 5000 కోట్లు  అవసరమౌతుందని ప్రణాళికా సంఘం  అభిప్రాయపడింది. ఇస్రో తయారుచేసిన ప్రాజెక్టు రిపోర్టును భారతీయ స్పేస్ కమిషను ఆమోదించింది.[10][11] 2009 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది.[12]

వ్యోమనాట్లకు శిక్షణ ఇచ్చేందుకు బెంగళూరులో సకల సౌకర్యాలతో ఒక కేంద్రాన్ని స్థాపిస్తామని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం డైరెక్టరు ఎం.సి.దత్తన్ చెప్పాడు. మానవ సహిత ప్రయోగ అవసరాలైన క్రూ మాడ్యూలులోకి ప్రవేశించడం వంటి సౌకర్యాలతో  శ్రీహరికోటలో మూడవ ప్రయోగ వేదికను సిద్ధం చేయనున్నట్లు కూడా ఆయన చెప్పాడు. [11]

2009 ఏప్రిల్ ప్రాంతంలో పూర్తి స్థాయి క్రూమాడ్యూలును వ్యోమనాట్ల శిక్షణ కోసం సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి అందించారు.[13]

షెడ్యూలు[మార్చు]

2010 జనవరిలో కక్ష్యా వాహనాన్ని వ్యోమనాట్లతో సహా 2016 లో ప్రయోగిస్తామని ఇస్రో ప్రకటించినప్పటికీ,[12] 2012 నాటికి నిధుల సమస్య కారణంగా ప్రాజెక్టు భవితవ్యం సందేహాస్పదంగా మారింది;[14] 2013 ఆగస్టు నాటికి, మానవ సహిత యాత్రకు సంబంధించిన ప్రయత్నాలను ఇస్రో ప్రాథమ్యాల నుండి తొలగించారు[15] అయితే, 2014 ఫిబ్రవరిలో పెంచిన ఇస్రో బడ్జెట్టు ద్వారా ప్రధానంగా లబ్ధి పొందిన ప్రాజెక్టుల్లో మానవ సహిత యాత్ర ఒకటి. దీనికి కొద్దిగా ముందు, జనవరిలో ఇస్రో చైర్మన్ 2014 లో కక్ష్యా వాహనాన్ని ప్రయోగిస్తామని ప్రకటించాడు. వాహనం SRE-1 లాగానే బంగాళాఖాతంలో పడుతుంది.

2014 ఫిబ్రవరి 13 న హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొదటి క్రూ మాడ్యూలు నిర్మాణాన్ని ఇస్రోకు అందజేసింది.[3] విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఈ మాడ్యూలులో సిబ్బందికి, నేవిగేషనుకు, గైడెన్స్ అండ్ కంట్రోలుకూ అవసరమైన వ్యవస్థలను అమర్చింది. 2014 డిసెంబరు 18 న ఎల్‌విఎమ్‌3 వాహనం ద్వారా ఇస్రో ఈ క్రూ మాడ్యూలును విజయవంతంగా ప్రయోగించింది. 126 కి.మీ. ఎత్తున క్రూ మాడ్యూలు రాకెట్‌  నుండి వేరుపడి దానిలో ఉన్న మోటార్లు నియంత్రిస్తూండగా 80 కి.మీ. ఎత్తుకు దిగింది. ఆ తరువాత ఏ చోదక శక్తీ లేకుండానే భూవాతావరణంలో ప్రయాణించింది. పారాచూట్ల సాయంతో క్షేమంగా బంగాళాఖాతంలో దిగింది.

ఈ యాత్రలో కింది వ్యవస్థలను పరీక్షించారు. కక్ష్యలో ప్రక్షేపించడం, విడిపోవడం, పునఃప్రవేశం, క్రూ మాడ్యూలు వ్యవస్థలు, ఉష్ణ కవచాలు, ఏరోబ్రేకింగు, పారాచూట్లు, రెట్రో ఫైరింగు, నీటిలో దిగడం, తేలియాడడం, రికవరీ.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు వనరులు[మార్చు]

 1. Vyomanaut in Wiktionary
 2. K.S. Jayaraman (11 February 2009), Designs for India's First Manned Spaceship Revealed, Bangalore: Space.com, retrieved 14 June 2013 
 3. 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-02-22. Retrieved 2016-08-30.
 4. Priyadarshi, Siddhanta (23 February 2009).
 5. "ISRO gets green signal for manned space mission, Science News - By Indiaedunews.net". Archived from the original on 2014-02-21. Retrieved 2016-08-30.
 6. Ray, Kalyan (4 January 2009).
 7. Orbital Vehicle
 8. "క్రూ మాడ్యూలు గురించిన ఇస్రో పేజీ". Archived from the original on 2016-09-03. Retrieved 2016-08-30.
 9. Towards an Indian manned flight
 10. "Eleventh Five year Plan (2007-12) proprosals for Indian space program" (PDF). Archived from the original (PDF) on 2013-05-12. Retrieved 2020-01-14.
 11. 11.0 11.1 Mishra, Bibhu Ranjan (8 October 2008).
 12. 12.0 12.1 Beary, Habib (27 January 2010).
 13. T.S. Subramanian (2 May 2009), "Model of space crew module ready" Archived 2009-05-04 at the Wayback Machine, The Hindu, Chennai, retrieved 14 June 2013 
 14. Press Trust of India (25 April 2012).
 15. Press Trust of India.