Jump to content

గద్వాల సంస్థానం

వికీపీడియా నుండి
(గద్వాలు సంస్థానము నుండి దారిమార్పు చెందింది)
గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన మట్టి కోట

గద్వాల సంస్థానం, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ప్రాంతంలో నడిగడ్డగా పిలువబడే అంతర్వేదిలో 800 చ.కి.మీల మేర విస్తరించి ఉండేది. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత ఈ గద్వాల సంస్థానాధీశులు బహుమనీ సామ్రాజ్యం సామంతులు అయ్యారు. వంశ చరిత్ర ప్రకారం గద్వాలను 1553 నుండి 1704 వరకు పెద్ద వీరారెడ్డి, పెద్దన్న భూపాలుడు, సర్గారెడ్డి, వీరారెడ్డి, కుమార వీరారెడ్డి పరిపాలించారు.

1650 ప్రాంతంలో ముష్టిపల్లి వీరారెడ్డి అయిజా, ధరూర్ మొదలైన మహళ్లకు నాడగౌడుగా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానం లేకపోవడం వలన తన ఏకైక కుమార్తెకు వివాహం చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికం తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయ్యాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఇతననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడుగా ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత అతని రెండవ కొడుకు సోమన్న.ఇతను 1704 నుండి నాడగౌడికం చేశాడు.ఇతను కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణాన రాజ్యాన్ని బనగానపల్లె, ఆదోని, సిరివెళ్ల, నంద్యాల, సిద్ధాపురం, ఆత్మకూరు, అహోబిళం, కర్నూలు మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు. ఈ సంస్థానం కింద 103 పెద్ద గ్రామాలు, 26 జాగీరులు ఉండేవి.

సోమనాద్రి

నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలంలో, దక్కనులోని కొన్ని ప్రాంతాలలో మరాఠుల ప్రాబల్యం పెరిగి 25 శాతం ఆదాయ పన్ను (చౌత్) వసూలు చేయడం ప్రారంభించారు. దీనిని దో-అమలీ (రెండు ప్రభుత్వాలు) అని కూడా అనేవారు. రాజా సీతారాం భూపాల్ 1840 లో మరణించాడు. ఆ తరువాత అతని దత్తపుత్రుడు రాజా సీతారాం భూపాల్ II సంస్థానంను పరిపాలించాడు. నిజాం VII ఇతనికి "మహారాజ" అనే పట్టంను ప్రధానం చేశాడు. 1924 లో మరణించే సమయానికి ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి.[1]

నిడ్జూర్ యుద్ధం

[మార్చు]

ఢిల్లీ పీఠంపై బహద్దూర్షా బలహీన పాలనసాగుతున్న కాలంలో దక్షిణ సుభేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహద్దూర్ షా కు అనుయాయిగానే పాలన కొనసాగించాడు. ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడట. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలోని నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందగా, సోమన పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకుని పాలన కొనసాగించింది.[2].

సాహితీపోషణ

[మార్చు]

నిజాంరాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల సంస్థానంలో సాహితీపోషణ అధికంగా ఉండేది,[3] సంస్థానాధీశులు విద్యావేత్తలకు, కళాకారులను ఆదరించారు. సంస్థానంలో ప్రతి సంవత్సరం మాఘ, కార్తీక మాసాలలో సంగీత, సాహిత్య సభలు జరిగేవి. రాజాపెదసోమభూపాలుడు స్వయంగా కవి. అతను జయదేవుని గీతాగోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. 1761 నుండి 1794 వరకు పాలించిన చినసోమభూపాలుడు కవిపండితులను ఆదరించడమే కాకుండా, స్వయంగా రచనలుచేశాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలనే 8 మంది కవులు ఉండేవారు. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలో ' సాహిత్య స్వర్ణయుగం ' గా చెబుతారు. ప్రముఖకవి సోమయాజులు, అలంకార శిరోభూషణం రచించిన కందాళాచార్యులు ఇక్కడివారే. ఆంధ్రదేశంలోని ఎక్కడెక్కడి కవులో ఇక్కడి రాజుల దర్శనానికి వచ్చేవారు.

తిరుపతి వేంకటకవుల ఉదంతం

ఆంధ్రదేశంలో తిరుపతి వేంకటకవులు తిరుగని ప్రదేశం లేదు. వారికున్న ప్రశస్తే వేరు. అలాంటి ప్రముఖ కవులకు కూడా గద్వాల సంస్థానపు రాజుల దర్శనం అంత సులభంగా దొరకలేదనటానికి ఓ ఉదాహరణ ఈ సంఘటన. ఒక రోజు తిరుపతి వెంకటకవులు గద్వాల సంస్థానానికి వచ్చారు. రాజ దర్శనం కాలేదు. ఒకటి, రెండు రోజులు గడిచిపోయింది. అయినా దర్శన భాగ్యం కాలేదు. పట్టువదలని కవులు పట్టణాన్ని వదలకుండా వండుక తిని ఎదురు చూశారు. అయినా రాజదర్శనం కాలేదు. ఇక విసుగొచ్చిన కవులు ఒక రోజు " చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శబ్ధ శాస్త్రం చెప్ప / వంట నేర్పించే గద్వాల రాజు " అని ఓ కాగితం మీద రాసి రాజా వారికి పంపించారట. దానితో జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న రాజా వారు వెంటనే కవులను రప్పించి, వారి పాండిత్య ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లు చేయించి, తదనంతరం ఘనంగా సత్కరించి, సంభావనలు అందజేశారట.

ఈ తిరుపతి వెంకటకవులే ఒకనాడు విజయనగర రాజుల దర్శనార్థం వెళ్ళినప్పుడు, అక్కడి దివాను కోదండరామారావు సాహిత్య సభకు కాకుండా. సన్మానానికి ఏర్పాటు చేయగా కోపమొచ్చిన తిరుపతి కవులు అతనిని ఉద్దేశించి...

అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యంగల్గు దేశమ్మునన్

జటుల స్ఫూర్తి శతావధానములు మెచ్చం జేసియున్నట్టి మా

కిటు రాజీయక యున్న దర్శనము నింకెవ్వానికీ రాజొసం

గుట? చెప్పంగదవయ్య పాలితబుధా! కోదండరామాభిధా![4]. అంటూ చెప్పిన పద్యంలో.... సాహిత్యానికి గద్వాల ఒక గొప్ప స్థానమన్న విషయం ఋజువవుతుంది.

మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ

గద్వాల సంస్థానంను పాలించిన రాజులు

[మార్చు]

బుడ్డారెడ్డి గద్వాల సంస్థానానికు మూలపురుషుడు.[5] మొత్తం 11 రాజులు, 9 రాణులు ఈ సంస్థానాన్ని పాలించారు. వీరిలో ముఖ్యులు.

  • రాజ శోభనాద్రి
  • రాణి లింగమ్మ (1712 - 1723)
  • రాణి అమ్మక్కమ్మ (1723 - 1724 )
  • రాణి లింగమ్మ ( 1724 - 1738 )
  • రాజా తిరుమలరావు
  • రాణి మంగమ్మ ( 1742 - 1743)
  • రాణి చొక్కమ్మ ( 1743 - 1747 )
  • రాజా రామారావు
  • రాజా చిన్నసోమభూపాలుడు
  • రాజా చిన్నరామభూపాలుడు
  • రాజా సీతారాం భూపాలుడు
  • రాణి లింగమ్మ (1840 - 1841 )
  • రాజా సోమభూపాలుడు
  • రాణి వెంకటలక్ష్మమ్మ
  • రాజారాంభూపాలుడు
  • రాణి లక్ష్మీదేవమ్మ
  • మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ ( 1924 - 1949 )[2]

సంస్థాన రాజుల వంశవృక్షం[6]

[మార్చు]


ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు, వనరులు

[మార్చు]
  1. ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను మిలియన్ బుక్స్ సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు
  2. 2.0 2.1 సూర్య దినపత్రిక ప్రథమ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక,2008, పుట- 12
  3. సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము-3, 1962 ప్రచురణ, పేజీ 308
  4. తిరుపతి వెంకటకవులు(మూలం: ఆంధ్రరచయితలు,శ్రీమధనాంపతుల సత్యనారాయణ శాస్త్రి), తెలుగు వాచకం, 10 వ తరగతి(పాతది), ప్రభుత్వ ప్రచురణలు,1984, పుట- 77
  5. సంగ్రహ ఆంధ్రవిజ్ఞాన కోశము-3, 1962 ప్రచురణ, పేజీ 304
  6. సమగ్ర ఆంధ్ర సాహిత్యం,12 వ సంపుటం, కడపటిరాజుల యుగం,రచన:ఆరుద్ర, ఎమెస్కో, సికిందరాబాద్,1968, పుట-48

వెలుపలి లంకెలు

[మార్చు]