గరికపాటి నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరికిపాటి నరసింహారావు
Garikapati Narasimha Rao in March 2015.JPG
జననం(1958-09-14) 1958 సెప్టెంబరు 14
పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారం
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధిధారణాబ్రహ్మరాక్షసుడు
మతంహిందూ
భార్య / భర్తశారద
పిల్లలుశ్రీశ్రీ, గురజాడ
తండ్రిగరికిపాటి వెంకట సూర్యనారాయణ
తల్లివెంకట రమణమ్మ
వెబ్‌సైటు
http://srigarikipati.com

గరికిపాటి నరసింహారావు అవధానిగా, ఉపన్యాసకుడిగా సుప్రసిద్ధుడు.

జీవిత విశేషాలు[మార్చు]

నరసింహారావు పశ్చిమ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958, సెప్టెంబర్ 14వ తేదీకి సరియైన విలంబి నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమినాడు జన్మించాడు. ఇతడు ఎం.ఎ., ఎం.ఫిల్, పి.హెచ్.డి చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశాడు. ఇతని భార్య పేరు శారద. ఇతనికి ఇద్దరు కొడుకులు. వారికి తన అభిమాన రచయితల పేర్లు శ్రీశ్రీ, గురజాడ అని నామకరణం చేశారు. ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడ్డారు.

అవధానాలు[మార్చు]

ఇతడు అవధానిగా సుప్రసిద్ధుడు. సుమారు 275 అష్టావధానాలు, 8 అర్థ శత, శత, ద్విశత అవధానాలు, ఒక మహా సహస్రావధానం దిగ్విజయంగా నిర్వహించాడు. మొదటి అవధానం 1992 సంవత్సరం విజయదశమి రోజు చేశాడు. 2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు. 2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.

రచనలు[మార్చు]

 1. సాగరఘోష (పద్యకావ్యం)
 2. మనభారతం (పద్యకావ్యం)
 3. బాష్పగుఛ్ఛం (పద్య కవితా సంపుటి)
 4. పల్లవి (పాటలు)
 5. సహస్రభారతి
 6. ద్విశతావధానం
 7. ధార ధారణ
 8. కవితా ఖండికా శతావధానం
 9. మౌఖిక సాహిత్యం (పరిశోధన)
 10. పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు
 11. మా అమ్మ (లఘుకావ్యం)
 12. అవధాన శతకం
 13. శతావధాన భాగ్యం (సంపూర్ణ శతావధానం)
 14. శతావధాన విజయం (101 పద్యాలు)

టి.వి.కార్యక్రమాలు[మార్చు]

ఇతడు అనేక టి.వి.ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వ (హించాడు)హిస్తున్నాడు. వాటిలో కొన్ని

 1. ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో నవజీవన వేదం
 2. ఓం టి.వి. (సి.వి.ఆర్.స్పిరిట్యుయల్)లో రఘువంశం
 3. భక్తి టి.వి.లో ఆంధ్ర మహాభారతం
 4. భక్తి టి.వి.లో తరతరాల తెలుగు పద్యం
 5. దూరదర్శన్ సప్తగిరిలో మంచికుటుంబం
 6. ఈ.టి.వి-2 - చమక్కులు (తెలుగు వెలుగు)
 7. తెలుగు వన్ డాట్ కామ్ ఇంటర్నెట్ ఛానల్‌లో సాహిత్యంలో హాస్యం

సి.డి.లు, డి.వి.డి.లు[మార్చు]

వివిధ సందర్భాలలో ఈయన చేసిన ప్రసంగాలు, ప్రవచనాలు, సాగరఘోష కావ్యపఠనం సిడిలుగా డివిడిలుగా విడుదల చేయబడ్డాయి. వాటి వివరాలు:

 1. పలకరిస్తె పద్యం (హాస్య పద్యాలు)
 2. శివానంద లహరి
 3. సౌందర్య లహరి
 4. కనకథారా స్తవము
 5. భక్త ప్రహ్లద
 6. గజేంద్ర మోక్షము
 7. కాశీ ఖండము
 8. భగవద్గీత
 9. శకుంతలోపాఖ్యానము
 10. శ్రీ కాళహస్తి మహాత్మ్యం
 11. సాగరఘోష (1116 పద్యాలు x 20 గంటల వ్యాఖ్యానంతో సహా) (డివిడి)

పురస్కారాలు[మార్చు]

 1. ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)
 2. కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)
 3. సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)
 4. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)
 5. 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం
 6. 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి
 7. 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)
 8. 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి
 9. భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం
 10. 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం
 11. 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం
 12. సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)
 13. తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
 14. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.[1]

బిరుదులు[మార్చు]

 • శతావధాన గీష్పతి
 • అవధాన శారద
 • ధారణ బ్రహ్మ రాక్షస
 • అమెరికా అవధానభారతి

పరిశోధన[మార్చు]

ఇతని సాహిత్యంపై ఇంతవరకు వివిధ విశ్వవిద్యాలయాలలో రెండు ఎం.ఫిల్, రెండు పి.హెచ్.డి పరిశోధనలు జరిగాయి.

అవధానాలలో కొన్ని పూరణలు[మార్చు]

నిషిద్దాక్షరి[మార్చు]

స్త్రీని సాధ్వియయ్యు బయట స్వేష్టత నిడి
పంపిరాకాశ రాజ్ఞిగా పైన గల్ప
నమ్మను నిలిపి ఆమెయే అతివలకును
నేటికారాధ్యయయ్యె యింకేటి గోల! (కల్పనాచావ్లా గురించి)

దత్తపది[మార్చు]

 • ఆకాశం, సూరీడు, యవ్వారం, నారాయుడు పదాలతో బాపు రమణల ప్రశస్తి
ఆకాశంబది యెర్రబారినది ఏ హత్యల్‌జొరంబారెనో
సోకుల్నేర్చిన బాపు కుంచియలతో సూరీడు నేరేడగున్‌
ఆకే చాకుగ తోచు నా బుడుగు, ఈ యవ్వార మెవ్వారిదో
నాకంబందున ముళ్ళుపూడె ఇటకా నారాయుడేవచ్చెనో!

వర్ణన[మార్చు]

 • అమెరికాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి, ఇండియాలో పెరిగిన ఒక తెలుగు అమ్మాయి లండన్‌లో కలిస్తే...
అమెరికా కన్య ఓ యంచు ననగ జనదు
ఇండియా కన్య వూరకే వుండబోదు
మౌన భాషణ లొక్కచో స్నానమాడ
లండనున చల్లబడ్డది గుండెమంట

ఆశువు[మార్చు]

 • యంత్ర పరికరాలతో విశ్వశోధన చేసి మరో గురుగ్రహాన్ని కనుక్కున్నారు. ఆ సూర్య,గురుగ్రహాల సంభాషణని ఆశువుగా
సౌరమండలంబు సహచారి గురుగాంచి
తారలేగెనంచు తరలి నవ్వె
తిరుగ తిరుగ తాను గురుడౌనొ శిష్యుడో
తిరుగ వలదటంచు తిరిగి చెప్పె
తిరిగి చెడ్డవాడ గురుడనేమందునో
గగనమునకు రాజు గాంచ నీవె
తిరిగి కాళ్ళు లాగె తిరుగలులైపోయె
నన్ను చూడకయ్య కన్న తండ్రి!
 • కుండలాలతో, గండ పెండేరాలతో, కళ్ళద్దాలతో, పట్టు పంచెలతో సర్వాలంకారాలతో ఉన్న అవధానిని కలలో చూసి, దిగ్గున లేచిన రసజ్ఞుని పరిస్థితి
పంచెగట్టిరి పద్యాలు పంచి ఇడిరి,
నాల్గుకన్నులు సంద్రాలు నాల్గు గాగ
ధారణా కంకణమ్ములు దాల్చినారు
మాయమైనారు కలలోనె గాయమయ్యె!
 • కార్యేషు మంత్రి కరణేషు .....కి పేరడీ
కార్యేషు మిక్సి శయనేషు సెక్సీ భరణే చ కూలి తరునీషు శూలి రూపేచ హీరో కోపేచ  జీరో షట్కర్మ కర్త కలి కాల భర్త

సమస్యాపూరణ[మార్చు]

 • వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో
వెధవల్‌బుట్టిరి వింతదేశమున నవ్వే వచ్చెడిన్‌విన్నచో
కథలున్‌గోడలకెక్కె యీ కళకు పక్కా సంస్థలున్‌లేచె యీ
సుధలీనేలను రోగ రూపమున సంక్షోభమ్ము పుట్టించునో
వధువుల్లేకనె లగ్నముల్‌కుదిరె ఏ వైనాలు చూపింతురో

రచనల నుండి ఉదాహరణ[మార్చు]

ప్రొద్దుటి వాన

మ|| తనసౌందర్యము చుట్టి చూచుకొనియెన్ ధాత్రీమహాదేవి; చెం
తనె తచ్చాడుచునున్న చందురునిపై ధావళ్యపుందాడి; నూ
తన దేశమ్ములు చూచుకోరికను పంతాలాడుచున సాగుచుం
డిన వన్వేషక పక్షులీ జగతి నిండెన్ బాలభానుప్రభల్

మహాస్రగ్ధర|| ఇరులన్ ఛేదించివైచెన్ హిమమును కలచెన్ హ్రీయుతాబ్దమ్ము జేరెన్
సరసంబాడం దొడంగెన్ జడను ముడిపడెన్ జక్కవల్ నిక్కిచూడన్
వరుసన్ రేకుల్ కదిల్చెన్ పరువముల గనెన్ ఖానవీయ ప్రతాపం
బరుదౌ ఆనందమందే అమృతము కురిసెన్ హస్తముల్ చాపివైచెన్

తరళము|| తరుణికాంతుల ధారుణీసతి తళ్కుబెళ్కుల గుల్కగా
మెరుపుదాగిన మేఘమాలకు మేను కంపర మెత్తెనో
నిరసనమ్మును చూపె నీరద నీలవస్త్రము లంతటన్
ధరణి యందము నీరుగార్చగ ధారలన్ గురిపించెడిన్

చం|| ఒక జడివానవచ్చె, తెగహోరు హడావుడి చేయజొచ్చె, దీ
నికి నొక వేళ లేదనెడి నిందలకింకను హెచ్చె, భూమి కాం
తకు సుమగంధయుక్తమగు స్నానము కాన్కగనిచ్చె, కొంతవే
డుక యగుగాని దీనను చెడున్ పనులన్నియు బద్ధకించినన్

సీ|| కళ్ళాపి చల్లెడి కర్మ తప్పినదని
పనికత్తె లింత సంబరము పడగ
తడిసిన చోటనే పడావేసితని తిట్ట
దినపత్రికా దూత దిగులుపడగ
మా బడికీపూట పోబనిలేదని
పాకబడి భడవ పరవశింప
నడువ వెళ్ళిన వారు నడుమ వానకు చిక్కి
పరువెత్తలేక ఇబ్బంది పడగ

గీ|| ఇంతగా మొత్తుచుంటి విదేమి కర్మ
ప్రొద్దువా? ముద్దువా? పొమ్ము, పోకయున్న
పద్యవర్షమ్ము నీపని పట్టు నింక
అనగ శాంతించె నాహ! నేననగ నేమి?

ఉ|| ప్రొద్దున వచ్చు వానయును, ప్రొద్దుమలగంగ వచ్చు చుట్టమున్
వద్దనియన్న పోరనెడి వాక్యము దబ్బరచేసి, వాన తా
నెద్దరి కేగెనో! ఎవరి యిండ్లను దూరెనొ తిట్ల వర్షమై!
ముద్దుల ఊర్మికూన మొగముంగన నేను మహాబ్ధి జేరితిన్
(సాగరఘోష కావ్యం నుండి)

ఇవి కూడా చూడండి[మార్చు]

 1. హిందూలో వార్త [2]
 2. తెలుగు తేజోమూర్తులు[3]

మూలాలు[మార్చు]

 1. 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి
 2. ఎ,, రామలింగశాస్త్రి (నవంబర్ 11,2005). "Rich entertainer". ది హిందూ. Retrieved 17 December 2014. Check date values in: |date= (help)
 3. ఈరంకి, వెంకటకామేశ్వర్. "తెలుగుతేజోమూర్తులు". సృజన రంజని అంతర్జాల తెలుగు మాసపత్రిక. సిలికానాంధ్ర. Retrieved 17 December 2014.

https://www.youtube.com/watch?v=g7JzoUxLbWQ