గార్లపాటి రఘుపతిరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గార్లపాటి రఘుపతిరెడ్డి
గార్లపాటి రఘుపతిరెడ్డి
జననం
గార్లపాటి రఘుపతిరెడ్డి

రామాంజపురం, నల్లగొండ జిల్లా
మరణంజూలై 26, 2020
రామాంజపురం, నల్లగొండ జిల్లా
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణా పోరాట యోధుడు
తల్లిదండ్రులు
  • నారాయణరెడ్డి (తండ్రి)

గార్లపాటి రఘుపతిరెడ్డి తెలంగాణా విముక్తి పోరాటయోధుడు. నిజాం రాచరిక పాలన నుంచి హైదరాబాదును విముక్తి చేసేందుకు పాఠశాలస్థాయిలోనే సాయుధ పోరాట ఉద్యమంలో పాల్గొని ఉరిశిక్ష ఖరారై చివరి క్షణాల్లో రద్దైన వారిలో రఘుపతిరెడ్డి ఒకరు.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

ఉమ్మడి నల్లగొండ జిల్లా రామానుజాపురంకు చెందిన పోలీస్ పటేల్ నారాయణరెడ్డి దంపతులకు రఘుపతిరెడ్డి జన్మించాడు. శాలిగౌరారం, నల్గొండ, హైదరాబాదు ఈశామ్యనగర్ లోని ఉలూం మిడిల్ స్కూలు, నారాయణగూడలోని కేశవ మెమోరియల్ హైస్కూలులో చదివాడు.

ఉద్యమం[మార్చు]

రఘుపతిరెడ్డి స్కూలు చదువుల సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నిజాం రాజ్యాన్ని భారత ప్రభుత్వంలో కలపాలని హైదరాబాదు స్టూడెంట్ యూనియన్ తరపున ఉద్యమం చేశారు. వారిని అణచివేయడానికి పోలుసులు లాఠీచార్జీ,టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. అదిచూసిన రఘుపతిరెడ్డి తానుకూడా ఉద్యమంలో పాల్గొనాలని అనుకున్నాడు. చదువు మానేసి జనగామ జిల్లాలోని కల్లెం గ్రామానికి వెళ్ళి, కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉద్యమకారులపై పోలీసుల దాడులు జరపడంతో మళ్ళీ హైదరాబాదుకు వచ్చి చదువు కొనసాగించాడు.

కొతంకాలం తరువాత సొంతవూరికి వచ్చి సాయుధ దళంలో చేరి, చురుకుగా పనిచేసి దళ నాయుకుడిగా మారాడు. మోత్కూర్, అడ్డగూడూర్, కంచనపల్లి, అమ్మనబోలు వంటి గ్రామాలలో దళ ప్రచారంతోపాటు పటేల్, పట్వారి భూములు, వెట్టిచాకిరీ తాలూకూ ఒప్పంద పత్రాలను తగలబెట్టడం, వాళ్లదగ్గరున్న బర్మార్‌ తుఫాకీలను తీసుకురావడం వంటి పనులుచేశాడు.[2]

ఉరిశిక్ష రద్దు[మార్చు]

సాయుధ పోరాటంలో పాల్గొన్నందుకు అక్కినేపల్లిలోని దొర హత్య కేసులో రఘుపతిరెడ్డిని భువనగిరిలో అరెస్టుచేసి రెండునెలలు నల్గొండ సబ్‌జైల్లో బంధించారు. ట్రిబ్యునల్ కోర్ట్ రఘుపతిరెడ్డికి ఉరిశిక్ష విధించింది. ఈ ఉరిశిక్ష పడ్డవారిలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొప్పొలుకు చెందిన నంద్యాల శ్రీనివాసరెడ్డి, నల్లగొండ జిల్లా అప్పాజీపేటకు చెందిన ఎర్రబోతు రాంరెడ్డి, కడవెండికి చెందిన నల్లా నరసింహులు అనే 15సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. 1951, జనవరి 21, 22 తేదీలలో ఉరిశిక్ష అమలుచేయయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ముషీరాబాదు జైలులో ఉరిశిక్షకు ఏర్పాట్లుచేశారు. ఈ ఉరిశిక్షల గురించి విదేశి పత్రికలు కూడా కథనాలు ప్రచురించాయి. అది చూసిన ఇంగ్లాండ్ న్యాయవాది డి.ఎన్.ప్రిట్ భారతదేశం వచ్చి అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ ను కలిసి వీరి తరపున వాదించగా, భారత ప్రభుత్వం వాటిని అంగీరించి ఉరిశిక్షను రద్దుచేసి యావజ్జీవ కారాగారశిక్షగా మార్చింది. 1956లో రఘుపతిరెడ్డి విడుదలయ్యాడు.[3]

రచనలు[మార్చు]

తన ఉద్యమజీవితం, ఉరిశిక్ష రద్దు మొదలైన అంశాలతో ఉరికంబం ఎక్కబోతూ తిరిగొచ్చిన అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకం 2019, సెప్టెంబు 11న తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ‘తెలంగాణ సాయుధపోరాటం’ వార్షికోత్సవ సభలో అవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు బూర్గుల నరసింగరావు, జైని మల్లయ్య గుప్తా, చెన్నమనేని హన్మంతరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు.[4]

మరణం[మార్చు]

రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ సమస్యతో 2020, జూలై 26 సాయంత్రం రామానుజపురంలోని స్వగృహంలో మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (17 September 2019). "తెలంగాణ విముక్తి కాదు విలీనమే!". www.andhrajyothy.com. Archived from the original on 21 September 2019. Retrieved 21 September 2019.
  2. ఆంధ్రజ్యోతి, హైదరాబాదు (17 September 2019). "విప్లవ ఝరి.. రద్దయిన ఉరి." www.andhrajyothy.com. Archived from the original on 21 September 2019. Retrieved 21 September 2019.
  3. ఈనాడు, ప్రధాన వార్తలు (17 September 2019). "సామాన్యులే సాయుధులై". www.eenadu.net. Archived from the original on 17 సెప్టెంబరు 2019. Retrieved 21 September 2019.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (12 September 2019). "తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది". www.andhrajyothy.com. Archived from the original on 21 September 2019. Retrieved 21 September 2019.
  5. ఆంధ్రజ్యోతి, తెలంగాణ (27 July 2020). "'తెలంగాణ ట్వల్వ్‌'లో ఒకరైన రఘుపతిరెడ్డి కన్నుమూత". www.andhrajyothy.com. Archived from the original on 27 July 2020. Retrieved 27 July 2020.