గుండంచర్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండంచర్ల ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంపెద్దారవీడు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08596 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 320 Edit this on Wikidata


గ్రామ చరిత్ర[మార్చు]

13వ శతాబ్దంలో కాటమరాజు కనిగిరి ప్రాంతాన్ని పరిపాలిఉంచేవాడు. ఆయనకు ఎంతో పశుసంపద ఉండేది. ఒక సంవత్సరం, వర్షాలు లేక కనిగిరిసీమలో కరవు రావడంతో, ఆ జీవాలను నెల్లూరు సీమలో మేపటానికి ఆ ప్రాంత రాజయిన మనుమసిద్ధి కుమారుడు నల్లసిద్ధితో కాటమరాజు ఒప్పందం కుదుర్చుకుంటాడు. అక్కడ పశువులు మేస్తుండగా, అక్కడుండే చిలక అరుపులకు ఆవులమంద బెదిరిపోయింది. దీనితో కాటమరాజు మంత్రి, ఆ చిలుకలను చంపేస్తాడు. అందులో నల్లసిద్ధి భార్య కుంకుమాదేవి పెంపుడు చిలుక గూడా ఉండటంతో, ఆగ్రహించిన ఆమె, ఆవులను చంపివేస్తుంది. కాటమరాజు తమకు గోనష్టం జరిగిందని పుల్లరి చెల్లించనంటాడు. దీనితో కాటమరాజుకూ, నల్లసిద్ధికీ సమరం జరుగుతుంది. ఆ సమరంలో కాటమరాజు, శ్రీకృష్ణావతారంగా భావించే, బొల్లావును పూజించి యుద్ధానికి పంపుతాడు. యుద్ధంలో ఇరు పక్షాలకూ తీవ్ర నష్టం జరిగి, కాటమరాజు నల్లమ ప్రాంతానికి వచ్చి, ఆశ్రమం ఏర్పాటు చేసుకొంటాడు. ఆ ఆశ్రమమే నేటి కాటమరాజు ఆలయం. ఇక్కడి కొలను ఎంత కరవు వచ్చినా ఎండకపోవడం విశేషం. ఈ కొలనే భక్తుల దాహార్తినీ తీరుస్తుంది. ఆలయంలో రాతి విగ్రహంలో కాటమరాజు, ఆయనకు ఎదురుగా పురాతన ఒరగోగుమాను చెట్టు, దాని తరువాత కాటమరాజు భార్య గంగాదేవి విగ్రహాలు ఉన్నాయి.

దర్శనీయ ప్రదేశాలు/ దేవాలయాలు[మార్చు]

కాటమరాజు తిరునాళ్ళు[మార్చు]

గుండంచర్ల పంచాయతీ పరిధిలోని నల్లమల సమీపంలో వెలసిన వేనూతల గంగాభవాని కాటమరాజు తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఉగాదికి ముందురోజు పశ్చిమ ప్రకాశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళకు, స్థానికులేగాక, ఇతర జిల్లాల నుండి గూడా లక్షమందికిపైగా భక్తులు విచ్చేసి, తమ మ్రొక్కులు తీర్చుకొనుట ఆనవాయితీ. పశుసంపదను కాటమరాజుస్వామి బొల్లావు ద్వారా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. చెక్కతో తయారుచేసిన బొల్లావులను, భక్తులు, ఊరేగింపుగా తీసుకొనివచ్చి, వేడుకను నిర్వహించెదరు. రంగురంగుల విద్యుద్దీపాలంకరణలు, ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసెదరు. ఈ తిరునాళ్ళకు వచ్చు భక్తుల సౌకర్యార్ధం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు గిద్దలూరు, మార్కాపురం, కంభం డిపోలనుండి ప్రత్యేక బస్సులు నడిపెదరు.

ప్రత్యేక ఆకర్షణ[మార్చు]

ఈ తిరునాళ్ళలో బొల్లావుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీనిని రెండున్నర అడుగుల ఎత్తులో తేలికైన కలపతో తయారు చేస్తారు. దీనిని ఎరుపురంగులో ప్రత్యేకంగా తీర్చి దిద్దుతారు. రెండు తొడలపై ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, డొక్కకు సింహతలాటం, వీపున నాగబంధం, చెండుకు ఇరువైపులా శంఖుచక్రాలు, నొసటన గంగా, నెత్తిన ఒంటికొమ్ము బొల్లావుకు గాంభీర్యాన్ని చేకూరుస్తాయి. కొమ్ముకు వెండి గొడుగులు, చెవులకు, మెడకు ఆభరణాలతో ఉన్న బొల్లావు ఊరేగింపు కన్నుల పండువగా సాగుతుంది.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]