గుండె శస్త్రచికిత్స

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరోనరీ అర్తెరి బైపాస్ శస్త్రచికిత్సగా పిలిచే గుండె శస్త్రచికిత్సను నిర్వహించే ఇద్దరు గుండె శస్త్రచికిత్సకులు. రోగి గుండెలు బలవంతంగా తెరిచి ఉంచేందుకు ఉక్కు రి త్రాక్తర్‌ను వాడతారు.

కార్డియో వాస్క్యులర్‌ శస్త్రచికిత్స గుండెకు, మరియు/లేదా పెద్ద నాళికలకు హృద్రోగ నిపుణులైన శస్త్రచికిత్సకులు చేసే శస్త్రచికిత్స. ఇషెమిక్‌ గుండె వ్యాధులకు (ఉదాహరణకు కరోనరీ ఆర్టెరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌), జన్మతః వచ్చే గుండె వ్యాధులను సరి చేసేందుకు, ఎండోకార్డైటిస్‌ వంటి పలు కారణాలతో వచ్చే వాల్యులార్‌ గుండె రోగాలను నయం చేసేందుకు తరచూ ఈ శస్త్రచికిత్సను నిర్వహిస్తుంటారు. గుండె మార్పిడి కూడా ఇందులో కలిసే వుంటుంది.

చరిత్ర[మార్చు]

గుండె చుట్టూ ఉండే తిత్తిపై జరిగిన తొట్టతొలి శస్త్రచికిత్స 19వ శతాబ్దంలోనే చోటుచేసుకుంది. వాటిని ఫ్రాన్సిస్కో రొమెరో[1] డొమినిక్‌ జీన్‌ లారీ, హెన్రీ డాల్టన్‌, డేనియల్‌ హేల్‌ విలియమ్స్‌ నిర్వహించారు. ఇక నేరుగా గుండెపై తొలి శస్త్రచికిత్సను నార్వేకు చెందిన శస్త్రచికిత్సకుడు యాక్సెల్‌ చాపెలెన్‌ 1895 సెప్టెంబర్‌ 4న ఇప్పుడు ఓస్లోగా పిలిచే క్రిస్టీనియాలో ఉన్న రిక్షో హాస్పిటలెట్‌లో నిర్వహించాడు. గుండెకు ఎడమ వైపు ఆక్సిలీ కత్తిపోటుకు గురై, తీవ్రమైన షాక్‌కు గురైన పరిస్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చిన ఒక 24 ఏళ్ల యువకునికి తీవ్ర రక్తస్రావం జరుగుతున్న గుండె దమనిని ఆయన సరిచేశాడు. వక్షచ్ఛేదన ద్వారా ఈ పనిచేశాడు. రోగి లేచి, 24 గంటల పాటు బాగానే ఉన్నాడు. కానీ జ్వరం బాగా పెరిగిపోయి, చివరికి చనిపోయాడు. అందుకు మీడియాస్టినిటిస్‌ కారణమని పోస్టమార్టం తేల్చింది.[2][3] ఇలాంటి ఏ సమస్యలూ లేకుండా విజయవంతమైన తొలి గుండె శస్త్రచికిత్స 1896 సెప్టెంబర్‌ 7న జరిగింది. కుడి వెంట్రికిల్ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన డాక్టర్‌ లుడ్విగ్‌ రెన్‌ చేశాడు.[ఉల్లేఖన అవసరం]

పెద్ద నాళికలకు శస్త్రచికిత్స (అయోర్టిక్‌ కొయార్క్‌టేషన్‌ మరమ్మతు, బ్లాలాక్‌-టౌసిగ్‌ షాంట్‌ ఏర్పాటు, పేటెంట్‌ డక్టస్‌ అర్టేరిసస్‌ను మూసేయడం) వంటివి 20వ శతాబ్దంలో పరిపాటిగా మారాయి. ఇవి గుండె శస్త్రచికిత్సల విభాగంలోకి వస్తాయి. కాకపోతే సాంకేతికంగా మాత్రం వీటిని అలా పిలవరు.

గుండె అమరికలో లోపాలు - తొలినాటి దృక్పథాలు[మార్చు]

గుండె నాళాలకు శస్త్రచికిత్సలు 1925 దాకా జరగనే లేదు. మిట్రల్‌ స్టెనోసిస్‌తో బాధ పడుతున్న ఓ యువతికి హెన్రీ సౌటర్‌ విజయవంతంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ఎడమ హృద్దమని భాగాన్ని తెరిచి, పాడైన మిట్రల్‌ నాళాన్ని పరిశీలించేందుకు అందులోకి వేలిని చొప్పించాడు. రోగి కొన్నేళ్ల[4] పాటు ఆరోగ్యంగా బతికింది. కానీ ఆ ప్రక్రియ సరైంది కాదని తోటి వైద్యులు అనటంతో సౌటర్‌ దాన్ని కొనసాగించలేకపోయాడు.[5][6]

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గుండె శస్త్రచికిత్సలు బాగా మారిపోయాయి. 1948లో నలుగురు శస్త్రచికిత్సకులు రుమాటిక్‌ జ్వరం వల్ల వచ్చిన మిట్రల్‌ స్టెనోసిస్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స చేయగలిగారు. చార్లొటీకి చెందిన హోరేస్‌ స్మితీ (1914-1948) పీటల్‌ బెంట్‌ బ్రిగామ్‌ ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ డ్వైట్‌ హార్కెన్‌ ద్వారా ఒక శస్త్రచికిత్సను నిర్వహించి మిట్రల్‌ నాళంలోని ఒక భాగాన్ని పంచ్‌ వాడకం ద్వారా తొలగించాడు. ఫిలడెల్ఫియాలోని హన్వెన్‌ ఆస్పత్రికి చెందిన చార్లెన్‌ బెయిలీ (౧౯౧౦-1993), బోస్టన్‌కు చెందిన డ్వైట్‌ హార్కెన్‌, గై ఆస్పత్రికి చెందిన రసెల్‌ బ్రోక్‌ వంటివారంతా సౌటర్‌ పద్ధతినే అనుసరించారు. వీరంతా కొద్ది నెలల వ్యవధిలోనే ఎవరికి వారు స్వతంత్రంగానే తమ కార్యకలాపాలు కొనసాగించారు. ఈ సమయానికి సౌటర్‌ పద్ధతిని కొన్ని మార్పుచేర్పులతో విస్తృతంగా వాడసాగారు.[5][6]

1947లో మిడిల్‌సెక్స్‌ ఆస్పత్రికి చెందిన థామస్‌ హోమ్స్‌ సెల్లర్స్‌ (1902-1987) పల్మనరీ స్టెనోసిస్‌తో బాధపడుతున్న ఓ ఫాలట్‌ టెట్రాలజీ రోగికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం ద్వారా స్టెనోసెడ్‌ పల్మనరీ నాళాన్ని విజయవంతంగా విడదీయగలిగాడు. సెల్లర్‌ ప గురించి బహూశా తెలియని కారణంగా రసెల్‌ బ్రోక్‌ 1948లో ప్రత్యేకంగా రూపొందించిన డయాల్టర్‌ను మూడు పల్మనరీ స్టెనోసిస్‌ ఉపయోగించాడు. తర్వాత 1948 లో ఇంఫున్దిబులర్ కండరం స్టెనోసిస్ లో రంధ్రం చేయడానికి ఒక పంచ్ ను రూపొందించారు. దీన్ని తరచూ ఫాలట్‌ టెట్రాలజీకి ఆపాదిస్తుంటారు. ఎట్టకేలకు గుండె నాళాలకు నేరుగా శస్త్రచికిత్స ద్వారా గుండె బైపాస్‌ను ప్రవేశపెట్టే దాకా ఈ తరహా వేలాది గుడ్డి శస్త్రచికిత్సలు జరిగాయి.[5]

ఓపెన్‌ హార్ట్‌ శస్త్రచికిత్స[మార్చు]

ఈ శస్త్రచికిత్సలో రోగి గుండెను తెరిచి లోపలిభాగాలకు శస్త్రచికిత్స చేస్తారు.

రక్తరహిత, చలనరహిత స్థితిలో గుండె లోపలిభాగాలకు మరింత చక్కగా చికిత్స చేయచ్చని టొరెంటో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ విల్‌ఫ్రెడ్‌ జి.బిగిలోవ్‌ కనుక్కున్నారు. అంటే గుండెకు రక్త సరఫరా నిలిపివేసి తర్వాత చికిత్స, చేయాలన్నమాట. జన్మతః వచ్చే గుండె వ్యాధికి 1952, సెప్టెంబర్‌ 2న మొట్టమొదటిసారి మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన వైద్యులు సి.వాల్టన్‌ లిల్లీహీ, ఎంఫ్‌ జాన్‌ లూయిస్ హైపోథర్మియా పద్ధతి ద్వారా ఓ హృద్రోగికి శస్త్రచికిచ్స నిర్వహించారు. మరుసటి ఏడాది సోవియట్‌ వైద్యుడు అలెగ్జాండర్‌ అలెంగ్జాండ్రోవిచ్‌ విష్‌నెవ్‌స్కీ లోకల్‌ అనస్తీషియా ఇచ్చి గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు.

శస్త్రచికిత్సకులు ఈ హైపోథర్మియా పరిమితులను గుర్తించారు. అంటే గుండెలోపలి భాగాలకు చికిత్స చేసేందుకు ఎక్కువ సమయం అవసరమవుతుందని, రోగి శరీరానికి (మరీ ముఖ్యంగా మెదడుకు) రక్త సరఫరా అవసరమని గుర్తించారు. రోగిి గుండె, ఊపిరితిత్తులు పనిచేయడానికి కృత్రిమ పద్ధతిని అవలంబించడంతో దీన్ని కార్డియోపల్మనరి బైపాస్‌ అని వ్యవహరిస్తారు. జఫర్‌సన్‌ మెడికల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్‌ జాన్‌ హేషామ్‌ గిబ్బన్‌ ఆక్సిజనరేటర్‌ ద్వారా ఎక్స్‌ట్రాకార్పోరల్‌ సర్కులేషన్‌ ఉపయోగించి 1953లో తాను విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెలిపారు. అయితే తర్వాత వైఫల్యాలు ఎదురుకావడంతో ఆయన ఆ పద్ధతిని నిషేధించారు. 1954లో డాక్టరె లిల్లీహీ రోగి తల్లి లేదా తండ్రిని 'గుండె, ఊపిరితిత్తుల యంత్రం'లా ఉపయోగించి కంట్రోల్డ్‌ క్రాస్‌ సర్కులేషన్‌ విధానంతో శస్త్రచికిత్సలు నిర్వహించారు. రోచెస్టర్‌ మేయో క్లినిక్‌కు చెందిన డాక్టర్‌ జాన్‌ డబ్ల్యూ కిర్క్‌లిన్‌ మిన్నెసోటా వైద్యుడు గిబ్బన్‌ ఉపయోగించినట్టే ఆక్సిజనరేటర్‌ పంప్‌ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించారు. తర్వాత ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని శస్త్రచికిత్సకులందరూ అదే పద్ధతిని అనుసరించారు.

మొట్టమొదటగా ఆక్సిజనరేటర్‌ పంప్‌ను రూపొందిన వైద్యులు క్లారెన్స్‌ డెన్నిస్‌, కార్ల్‌ కార్ల్‌సన్‌, ఛార్లెస్‌ ఫ్రీస్‌ వద్ద డాక్టర్‌ నాజీ జుహ్దీ నాలుగేళ్లు పనిచేశారు. బ్రూక్లిన్‌ సెంటర్‌లో జుహ్దీ, ఫ్రీస్‌ 1952 నుంచి 1956 వరకూ డెన్నిస్‌ పంప్‌కు అనేక మార్పులు చేర్పులు చేశారు. తర్వాత మిన్నెసోటా వైద్యుడు సి.వాల్టన్‌ లిల్లీహీతో కలిసి పనిచేయడానికి జుహ్దీ వెళ్లారు. లిల్లీహీ సొంతంగా క్రాస్‌సర్కులేషన్‌ యంత్రాన్ని రూపొందించారు. తర్వాత అదే డివాల్‌-లిల్లీహీ గుండె, ఊపిరితిత్తుల యంత్రంగా ప్రసిద్ధికెక్కింది. శస్త్రచికిత్స సమయంలో గుండెతాతత్తాలికంగా నిలిపివేసిందుకు సరఫరా అయ్యే రక్తంలో గాలిబుడగల ్త సమస్యను పరిష్కరించడానికి రక్తం చిలకరించడం, రక్తసరఫరాపై జుహ్దీ అధ్యయనం చేశారు. 1957లో జుహ్దీ ఒక్లహెAమాకు తరలిపోయి అక్కడి విశ్వవిద్యాలయంలో పనిచేశారు. అక్కడ జుహ్దీ, మరో ఇద్దరు వైద్యులు అలెన్‌ గ్రీర్‌, జాన్‌ కారేతో కలిసి ఓపెన్‌ హార్ట్‌సర్జిరీలు చేసే బృందంగా ఏర్పడ్డారు. డివాల్‌-లిల్లీహీ గుండె ఊపిరితిత్తుల యంత్రం కంటే చాలా చిన్నదిగా రూపొందించిన జుహ్దీ యంత్రం సాయంతో రక్తంస్రావాన్ని కనిష్టస్థాయికి తగ్గించడమేకాక, ఎక్విప్‌మెంట్‌ ధర కేవలం 500 డాలర్లకు లభించే వీలు ఏర్పడింది.దీంతో శస్త్రచికిత్స తయారయ్యే సమయం 2గంటల నుంచి 20 నిమిషాలు తగ్గింది. ఒక్లహామా నగరంలోని మెర్సీ ఆసుపత్రిలో 1960. ఫిబ్రవరి 25న టెర్రీ జినినిక్స్‌ అనే ఏడేళ్ల బాలుడిపై మొట్టమొదటి టోటల్‌ ఇన్‌టెన్షనల్‌ హీమోడైల్యూషన్‌ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని జుహ్దీ విజయవంతంగా నిర్వహించారు. అయితే మూడేళ్ల తర్వాత నిక్స్‌ 1963లో మృతిచెందాడు[7]. 1961 మార్చిలో జుహ్దీ బృందం మూడున్నర్రేళ్ల చిన్నారికై ఇదేపద్ధతిలోశస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఆ రోగి ఇంకా బతికే ఉన్నారు[8].

1985లో డాక్ట్‌ర్‌ జుహ్దీ ఒక్లహామా బాప్టిస్ట్‌ ఆసుపత్రిలో నాన్సీ రోజర్స్‌కు మొట్టమొదటి గుండె మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. అయితే కేన్సర్‌ రోగి అయిన రోజర్స్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా శస్త్రచికిత్స జరిగిన 54రోజలు తర్వాత మరణించారు[9].

ఆధునిక బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ.[మార్చు]

1990 నుంచి శస్త్రచికిత్సకులు 'ఆఫ్‌ పంప్‌ బైపాస్‌ సర్జరీ'ని చేయడం ప్రారంభించారు.కార్డియోపల్మనరి బైపాస్‌ కాస కరోనరి ఆర్టరీ బైపాన్‌లు చేయడం ఆరంభించారు. ఈ పద్ధతుల్లో శస్త్రచికిత్స సమయంలో గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే దాన్ని స్థిరీకరిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల చికిత్స అనంతర కాలంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు (పోస్ట్‌పర్ఫ్యూషన్‌ సిండ్రోమ్‌ వంటివి). ( 2007నాటికి అధ్యయన ఫలితాలు వివాదాస్పదంగా ఉన్నాయి, అయితే శస్త్రచికిత్సకుల సముఖత, ఆసుపత్రులు ఫలితాలు ముఖ్యభూమిక పోషిస్తాయి).

అతి తక్కువగా రంధ్రం చేసే శస్త్రచికిత్స[మార్చు]

రోబో సహాయంతో నిర్వహించే కొత్త తరహా గుండె శస్త్రచికిత్సకు ఇటీవలి కాలంలో ఆదరణ బాగా పెరిగింది. ఈ విధానంలో గుండె శస్త్రచికిత్స నిపుణుని నియంత్రణలో శస్త్రచికిత్స చేసేందుకు యంత్రాన్ని ఉపయోగిస్తారు. రోగి శరీరానికి చేసే రంధ్ర పరిమాణం అతి తక్కువగా ఉండటమే ఈ విధానంలోని ప్రధానమైన సానుకూలత. కనీసం శస్త్రచికిత్సకుడు తన వేలిని లోనికి చొప్పించేంత పెద్దగా ఉండే రంధ్రానికి బదులుగా రోబో చేతులను ఉపయోగిస్తారు కాబట్టి అతి చిన్నవైన మూడు రంధ్రాలను మించి మరేమీ అవసరముండదు.

పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ శస్త్రచికిత్స[మార్చు]

పీడియాట్రిక్‌ కార్డియోవాస్క్యులర్‌ సర్జరీ చిన్న పిల్లల గుండెకు చేసే శస్త్రచికిత్స. 1956 మార్చిలో సాల్ట్‌లేక్‌ సాధారణ ఆస్పత్రిలో రసెల్‌ ఎం.నెల్సన్‌ తొలి విజయవంతమైన చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్స చేశాడు. ఒక నాలుగేళ్ల పాపకు ఫాలోట్‌ టెట్రాలజీని పూర్తిగా నయం చేసేందుకు ఆయన ఈ శస్త్రచికిత్స చేశాడు.[10]

ప్రమాదాలు[మార్చు]

గుండె శస్త్రచికిత్స, కార్డియోపల్మనరీ బైపాస్‌ వంటి పరిజ్ఞానాలు ఈ శస్త్రచికిత్సల్లో మరణాల రేటును చాలా తక్కువకు తగ్గించాయి. ఉదాహరణకు ప్రస్తుతం గుండె సంబంధిత సమస్యలకు చేసే శస్త్రచికిత్సల్లో మరణాల శాతం 4 నుంచి 6 శాతం మాత్రమే.[11][12]

కాకపోతే గుండె శస్త్రచికిత్సల విషయంలో ప్రధానమైన ఆందోళన ఒకటుంది. అదే, నరాలపరమైన నష్టం. గుండె శస్త్రచికిత్స చేయించుకునే రోగుల్లో 2 నుంచి 3 శాతం మందికి పక్షవాతం వచ్చే ప్రమాదముంటుంది.[ఉల్లేఖన అవసరం]ఈ ప్రమాదం ముందు నుంచే ఉన్న రోగులకు ఈ సమస్య మరీ ఎక్కువ. ఇక కార్డియోపల్మనరీ బైపాస్‌ శస్త్రచికిత్సకు ముడిపెట్టి చెప్పే మరో ప్రధానమైన నరాల సంబంధిత సమస్య పోస్ట్‌పెర్‌ఫ్యూషన్‌ సిండ్రోమ్‌ (కొన్నిసార్లు 'పంప్‌హెడ్‌' అని కూడా అంటారు). తొలుత దీని లక్షణాలను శాశ్వతంగా[13] ఉండిపోయేవిగా భావించారు. కానీ అవి అలా వచ్చి ఇలా వెళ్లేవే తప్ప నరాలకు శాశ్వత నష్టమేదీ కలిగించేవి కాదని తేలింది.[14]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • గుండె శస్త్రచికిత్సకుడు
 • కార్డియోథెరాక్టిక్ శస్త్రచికిత్స
 • డయింగ్‌ టు లివ్‌ (సినిమా)
 • వాస్క్యూలర్ సర్జరీ
 • కార్డియాోథొరాసిక్ అనస్థీషియాలజీ

సూచనలు[మార్చు]

 1. తొలి గుండె శస్త్రచికిత్సకుడు ఏరిస్‌ ఫ్రాన్సిస్కో రొమెరో. ఆన్‌ థొరాక్‌ శస్త్రచికిత్స 1997 సెప్టెంబర్‌ ; 64 (3): 870-1. PMID 9307502
 2. లాండ్‌మార్క్స్‌ ఇన్‌ కార్డియాక్‌ సర్జరీ, స్టీఫెన్‌ వెస్టబీ, సెసిల్‌ బోషెర్‌, ISBN 1-899066-54-3
 3. http://www.tidsskriftet.no/?seks_id=659174
 4. డిక్షనరీ ఆఫ్‌ నేషనల్‌ బయోగ్రఫీ - హెన్రీ సౌటర్‌ (2004 -08)
 5. 5.0 5.1 5.2 హరాల్డ్‌ ఎలిస్‌ (2000) అ హిస్టరీ ఆఫ్‌ సర్జరీ, పుట 223+
 6. 6.0 6.1 లారెన్స్‌ హెచ్‌ కోన్‌ (2007), కార్డియాక్‌ సర్జరీ ఇన్‌ ద అడల్ట్‌, పుట 6+
 7. క్లిఫ్‌ వారెన్‌, డాక్టర్‌ నాజీ జుహ్దీ ా హిజ్‌ సైంటిఫిక్‌ వర్క్‌ మేడ్‌ ఆల్‌ పాత్స్‌ లీడ్‌ టు ఓక్లహామా సిటీ, ఇన్‌ డిస్టింక్ట్‌లీ ఓక్లహామా, 2007 నవంబర్‌, పుటలు ౩౦-33
 8. రోగి ఇచ్చిన సమాచారం, గోప్యత కోసం పేరు ఇవ్వడం లేదు
 9. http://ndepth.newsok.com/zuhdi ప్రఖ్యాత గుండె శస్త్రచికిత్సకుడు డాక్టర్‌ నాజీ జుహ్దీ, ద ఓక్లహామన్‌, 2010 జనవరి
 10. పీడియాట్రిక్‌ హార్ట్‌ సర్జరీ ఇన్‌ మెడ్‌లైన్‌ప్లస్‌
 11. జె.గిలివాన్‌, ఎస్‌.స్టార్క్‌, జె.లవ్‌గ్రోవ్‌, జేఆర్‌ హ్యామిల్టన్‌, జేఎల్‌ మోన్రో, జేసీ పొలాక్‌, కేజీ వాటర్సన్‌. పుట్టుకతో వచ్చిన గుండె లోపాలున్న పిల్లల్లోశస్త్రచికిత్స తర్వాత మరణ శాతం. శస్త్రచికిత్సకుల పనితీరు. లాంకెట్‌ 2000 మార్చి 18; 355 (9208): 1004 -7. PMID 10768449
 12. టీఎస్‌ క్లిట్జెనర్‌, ఎం లీ, ఎస్‌ రోడిగ్జ్ర్‌, ఆర్‌ఆర్‌ చాంగ్‌. గుండె రోగుల్లో శస్త్రచికిత్సల తర్వాత మరణ శాతంలో లింగపరమైన తేడాలు. జన్మత: వచ్చే గుండె సమస్యలు 2006 మే; 1 (3): 77. అబ్‌స్ట్రాక్ట్‌
 13. Newman M, Kirchner J, Phillips-Bute B, Gaver V, Grocott H, Jones R, Mark D, Reves J, Blumenthal J (2001). "Longitudinal assessment of neurocognitive function after coronary-artery bypass surgery". N Engl J Med. 344 (6): 395–402. doi:10.1056/NEJM200102083440601. PMID 11172175.CS1 maint: multiple names: authors list (link)
 14. Van Dijk D, Jansen E, Hijman R, Nierich A, Diephuis J, Moons K, Lahpor J, Borst C, Keizer A, Nathoe H, Grobbee D, De Jaegere P, Kalkman C (2002). "Cognitive outcome after off-pump and on-pump coronary artery bypass graft surgery: a randomized trial". JAMA. 287 (11): 1405–12. doi:10.1001/jama.287.11.1405. PMID 11903027.CS1 maint: multiple names: authors list (link)

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]

మూస:Cardiac surgery