గుణవంతుడు
గుణవంతుడు 1975 నవంబర్14 న విడుదలయినతెలుగు చలన చిత్రం . ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో, శోభన్ బాబు, మంజుల , అంజలీదేవి, కాంతారావు, ప్రభాకర్ ర్‌రెడ్డి మొదలగు వారు నటించగా, సంగీతం కె వి మహదేవన్ అందించారు.
గుణవంతుడు (1975 తెలుగు సినిమా) | |
తారాగణం | శోభన్ బాబు, మంజుల (నటి) |
---|---|
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయభట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]పాత్ర | పాత్రధారి |
---|---|
మోహన్, ఆనంద్ | శోభన్ బాబు |
దుర్గాప్రసాద్ | కాంతారావు |
సుందరం | ప్రభాకరరెడ్డి |
రాజారావు | ధూళిపాళ |
డాక్టర్ ఆరోగ్యం | రావి కొండలరావు |
సీత | మంజుల |
లక్ష్మి | అంజలీదేవి |
లిల్లీ | జయమాలిని |
పార్వతి | కృష్ణకుమారి |
గణపతి | మాడా |
గుమాస్తా | సాక్షి రంగారావు |
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకుడు: ఆదుర్తి సుబ్బారావు
- నిర్మాతలు: ఎన్.ఎన్.భట్, ఎన్.ఎస్.మూర్తి
- మాటలు: పి. సత్యానంద్
- పాటలు: ఆత్రేయ
- సంగీత దర్శకుడు: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: ఎం.కన్నప్ప
- కళ: జె.వి.సుబ్బారావు
- నృత్యం: శీను
- కూర్పు: ఆదుర్తి హరినాథ్
- స్టంట్స్: పరమశివం
కథా సంగ్రహం
[మార్చు]ఆనంద్ ధనవంతుడైన దుర్గాప్రసాద్, లక్ష్మిల పుత్రుడు. గారాబంగా పెరగడం వల్ల అన్ని దురవాట్లు అబ్బాయి. ఒక సారి పేకాటలో మాటామాటా పెరిగి ఒకని మీద చేయి చేసుకుంటే ఆయన చనిపోయాడని, ఆ హత్యానేరం ఆనంద్ పై పడితే వారి కుటుంబగౌరవం నాశనమౌతుందని, అవమానంతో అతని తండ్రి గుండె పగిలి చస్తాడని, అందుచేత ఆ నేరం ఆనంద్ మీదకు రాకుండా డబ్బు వెదజల్లి ఊరి నుండి పారిపోవాలని అతని స్నేహితురాలు లిల్లీ ప్లాన్ చేస్తుంది. ఇంట్లో కావలసినంత డబ్బు దొరకనందున నగలు కూడా ఎత్తుకు వచ్చిన ఆనంద్‌తో మద్రాసుకు పలాయనం చిత్తగిస్తారు లిల్లీ ఆనంద్‌లు. ఆనంద్‌ను చంపి ఆ నగలను కాజేయాలని పన్నాగం పన్నారు లిల్లీ, సుందరంలు. ఐతే ఈ కుట్రను పసిగట్టిన ఆనంద్ ఆ నగల పెట్టెను ఒక ఇంటిలో పడేసి వాటిని రక్షించుకోగలిగాడు కానీ తన ప్రాణాలను రక్షించుకోలేక పోయాడు. ఆ గుండాలు తరుముతున్న జీప్ క్రింద పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆనంద్ లేడని దుర్గాప్రసాద్ మంచం పడతాడు. ఆ నగల పెట్టెతో మోహన్ అనే వ్యక్తి ఈ ఊరు వచ్చాడు. మోహన్ ఆనంద్‌ను పోలి ఉండటం చేత అందరూ అతడిని మోహన్ అనే అనుకుంటారు. అతడు ఏమి చెప్పదలచుకున్నా ఎవరూ వినలేదు. ఎవరికీ తెలియకుండా పారిపోతున్న మోహన్‌ను లక్ష్మి ఆపుతుంది. ఆనంద్ వచ్చే వరకు అతనిలా నటించి తన భర్త ప్రాణాలను నిలబెట్టమని అర్థించడంతో మోహన్ అంగీకరించక తప్పలేదు. ఆనంద్ మరణిస్తే తన బావగారు మంచంపట్టి చచ్చిపోతాడు. ఆస్తి మొత్తం తన అక్క చేతిలోకి వస్తుంది. తను అధికారం చలాయించ వచ్చు అని ఆశపడిన సుందరానికి చుక్కెదురయ్యింది. మోహన్ ఆఫీసు వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. దుర్గాప్రసాద్ ప్రాణస్నేహితుడు రాజారావు తన కూతురు సీతను తీసుకుని వస్తాడు. సీత మద్రాసులో ఉన్నప్పుడు మోహన్‌ను ప్రేమించింది. మరణించిన ఆనంద్‌ను మోహన్ అని భ్రమపడింది. ఆమెను ఓదార్చి తన కోరిక ప్రకారం దుర్గాప్రసాద్ కొడుకు ఆనంద్‌కు ఇచ్చి పెళ్ళి చేయాలని రాజారావు భావిస్తాడు. తాను మోహన్ అని సీతతో చెప్పలేని స్థితిలో ఉంటాడు మోహన్. తమ చేతుల్లో చచ్చిన మోహన్ తిరిగిరావడం అసంభవం కనుక వచ్చిన వాడు మరొకడు అని నమ్మిన సుందరం అతడి గురించి ఆరా తీస్తాడు. తన తల్లిని మోసం చేసిన తండ్రి దుర్గాప్రసాదే అని సుందరం మోహన్కూ చెబుతాడు. దుర్గాప్రసాద్‌ను పగతో హత్యచేయాలని మోహన్ రివాల్వర్‌తో అతని గదిలోకి ప్రవేశిస్తాడు. దుర్గాప్రసాద్ తాను ఏ పరిస్థితులలో మోహన్ తల్లిని వదిలిపెట్టవలసి వచ్చిందో వివరిస్తాడు. చంపుదామని తీసుకువెళ్ళిన రివాల్వర్‌ను జారవిడుస్తాడు మోహన్. కానీ వేరే రివాల్వర్ పేలింది. దుర్గాప్రసాద్ మరణిస్తాడు. హత్యానేరం మోహన్‌పై మోపబడి జైలుపాలయ్యాడు. రాజారావు సహాయంతో సీత కొన్ని రహస్యాలను వెలికి తీసింది. మోహన్‌ను జైలు నుండి బయటకు రప్పించారు. మోహన్ సుందరం చేత నిజాలు చెప్పించాడు. సుందరం, అతని ముఠాను శిక్షించారు. మోహన్‌ను తన కొడుకులా స్వీకరించింది లక్ష్మి. సీతకు, మోహన్‌కు వివాహం జరిపిస్తారు.[1]
పాటలు
[మార్చు]- కలుసుకున్న తొలిరోజింకా కన్నులలోనే ఉన్నదిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
- కొడితే గోల్కొండ కొట్టాలిరా పడితే బాద్షాను పట్టాలిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
- నేనుగాక ఇంకెవరూ నిను కౌగిలిలో పొదిగేది - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
- మందిస్తా మత్తెక్కిస్తా మత్తులో మెట్టు మెట్టు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆత్రేయ
- సీతమ్మ నడిచింది రాముని వెంట రాముడు ఉన్నాడు - ఎస్.పి.బాలు, పి.సుశీల - రచన: ఆత్రేయ
- హేపీ గో లక్కీ లక్కీ లక్కీ.. రాదు నిన్నలేదు రేపు నిజం - ఎస్.పి. బాలు, రమణ బృందం - రచన: ఆత్రేయ
మూలాలు
[మార్చు]- ↑ సత్యానంద్ (1975). గుణవంతుడు పాటలపుస్తకం. p. 8. Retrieved 14 June 2021.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)