గుమ్మా శంకరరావు
గుమ్మా శంకరరావు | |
---|---|
జననం | గుమ్మా శంకరరావు 1933 ఫిబ్రవరి 10 |
ఉద్యోగం | తెలుగు అకాడమీ, హైదరాబాద్ |
గుమ్మా శంకరరావు ప్రసిద్ధుడైన అవధాని, కవి. ఇతడు అంకగణితం, పంచాంగ గణనం, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యరంగాలలో కూడా పేరు పొందాడు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఇతడు 1933, ఫిబ్రవరి 10వ తేదీన విశాఖపట్నం జిల్లా (ప్రస్తుతపు విజయనగరం జిల్లా) శృంగవరపుకోట మండలం చామలాపల్లి అగ్రహారంలో జన్మించాడు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1972లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. పట్టా స్వీకరించాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి "మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు" అనే అంశంపై సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో పరిశోధించి సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. హైదరాబాదులోని తెలుగు అకాడమీలో చాలాకాలం భాషానిపుణుడిగా పనిచేశాడు.
అవధానాలు
[మార్చు]ఇతడు చేసిన అష్టావధానాలలో సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్దాక్షరి, గణితము, ఆశువు, అప్రస్తుత ప్రసంగము, చిత్రాక్షరి అనే అంశాలు ఉన్నాయి. ఇతడు పార్వతీపురం, చీపురుపల్లి, గరివిడి, తాటిపర్తి, కొత్తపల్లి, విజయనగరం, టాటానగర్, చక్రధర్‌పూర్ మొదలైన చోట్ల అవధానాలు నిర్వహించాడు.
అవధానాలలో పూరణలు
[మార్చు]- సమస్య: అర చేతికి పళ్లు వచ్చి యబలను కఱచెన్
పూరణ:
ధరలో ద్విచక్ర శకటము
పరువిడి కొని యెక్కి త్రొక్కి పడగా నంతన్
సరిచేయ గొలుసునపుడా
యరచేతికి పళ్లువచ్చి యబలను కఱచెన్
- దత్తపది: నడక - పిడక - తడక - పుడక అనే పదాలతో సంజయ రాయబారం
పూరణ:
నడక దప్పిన కౌరవనాయకుండు
రాయబారంబు పంపెను రాపిడకయె
తడక లల్లిన లాభంబు దానరాదు
పుడక మోపినమేర నీ బొమ్మటంటు
రచనలు
[మార్చు]ఇతడు 12వ యేటనుండే కవిత్వం చెప్పనారంభించాడు. ఇతడు ఆంధ్రప్రభ, భారతి, తెలుగు మొదలైన పత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశాడు. ఇతడు ఈ క్రింది రచనలు చేశాడు.
- మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు - సిద్ధాంతగ్రంథం
- వ్యాస పారిజాతం
- జాతీయాలు - తీరుతీయాలు
- సాహిత్యం నుండి సైన్స్
- భారతీయ వేదాంతం - ఆధునిక విజ్ఞానశాస్త్రం
- మాఘ మహాకవి
మూలాలు
[మార్చు]- ↑ రాపాక, ఏకాంబరాచార్యులు (2016). "అవధాన విద్యాధరులు". అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. pp. 386–388.