Jump to content

గుర్రం యాదగిరి రెడ్డి

వికీపీడియా నుండి
గుర్రం యాదగిరి రెడ్డి
గుర్రం యాదగిరి రెడ్డి

గుర్రం యాదగిరి రెడ్డి


మాజీ శాసనసభ సభ్యుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.
పదవీ కాలం
1985  1999
నియోజకవర్గం రామన్నపేట

ముందు కొమ్ము పాపయ్య
తరువాత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం ఫిబ్రవరి 5, 1931
సుద్దాల, గుండాల మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం నవంబరు 22, 2019
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ
జీవిత భాగస్వామి యాదమ్మ (రామాంజమ్మ)
సంతానం ఇద్దరు కుమారులు (రాజశేఖరరెడ్డి, రాంమోహన్‌రెడ్డి), ఇద్దరు కుమార్తెలు
నివాసం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

గుర్రం యాదగిరి రెడ్డి (ఫిబ్రవరి 5, 1931నవంబరు 22, 2019) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు. మాజీ ఎమ్మెల్యే. మచ్చలేని నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన భారత కమ్యూనిస్టు పార్టీ నుండి వరుసగా మూడుసార్లు రామన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

యాదగిరి రెడ్డి గుండాల మండలం సుద్దాల గ్రామంలో 1931, ఫిబ్రవరి 5న గుర్రం నర్సమ్మ, రాంరెడ్డి చివరి సంతానంగా జన్మించాడు. ఈయనకు అన్నతో పాటు ఐదుగురు అక్కలు ఉన్నారు. రాత్రి బడిలో 5వ తరగతి వరకు భోగం యాదగిరి పంతులు వద్ద చదువుకున్నాడు. గొర్రెల కాపరిగా, వ్యవసాయం చేస్తూ జీవనం సాగించాడు. గుతుప సంఘానికి 15 ఏళ్ల వయస్సులోనే పాలు అందిస్తూ దళంలోకి వెళ్లాడు. ఆయనకు తల్లిదండ్రులు వారసత్వంగా ఇచ్చిన మూడెకరాల భూమితో పాటు పాత పెంకుటింట్లోనే జీవనం సాగించాడు.

తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళంలో, నిర్మలా కృష్ణమూర్తి, నల్లా నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన దళాల్లో సుద్దాల హనుమంతు, నాయిని నర్సింహారెడ్డి, దూదిపాల చిన్న సత్తిరెడ్డి, కూరెళ్ల సంజీవరెడ్డితో కలిసి పనిచేసి దళ కమాండర్‌ స్థాయికి ఎదిగాడు. తన పాటలతో, బుర్రకథలతో ప్రజల్లో చైతన్యం కలిగించాడు.

కుటంబం

[మార్చు]

ఆయనకు భార్య యాదమ్మ (రామాంజమ్మ) తో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడైన గుర్రం రాజశేఖరరెడ్డి న్యాయవాదిగా, చిన్న కుమారుడు రాంమోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో విశాలాంధ్ర దిన పత్రికలో రిపోర్టర్‌గా పని చేస్తున్నారు. పెద్ద కుమార్తెను మోటకొండూర్‌ మండలం తేర్యాల గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తికి వచ్చి పెళ్లి చేశాడు, చిన్న కుమార్తె హైదరాబాద్‌లో జీవనం సాగిస్తోంది. యాదగిరి రెడ్డి తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదివించి ఆదర్శంగా నిలిచాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

చిన్నప్పటి నుండి ఉద్యమ, వామపక్ష భావాలు కలిగిన యాదగిరి రెడ్డి కమ్యూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవాడు. 1978 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్ము పాపయ్య చేతిలో ఓడిపోయాడు. ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట నియోజకవర్గం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీ తరపున 1985,[1] 1989,[2] 1994[3] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిపై గెలుపొంది, ఎమ్మెల్యే అయ్యాడు.

ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేశాడు. గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యంను కల్పించడంతోపాటు పాఠశాలల, ప్రభుత్వ భవనాల ఏర్పాటుకు విశేషమైన కృషిచేశాడు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో అమలు చేసిన క్రాంతిపథకం నుంచి అనేకమంది రైతులకు ఇన్‌వెల్‌ బోర్లు వేయించడం ద్వారా వారిని ఆదుకున్నాడు.

మరణం

[మార్చు]

యాదగిరిరెడ్డి అనారోగ్యంతో హైదరాబాదులోని ఓవైసీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2019, నవంబరు 22న మరణించాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Assembly Election Results in 1985". www.elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2019.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1989". www.elections.in. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2019.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1994". www.elections.in. the original నుండి 5 సెప్టెంబరు 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2019.
  4. ఈనాడు, తెలంగాణ (22 November 2019). "సీపీఐ సీనియర్‌ నేత యాదగిరిరెడ్డి కన్నుమూత". www.eenadu.net (in ఇంగ్లీష్). the original నుండి 22 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2019.
  5. ఆంధ్రప్రభ, తెలంగాణ (22 November 2019). "సీపీఐ సీనియర్ నేత గుర్రం యాదగిరిరెడ్డి కన్నుమూత". the original నుండి 22 November 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 November 2019.