గొల్లపూడి సీతారామశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గొల్లపూడి సీతారామశాస్త్రి లేదా స్వామి సీతారాం ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది.

జీవిత విశేషాలు[మార్చు]

గొల్లపూడి సీతారామశాస్త్రి గుంటూరుకు చెందినవారు.మొదట న్యాయవాద వృత్తిని చేపట్టి, మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. జమీందారీ లావాదేవీల మొదలుకొని పలు కేసుల్లో పనిచేసిన ఆయన, వృత్తిలో గట్టివాడిగా పేరు సంపాదించుకున్నారు.[1]

గొల్లపూడి సీతారామశాస్త్రి గాంధేయవాదిగా జీవితాన్ని సాగించారు. ఆయన మంచి ఉపన్యాసకులు. వేలమంది ముందు నిలబడి ఉపన్యసిస్తున్నా ఆర్థిక అవసరాలు, వరుమానాలూ, ఖర్చులు వంటి అంశాలపై ప్రసంగించాల్సివస్తే కాగితం, కలం అవసరం లేకుండా నోటిలెక్కలపై ఆర్థికవేత్తలను మించి మాట్లాడగల దిట్ట.

స్వాతంత్ర సమరం[మార్చు]

1921లో మహాత్మాగాంధీ పూర్ణస్వరాజ్యం పిలుపునిచ్చి ప్రభుత్వ సేవలు, కోర్టులు, కళాశాలలు విడిచిరమ్మని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకుని లాభదాయకంగా ఉన్న తన ప్లీడరు వృత్తిని విడిచిపెట్టి జాతీయ సమరంలోకి చేరారు.

మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమం 1930 లో మొదలుపెట్టినపుడు, ఆంధ్రలో జాతీయోద్యమ స్ఫూర్తిని రగుల్కొలిపేందుకు శిబిరాలను నెలకొల్పదలచారు. దానిలో భాగంగా సీతారామశాస్త్రి గారు తుమ్మల బసవయ్య, దుర్గాంబ దంపతులు సహకారంతో గుంటూరు జిల్లాలో కావూరులో వినయాశ్రమం ఏర్పాటు చేసారు. తుమ్మల బసవయ్య దంపతులు తమ యావదాస్థినీ ఈ ఆశ్రమానికి అర్పించారు.సీతారామ శాస్త్రి గారు తనకున్న ఒక ఎకరం భూమిని, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు 26 ఎకరాల భూమిని ఈ ఆశ్రమానికి దానం ఇచ్చారు. 65 ఎకరాల స్థలంలో ఈ ఆశ్రమం నెలకొని ఉంది. ఈ ఆశ్రమవాసిగా మారి సీతారామ శాస్త్రి గారు స్వామి సీతారాం గా పిలవబడ్డారు, జాతీయోద్యమంలో వీరి నిర్వహణలో వినయాశ్రమం నిర్వహించిన పాత్ర ప్రశస్థమైనది.

ఈ ఆశ్రమాన్ని గాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంబించబడింది. గాంధీజీ వినయాశ్రమంలో రెండురోజులు ఉండి ప్రజలలో స్వాతంత్ర్య ఉద్యమం గురించి ప్రేరణ కలిగించారు.

వినయాశ్రమంలో 1934 ఆయుర్వేద వైద్యశాల స్థాపించారు. పిల్లలకోసం గురుకుల పాఠశాల స్థాపించారు.1935లో మీరా బెన్ చేత స్వరాజ్య స్థూపం ఆవిష్కరింపజేశారు.

హరిజన సేవాయాత్రలో భాగంగా గాంధీజీ 1937 జనవరి 23 న రెండవసారి వినయాశ్రమం సందర్శించి తుపాను బాధితుల కోసం విరాళాలు సేకరించాడు. గ్రామ పారిశుద్ధ్యం, హరిజన సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కొరకు సీతారాం గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొన్నాడు. దీంతో ఆంధ్రాలో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తరువాత, 1951 సెప్టెంబరు 20న ఆచార్య వినోబా భావే అభ్యర్ధనపై ఆయన తన దీక్షను విరమించాడు.

మరణం[మార్చు]

స్వామి సీతారాం గారు 1960 ఏప్రియల్ 9న వినయాశ్రమం లో పరమపదించారు[2].

మూలాలు[మార్చు]

  1. టంగుటూరి, ప్రకాశం (July 1972). Wikisource link to నా జీవిత యాత్ర. M. SESHACHALAM & CO. వికీసోర్స్. 
  2. గుంటూరు రూరల్ (2014, అక్టోబరు-29; 11వ పేజీ.). "ఈనాడు". {{cite news}}: Check date values in: |date= (help)