గొల్లసుద్దులు
గొల్లసుద్దులు, ఆంధ్ర దేశపు జానపద కళారూపం.
సుద్దులు చెప్పే గొల్ల సుద్దులు
[మార్చు]గొల్ల సుద్దులను చెప్పేవారు గొల్లలను మాత్రమే యాచిస్తారు. యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణ లీలలు, కాటమరాజు కథ మొదలైన వాటిని సుద్దుల వారు ప్రచారం చేస్తూ వుంటారు. ఈ ప్రచారకులు ఆంధ్ర దేశమంతటా ఉన్నారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు హంస వింశతిలో గొల్ల సుద్దులను ఈ విధంగా వర్ణించాడు.
కొమ్ములు దీరణాలు జిగుగుల్కెడు వ్రాతల కృష్ణ లీలలం
గ్రమ్ము గుడార్లు వీరుడగు కాటమ రాజు కాథానులాపముల్
బమ్మిన పుస్తకాలు ముఖ పట్టిడి కట్టురు మాలలున్నెటా
సొమ్ములు నావముల్ వెలయు సుద్దుల గొల్లలు వచ్చి రెంటయున్.
గుడ్దలమీద బొమ్మల కథలు
[మార్చు]గొల్ల సుద్దుల వారి కథా వివరాన్నీ, పెద్ద పెద్ద వస్త్రాలపై చిత్రించి బొమ్మల సహాయంతో కథలు చెపుతారు. వీరి మాదిరే తెలంగాణాలో పాండవులనే తెగవారు భారత కథల్ని చీరలపై చిత్రించి పెద్దపెద్ద బొమ్మల సహాయంతో ప్రజానీకానికి పాడి వినిపిస్తారని డా: బిరుదురాజు.రామరాజు జానపద గేయ సాహిత్యంలో తెలియజేసారు.
పై పద్యంలో వివరించిన మాదిరి కొమ్ముల్నీ వీరణాలనూ వాయిస్తారు. వీరణం పెద్ద డోలు వంటిది. కొందరు శంఖాలను కూడా పూరిస్తారు. గొల్లలలో అనేక తెగల వారు వున్నప్పటికీ ఆధిక సంఖ్యలో వున్న వారు ఎఱ్ఱ గొల్లలే. వీరి ప్రధానమైన వృత్తి ఆవుల మందలనూ, గొఱ్ఱెల మందలనూ పెంచుతారు. యాదవులకు ప్రధాన దేవత యైన గంగమ్మకు జాతర్లు మొదలైన ఉత్సవాలు చేస్తూ వుంటారు. అలాంటి ఉత్సవాలు దొనకొండ, అలవలపాడు, మొదలైన చోట్ల జరుగుతున్నాయి. దర్దన్న పండితుడు ఈ గంగ పూజలను వీరుల పూజలుగా పేర్కొన్నాడు.
గొల్లలు సాధారణంగా అందరూ వైష్ణవులే అయినప్పటికీ, వీరిలో కొందరు శైవులు కూడా ఉన్నారు. సంఘంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యజాతుల తరువాత గొల్లలే అధికులని చెపుతారు. కులాల పట్టింపులు అధికంగా ఉండే గత కాలంలో రెడ్లు, వెలమవారు, గొల్లల సరసన కూర్చుని తినడానికి వెనుకాడేవారు కారు. యాదవులకు అంతటి స్థానముందని గుర్తించారు.
గొల్లలలో చాలా ఉపకులాలున్నాయి. వారిలో అధిక శాతం ఎఱ్ఱ గొల్లలు. గొల్ల సుద్దులు చెప్పేవారు ఎఱ్ఱ గొల్లలే. గొల్లల వృత్తి మేకలను పెంచటం, గొల్ల సుద్దులను భిక్షాటనగా ఉపయోగిస్తారు కూడా. వీరు కూడా గొల్ల సుద్దుల్లో హరి హరి నారాయణా ఆ... అంటూ పల్లవిని కొంత మంది వాడుకోవటం కూడా కద్దు. ఉదాహరణకు గొల్లల గోత్రాలు గొఱ్ఱెల కెరుక గొఱ్ఱెల గోత్రాలు గొల్లక కెరుక వీరి వారి గోత్రాలు తోడేళ్ళ కెరుకో హరి, హరి.
సంఘంలో వున్న చెడును తొలగించ టానికి సుద్దులు చెపుతారు. ఈ సుద్ధులకు ప్రత్యేకమైన ఛందస్సు వుండదనీ, దానికి కూన పదమనీ, జానపద ఛందస్సుతో పదం చాల ప్రసిద్ధమైనదనీ తాళ్ళపాక అన్నమయ్య, క్షేత్రయ్య, సేనయ మంత్రి మొదలైన వారు ఈ పదరచనలో ప్రసిద్ధులనీ, ఈ పదాలలో కూడా అనేక రకాలున్నాయనీ, అందులో ఒకటి కూన పదమనీ, కూనపదమంటే చిన్న పదమనీ శ్రీ రాంభట్ల కృష్ణమూర్తి గారు నాట్య కళ, జానపద సంచికలో వివరించారు.
గొల్ల సుద్దులన్న ఎక్కువగా కూన పదాలు గానే వుంటాయి. ఈ పదాన్ని ప్రధాన గాయకుడు ఆలపిస్తే ప్రక్కనున్న ఇద్దరు వంతలూ, ఆ పదాన్ని ఆ .... అంటూ సాగ తీసి చెవికి చేయి కప్పి పాడ్తారు. ఈ పదాల్ని గొల్లలు గొఱ్ఱెలను కాస్తూ రాత్రిళ్ళు వాటిని తోడేళ్ళ బారి నుండి కాపాడటానికి తెల్లవార్లూ పాడుతూనే వుంటారు.
హరి హరీ నారయుడా.. ఆదీ.. నారాయుడా కరుణించి మమ్మేలూ.. కమల లోచనుడా...
అంటూ ప్రారంభించి కృష్ణ గాథలు చెపుతారు. యాదవుడి గోవులను, మాధవుడు హాయంగ మాధవుడు మచ్ఛావాతార మైనాడు. అని దశావతార సంకీర్తన పాడుతారు.
గొల్ల సుద్దుల ప్రారంభంలో కథకులు రంగస్థలం మీదికి సరాసరి వచ్చేయరు. ప్రేక్షకుల మధ్య నుంచే ఆమూల నుంచి ఒకరు, ఈ మూల నుంచి ఒకరు టుర్ కీ అంటూ గొఱ్ఱెలను అదిలించినట్లూ, తప్పిపోయిన గొఱ్ఱెల కోసం వెతికినట్లు, తోడేళ్ళను కేకలతో అదరగొట్టినట్లు హడావిడి చేసి రంగం మీద కొస్తారు. వచ్చిన తరువాత వారూ వీరూ వచ్చారా అని పరామర్శ చేసి హాస్యపు ఛలోక్తులతో ప్రేక్షకులను ఆకట్టుకుని నృత్యంతో కథను ప్రారంభిస్తారు. వంత శ్రుతినే కథకుడు శ్రుతిగా ఆధారం చేసుకుంటాడు. ఒకప్పుడు వాయిద్యంగా వీణలను ఉపయోగించేవారట. ఆ వీణ ఎటు వంటిదో ఆధారం లేదు. ఆ తరువాత చేకోలను ఉపయోగించేవారు. వీరి కథల్లో పెద్ద డోలు కూడా వుంటుంది. ఇక వేషధారణలో కథకునికి పెద్ద తలపాగా, వెండి బిళ్ళల మొరత్రాడు, చెవులకు దిద్దులు, చేతులకు తెల్లని మురుగులు, భుజంమీద గొంగడి, చేతిలో పెద్ద కఱ్ఱ వుంటుంది. సుద్ధులు తేలికగా అగుపించినా అందులోనే మనకు వేమన పద్యాల్లో వున్నంత అర్థ స్ఫూర్తీ, తర్కమూ సిద్ధాంత సమన్వయంతో ద్వంద్వాత్మకంగా వుంటాయి.
గొల్ల కలాపం
[మార్చు]సుద్దులకూ, గొల్ల కలాపానికి సంబంధం లేక పోయినా, గొల్ల కలాప ప్రాముఖ్యంతో యాదవుల గొప్పతనాన్ని తర్కంతో నిరూపిస్తారు. అయితే కూచిపూడి వారూ, మారంపల్లి దేవదాసీలూ ప్రదర్శించే గొల్ల కలాప ఇతివృత్తానికీ దీనికీ సంబంధం లేదు. గొల్ల కలాపం కులవ్యవస్థమీద తిరుగుబాటు, అ తిరుగుబాటుకు పురాణాలనే ఆయుధంగా త్రిప్పుతారు.
కలాపాన్ని ఈ విధంగా ప్రారంభిస్తారు. యాదవుని గోవులు కాచిన మాధవుడు యాదవుడే కదా? ఆ మాధవుడు పాలకడలిలో యోగనిద్రలో వున్నప్పుడు అతని నాభి కమలంలో పుట్టిన బ్రహ్మ ఎవడు? యాదవుడే కదా? ఆ బ్రహ్మ ముఖం నుండి పుట్టిన బ్రాహ్మణులు, బ్రాహ్మణులకు పుట్టిన క్షత్రియులు వగైరా ఎవరు? యాదవులే కదా? అందుకని ఈ మనుషులందరిదీ ఒకటే కులం, ఒకటే కులం, యాదవ కులంలో అందరూ ఎఱ్ఱ గొల్లలే అని పురాణ తర్కంతో సిద్ధాంతీకరిస్తారు.
యాదవుల కళారూపాలు
[మార్చు]తెలంగాణా యాదవుల్లో కథలు చెప్పేవారు రెండు మూడు రకాలుగా ఉన్నారు. పురుషుడు ఆడ వేషం వేసుకుని కాళ్ళకు గజ్జెలు కట్టి ఒక్కు చేత బట్టి, పెద్ద డోలుతో పెద్ద తాళాలతో, వంతల సహాయంతో నృత్యం చేస్తూ కథను ముగిస్తాడు. వీరు ముఖ్యంగా బల్ గురి కొండయ్య కథ చెపుతారు. మరి కొంత మంది వృద్ధులైన కథకులు ఎల్లమ్మ కథను చెపుతూ జీవిస్తారు. ఇలా యాదవుల్లో కుర్మోళ్ళు అనే మరో తెగవారు వీరన్న కథ చెపుతారు. వీరు గాక గొల్ల భాగోతులు అనేవారు వేరేవారున్నారు. వీరాంజనేయ, చంద్ర కాంత, మాంధాత, చిరు తొండ, విప్రనారాయణ లాంటి వీధి నాటకాలు ఆడతారు. మరో తెగ 'మంది హెచ్చు వాళ్ళు' వీరు చెక్క బొమ్మలు పెట్టి, ఆ బొమ్మల్ని అవసరాన్ని బట్టి చూపిస్తూ, కదలిస్తూ, రాగాలు తీస్తూ కథలు చెపుతారు. వారు చెప్పే కథలు పెద్దిరాజు కథ, కాటమరాజు కథ, గొల్ల కరివెళ్ళ రాజు యుద్ధం చెపుతారని లక్ష్మీ కాతం మోహన్ వ్రాస్తున్నారు.
సుద్దుల కథలు
[మార్చు]సంప్రదాయ బద్ధంగా గొల్లలు చెప్పే సుద్దులను, కథల్నీ రాజకీయ ఉద్యమంలో ప్రచార సాధనంగా వుపయోగించారు. అలా ఉపయోగించిన వారిలో ప్రథములు ఆంధ్ర ప్రజా నాట్య మండలి వారు. తెలంగాణా విప్లవాన్ని గురించి, బుర్రకథను రచించిన తిరునగరి రామాంజనేయులు 1952 లో 'రాష్ట్ర వాంఛ ' అనే సుద్ధుల కథను, ఆంధ్ర రాష్ట్ర సిద్ధిని కోరుతూ వ్రాయబడిన కథ ఇది. కాటమరాజు కథల బాణీలో గొల్ల సుద్దులను చక్కగా వర్ణిస్తూ వ్రాయబడింది. ఈ కథకు మంచి ప్రచారం వచ్చింది. నవయుగ పబ్లిషింగ్ హౌసు వారు దీనిని 1953 లో అచ్చు వేశారు.
రామాంజనేయులు మన్యం విప్లవం అనే పేరుతో అల్లూరి సీతారామరాజు కథను కూడా సుద్దుల కథగా రచించారు. ఇది అముద్రితంగా ఉండిపోయినా బహుళ ప్రచారం పొందింది. వారణాసి సత్య నారాయణ శాస్త్రి 1954 లో సతీ ముసలమ్మ కథను గొల్ల సుద్దుల బాణీలో వ్రాశారు. ఇది కూడా అముద్రితంగానే వుండి పోయింది.
మూలాలు
[మార్చు]- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు