గోపగృహిణీన్యాయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పూర్వము ఇరువురు రాజదంపతు లుండేవారు. వారికొకుమారుఁడు. రాణి కొంచెము చీఁకటితప్పులమనిషి. ఆమెకు రాజుగారన్న అసహ్యము. ఒకనాఁ డామె రాజును విషము పెట్టి చంపి ఱంకుమగని యింటికి పోఁగా అతఁడు సర్పదష్టుఁడై చనిపోయెను. ఆమె దేశాంతరమునకు పోయి అచట వేశ్యావృత్తితో జీవించుచుండెను. కొన్నాళ్ళ కొకరాజపుత్రునకు నామెకు సంబంధము కలిగెను. ఇష్టాగోష్టిలో వారిరువురు తల్లి, కొడుకులని తెలియవచ్చి ఒకరి నొకరు వదలివైచి ఆపాపప్రాయశ్చిత్తికై చితిపేర్చుకొని దానిపై నెక్కిరి. రాజకుమారుఁడు చనిపోయెను. ఆమె మాత్రము చావక చితినుండి దొర్లి ప్రక్కనున్ననదిలో పడెను. నదీప్రవాహవశమున కొట్టుకొనిపోవుచుండఁగా నామెనొక గొల్లవాడు ఒడ్డునుకు జేర్చి తనయింటికిఁ దీసి కొనిపోయెను. వారిరువురును మహానురాగముతో అలుమగలవలె మెలఁగఁజొచ్చిరి. ఒకనాఁడామె పెరుగమ్ముటకు పోవుచు త్రోవలో నెదురుదెబ్బతగిలి క్రిందపడెను. తలమీది పెరుగుబాన నేలపైఁబడి పగిలి పెరుగు నేలపాలయ్యెను. అది చూచి ఆరాణి యిట్లను కొనుచు నేడువఁ దొడఁగెను- "హత్వా నృపం పతి మవాప్య భుజంగదష్టం, దేశాంతరే విధివశా ద్గణికాస్మి జాతా, పుత్త్రం స్వకం సమధిగమ్య చితాం ప్రవిష్టా, శోచామి గోపగృహిణి కథ మధ్య తక్రమ్‌?" అంతకంతకు భ్రష్టత్వము నొంది ఆపదలంబడినవారి విషయమున నీన్యాయము ప్రవర్తించును.