గోరటి వెంకన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోరటి వెంకన్న
Gorati venkanna.jpg
గోరటి వెంకన్న
జననంగోరటి వెంకన్న
1963 (age 49–50)
ఇతర పేర్లుగోరటి వెంకన్న
ప్రసిద్ధిపాటల రచయిత, కవి,గాయకుడు

గోరటి వెంకన్న ప్రముఖ ప్రజాకవి, గాయకుడు. పల్లె ప్రజలు, ప్రకృతి ఆయన పాట లకు మూలాధారాలు. మా టీవీలో ప్రసార మవుతున్న రేలా రె రేలా కార్యక్రమానికి సుద్దాల అశోక్ తేజతో కలిసి న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు.

జననం[మార్చు]

గోరటి వెంకన్న 1963 లో నాగర్‌కర్నూల్ జిల్లా, గౌరారం (బిజినపల్లి)లో ఆయన జన్మించాడు. నాన్న పేరు నర్సింహ. అమ్మ ఈరమ్మ. తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు.

చిన్నతనంలో ఆయనకు సినిమా పాటలంటే చాలా చిన్న చూపు ఉండేది. బడిలో పాట పాడమంటే ఎక్కువగా భక్తి పాటలు పాడేవాడు. ఆయన తండ్రి కూడా మంచి కళాకారుడే. తల్లి కూడా మంగళ హారతులూ మొదలైన పాటలు పాడేది. అలా ఆయనకు చిన్నప్పటి నుంచీ పాటల మీద ఆసక్తి కలిగింది. అలా ఉండగా ఆయన ఊర్లో వామపక్ష భావాలున్న వెంకటరెడ్డి అనే మాస్టారు వెంకన్న లోని సృజనాత్మకతను గుర్తించి కొన్ని పాటల పుస్తకాలను తీసుకువచ్చి ఇవ్వడం జరిగింది. వాటిలో పాటలను ఆయన అలవోకగా పాడగలగటం జరిగింది.[1]

రైతుల సమస్యలపై పాటలు రాస్తున్న సమయంలో 1984 లో ఆయన రాసిన నీ పాట ఏమాయెరో నీ మాట ఏమాయరో అనే పాట చాలా పేరు సాధించిపెట్టింది. ఆయనను చిన్నతనంలో ప్రోత్సహించిన వెంకటరెడ్డి మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాలుపంచుకోసాగాడు. అదే ప్రభావంతో అనేక పాటలు రాశాడు. అలా ఆయన రాసిన పాటలు జన నాట్యామండలి వాళ్ళు సభల్లో పాడేవారు.

సినీరంగ నేపథ్యం[మార్చు]

రాజ్యహింస పెరుగుతున్నాదో
పేదోళ్ళ నెత్తురు ఏరులై పారుతున్నదో

అనే పాట ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్ వినడం తటస్థించింది. ఆయన ఈపాట రాసింది ఎవరా అని రెండు నెలలపాటు వెతికి పట్టుకున్నాడు. శంకర్ ఆయన్ను సినిమా కోసం పాట రాయమని అడిగితే నిర్లక్ష్యంగా చూశాడు. సినిమా పాటలన్నీ పడికట్టు పదాలతో రాయబడి ఉంటాయనీ సినిమాల వల్ల సమాజంలో మార్పు రాదనే అభిప్రాయంతో ఉన్నాడు. చివరకు మిత్రుడు సాహు ఇచ్చిన ట్యూన్ తో జై భోలో జై భోలో అమరవీరులకు జై భోలో అనే పాటను రాశాడు. అది బాగా హిట్టయింది. అలాగే "కుబుసం" సినిమా కోసం ఆయన రాసిన పల్లె కన్నీరు పెడుతోంది అనే పాట కూడా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

రచనలు[మార్చు]

 • ఏకనాదం:
 • రేల పూతలు: ఎవరికో కొన్ని వర్గాల వారికి మాత్రమే అర్థమై, పరిమితమైన కవితా సంకలనాలకు నేడు కొదువ లేదు. కాని సామాన్య జనానికి అర్థమై, వారి నాలుకల మీద నిలిచిన సజీవమైన కవిత పాటే కదా! ఆ పాటలే నేడు కరువైనాయి. ఆ కరువును తీర్చడానికే మూడు పాటల సంకలనాలు వెలువరించాడు గోరటి. వాటిలో రేలపూతలు ఒకటి
 • అల చంద్రవంక

భావాలు అనుభవాలు[మార్చు]

 • మా మండల కేంద్రం తెలకపల్లి 'తెలకడు' అనే దళిత శివయోగి పేరు మీద ఏర్పడింది. ఇక మా ఊరు ఈశాన్యాన మేలబాయి, తూర్పున ఏనుగోళ్ల కంచెం, వాయవ్యానికి జైన గుట్ట (దీన్ని ఇప్పుడు అందరూ జన్నాయిగుట్ట అంటున్నారు) ఉత్తరానికి రామగిరిగుట్ట, దుందుభి నది ఉన్నాయి. తాపీ ధర్మారావు రాసిన 'దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు' పుస్తకం మీద శిల్పం బొమ్మ ఉంటుంది కదా, అది మాకు సమీపంలోని మామిళ్లపల్లిలోని దేవాలయం మీద ఉండే శిల్పమే. మాది చాలా విశిష్టమైన ఊరు.
 • చెన్నదాసు అనే యోగి మా ప్రాంతంలో తిరుగుతూ మా నాన్న తరంలో సాలె, మాల, మాదిగలందరికీ అష్టాక్షరి మంత్రోపదేశం చేశారట. ఉదయాన్నే స్నానం చేసి పూజ చెయ్యడం అన్నీ అలవడ్డాయి. ఎవరి ఇల్లే వారికి ఆలయమయ్యింది. గనక ఊళ్లోని ఇతర దేవాలయాలకు వెళ్లే అవసరం పడలేదు మాకు. చేతి నిండా ఎవరి పని వారికున్నప్పుడు కులంతో పనేముంది? కులం పేరుతో ఎక్కువతక్కువలు మా ఊళ్లో ఎప్పుడూ లేవు. 'ఏం రెడ్డీ..' 'ఏం వెంకన్నా' అనుకోవడమే తప్ప, ఎవరూ ఎవర్నీ 'అరే, ఒరే' అనడం లేదు. పైగా అందరూ వరసలతో పిలుచుకునేవారు.
 • మా నాన్నకు పది యక్షగానాలు, కనీసం ఐదు శతకాలు, ఇతరత్రా పద్యాలు, వందకు పైగా జానపద గేయాలు - అవన్నీ నోటికి వచ్చు. ఏదైనా ఒకసారి వింటే చాలు, ఆయనకు నోటికి వచ్చేసేది. మా అమ్మానాన్నలు ఏ మాట చెప్పాలన్నా దాన్ని ఒక సామెతగానో, పద్యంగానో... చాలా కవితాత్మకంగా చెప్పేవారు. రోజువారీ మామూలు సంభాషణల్లో సైతం ఎంతో సంస్కృతి, కవిత్వం ఉట్టిపడుతూ ఉండేవి. వాళ్ల నుంచే పాట నాకు వారసత్వంగా వచ్చింది.
 • మా ఊరి దగ్గరున్న దుందుభి వాగు అపర గోదావరి. వానాకాలం మొదలవక ముందే, ఆశ్లేష కార్తె నుంచే అవతలి ఇవతలి ఒడ్డులను ఒరిసి పారేది. అటూఇటూ మనుషుల రాకపోకలకు వీలయ్యేదే కాదు. అందువల్ల నన్ను మూడో తరగతి తర్వాత అవతలి ఒడ్డున ఉన్న రఘురాంపల్లి గ్రామంలో హాస్టల్లో వేశారు. మా ఊళ్లో స్వేచ్ఛగా, ఆరోగ్యంగా పెరిగిన నేను అక్కడ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉండలేకపోయేవాణ్ని.
 • ఇంకా తెల్లవారక ముందు, మూడున్నర గంటల సమయానికే మోట కొట్టే శబ్దాలు వినిపించేవి. వాటితో పాటు పాటలు, జారే నీళ్ల చప్పుడు, ఎద్దుల గిట్టల సవ్వడి - ఇవన్నీ చెవుల్లో దూరి గిలి పెట్టేవి. తెలవారుతూనే యోగి కీర్తనలు, భజనలు వినిపించేవి. తర్వాత రోజంతా బాలసంతులు, వీధి భాగవతులు, బుడబుడక్కలవాళ్లు - ఇలా ఎవరోఒకరు వస్తూనే ఉండేవారు. వాళ్లందరి నుంచీ పాటలు వినిపిస్తూనే ఉండేవి. ఇక సాయంత్రం మళ్లీ భజనలు, మేళాలు జరుగుతూ ఉండేవి. ఆలోచిస్తే, మా ఊరివాళ్లు అన్నం తినికాదు, ఆటపాటలతో బతికారు అనిపిస్తుంది. ఆత్మానందాన్ని శారీరక బలంగా మార్చుకుని జీవించారు వాళ్లు. ఆ పల్లెటూరి జీవనశైలి రాగమై నా పాటల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. నా పాటల్లో కనిపించేది నేను అనుభవించిన జీవితం కాదు. మా ఊళ్లో నేను చూసిన జీవితం. చిన్నప్పుడు సినిమాల ప్రభావం తక్కువ మాపైన. దగ్గర్లో ఉన్న కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ వంటి పట్టణాల్లో కొత్త సినిమాలు విడుదలైన విషయాన్ని ఇక్కడ బళ్ల మీద తిరుగుతూ చెప్పేవారు. నాకు తెలియక ఆ బండిలోనే సినిమా చూపిస్తారని అనుకునేవాణ్ని చాలారోజులు. నేను చూసిన తొలి సినిమా 'వీరాంజనేయ యుద్ధం' అని గుర్తు.
 • ఒకరి ముందు చెయ్యి చాపకుండా, ఇచ్చినా తీసుకోకుండా గౌరవంగా బతికిన మా నాన్న ఒకసారి కరువును తట్టుకోలేక హైదరాబాదు‌లో పనికి వెళ్లాడు. అక్కడ బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయి, తలెత్తకుండా పనిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయి ఏడ్చేశాను.[2]

పురస్కారాలు[మార్చు]

 1. కాళోజీ నారాయణరావు పురస్కారం - 09.09.2016[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

 1. http://www.telugulo.com/view_news.php?id=1905
 2. http://www.andhrajyothy.com/node/45375 ఆంధ్రజ్యోతి 22.12.2013
 3. నమస్తే తెలంగాణ (SEPTEMBER 9, 2016). "గోరెటి వెంకన్నకు కాళోజీ పురస్కారం ప్రదానం". Retrieved 9 September 2016. Check date values in: |date= (help)

యితర లింకులు[మార్చు]