గౌరవం (2013 సినిమా)
గౌరవం | |
---|---|
దర్శకత్వం | రాధా మోహన్ |
రచన | రాధా మోహన్ బి. వి. ఎస్. రవి విజి |
నిర్మాత | ప్రకాశ్ రాజ్ |
తారాగణం | అల్లు శిరీష్ యామీ గౌతం ప్రకాశ్ రాజ్ |
ఛాయాగ్రహణం | ప్రీత |
కూర్పు | అలెన్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 12, 2013[1] |
దేశం | భారతదేశం |
భాషలు | తమిళం తెలుగు |
రాధా మోహన్ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ ప్రోడక్షన్స్ మరియూ డ్యుయెట్ మూవీస్ పతాకాల పై ప్రకాష్ రాజ్ తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన చిత్రం గౌరవం. గౌరవ హత్యల నేపథ్యంలో నిర్మించబడిన ఈ చిత్రంలో అల్లు శిరీష్, యామీ గౌతం, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఏప్రిల్ 19, 2013న విడుదలైంది.
కథ
[మార్చు]అర్జున్ (అల్లు శిరీష్) ఒక ధనవంతుని కుమారుడు, అతను చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటాడు. ఒక రోజు అతని తండ్రి ఎస్.ఎమ్ పల్లి అనే గ్రామానికి బిజినెస్ పనిమీద పంపిస్తాడు. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ శంకర్ (విఘ్నేష్) కూడా అదే గ్రామానికి చెందిన వాడు కావడంతో ఎంతో సంతోషంతో అక్కడకు వెళ్తాడు. ఐతే అక్కడ శంకర్ అన్నయ్య బాచీ (కుమరవేల్) ద్వారా అర్జున్ శంకర్ ఆ ఊరి పెద్దమనిషి, ధనవంతుడైన పశుపతి (ప్రకాశ్ రాజ్) గారి అమ్మాయి రాజేశ్వరిని ప్రేమించి తనతో లేచిపోయాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. బాచీతో కలిసి అర్జున్ శంకర్ తండ్రి (ఎల్.బి.శ్రీరామ్) ఇంటికి వెళ్తాడు. అక్కడ అర్జున్ శంకర్ తండ్రి పడుతున్న బాధ చూసి చలించిపోయిన అర్జున్ శంకర్ ఆచూకీ తెలుసుకుంటానని చెప్పి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోతాడు.
తన స్నేహితుడు వెంకీ (శ్రీ చరణ్) తో కలిసి అర్జున్ మళ్ళీ ఆ ఊరికి వస్తాడు. అక్కడ బాచీ సహాయంతో ఒక చెరువు వొడ్డున టెంట్ వేసుకుని అర్జున్, వెంకీ కలిసి ఉంటారు. మరుసటి ఉదయం బాచీ ఆ ఊరిలోకి అర్జున్, వెంకీలతో కలిసి ఆ ఊరి యూనియన్ లీడర్ (నాజర్) ఇంటికి వెళ్తడు. అక్కడ ఆయన కూతురు యామిని (యామీ గౌతం) ని రెండోసారి చూసిన అర్జున్ తనతో స్నేహం పెంచుకుంటాడు. జూనియర్ లాయర్ గా పనిచేస్తున్న యామిని శంకర్, రాజేశ్వరిలను వెతకడంలో అర్జుంకి సహాయం చేస్తానని మాటిస్తుంది. అర్జున్, యామిని, వెంకీల ప్రయత్నాలు ఎక్కువయ్యే కొద్దీ పశుపతి కొడుకు జగపతి (హరీష్), పశుపతికి నమ్మకస్తుడైన రాంబాబు (బ్రహ్మాజీ) అర్జున్, వెంకీలను అడ్డుకుంటారు. వారిద్దరూ తమ మాట వినకపోయే సరికీ జగపతి తన ఇంటి కారులో తనే బాంబు పెట్టి, అది ఆ తక్కువ కులం వాళ్ళు చేసిన పనేనని ఆ కాలనీ పై, అర్జున్-వెంకీలు ఉంటున్న ప్రదేశం పై దాడి చేయిస్తాడు జగపతి.
చివరికి తన స్నేహితుడిని వెతకడంలో వారు విఫలమైయ్యారని భావించి ఫోన్, ఫేస్ బుక్, మేల్ వ్యవస్థల ద్వారా తమ స్నేహితులను ఎస్.ఎం.పల్లికి రప్పిస్తాడు అర్జున్. అర్జున్, యామిని, వెంకీ, బాచీలను కలిపి అరవై మందికి పైగా జనసమూహం, వీరికి తోడుగా దాదాపు పది మీడీ చానళ్ళు ఆ ఊరిలోకి శంకర్-రాజేశ్వరిలను రప్పించడానికీ, కుల గౌరవం పేరుతో జరుగుతున్న అరాచకాలను ఆపాలన్న శంకర్ ఆశయాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇంతలో ఆటిసం అనే మానసిక రుగ్మతతో బాధపడుతున్న శీను అనే పిల్లవాడి గురించి గుర్తుతెచ్చుకుంటాడు అర్జున్. శీను చూసిన ప్రతీవిషయం బొమ్మలుగా గీస్తాడు. అలాగే శంకర్ గురించి అడిగినప్పుడు కూడా శీను "లేడు" అని జవాబిస్తాడు. దానితో అనుమానం వచ్చి అర్జున్ శీను బొమ్మల పుస్తకాలని చూస్తాడు. అందులో ఒక బొమ్మలో ఒక గుడి దగ్గర ముగ్గురు గోతులు తవ్వుతున్న దృశ్యాన్ని చూసి అర్జున్ ఆ రాత్రి తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్తాడు. ఆ బొమ్మ ప్రకారం తవ్వి చూడగా రెండు సగం కుళ్ళిన శవాలు దొరుకుతాయి.
మరుసటి రోజు ఉదయాన ఫోరెన్సిక్ అధికారులు, శంకర్ తండ్రి, పశుపతి ద్వారా అవి శంకర్-రాజేశ్వరిల శవాలుగా గుర్తిస్తారు అక్కడి మీడియా, జనాలు. తమ పిల్లలు చంపబడ్డారని తెలిసి రోదిస్తున్న శంకర్ తండ్రి, పశుపతులతో పాటు అర్జున్ కూడా తన స్నేహితుడు చంపబడేంత తప్పు ఏం చేసాడని కుమిలిపోతుంటాడు. అదే సమయంలో హంతకులెవరో తెలుసుకోవాలని యామిని ద్వారా కోర్టులో కేసు వేసి విచారణకు అనుమతి కోరుతాడు. ఇంతలోనే ఒకడు శంకర్-రాజేశ్వరిలను నగల కోసం చంపింది నేనేనని కోర్ట్ లో లొంగిపోతాడు. ఐతే రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్ళే ముందు నగలు ఇంటిలోనే వదిలి వెళ్ళిందని తన వదిన ద్వారా తెలుసుకుంటాడు అర్జున్. మొదటి నుంచీ వారికి నమ్మకస్తుడిగా ఉంటున్న రాంబాబు వారం రోజుల నుంచీ ఏదో బాధతో కుమిలిపోతున్నాడని రాజేశ్వరి వదిన ద్వారా తెలుసుకున్న అర్జున్ రాంబాబుని పట్టుకుంటే అన్ని నిజాలూ తెలుస్తాయని అనుకుంటాడు. కోర్టులో లొంగిన వాడి మాటలు అబద్ధాలని తెలిసాక అర్జున్, యామినిల దగ్గరికి రాజేశ్వరి తల్లి (పవిత్ర లోకేష్), రాంబాబు వస్తారు. తన కూతురి చెయ్యి నరికి చంపిన వాడెవరో తెలుసుకునేంతవరుకు పోరాటం ఆపవద్దని అర్జున్ ని, అర్జున్ కి ఈ విషయంలో సహాయపడమని రాంబాబుని రాజేశ్వరి తల్లి కోరుతుంది. ఆమెపై గౌరవంతో ఇద్దరు ఆమెకు మాటిస్తారు.
ఇచ్చిన మాట ప్రకారం అర్జున్ స్నేహితులచే జగపతి నుంచి కాపాడబడిన రాంబాబు అర్జున్ కు జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటి రోజు ఉదయం అర్జున్, వెంకీ, బాచీ, రాంబాబు వెళ్తున్న కారుపై దాడి చేసిన జగపతి అర్జున్ తో హోరాహోరీ పోరాటం చేస్తాడు. సరైన సమయానికి అర్జున్ స్నేహితులు అక్కడికి చేరుకోవడంతో అర్జున్, వెంకీ, బాచీ రక్షింపబడతారు. జగపతి కారు ఎక్కి పారిపోతాడు. పశుపతి ఇంటికి అర్జున్, రాంబాబు కలిసి వెళ్తారు. అప్పుడు పశుపతికి జరిగిన విషయమంతా వివరిస్తాడు రాంబాబు. రాజేశ్వరి లేచిపోయిన రాత్రి పశుపతి శంకర్ ని చంపైనా తన కూతురిని తీసుకురమ్మని జగపతి, రాంబాబులకు చెప్పి పంపుతాడు. ఆ రాత్రి బస్సులో ఉన్న శంకర్-రాజేశ్వరిలను రైసు మిల్లుకు తీసుకెళ్ళి జగపతి వారిద్దరినీ వీరావేశంలో చంపేసాడు.
ఇదంతా తెలిసి కూలిపోయిన పశుపతికి అర్జున్ రాజేశ్వరి చావుకు కారణం పశుపతి జగపతిని కులోన్మాదిగా పెంచడమే కారణమని, గౌరవం పుట్టుకతో కాదు, చేసే పనులవల్ల వస్తుందని మందలిస్తాడు. ఇంతలో ఇంటికి చేరిన జగపతి నిజం ఒప్పుకుని అర్జున్ ని చంపాలనుకున్నాడు. తన తప్పు తెలుసుకుని కళ్ళు తెరుచుకున్న పశుపతి రివాల్వరుతో కాల్చి చంపేస్తాడు. మీడియా ముందుకు వెళ్ళి "కళ్ళు మూసుకుపోయి నా కూతురిని చంపుకున్నాను, కళ్ళు తెరుచుకుని నా కొడుకుని చంపాను. నాకు శిక్ష కావాలి. నా కొడుకును చంపినందుకు కాదు. నా కూతురిని చంపుకున్నందుకు" అని చెప్పి పోలీసులకు లొంగిపోతాడు. అర్జున్, తన స్నేహితులు చేసిన ఈ పోరాటం ఆ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలలో కులగౌరవ భేదాలను మార్చి అందరినీ సమం చేసింది.
నటవర్గం
[మార్చు]- అల్లు శిరీష్ - అర్జున్
- యామీ గౌతమ్ - యామిని
- ప్రకాశ్ రాజ్ - పశుపతి
- హరీశ్ ఉత్తమన్ - జగపతి
- నాజర్ - యామిని తండ్రి
- ఎలాంగో కుమారవేల్ - బాచీ
- శ్రీ చరణ్ - వెంకీ
- విఘ్నేష్ - శంకర్
- బ్రహ్మాజీ - రాంబాబు
- పావని రెడ్డి
సంగీతం
[మార్చు]ఎస్. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా యొక్క పాటలు మార్చి 31, 2013న హైదరాబాదులో విడుదల చేయబడ్డాయి. ఈ సినిమాకు థమన్ తన శైలిలో కాకుండా కథానుసారంగా స్వరాలను అందించారని ప్రశంసలు అందాయి. చంద్రబోస్ ఈ సినిమాకి అందించిన సాహిత్యానికి కూడా మంచి ఆదరణ లభించింది.
- ఒక్కటై ఒక్కటై
- మనసా మనసా
- చేతినుండి మన్ను తీసి
- ఒక గ్రామం ఉందంటా
విశేషాలు
[మార్చు]- ఈ సినిమా తెలుగు వర్షన్ లో కథనం గత-ప్రస్తుత ధోరణిలో నడుస్తుంది. తమిళ్ వర్షన్ లీనియర్ ధోరణిలో నడుస్తుంది. తెలుగు, తమిళ్ వర్షన్లలో పతాక సన్నివేశాలు వేరుగా ఉండటమే కాక తెలుగు వర్షన్ లో మరో 18 సీన్లు జతచేసారు.
- అల్లు అర్జున్ తమ్ముడైన అల్లు శిరీష్ కి ఇది నటుడిగా తొలిచిత్రం. శిరీష్ తను ఎంచుకున్న ఈ కథకి విమర్శకులనుంచి ప్రశంసలందుకున్నాడు. కానీ ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేకపోవడం, కొన్ని సన్నివేశాలు మరీ బాధాకరంగా ఉండటం ఈ సినిమాకు చెడ్డపేరును తీసుకువచ్చాయి.[2]
- కానీ నిర్మాత ప్రకాష్ రాజ్ కు ఈ సినిమా నష్టాన్ని మిగల్చలేదు. ఈ సినిమాకి ఆయన పెట్టిన ఖర్చు 7.5 కోట్ల రూపాయలు కాగా రెండు భాషల టీవీ ప్రసార హక్కుల ద్వారా దాదాపు 4.25 కోట్ల రూపాయలు గడించారు. మొదటి రోజు ఈ సినిమా వసూళ్ళు 4.25 కోట్ల రూపాయలు కావడంతో ఈ సినిమా ఆర్థికంగా లాభార్జన గడించిందనేది విదితం.[3]
మూలాలు
[మార్చు]- ↑ http://www.indiaglitz.com/channels/telugu/article/91774.html
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-23. Retrieved 2013-04-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-04-23. Retrieved 2013-04-22.