గౌరీ లంకేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గౌరీ లంకేష్
గౌరీ లంకేశ్
జననం(1962-01-29)1962 జనవరి 29
బెంగళూరు, మైసూరు రాష్ట్రం, భారతదేశం
మరణం2017 సెప్టెంబరు 5(2017-09-05) (వయసు 55)
బెంగళూరు, కర్నాటక, భారతదేశం
మరణ కారణంహత్య
వృత్తిజర్నలిస్టు - ఉద్యమకారిణి
కుటుంబంపి.లంకేశ్ (తండ్రి)
ఇంద్రజిత్ లంకేష్ (సోదరుడు)
కవితా లంకేశ్ (సోదరి)

గౌరీ లంకేష్‌ (29 జనవరి 1962 – 5 సెప్టెంబరు 2017) భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె బెంగళూరుకు చెందిన లంకేశ్, ఇందిరల మొదటి కుమార్తె. తండ్రి లంకేష్‌ తనపేరుతోనే ‘లంకేశ్‌’ అనే పత్రికను నడిపారు. చిన్నప్పటినుంచే జర్నలిజంపై ఆసక్తి కనబరిచారు. పలు ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలపై కథనాలను అందించారు. గౌరీ లంకేశ్ కన్నడ నాట ప్రముఖ పాత్రికేయురాలు. మితవాదులు, హిందూత్వవాదులపై లౌకిక కోణంలో విమర్శలు చేసే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధి గాంచారు. నక్సలైట్ల సానుభూతి పరురాలిగా కూడా పేరుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేశారు. అనంతరం తన తండ్రి స్థాపించిన ‘‘లంకేశ్ పత్రికే’’ వార్తాపత్రికను సోదరుడు ఇంద్రజిత్‌తో కలిసి కొన్నేళ్లు నడిపారు. ఆ తర్వాత తన సొంత వార్తా పత్రిక ‘‘గౌరీ లంకేశ్ పత్రికే’’తో పాటు పలు ప్రచురణలను ప్రారంభించారు.


ధైర్యశాలిగా, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రికేయురాలిగా ఆమె ప్రసిద్ధి గాంచారు. ప్రముఖ సినీ దర్శకురాలు, అవార్డు గ్రహీత కవితా లంకేశ్ ఆమె సోదరి. తండ్రి పి. లంకేశ్ ప్రముఖ వామపక్ష కవి, రచయిత. బెంగళూరు, రాజరాజేశ్వరి నగర్‌లో గౌరీ నివసిస్తున్నారు. 2017 సెప్టెంబరు 4 సాయంత్రం గుర్తు తెలియని దుండగులు ఆమెను ఇంటివద్ద కాల్చి చంపారు.[1]

ప్రజా ఉద్యమం

[మార్చు]

గౌరి లంకేశ్‌ మూఢాచారాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగించారు. సమాజంలోని అసమానతలు, దురాచారాల నిర్మూలనకు నడుం కట్టిన పౌరులకు, వారు సాగించిన ఆందోళనలకూ లంకేశ్‌ పత్రికతో ప్రచారం ఇచ్చారు. గత దశాబ్దమున్నర కాలగమనంలో కన్నడ నాట జరిగిన అనేక ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యారు. లింగాయత వీరశైవ వివాదంలో లింగాయత వాదానికి దన్నుగా నిలిచారు. ఎంగిలాకులపై పొర్లు దండాలు పెట్టించే దుష్ట ఆచారానికి వ్యతిరేకంగా సాగిన పోరాటానికి మద్దతిచ్చారు. బాబాబుడాన్‌ గిరి దత్త పీఠం వివాదంలో సంఘపరివార్‌ శక్తుల దూకుడును అడ్డుగడుగునా అడ్డుకునేందుకు, మత సామరస్య సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. సమ సమాజ స్థాపనకు కాగడాలైన వారి వెలుగుబాటలోనే అడుగులేస్తున్నానని తన విధానాల్ని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రజాందోళనల్లో పాల్గొనే యువ కార్యకర్తల్ని కన్న బిడ్డలుగా భావించారు. దళిత యువజన కార్యకర్త జిగ్నేశ మేవాని, అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకుడు కన్నయ్యలాల్‌ను తన దత్త పుత్రలని చెప్పుకొన్నారు.

అణగారిన వర్గాల కోసం పోరాడే వారిపై ఎనలేని ప్రేమాభిమానాల్ని ప్రదర్శించారు. కేవలం మాటల్లోనే కాకుండా చేతల్లోనూ ప్రదర్శించారు. పత్రికారచనతోపాటు ప్రజాందోళనల క్రియాశీల కార్యకర్త, నేతగానూ జోడు గుర్రాల స్వారీని అప్రతిహతంగా సాగించి రెండు రంగాల్లోనూ చెరగని ముద్ర వేసారు. మూఢనమ్మకాలను తీవ్రంగా వ్యతిరేకించే గౌరి, దేవాలయాల్లో జరిగే మూఢనమ్మకాలను విమర్శిస్తూ ఎన్నో కథనాలు ప్రచురించారు. దీంతో ఓ వర్గం నుండి వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చింది. 2008లో పలువురు హిందుత్వ నాయకులపై రాసిన కథనాలకు గాను రెండు పరువునష్టం కేసు (ఎంపీ ప్రహ్లాద్‌ జోషి, బీజేపీ నేత ఉమేశ్‌ దోషిలు వేసిన)ల్లో కోర్టు ఈమెను దోషిగా పేర్కొంది. ఇందుకు గానూ ఆర్నెల్ల జైలుశిక్షకు ఆదేశించింది. అయితే, అదేరోజు కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Gauri Lankesh honoured with Anna Politkovskaya Award". The Hindu (in Indian English). Special Correspondent. 2017-10-05. ISSN 0971-751X. Retrieved 2017-10-06.{{cite news}}: CS1 maint: others (link)
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-03-04. Retrieved 2017-09-07.