ఘటోత్కచుడు (రాజు)
| ఘటోత్కచుడు | |
|---|---|
| మహారాజ శ్రీ | |
| గుప్త రాజు | |
| పరిపాలన | c. సా.శ. 280 – సా.శ. 319 |
| పూర్వాధికారి | గుప్తుడు |
| ఉత్తరాధికారి | మొదటి చంద్రగుప్తుడు |
| మరణం | c. సా.శ. 319 |
| వంశము | మొదటి చంద్రగుప్తుడు |
| రాజవంశం | గుప్త |
| తండ్రి | గుప్తుడు |
ఘటోత్కచుడు (గుప్త లిపి: ![]()
![]()
![]()
ఘ-టో-త్క-చ, IAST: Ghaṭotkaca, పాలన సుమారు 3వ శతాబ్దం చివరి నుండి - 4వ శతాబ్దం ప్రారంభం వరకు) ఉత్తర భారతదేశంలో సామ్రాజ్యపూర్వ గుప్త రాజు. ఇతను రాజవంశ స్థాపకుడు గుప్తుని కుమారుడు, రాజవంశం మొదటి చక్రవర్తి మొదటి చంద్రగుప్తుని తండ్రి.
ఆధారాలు
[మార్చు]ఘటోత్కచుడు గుప్త రాజవంశ స్థాపకుడు గుప్తుని కుమారుడు. తన తండ్రి వలె, ఘటోత్కచుడు తన సొంత శాసనాల ద్వారా ధృవీకరించబడలేదు. అతని గురించిన తొలి వర్ణన అతని మనవడు సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభం శాసనంలో కనిపిస్తుంది, రాజవంశం తదుపరి అనేక రికార్డులలో అక్షరం పొల్లుపోకుండా పునరావృతమైంది.[2] పూర్వ పండితులు ఒక బంగారు నాణేన్ని, ఒక మట్టి ముద్రను ఇతనికి ఆపాదించారు, అయితే ఇవి ఇప్పుడు ఏకగ్రీవంగా 5వ శతాబ్దపు గుప్త పాలకుడు మొదటి కుమారగుప్తుని కుమారుడు లేదా తమ్ముడు అయిన ఘటోత్కచ-గుప్తునికి కేటాయించబడ్డాయి.[3]
కాలం
[మార్చు]ఆధునిక చరిత్రకారులు గుప్త క్యాలెండర్ శకం ప్రారంభాన్ని సా.శ. 318-319 నాటిదిగా నిర్ధారించారు. ఈ శకం బహుశా గుప్త సింహాసనంపై మొదటి చంద్రగుప్తుని ఆరోహణను సూచిస్తుంది, అంటే ఘటోత్కచుని పాలన ఈ సమయంలో ముగిసింది.[3]
అతని పాలన ప్రారంభం అనిశ్చితంగా ఉంది. అతని పాలన వివిధ అంచనాలు ఇలా ఉన్నాయి:[4]
- ఆర్. కె. ముఖర్జీ: సా.శ. 280-319
- ఎ. ఎస్. అల్తేకర్: సా.శ. 290-305
- తేజ్ రామ్ శర్మ: సా.శ. 295-319
- వి. ఎ. స్మిత్: సా.శ. 300-320
- నాణేల శాస్త్రవేత్త పి. ఎల్. గుప్త, చరిత్రకారుడు ఎస్. ఆర్. గోయల్: సా.శ. 300-319
రాజకీయ స్థితి
[మార్చు]అలహాబాద్ స్తంభం శాసనం ఘటోత్కచుని కుమారుడు మొదటి చంద్రగుప్తునికి వాడిన మహారాజాధిరాజ ("రాజులకు రాజు") అనే బిరుదుకు విరుద్ధంగా, గుప్తుడు, ఘటోత్కచులకు మహారాజ (![]()
![]()
![]()
, "గొప్ప రాజు") అనే బిరుదును ఉపయోగిస్తుంది. తరువాతి కాలంలో, మహారాజ బిరుదును సామంతులైన పాలకులు ఉపయోగించారు, దీని వలన గుప్తుడు, ఘటోత్కచుడు సామంతులైన రాజులు అని సూచించబడింది. అయితే, గుప్త-పూర్వ, గుప్తుల-తరువాతి కాలాల్లో సార్వభౌమాధికారులు మహారాజ బిరుదును ఉపయోగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి, కాబట్టి దీనిని కచ్చితంగా చెప్పలేము. అయినప్పటికీ, గుప్తుడు, ఘటోత్కచుడు మొదటి చంద్రగుప్తుని కంటే తక్కువ హోదా కలిగి ఉన్నారని, తక్కువ శక్తిమంతులని అనడంలో సందేహం లేదు.[5]
పాలన
[మార్చు]ఘటోత్కచుడు లిచ్ఛవి వంశస్థులతో వైవాహిక సంబంధం కుదుర్చుకోవడానికి కారణమై ఉండవచ్చు, దీని ఫలితంగా లిచ్ఛవి యువరాణి కుమారదేవి అతని కుమారుడు మొదటి చంద్రగుప్తునితో వివాహం జరిగింది. చరిత్రకారుడు వి. ఎ. స్మిత్ ఈ సంఘటనను సుమారు సా.శ. 308 నాటిదిగా పేర్కొన్నాడు.[3] గుప్త శాసనాలు కుమారదేవి మినహా రాజవంశం రాణుల పితృ కుటుంబం గురించి ప్రస్తావించలేదు, ఇది చంద్రగుప్తునితో కుమారదేవి వివాహాన్ని గుప్త కుటుంబం ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణించిందని సూచిస్తుంది.[6]
చరిత్రకారుడు హెచ్. సి. రాయచౌధురి పురాణ పాత్ర ఘటోత్కచుని పాపాలను వివరించే కొన్ని మహాభారతం కథలు గుప్త రాజు ఘటోత్కచుని పట్ల గౌరవంతో ఇతిహాసం తుది కూర్పులో వదిలివేయబడ్డాయని సిద్ధాంతీకరించాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ Full inscription, Fleet, John Faithfull (1888). Corpus Inscriptionum Indicarum Vol. 3. pp. 1-17.
- ↑ R. C. Majumdar 1981, p. 6.
- 1 2 3 Ashvini Agrawal 1989, p. 87.
- ↑ Tej Ram Sharma 1989, pp. 49–55.
- ↑ R. C. Majumdar 1981, pp. 6–7.
- ↑ R. C. Majumdar 1981, p. 10.
- ↑ R. C. Majumdar 1981, p. 9.
గ్రంథ పట్టిక
[మార్చు]- Ashvini Agrawal (1989). Rise and Fall of the Imperial Guptas. Motilal Banarsidass. ISBN 978-81-208-0592-7.
- R. C. Majumdar (1981). A Comprehensive History of India. Vol. 3, Part I: A.D. 300-985. Indian History Congress / People's Publishing House. OCLC 34008529.
- Tej Ram Sharma (1989). A Political History of the Imperial Guptas: From Gupta to Skandagupta. Concept. ISBN 978-81-7022-251-4.