ఘరే బైరే
| ఘరే బైరే (1984 బెంగాలీ సినిమా) | |
| దస్త్రం:Dvd ghare baire satyajit ray.jpg పోస్టరు | |
|---|---|
| దర్శకత్వం | సత్యజిత్ రే |
| నిర్మాణం | NFDC |
| రచన | రవీంద్రనాథ్ టాగోర్ నవల ఆధారంగా సత్యజిత్ రే |
| తారాగణం | స్వాతిలేఖ సేన్‌గుప్తా విక్టర్ బెనర్జీ జెన్నిఫర్ కెండాల్ సౌమిత్ర ఛటర్జీ |
| సంగీతం | సత్యజిత్ రే |
| ఛాయాగ్రహణం | సౌమేందు రే |
| కూర్పు | దులాల్ దత్తా |
| పంపిణీ | మ్యాక్స్ వీడియో |
| విడుదల తేదీ | 1984 మే 22 |
| నిడివి | 140 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | బెంగాలీ |
[[వర్గం:1984_బెంగాలీ_సినిమాలు]]
ఘరే బైరే అనేది 1984లో సత్యజిత్ రే రాసి, దర్శకత్వం వహించిన భారతీయ బెంగాలీ భాషా శృంగార చిత్రం. ఈ చిత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందించబడింది. సౌమిత్ర ఛటర్జీ, విక్టర్ బెనర్జీ, స్వాతిలేఖ ఛటర్జీ, జెన్నిఫర్ కెండాల్ ఇందులో నటించారు. ఈ చిత్రంలో జాతీయవాదం, మహిళా విముక్తి, జీవితంపై ఆధ్యాత్మిక, భౌతికవాద దృక్పథం, సంప్రదాయం వర్సెస్ ఆధునికవాదం, ఇతర అంశాల సంక్లిష్ట చిత్రణ ఉంది.[1][2][3][4]
రే తన మొదటి చిత్రం పథేర్ పాంచాలిని తీయడానికి చాలా కాలం ముందు, 1940లలో దాని కోసం ఈ స్క్రిప్టును సిద్ధం చేశాడు. ఈ చిత్రం 1984 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పామే డి'ఓర్ కోసం పోటీలో నిలబడింది.[5] 32వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, ఇది బెంగాలీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
కథాంశం
[మార్చు]ఈ కథ 1907లో సుఖ్‌సయార్‌లోని ధనికుడు, ప్రభావవంతమైన బెంగాలీ కులీనుడూ అయిన నిఖిలేష్ "నిఖిల్" చౌదరి (విక్టర్ బెనర్జీ) ఎస్టేట్‌లో జరుగుతుంది. లార్డ్ కర్జన్ బెంగాల్‌ను ముస్లిం, హిందూ రాష్ట్రాలుగా విభజించిన గందరగోళ పరిణామాలలో, దిగుమతులు భారతీయ పేదరికానికి మూలమని పేర్కొంటూ మొదలైన స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువులను బహిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. నిఖిలేష్ తన కుటుంబంలో పాశ్చాత్య విద్యను పొందిన మొదటి వ్యక్తి. అతనికి ఆధునిక దృక్పథాలు ఉన్నాయి. అతను బిమల (స్వాతిలేఖ సేన్‌గుప్తా) ను పెళ్ళి చేసుకున్నాడు. తన భార్య బిమలకు పియానో, ఇంగ్లీష్ పాటలు నేర్పడానికి మిస్ గిల్బీని నియమించాడు. తన స్నేహితుడు, విప్లవకారుడు, స్వదేశీ ఉద్యమానికి బలమైన మద్దతుదారుడూ అయిన సందీప్ (సౌమిత్ర ఛటర్జీ) కనిపించే వరకూ నిఖిల్, భార్య బిమల, అతని వితంతువు వదినతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. విదేశీ వస్తువులను త్యజించమని నిఖిలేష్‌ను, ఇతర గ్రామస్తులనూ ఒప్పించడానికి సందీప్, సుఖ్‌సయార్ వస్తాడు.
సందీప్ ఉద్వేగభరితుడు, శాంతిని ప్రేమించే, చురుకైన వ్యక్తి. అతను నిష్క్రియాత్మకమైన నిఖిలేష్ కు విరుద్ధంగా ఉంటాడు. నిఖిలేష్ అతన్ని తన భార్య బిమలకు పరిచయం చేస్తాడు. అయితే, సందీప్ బిమల పట్ల ప్రేమలో పడతాడు. ఆమె తనను రోజూ కలవాలని పట్టుబట్టి నిఖిలేష్, బంగళా లోనే ఉండాలని నిర్ణయించుకుంటాడు. అతని పట్ల ఏ అనుమానమూ లేని అమాయకమైన బిమలను అతను సులభంగా ఆకర్షిస్తాడు. ఇంతలో, మిస్ గిల్బీ చర్చి నుండి తిరిగి వస్తున్నప్పుడు స్వదేశీ ఉద్యమంతో సంబంధం ఉన్న ఒక విద్యార్థి ఆమెను కొడతాడు. దీని కారణంగా, ఆమె సుఖ్‌సయార్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటుంది. నిఖిలేష్ తన వదిన ద్వారా, ఇతర సన్నిహితుల ద్వారా సందీప్, బిమలల మధ్య ఏమి జరుగుతుందో తెలుసుకున్నప్పటికీ, అతను పరిణతి చెందినవాడు కాబట్టి, బిమల తానేమి కోరుకుంటోందో ఆమె తెలుసుకోవడానికీ, మరింత ఎదగడానికీ స్వేచ్ఛ ఇస్తాడు. ఎందుకంటే వారి పెళ్ళి ఆమె చిన్నతనం లోనే అయింది. అంతేకాకుండా నిఖిలేష్, బిమలకు ఇంటి లోపల మాత్రమే కాకుండా దాని వెలుపల కూడా ఒక జీవితం ఉండాలని కోరుకుంటున్నానని చెబుతాడు - 1916 లో ఈ నవల రాసినప్పుడు ఇది వివాదాస్పద వైఖరి.
సందీప్ బిమలను స్వదేశీ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని ఒప్పిస్తాడు. ఉద్యమానికి వ్యతిరేకి అయిన నిఖిలేష్‌ను ఒప్పించమని కూడా ఆమెను కోరతాడు. విదేశీ వస్తువులు చౌకగా ఉంటాయనీ, స్వదేశీ వస్తువుల కంటే మెరుగైన నాణ్యమైనవనీ, విదేశీ వస్తువులను నిషేధించినట్లయితే నష్టపోయేది పేదలేననీ, అందుచేత పేద ప్రజలు ఈ ఉద్యమాన్ని భరించలేరనేది నిఖిలేష్ అభిప్రాయం. అందువల్ల, అతను సుఖ్‌సయార్‌లో విదేశీ వస్తువులను నిషేధించడు. సందీప్ ఓటమిని అంగీకరించనప్పటికీ, స్థానిక పేద ముస్లిం అద్దెదారులు కూడా విదేశీ వస్తువులను కొనడం, అమ్మడం ఆపడానికి నిరాకరించడంతో అతడు కొన్ని దుష్ట ప్రణాళికలను రూపొందించడం ప్రారంభిస్తాడు. స్థానిక ముస్లిం వ్యాపారుల నుండి తరచుగా విదేశీ వస్తువులను లాక్కొని, సుఖ్‌సయార్‌లో విదేశీ వస్తువులను తీసుకువెళుతున్న పడవలను మునిగిపోయేలా స్థానిక నిర్వాహకుడికి లంచం ఇచ్చే సమూహాలను అతను సృష్టిస్తాడు. దీని ఫలితంగా హిందువులు, ముస్లింల మధ్య ద్వేషం పెరుగుతుంది. ఇతర ప్రాంతాల ముస్లిం బోధకులు, సుఖ్‌సయార్‌లోని హిందువులు ముస్లింల మధ్య తలెత్తిన ఈ సమస్యల నుండి ప్రయోజనం పొందడం మొదలుపెడతారు. హిందువులపై పేద ముస్లిం రైతులకు ద్వేషాన్ని నూరిపోయడం ప్రారంభిస్తారు.
సందీప్ స్వదేశీ లక్ష్యం కోసం బిమల నుండి డబ్బు డిమాండ్ చేస్తాడు. అనుమానం లేని బిమల అతనికి అవసరమైన డబ్బు ఇస్తుంది. కానీ అతను అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బు డిమాండ్ చేసినట్లు ఆమె ఆ తరువాత గ్రహిస్తుంది. సుఖ్‌సయార్‌లో అతను సమస్యలను సృష్టిస్తున్నాడని కూడా ఆమెకు తెలుస్తుంది. సందీప్ కంటే తన భర్త నిఖిలేష్ తనను నిజంగా ప్రేమిస్తున్నాడని బిమల చివరికి గ్రహిస్తుంది. నిఖిలేష్ ముందు తన చర్యలకు చింతిస్తుంది. అతను ఆమెను క్షమిస్తాడు. సుఖ్‌సయార్‌లో ముస్లింలు, హిందువుల మధ్య అల్లర్లు చెలరేగాయి. నిఖిలేష్ స్వయంగా వెళ్లి రెండు వర్గాల మధ్య అల్లర్లను ఆపాలని నిర్ణయించుకుంటాడు. ఇంతలో, అల్లర్ల గురించి విన్న వెంటనే సందీప్ సుఖ్‌సయార్‌ను వదిలి రైలులో వెళ్ళిపోతాడు. ఉదయం, నిఖిలేష్ చనిపోయి కనిపిస్తాడు. బిమల వితంతువు అవుతుంది.
తారాగణం
[మార్చు]- సౌమిత్ర ఛటర్జీ ... సందీప్ ముఖర్జీ
- విక్టర్ బెనర్జీ ... నిఖిలేష్ "నిఖిల్" చౌదరి
- స్వాతిలేఖ సేన్‌గుప్తా ... బిమలా చౌదరి
- గోపా ఐచ్ ... వదిన
- జెన్నిఫర్ కెండల్ ... మిస్ గిల్బీ (జెన్నిఫర్ కపూర్ గా)
- మనోజ్ మిత్రా ... ప్రధానోపాధ్యాయుడు
- ఇంద్రప్రమిత్ రాయ్ ... అమూల్య
- బిమల ఛటర్జీ ... కులద
- మాస్టర్ అజయ్ ఘోష్
నిర్మాణం
[మార్చు]1940లలో సత్యజిత్ రే ఘరే బైరే కోసం ఒక స్క్రిప్ట్ రాశాడు, కానీ హరిసధన్ దాస్‌గుప్తా దర్శకత్వం వహించాల్సిన ఆ చిత్రం నిర్మాణానికి నోచుకోలేదు. కొన్ని సంవత్సరాల తరువాత రే, మళ్ళీ స్క్రిప్టుపై పనిచేసి, దానిని తిరిగి రూపొందించాడు. అసలు వెర్షన్ "అమెచ్యూరిష్"గా ఉందని అభివర్ణించాడు.[6] సౌమిత్ర ఛటర్జీ అపూర్ సంసార్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత రేతో కలిసి పనిచేశాడు. విక్టర్ బెనర్జీ శత్రంజ్ కే ఖిలారిలో కూడా రేతో కలిసి పనిచేశాడు. అయితే, స్వాతిలేఖ ఛటర్జీ థియేటర్ గ్రూప్ నందికర్‌లో రంగస్థల నటి, ఆమెకు సినిమాల్లో నటించడంలో అనుభవం లేదు. రే ఆమెను ఒక రంగస్థల నిర్మాణంలో చూసి బిమల పాత్రకు ఆమె సరిగ్గ సరిపోతుందని నిర్ణయించుకున్నాడు.[7] 1983లో, ఈ సినిమా షూటింగ్ సమయంలో, రేకు రెండు సార్లు గుండెపోటు వచ్చింది. అతని కుమారుడు సందీప్ రే, తండ్రి సూచనల మేరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేశాడు.
ప్రేక్షకాదరణ
[మార్చు]ఈ చిత్రం మొదట విడుదలైనప్పుడు వాణిజ్యపరంగా బాగానే ఆడింది. రే గుండెపోటు కూడా దీనికి ఒక కారణమై ఉండవచ్చు. మొదటిసారిగా రే చిత్రాలలో ముద్దు దృశ్యం ఉండటం కూడా, భారతీయ ప్రేక్షకుల ఆసక్తికి అదనపు కారణంగా ఉంది.
భారతదేశంలో విమర్శకుల స్పందన మిశ్రమంగా ఉంది. ఇండియా టుడేలో సుమిత్ మిత్రా తన సుదీర్ఘ సమీక్షలో ఈ చిత్రం "కావాలని ఫ్లాప్ తీసినట్లుగా ఉంది" అని అన్నాడు.[8] మిత్రాతో సహా కొంతమంది విమర్శకులు, బిమలగా స్వాతిలేఖ ఛటర్జీని ఎంచుకోవడం తప్పని భావించారు. ఈ చిత్రం విడుదలైన ముప్పై సంవత్సరాల తర్వాత, 2018 లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, ఆమె స్వయంగా ఈ సంగతి చెప్పింది. ఆమె ఇలా అంది: "ఒక విమర్శకుడు `ఆమె, ఆ పాత్ర లాగా ఎప్పుడూ జీవించలేదు, అలా కనిపించనూ లేదు' అని ఒక వాక్యం రాశాడు." ఆ సమీక్షలను చదివిన తర్వాత, చచ్చిపోవాల నిపించిందని ఆమె చెప్పింది.[7]
అయితే, విదేశాల్లో, స్పందన చాలావరకు సానుకూలంగా ఉంది. ఈ చిత్రం కేన్స్‌లో ప్రదర్శించగా, అక్కడ మంచి ఆదరణ లభించింది. రే అనారోగ్యంతో వెళ్ళలేకపోయినా, అతని పట్టుదలతో సౌమిత్ర ఛటర్జీ, స్వాతిలేఖ ఛటర్జీ ఇద్దరూ కేన్స్‌కు వెళ్లారు. తన నటనకు సత్కారం పొందినట్లు ఆమె గుర్తుచేసుకుంది: "... చుట్టూ ఉన్నవారు వచ్చి నన్ను కౌగిలించుకున్నారు."[7]
పౌలిన్ కేల్ ఇలా రాశారు: "చివరికి, స్వాతంత్ర్యం కోరడం పట్ల తన భర్త నుండి [ప్రోత్సాహం పొందిన] బిమల, ఆ స్వాతంత్ర్యాన్ని నిర్లక్ష్యంగా వ్యక్తపరచడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. మహిళల జీవితాల గురించి నిజాయితీ విషయానికి వస్తే, ఈ గొప్ప భారతీయ చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రే ఇరు లింగాల అమెరికన్ యూరోపియన్ దర్శకులను సిగ్గుపడేలా చేస్తాడు." విన్సెంట్ కాన్బీ న్యూయార్క్ టైమ్స్‌లో ఇలా వ్రాశాడు: "గొప్ప దర్శకులందరి రచనల మాదిరిగానే, ది హోమ్ అండ్ ది వరల్డ్ చవకైన వర్గీకరణలను ధిక్కరిస్తుంది. క్లోజప్‌లో, ఇది ఒక ప్రేమకథ. కానీ ఇది ఎంత సంపూర్ణంగా నిర్వచించబడిందంటే, లాంగ్-షాట్‌లో సుదూర క్షితిజంలో కనిపించే సంఘటనలను నాటకీయంగా చూపించడంలో విజయవంతమైనట్లు - జాతీయవాద ఉద్యమానికి నాయకత్వం వహించిన గాంధీ, నిఖిల్ లాగా మర్యాదపూర్వకమైన రాజీ కోసం నిలబడిన ఠాగూర్ల మధ్య రాజకీయ వ్యత్యాసాలతో సహా." నటుల గురించి, అతను ఇలా వ్రాశాడు: "ఈ చిత్రం లోని ముగ్గురు ప్రముఖ నటులూ సమ్మోహనంగా నటించారు."[9] రోజర్ ఎబర్ట్ ఈ సినిమా కథ వాస్తవంగా బిమల హృదయంలో, మనస్సులో జరుగుతుందని రాసాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు: "ఇది ఒక ఆలోచనాభరితమైన సినిమా -- ప్రశాంతమైన, నెమ్మదైన, ఆకస్మికమైన కార్యకలాపాలతో కూడిన సంభాషణల క్రమం." [10]
పురస్కారాలు
[మార్చు]| సంవత్సరం | అవార్డు | వర్గం | నామినీ(లు) | ఫలితం | సూచిక నెం. |
|---|---|---|---|---|---|
| 1984 | కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ | పామ్ డి'ఓర్ | సత్యజిత్ రే | ప్రతిపాదించబడింది | [11] |
| 1985 | నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డులు | అగ్ర విదేశీ సినిమాలు | ఘరే బైరే | గెలుపు | [12] |
| 1985 | జాతీయ చలనచిత్ర అవార్డులు | బెంగాలీలో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ | NFDC, సత్యజిత్ రే | గెలుపు | [13] |
| ఉత్తమ సహాయ నటుడు | విక్టర్ బెనర్జీ | గెలుపు | |||
| ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ | హరుదాస్, బాపుల్దాస్ | గెలుపు | |||
మూలాలు
[మార్చు]- ↑ Ghatpande, Neha (8 May 2017). "Ghare-Baire: Bimala's Transgression Of Boundaries Between The Home And The World". Feminism in India. Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
- ↑ Basu, Sanjukta (18 May 2020). "Gender, Sexuality and Nation – Tagore's Ghare Baire (Home and the World)". This Is My Truth. Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
- ↑ Mahapatra, Anirban (22 March 2020). "What Satyajit Ray's Ghare Baire tells us about our age of aggressive nationalism". The Indian Express. Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
- ↑ Analysis, The (20 March 2022). "Satyajit Ray's Ghare Baire and lessons for India's nationalism". The Analysis. Archived from the original on 31 December 2022. Retrieved 31 December 2022.
- ↑ "Festival de Cannes: Ghare Baire". festival-cannes.com. Archived from the original on 1 October 2012. Retrieved 2009-06-23.
- ↑ "Official Website of Satyajit Ray World: Script Writer". satyajitrayworld.org. Archived from the original on 13 September 2020. Retrieved 1 May 2018.
- 1 2 3 Sen, Zinia (12 January 2017). "I wanted to kill myself after Ghare Baire: Swatilekha Sengupta". The Times of India. Archived from the original on 5 June 2018. Retrieved 4 May 2018.Sen, Zinia (12 January 2017). "I wanted to kill myself after Ghare Baire: Swatilekha Sengupta". The Times of India. Archived from the original on 5 June 2018. Retrieved 4 May 2018.
- ↑ Mitra, Sumit (15 July 1984). "Satyajit Ray's Ghare Baire looks like an intended failure to its last reel". India Today. Archived from the original on 11 May 2018. Retrieved 11 May 2018.
- ↑ Canby, Vincent (21 June 1985). "Movie Review - The home and the World". The New York Times. Archived from the original on 16 August 2023. Retrieved 8 February 2013.
- ↑ "The Home and the World :: rogerebert.com :: Reviews". Chicago Sun-Times. Archived from the original on 27 November 2011. Retrieved 15 February 2013.
- ↑ "37ème Festival International du Film - Cannes". cinema-francais.fr (in ఫ్రెంచ్). Archived from the original on 13 June 2017. Retrieved 5 June 2017.
- ↑ Pauline Kael, State of the Art ISBN 0-7145-2869-2
- ↑ "32nd National Film Awards (PDF)" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 29 October 2013. Retrieved 18 January 2013.