ఘర్షణ (2004 సినిమా)
ఘర్షణ | |
---|---|
దర్శకత్వం | గౌతమ్ మేనన్ |
రచన | గౌతమ్ మేనన్ (కథ, స్క్రీన్ ప్లే) |
నిర్మాత | జి. శివరాజు, సి. వెంకట్రాజు |
తారాగణం | వెంకటేష్, ఆసిన్ |
ఛాయాగ్రహణం | ఆర్. డి. రాజశేఖర్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | హ్యారిస్ జయరాజ్ |
విడుదల తేదీ | జూలై 30, 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఘర్షణ 2004 లో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో విడుదలైన యాక్షన్ కథాచిత్రం.[1][2][3] ఇందులో వెంకటేష్, ఆసిన్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది గౌతమ్ మేనన్ ముందుగా తమిళంలో తీసిన కాక్క కాక్క అనే చిత్రానికి పునర్నిర్మాణం. తమిళంలో సూర్య, జ్యోతిక జంటగా నటించారు. హ్యారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.
కథ
[మార్చు]ఒక అందమైన కొలను ఒడ్డున ఒక గెస్ట్ హౌస్ నుండి ఉన్నట్టుండి ఒక వ్యక్తి ఎగిరి నీళ్ళలో పడతాడు. బుల్లెట్ గాయాలతో నీళ్ళ అడుగుకు చేరుకుంటుండగా అతను అంతరంగం పరిచయం చేసుకోవడం మొదలు పెడుతుంది. అతను రామచంద్ర ఐ. పి. ఎస్ హైదరాబాదు నగరానికి డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీసు (డి.సి.పి). అనాథగా పెరగడం వల్ల, కరుకైన పోలీసు వృత్తిని ఎంచుకున్నందువల్ల అతని మనసు కఠినంగా మారిపోయి అమ్మాయిలంటే దూరంగా ఉంటాడు. అతనికి న్యాయవ్యవస్థ మీద కూడా పెద్దగా నమ్మకం ఉండదు. కరుడు గట్టిన నేరస్థులు చేతికి చిక్కినపుడు వారిని పట్టుకుని చట్టానికి అప్పగించకుండా ఎన్ కౌంటర్ ద్వారా చంపేస్తుంటాడు. ఇతనికి సహకరించడానికి ప్రత్యేకంగా ఓ బృందం కూడా ఏర్పాటు చేసుకుని ఉంటాడు.
ఒకానొక సమయంలో మాయ అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. మాయ ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమె కూడా రామచంద్రతో ప్రేమలో పడుతుంది. కానీ తన వృత్తి వల్ల ఆ అమ్మాయికి హాని కలగవచ్చనే ఉద్దేశంతో ఆమెకు దూరంగా ఉంటుంటాడు. కానీ ఎలాగోలా మనసుకి నచ్చజెప్పుకుని ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.
ఒకానొక ఎన్ కౌంటర్ లో రామచంద్ర ఒరిస్సాకు చెందిన దాస్ అనే ఒక నేరస్థుడిని మట్టుపెడతాడు. అప్పటి నుంచి అతనికి సమస్యలు మొదలవుతాయి. దాస్ తమ్ముడైన పాండా తన అన్న మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అందులో భాగంగా రామచంద్ర బృందంలోని స్నేహితులు, వారి కుటుంబాలను చంపడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. మాయను కూడా అతని మనుషులు అపహరిస్తారు. తన భార్యను రక్షించుకుని పాండాను ఎలా వదిలించుకున్నాడన్నది మిగతా కథ.
నిర్మాణం
[మార్చు]ఈ పాత్రలో అసలైన పోలీసులా కనిపించడం కోసం వెంకటేష్ హైదరాబాద్ పోలీస్ అకాడమీకి వెళ్ళి వాళ్ళ నడవడిని గమనించాడు. శరీరాకృతిని కూడా దానికి తగ్గట్టు మార్చుకున్నాడు. ఈ సినిమాలో మొదటగా కథానాయిక పాత్రకు సోనాలీ బెంద్రేని అనుకున్నారు. తర్వాత ఆ అవకాశం ఆసిన్ కు దక్కింది.
ప్రతినాయక పాత్ర పోషించిన సలీం బేగ్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడమే కాకుండా మరిన్ని సినిమాల్లో అవకాశం లభించింది. ఈ సినిమా పాత్ర పేరు పాండాను తన పేరులో చేర్చుకున్నాడు.
తారాగణం
[మార్చు]- డి. సి. పి రామచంద్ర ఐ. పి. ఎస్ గా వెంకటేష్
- మాయగా ఆసిన్
- రాజేష్ గా రవిప్రకాష్
- పాండాగా సలీం బేగ్
- సత్యం రాజేష్
- డేనియల్ బాలాజీ
- వంశీకృష్ణ
- యానా గుప్తా (ప్రత్యేక నృత్యం)
పాటలు
[మార్చు]హ్యారిస్ జయరాజ్ స్వరపరిచిన ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.[4] అన్ని పాటలు కులశేఖర్ రాశాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాటలు విడుదలయ్యాయి. అందగాడా అందగాడా, ఏ చిలిపి కళ్ళలోన కలవో పాటలు తప్ప మిగతావన్నీ తమిళంలో స్వరపరిచిన బాణీలే వాడుకున్నారు. ఆడతనమా చూడతనమా ఆనే పాటలో యానా గుప్తా ప్రత్యేక నృత్యంలో కనిపిస్తుంది.
క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "చెలియా చెలియా" | కెకె, సుచిత్ర | 5:19 | ||||||
2. | "నన్నే నన్నే చూస్తూ" | టిప్పు, పాప్ షాలిని | 5:53 | ||||||
3. | "ఏ చిలిపి కళ్ళలోన కలవో" | శ్రీనివాస్ | 5:14 | ||||||
4. | "అందగాడా అందగాడా" | హరిణి | 5:20 | ||||||
5. | "ఆడతనమా చూడతనమా" | సునీత సారథి, ఫెబి మణి | 4:48 | ||||||
6. | "థీం మ్యూజిక్" | Instrumental | 2:17 | ||||||
30:12 |
మూలాలు
[మార్చు]- ↑ జి. వి, రమణ. "సినిమా సమీక్ష". idlebrain.com. Retrieved 30 November 2017.
- ↑ "ఘర్షణ సినిమా సమీక్ష". indiaglitz.com. Retrieved 30 November 2017.
- ↑ "ఫుల్ హైదరాబాద్ లో చిత్రసమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 30 November 2017.
- ↑ "పాటలు". naasongs.com. Archived from the original on 19 నవంబరు 2016. Retrieved 30 November 2017.