Jump to content

చందవరం బౌద్ధక్షేత్రం

Coordinates: 15°55′58.5156″N 79°25′40.2240″E / 15.932921000°N 79.427840000°E / 15.932921000; 79.427840000
వికీపీడియా నుండి
చందవరం బౌద్ధక్షేత్రం
చందవరం బౌద్ధక్షేత్రం is located in ఆంధ్రప్రదేశ్
చందవరం బౌద్ధక్షేత్రం
ఆంధ్రప్రదేశ్ లో స్థానం
పటం
ఇతర పేర్లుచందవరం తవ్వకాల ప్రాంతం
స్థానంచందవరం
ప్రాంతంఆంధ్ర ప్రదేశ్
నిర్దేశాంకాలు15°55′58.5156″N 79°25′40.2240″E / 15.932921000°N 79.427840000°E / 15.932921000; 79.427840000
రకంబౌద్ధం, పురావస్తు తవ్వకాల స్థలం
చరిత్ర
నిర్మించినవారుశాతవాహన వంశం[1]
పదార్థాలుసున్నపురాయి
స్థాపన తేదీక్రీ.పు 2 శతాబ్దం నుండి క్రీ. శ 2 శతాబ్దం
సంస్కృతులుబౌద్ధ సంస్కృతి
స్థల గమనికలు
తవకాల తేదీలు1972-77
పురాతత్వవేత్తలువేలూరి వేంకట కృష్ణ శాస్త్రి
స్థితిపునర్నిర్మితము
యజమానిప్రభుత్వ
ప్రజలకు అందుబాటుఅవును

చందవరం గ్రామంలో ఉన్న బౌద్ధక్షేత్రం అతి పురాతన బౌద్ధక్షేత్రాలలో ఒకటి. ఇది ప్రకాశం జిల్లాలో దొనకొండకు ఈశాన్యంలో 10కి.మీ దూరంలో గుండ్లకమ్మ నదీతీరంలో ఉంది. 1967 లో పురాతత్వ పరిశోధన శాఖ ఉద్యోగి వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి పరిశోధన చేసి బౌద్ధక్షేత్రంగా నిర్ణయించాడు. 1972-77 కాలంలో త్రవ్వకాలు జరిపి మహాస్తూపం, 15 సాధారణ స్తూపాలు, 100 చిన్న స్తూపాలు వెలికితీశారు. ఇది శాతవాహనుల పాలనలో క్రీ.పూ 2వ శతాబ్దం - సా.శ. 2 వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది.

చరిత్ర

[మార్చు]

1967 లో చందవరం గ్రామ కరణం శ్రీ కృష్ణావఝల మల్లికార్జున వరప్రసాద శర్మ గారు సింగరకొండ పైన ప్రాచీన కట్టడాలలోని శిల్పాలను ప్రక్కకు తొలగించి ప్రజలు ఇటుకలు తీసుకొనిపోతున్నారని పురాతత్వ పరిశోధన శాఖ సంచాలకులకు లేఖరాయగా, శాఖ తరపున వేలూరి వేంకట కృష్ణ శాస్త్రి పరిశోధన చేసి బౌద్ధక్షేత్రంగా నిర్ణయించాడు. ఇక్కడ కొండశిఖరం మీద రెండస్థుల స్తూపం ఉంది. సాంచి స్తూపం తరువాత స్థానంలో చందవరం బౌద్ధస్తూపం ప్రాధాన్యత కలిగి ఉంది.[2] 1972-77 కాలంలో 4 మార్లు త్రవ్వకాలు జరపబడ్డాయి. 15 సాధారణ స్తూపాలు, 100 చిన్న స్తూపాలు కనుగొనబడ్డాయి[3]. ఇది క్రీ.పూ 2 వ శతాబ్దం - సా.శ. 2 వ శతాబ్ద కాలంలో నిర్మించబడింది.[4] అమరావతి స్కూల్‌లోని శిలాకృతుల ఆధారంగా కూడా ఈ బౌద్ధారామం క్రీ.పూ 2వ (కామన్ ఎరా) శతాబ్దంనాటిదని నిర్ణయించబడింది.[1][5]

త్రవ్వకాలలో లభించిన శాతవాహన నాణాలు ఆధారంగా, సా.శ.1-2 శతాబ్దాలకే ప్రఖ్యాతి పొందినదని తెలుస్తుంది. ఒక చిన్న కుండలో లభించిన 1600 నాణేలకు ఒకవైపు గుర్రం, రెండవవైపు శూన్యంగా ఉంది. ఇవి క్రీ.పూ 2-3 శతాబ్దాలవని అంచనా. సా.శ. 7వ శతాబ్దిలో హ్యూన్సాంగ్ అనే చీనా యాత్రీకుడు వర్ణించిన చుళియే ప్రాంతలోని స్తూపం ఇదేనని అభిప్రాయబడుతున్నారు. అప్పుడు రేనాటి చోళులపరిపాలనలో వున్నందున చుళియే అని వ్యవహరించారు.[4]

ఇది అంధ్రప్రదేశ్‌లో నిర్మించబడిన మొదటి బౌద్ధారామంగా విశ్వసించబడింది. ఇక్కడ బౌద్ధమత సంబంధిత కార్యక్రమాలు చురుకుగా సాగేవి.[6][7] చందవరం బౌద్ధారామం వారణాశి నుండి కంచి వెళ్ళే బౌద్ధసన్యాసులకు విశ్రాంతి ప్రదేశంగా ఉపయోగించబడింది.

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

గుంటూరు - అనంతపురం జాతీయ రహదారి NH544D లో వెల్లంపల్లి ఊరు దగ్గరలో ఈ ప్రదేశం ఉంది. దగ్గరి రైల్వేస్టేషన్ దొనకొండ లో, దగ్గరి విమానాశ్రయాలు కర్నూలు, విజయవాడలో ఉన్నాయి. కురిచేడు నుండి త్రిపురాంతకం పోవు ప్రైవేట్ బస్సులో ఈ ప్రదేశం చేరుకోవచ్చు. ఒంగోలు నుండి దొనకొండ మీదుగా చందవరం చేరుకొని అక్కడినుండి ఆటోల ద్వారా కూడా ఈ ప్రదేశం చేరవచ్చు.

నిర్మాణం

[మార్చు]
చందవరం బౌద్ధస్తూపం
చందవరం బౌద్ధారామం 360 డిగ్రీల వీక్షణ

చందవరం బౌద్ధస్తూపాన్ని శాతవాహన రాజుల పాలనాకాలంలో నిర్మించారు. కొండశిఖరం మీద ఉన్న ఎత్తైన వేదికమీద రెండస్తులుగా స్తూపం నిర్మించబడింది. మహాస్తూపనిర్మాణం హీనయాన బౌద్ధులచేత నిర్మించబడిందని భావించబడుతుంది. మహాస్తూపం 148 అడుగుల వ్యాసార్ధం కలిగివుంది. దీనిని చేరటానికి చక్కని మెట్లవరస నిర్మించబడింది. స్తూప వేదికకు నలు దిక్కులా ఆయకస్తంభాలు నిలబెట్టడానికి నిర్మించిన ఆయక వేదికలున్నాయి. వేదిక పైన అర్ధగోళాకారపు గుమ్మటము, దానిపైన హార్మిక ఉంది. హార్మికపైన నిలబెట్టిన ఛత్రం శిథిలమైంది. గుమ్మటము చుట్టుకొలత 120 అడుగులు ఎత్తు 30 అడుగులు. మహాస్తూపంలో మాహాచైత్య 1.6 మీ ఎత్తు, 60 సెమీ వెడల్పు ఉంటుంది. మహాస్తూపం తక్షిలా (పాకిస్థాన్) లోని ధర్మరాజికా స్తూపాన్ని పోలి ఉంటుంది.

మహాస్తూపం శిలాఫలకాలు సున్నపురాయితో చేయబడింది. మేథి (Drum) విభాగంలో శిలాఫలకాలపై రెక్కలుగల జంతువులు, సింహాలు, పూర్ణకుంభాలు, అగ్ని స్తంభాకృతిలోనున్న బుద్ధునికి ఇరువైపుల నిల్చి ఆరాధిస్తున్న దంపతుల శిల్పాలున్నాయి. గుమ్మటానికి చుట్టూ అతికించిన 10 అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పుస గల శిల్ప పటాలు 30 కి పైగా లభించాయి. ఈ ఫలకాలమీద బుద్ధుని జ్ఞానోదయం, ధర్మచక్రప్రవర్తన, మహాపరినిర్వాణ ఘట్టాలను సూచించే బోధివృక్షం, ధర్మచక్రం, స్తూపాకృతులున్నయి. వేదికపైన శిల్పపటాలను దర్శిస్తూ బౌద్ధమతస్థులు ప్రదక్షిణం చేసేవారు. ఈ స్తూపానికి రెండు అంతస్తులలో (వేదిక, అండం) ప్రదక్షిణపథాలున్నాయి.[4]

తస్కరణ

[మార్చు]
బుద్ధుని ఆరాధకులు శిలాఫలకం (తస్కరింపబడి, తిరిగి పొందబడినది)

1980 లో ప్రదర్శనశాలని నిర్మించి దానిలో ధర్మ చక్రాలు, స్తూప, బోధి చెట్టు శిలాఫలకాలు, జాతక కథల చిత్రాలతో కూడిన ఫలకాలు ప్రదర్శనకు పెట్టారు[3]. 2001లో మూడు స్తంభాలు 9 అడుగుల పొడవైన బుద్ధుని శిల్పం అపహరణకు గురైంది. 2001 మార్చిలో అలంకరణ స్తంభాలు, తామర పతకం అపహరణకు గురైంది. 2002 అక్టోబరులో బోధిచెట్టు, చైత్ర చెక్కబడిన 9 అడుగుల ఫలకాలు సిమెంటు వేదిక నుండి త్రవ్వి తీయబడి మ్యూజియం నుండి తస్కరించబడ్డాయి.[5] ఆ తరువాత ప్రదర్శన వస్తువులను చందవరం గ్రామంలోని పంచాయితీ కార్యాలయంలో భద్రం చేశారు.[3]

16 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా దేశంలోని ప్రదర్శనశాల కొన్న శిలాఫలకం చందవరం నుండి దొంగిలించినది అని తేలడంతో దానిని తిరిగి పంపింది. అయితే ఆంధ్రప్రదేశ్ పురాతత్వ శాఖ దానిని ఆధారం చేసుకొని దొంగిలించినవారి నుండి ఇతర అపహరణ వస్తువులు సేకరించలేదు.[8].

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • "AP Buddhist Places Brochure" (PDF). APTDC. 2016. p. 25. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-02.

మూలాల జాబితా

[మార్చు]
  1. 1.0 1.1 "Chandavaram – Foothold of Buddhist Mahastupa". kostalife.com. the original నుండి 2015-12-08 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-12-01.
  2. "Chandavaram monastic cluster". Monastic Asia. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-12-01.
  3. 3.0 3.1 3.2 "Brief Introduction on Dist. Archaeological Site Museum, Chandavaram, Prakasam District :". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-01.
  4. 4.0 4.1 4.2 డా వి.వి.కృష్ణశాస్త్రి చరిత్ర పురాతత్వ వ్యాసాలు. ఎమెస్కో బుక్స్. 2014. pp. 232–234. ISBN 978-93-83652-79-2.
  5. 5.0 5.1 "Easy pickings". India Today. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-12-01.
  6. "About Chandavaram Excavation Site". Holidayiq.com. the original నుండి 2015-12-10 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-12-01.
  7. "Chandavaram Buddhist site". Discovered India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-12-01.[permanent dead link]
  8. "The Chandavaram Loot – How Andhra Pradesh Is Missing An Opportunity To Go After Heritage Smugglers". Swaraj. 2018-11-19. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-07-01.