Jump to content

చంద్రశేఖర భారతి III

వికీపీడియా నుండి
జగద్గురు శంకరాచార్యులు

చంద్రశేఖర భారతి స్వామి III
శీర్షిక34 వ శృంగేరి జగద్గురు శంకరాచార్యులు
వ్యక్తిగతం
జననం
నరసింహశాస్త్రి

(1892-10-16)1892 అక్టోబరు 16
మరణం1954 సెప్టెంబరు 26(1954-09-26) (వయసు: 61)
చివరి మజిలీశృంగేరిలో నరసింహవనం
మతంహిందూమతం
జాతిదశనామి సంప్రదాయం
Monastic nameస్వామి చంద్రశేఖర భారతి
Templeశృంగేరి శారదా పీఠం
Philosophyఅద్వైత వేదాంతం
Senior posting
Predecessorసచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి
Successorఅభినవ విద్యాతీర్థ
Ordination1912 ఏప్రిల్ 7

స్వామి చంద్రశేఖర భారతి (జననం నరసింహశాస్త్రి; 1892–1954) 1912–1954 మధ్యకాలంలో శృంగేరి శారదా పీఠానికి జగద్గురు శంకరాచార్యులు. ఆయన 20వ శతాబ్దంలో హిందూమతంలో సుప్రసిద్ధులైన ఆధ్యాత్మిక వ్యక్తులలో ఒకడు. భక్తులు ఆయనను జీవన్ముక్తుడిగా పరిగణిస్తారు.

జీవిత చరిత్ర

[మార్చు]

జగద్గురు శంకరాచార్య స్వామి చంద్రశేఖర భారతిగా మారిన నరసింహశాస్త్రి, హిందూ చాంద్రమాన సంవత్సరం నందన మాసంలో (1892 అక్టోబరు 16) అశ్వయుజ కృష్ణ ఏకాదశి నాడు శృంగేరిలో గోపాలశాస్త్రి, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన తన తల్లిదండ్రుల పన్నెండు మంది సంతానంలో చివరివాడు. వారందరిలో బాల్యం దాటి జీవించిన ఏకైక బిడ్డ అతను. ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన విశేషం ఏమిటంటే, జననం, ఉపనయనం, సన్యాసం దేహ విముక్తి (మరణం), అన్నీ ఆదివారాల్లోనే జరిగాయి.

బాల్యదినాలు

[మార్చు]

నరసింహశాస్త్రి బాల్యం శృంగేరిలో గడిచింది. అంతర్ముఖుడైన ఆయనకు సాంఘిక జీవితంపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆయన అప్పటి శృంగేరి మఠం నిర్వాహకుడైన శ్రీకాంతశాస్త్రి ఇంట్లో ఉండేవారు. ఆయన తల్లిదండ్రులు చూడాకర్మ (పదహారు సంస్కారాలలో ఒకటి) నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను ప్రభుత్వం నడిపే స్థానిక ఆంగ్లో-వెర్నాక్యులర్ పాఠశాలకు పంపించారు.

ఆయనకు ఎనిమిదేళ్ల వయసులో బ్రహ్మోపదేశం జరిగింది. ఆయన రోజుకు మూడుసార్లు సంధ్యావందనం, రెండుసార్లు అగ్నికార్యం క్రమం తప్పకుండా చేసేవాడు.

జగద్గురు శంకరాచార్యులైన స్వామి సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి అభిలాష మేరకు, నరసింహ తన పన్నెండవ ఏట శృంగేరిలోని సద్విద్యా సంజీవిని పాఠశాలకు తరలివెళ్లాడు. ఆయన తన శిష్యుని ప్రగతిని నిశితంగా పర్యవేక్షించాడు.

బెంగళూరులో ఉన్నత విద్య

[మార్చు]

శృంగేరి శంకరాచార్యులు 1910లో బెంగళూరులో భారతీయ గీర్వాణ ప్రౌఢ విద్యా వర్ధినీ శాల అనే ఉన్నత వేదాంత శిక్షణా సంస్థను స్థాపించాడు. నరసింహశాస్త్రి ఆ సంస్థలో విద్యార్థిగా ఎంపికయ్యాడు. నరసింహశాస్త్రి 1911లో తన తల్లిదండ్రులతో బెంగళూరుకు తరలివచ్చి, చదువులో నిమగ్నమయ్యాడు. మహామహోపాధ్యాయ వెల్లూరు సుబ్రహ్మణ్యశాస్త్రి, మీమాంస శిరోమణి వైద్యనాథశాస్త్రి ఆయనకు భట్ట దీపిక వంటి గ్రంథాల ద్వారా పూర్వ మీమాంసను బోధించాడు. మహామహోపాధ్యాయ విరూపాక్షశాస్త్రి ఆయనకు వేదాంతాన్ని బోధించాడు. బెంగళూరులో కూడా నరసింహ అంతర్ముఖత్వంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన తన ఖాళీ సమయాన్ని బెంగళూరులోని గావిపురంలో ఉన్న గవి గంగాధరేశ్వర ఆలయంలో ప్రశాంత వాతావరణంలో గడిపేవాడు.[1]

సన్యాసం స్వీకరించడం

[మార్చు]

1912లో జగద్గురు శంకరాచార్య సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి శారదా పీఠంలో నరసింహశాస్త్రిని తన వారసుడిగా నియమించాడు. రామశాస్త్రి అనే భక్తుడు, మైసూర్ మహారాజా IV కృష్ణరాజ వడియార్ IV కి తన వారసుడు పేరును పేర్కొంటూ శంకరాచార్యుల లేఖను వ్యక్తిగతంగా అందజేసే బాధ్యతను అప్పగించాడు. నరసింహశాస్త్రి శృంగేరికి రాకముందే శంకరాచార్యులు దేహ విముక్తిని పొందాడు. కాబట్టి, 1912 ఏప్రిల్ 7 న నరసింహశాస్త్రి స్వామి సత్యానంద సరస్వతి చేత సన్యాస దీక్ష పొంది, స్వామి చంద్రశేఖర భారతి యోగ పట్టా అందుకున్నాడు. అతను సత్యానందుని నుండి కాషాయ వస్త్రాలు, దండ, కమండలాలను అందుకున్నాడు. ఈ విధంగా ఆయన ఆది శంకరాచార్యుల వారి దశనామి సంప్రదాయంలో దీక్ష పొందాడు.

కుంభాభిషేకం, దిగ్విజయం

[మార్చు]

1916లో, శృంగేరిలోని శారదా దేవాలయానికి స్వామి చంద్రశేఖర భారతి కుంభాభిషేకం (ప్రతిష్ఠ) చేశాడు. 1924లో, ఆయన తన మొదటి దిగ్విజయం (పర్యటన) కోసం శృంగేరి నుండి బయలుదేరాడు. మొదట మైసూరు చేరుకుని, తన గురువుగారి ఇంట్లో ఒక ఆలయాన్ని ప్రతిష్ఠించాడు. దానికి అభినవ శంకరాలయం అని పేరు పెట్టారు. తరువాత, శంకరాచార్యులు మైసూరు నుండి నంజనగూడు, చామరాజనగర్ మీదుగా సత్యమంగళంకు వెళ్లాడు. ఆ తర్వాత ఆయన తిరునెల్వేలి, కన్యాకుమారితో సహా తమిళ దేశంలోని దక్షిణ ప్రాంతాలలో పర్యటించాడు. ఆ తర్వాత ఆయన ట్రావన్‌కోర్‌లోని తిరువనంతపురం, కాలడిలో పర్యటించాడు. 1927లో కాలడిలో ఆయన ఒక వేదాంత పాఠశాలను స్థాపించాడు. ఆ తర్వాత కర్ణాటక, ట్రావన్‌కోర్‌లోని మరికొన్ని ప్రదేశాలను సందర్శించి శృంగేరికి తిరిగి వచ్చాడు.

అవధూత స్థితి, అతని వారసుడు పేరు పెట్టడం

[మార్చు]

శృంగేరికి తిరిగి వచ్చిన తరువాత, స్వామి చంద్రశేఖర భారతి అవధూత స్థితిని స్వీకరించాడు. ఆయన ఆత్మ అంతర్గత ఆనందంలో లీనమయ్యాడు. ధ్యానంలో, ఆత్మ చింతనలో ఎక్కువ సమయం గడపడానికి వీలుగా, ఆయన పీఠానికి శ్రీనివాసశాస్త్రి అనే వటువును వారసుడిగా నియమించాడు. 1931, మే 22న, ఆయన శ్రీనివాసశాస్త్రికి సన్యాస దీక్ష ఇచ్చి, శ్రీ అభినవ విద్యాతీర్థ యోగ పట్టాను బహూకరించాడు. 1938 లో స్వామి చంద్రశేఖర భారతి బెంగళూరు, మైసూరు, కాలడిల యాత్ర చేపట్టాడు. శృంగేరికి తిరిగి వచ్చిన తరువాత, ఆయన వేదాంత తరగతులను పునఃప్రారంభించి, మఠం ప్రచురించే 'అస్తికామతసంజీవిని' అనే పత్రికలో ఆలోచనలను రేకెత్తించేలా పాండిత్యంతో కూడిన వ్యాసాలు రాశారు. ఆయన నిజమైన అన్వేషకులకు ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజలకు దర్శనం కల్పించాడు.

చివరి సంవత్సరాలు, దేహ విముక్తి

[మార్చు]

1945 తర్వాత, స్వామి చంద్రశేఖర భారతి క్రమంగా అన్ని కార్యకలాపాల నుండి వైదొలిగారు. అయినప్పటికీ, ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది. 1954 ఆగస్టు 24న, భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శంకరాచార్యులకు నివాళులర్పించడానికి శృంగేరిని సందర్శించాడు. హిందూ గ్రంథాలపై ప్రగాఢ విశ్వాసం ఉన్న భక్తిపరుడైన ఆ రాష్ట్రపతి, స్వామి చంద్రశేఖర భారతితో ధర్మం గురించి, ఇతర అనుబంధ విషయాల గురించీ సంస్కృతంలోనే చర్చించాడు.

కొన్ని రోజుల తరువాత, జగద్గురువు సమాధి చెందారు. 1954, సెప్టెంబరు 26, ఆదివారం నాడు, ఆయన తెల్లవారుజామున లేచి తుంగ నది వైపు నడిచారు; ఒక సేవకుడు కొద్ది దూరంలో ఆయనను అనుసరించాడు. ఆ ప్రదేశంలో నీటి లోతు గురించి సేవకుడు హెచ్చరించినా ఆయన పట్టించుకోకుండా నీటిలోకి అడుగుపెట్టి, ప్రవాహంలోకి మరింత ముందుకు వెళ్లి మునిగారు. ఆ తరువాత ప్రాణాయామం చేసి, మళ్ళీ మునిగారు. ఆచార్యుల శరీరం ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని సేవకుడు చూశాడు. ఆందోళనతో ఆ సేవకుడు నదిలోకి దూకి, ఆచార్యులను పట్టుకున్నాడు, కానీ ఆ ప్రయత్నంలో స్పృహ కోల్పోయాడు. సేవకుని అరుపులు విన్న ఒక పెద్దమనిషి వారిద్దరినీ ఒడ్డుకు చేర్చాడు. సేవకునికి వెంటనే ప్రాణం వచ్చింది కానీ 'మరొకరి విషయంలో ఏమీ చేయలేకపోయారు'. ధ్యానం చేసే సమయంలో ఉన్నట్లుగానే ఆయన శరీరం కాళ్లు ముడుచుకుని నిటారుగా కూర్చున్న భంగిమలో ఉందని, శ్వాసను పునరుద్ధరించే ప్రయత్నంలో మాత్రమే నిటారుగా చేశారని, నీటిలో మునిగిపోవడం గానీ, ఊపిరాడకపోవడం గానీ, లేదా ప్రాణాల కోసం పోరాడిన ఆనవాళ్లు ఏవీ లేవని తెలిసింది. జగద్గురువు భౌతికకాయం నరసింహవనంలో, ఆయన గురువు గారి సమాధి పక్కనే ఉన్న ఒక సమాధిలో కొలువుదీరింది. ఏటా ఆ రోజు మహాలయ అమావాస్య రోజునే వస్తుంది; ఆ రోజే నవరాత్రి ఉత్సవాలకు సన్నాహకంగా శారదకు వార్షిక అభిషేకం జరుగుతుంది. ఆయన జననం, ఉపనయనం, సన్యాసం, దేహ విముక్తి అన్నీ ఆదివారాల్లోనే జరిగాయి.

రచనలు

[మార్చు]

స్వామి చంద్రశేఖర భారతి కొన్ని పద్యాలు రచించి, ఒక ప్రసిద్ధ వ్యాఖ్యానాన్ని రాశారు. ఆయన ప్రధాన రచనలు:

  • సుమారు 400 పుటలలో 36 రచనలు కలిగిన గురురాజ సూక్తి మాలిక. దీన్ని సంస్కృతం తమిళంలో ముద్రించారు.
  • సంస్కృతంలో శ్రీ శారదా దండకం, శృంగేరి పీఠాధిపతి- శ్రీ శారదాంబను కీర్తిస్తూ
  • వివేకచూడామణిపై భాష్య (వ్యాఖ్య), శ్రీ ఆద్యశంకరాచార్యులకి ఆపాదించబడిన అద్వైత గ్రంథం

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Sages of Sringeri, A Tattvaloka Publication, Shri Sharada Peetham, Shringeri, 2005.

వనరులు

[మార్చు]