చంద్ర గ్రహణం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మార్చి 3, 2007 నాటి చంద్ర గ్రహణం.
సంపూర్ణ చంద్ర గ్రహణం

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.

చంద్రగ్రహణానికి కావలసిన పరిస్థితులు[మార్చు]

చంద్రగ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.

  • చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
  • చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
  • నిండు పౌర్ణమి రాత్రి వుండాలి.
  • చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది.

చంద్రగ్రహణం ఏర్పడిన తేదీలు[మార్చు]

  • 2008 ఫిబ్రవరి 21 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది.
  • 2008 ఆగస్టు 16న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడవచ్చు.
  • సంపూర్ణ చంద్రగ్రహణం, 2010 డిసెంబరు 21 వ తేదీన చూడవచ్చని శాస్త్రవేత్తల అంచనా.
  • 2011 డిసెంబరు 10 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది
  • 2015 ఏప్రిల్ 4 న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది

కొన్ని విశేషాలు[మార్చు]

చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.

రకాలు[మార్చు]

భూమి యొక్క నీడను ఛాయ మరియు ప్రచ్ఛాయ అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఛాయ అనగా సూర్యుకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగము. దీనివలన సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. ప్రచ్ఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగించబడిన ప్రాంతం. దీనివలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి యొక్క ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని పాక్షిక చంద్రగ్రహణం అనీ పూర్తిగా భూమి ఛాయలోకి ప్రవేశించినపుడు దానిని సంపూర్ణ చంద్రగ్రహణం అనీ వ్యవహరిస్తారు.

ఇవీ చూడండి[మార్చు]

చిత్రమాలిక[మార్చు]