చక్ దే! ఇండియా
| చక్ దే! ఇండియా | |
|---|---|
సినిమా పోస్టర్ | |
| దర్శకత్వం | షిమిత్ అమిన్ |
| రచన | జైదీప్ సాహ్ని |
| నిర్మాత | ఆదిత్య చోప్రా |
| తారాగణం | షారూఖ్ ఖాన్ |
| ఛాయాగ్రహణం | సుదీప్ ఛటర్జీ |
| కూర్పు | అమితాభ్ శుక్లా |
| సంగీతం | సలీం-సులైమాన్ |
నిర్మాణ సంస్థ | యశ్ రాజ్ ఫిల్మ్స్ |
| పంపిణీదార్లు | యశ్ రాజ్ ఫిల్మ్‌స్ |
విడుదల తేదీ | 2007 ఆగస్టు 10 |
సినిమా నిడివి | 149 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹20 కోట్లు[1] |
| బాక్సాఫీసు | ₹109 కోట్లు[2] |
చక్ దే! ఇండియా (Chak De! India) అనేది 2007లో విడుదలైన ఒక భారతీయ హిందీ క్రీడా నేపథ్య చిత్రం. దీనికి షిమిత్ అమిన్ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించాడు. భారత పురుషుల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు మాజీ కెప్టెన్ కబీర్ ఖాన్ పాత్రలో షారూఖ్ ఖాన్ నటించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత, మతపరమైన వివక్ష కారణంగా ఖాన్ క్రీడా ప్రపంచం నుండి వెలివేయబడతాడు. ఏడు సంవత్సరాల తరువాత, తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో, అతను భారత మహిళల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపడతాడు. పరస్పర విబేధాలు ఉన్న 16 మంది క్రీడాకారిణులను ఒక విజేత జట్టుగా మార్చడమే లక్ష్యంగా ఈ సినిమా సాగుతుంది.
సినిమా రచయిత జైదీప్ సాహ్ని, 2002 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జాతీయ ఫీల్డ్ హాకీ జట్టు సాధించిన విజయం గురించి వార్తాపత్రికలో చదివి, చక్ దే! ఇండియా కథను రూపొందించడానికి ప్రేరణ పొందాడు. ఈ చిత్ర స్క్రీన్‌ప్లే కల్పితమైనది; ఇందులోని పాత్రలు నిజమైన జట్టు, కోచ్‌ల నుండి ప్రేరణ పొందినప్పటికీ, సాహ్ని వాటిని స్వయంగా సృష్టించాడు. కబీర్ ఖాన్ పాత్ర ఎదుర్కొనే ఇబ్బందులు వాస్తవ జీవిత హాకీ క్రీడాకారుడు మీర్ రంజన్ నేగి జీవితానికి దగ్గరగా ఉన్నప్పటికీ, స్క్రిప్ట్ రాసే సమయంలో నేగి ఎదుర్కొన్న సమస్యల గురించి సాహ్నికి తెలియదు. అప్పటి మహిళా హాకీ జట్టు కోచ్ మహారాజ్ క్రిషన్ కౌశిక్ సూచన మేరకు, సాహ్ని నేగిని చిత్ర నిర్మాణ బృందంలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. పదహారు మంది జట్టు సభ్యుల కోసం వృత్తిపరమైన క్రీడాకారులను, నటులను ఎంపిక చేశారు; నటులకు హాకీలో, క్రీడాకారులకు నటనలో శిక్షణ ఇవ్వడానికి వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కౌశిక్, నేగి ఆరు నెలల పాటు సాహ్ని, ఖాన్, ఇతర నటీనటులకు శిక్షణ ఇచ్చారు. చిత్రంలోని క్రీడా సన్నివేశాలకు రాబ్ మిల్లర్ కొరియోగ్రఫీ చేయగా, సలీం-సులైమాన్ సంగీతం అందించారు. సాహ్ని పాటలు వ్రాశాడు.
చక్ దే! ఇండియా చిత్రం భారతదేశ 60వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 10 ఆగస్టు 2007న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ₹20 కోట్ల (US$4.84 మిలియన్లు) బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ₹109 కోట్లు (US$26.36 మిలియన్లు) వసూలు చేసి, 2007లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ హిందీ చిత్రంగా నిలిచింది. విడుదలైనప్పటి నుండి ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా దర్శకత్వం, కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు, ఫెమినిస్ట్ అంశాలు, ఇంకా నటీనటుల నటనపై ప్రశంసల వర్షం కురిసింది. అందులోనూ షారూఖ్ ఖాన్ నటనకు విశేష గుర్తింపు లభించింది.
అనేక పురస్కారాలను అందుకున్న చక్ దే! ఇండియా, 55వ జాతీయ చలనచిత్ర అవార్డులలో 'అత్యుత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం' కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకుంది. 53వ ఫిలింఫేర్ అవార్డులలో ఈ చిత్రం ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు (అమిన్), ఉత్తమ సహాయ నటి (శుక్లా)తో సహా 10 విభాగాల్లో నామినేషన్లను పొంది, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్), ఉత్తమ నటుడు (షారుఖ్ ఖాన్) వంటి 5 కీలక అవార్డులను కైవసం చేసుకుంది.
"చక్ దే! ఇండియా" టైటిల్ సాంగ్ ప్రస్తుతం భారతదేశంలో ఒక స్పోర్ట్స్ ఆంథమ్ (క్రీడా గీతం)గా ప్రాచుర్యం పొందింది.[3][4]
కథ
[మార్చు]చక్ దే! ఇండియా సినిమా ఢిల్లీలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఆట చివరి నిమిషాల్లో పాకిస్థాన్ 1-0 ఆధిక్యంలో ఉంటుంది. భారత జట్టు కెప్టెన్ కబీర్ ఖాన్‌పై ఫౌల్ జరగడంతో, అతనికి పెనాల్టీ స్ట్రోక్ లభిస్తుంది. అయితే, అతను కొట్టిన షాట్ లక్ష్యాన్ని తప్పడంతో భారత్ మ్యాచ్‌లో ఓడిపోతుంది. ఆ తర్వాత కొద్దిసేపటికే, ఖాన్ పాకిస్థాన్ కెప్టెన్‌తో కరచాలనం చేస్తూ, ఆలింగనం చేసుకున్న ఫోటోను మీడియా ప్రసారం చేస్తుంది. ఆ క్రీడా స్ఫూర్తితో కూడిన చర్యను తప్పుగా అర్థం చేసుకున్న జనం, పాకిస్థాన్ పట్ల సానుభూతితోనే ఖాన్ కావాలని మ్యాచ్‌ను ఓడించాడని అనుమానిస్తారు.[5][6] మతపరమైన వివక్ష కారణంగా అతను తన తల్లితో కలిసి ఊరు విడిచి వెళ్లాల్సి వస్తుంది.[5][6][7]
ఏడు సంవత్సరాల తర్వాత, భారత హాకీ అసోసియేషన్ హెడ్ త్రిపాఠి, మహిళల హాకీ జట్టు గురించి చర్చించడానికి హాకీ ప్రతిపాదకుడు ఉత్తమ్ సింగ్‌తో సమావేశమవుతాడు. త్రిపాఠి అభిప్రాయం ప్రకారం, మహిళలకు భవిష్యత్తులో మిగిలేది కేవలం వంట వండటం, ఇల్లు శుభ్రం చేయడం మాత్రమే, కాబట్టి ఈ జట్టుకు భవిష్యత్తు లేదు. అయితే, ఖాన్ ఈ జట్టుకు కోచ్‌గా రావాలనుకుంటున్నారని ఉత్తమ్ అతనికి చెబుతాడు. మొదట సందేహించినప్పటికీ, త్రిపాఠి చివరికి ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తాడు.
తీవ్రమైన పోటీతత్వం, ప్రాంతీయ వివక్షలతో విడిపోయిన 16 మంది యువతుల బృందానికి ఖాన్ బాధ్యత వహిస్తాడు. హర్యానా గ్రామీణ ప్రాంతానికి చెందిన కోమల్ చౌతాలా, చండీగఢ్‌కు చెందిన ప్రీతి సబర్వాల్‌తో గొడవ పడుతుంది; పంజాబ్‌కు చెందిన కోపిష్టి బల్బీర్ కౌర్, జార్ఖండ్‌లోని మారుమూల గ్రామాల నుండి వచ్చిన రాణి డిస్పోటా, సోయ్‌మోయ్ కెర్కెటాలను వేధిస్తుంది. ఈశాన్య భారత రాష్ట్రాలైన మిజోరంకు చెందిన మేరీ రాల్టే, మణిపూర్‌కు చెందిన మోలీ జిమిక్ లు జాతి వివక్షను, అలాగే కొందరు వ్యక్తుల నుండి లైంగిక వేధింపులను కూడా ఎదుర్కొంటారు. జట్టు కెప్టెన్ విద్యా శర్మ హాకీకి, తన భర్త రాకేష్ కుటుంబ సభ్యుల ఇష్టానికి మధ్య ఒకదానిని ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక ప్రీతి కాబోయే భర్త ,అభిమన్యు సింగ్ భారత జాతీయ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, వారి భవిష్యత్తులో హాకీకి ప్రాముఖ్యత లేదని దానిని తేలికగా తీసిపారేస్తాడు.
అమ్మాయిలు తమ మధ్య ఉన్న విభేదాలను అధిగమిస్తేనే వారిని విజేతలుగా మార్చగలనని ఖాన్ గ్రహిస్తాడు. కోచ్‌గా తన మొదటి కొన్ని రోజులలో, అత్యంత అనుభవం ఉన్న బింద్యా నాయక్ సహా తన నిబంధనలను పాటించని పలువురు ఆటగాళ్లను అతను బెంచ్‌కే పరిమితం చేస్తాడు. దీనికి ప్రతిగా, ఖాన్‌ను ఎదిరించమని బింద్యా మిగిలిన ఆటగాళ్లను పదేపదే ప్రోత్సహిస్తుంది. ఆమె చివరకు విజయం సాధించడంతో, ఖాన్ కోపంతో రాజీనామా చేస్తాడు; అయితే, వెళ్లే ముందు సిబ్బందిని, జట్టును మెక్‌డొనాల్డ్స్‌లో విందుకు ఆహ్వానిస్తాడు. ఆ విందు సమయంలో, స్థానిక అబ్బాయిలు మేరీని వేధిస్తారు; బల్బీర్ వారిపై దాడి చేయడంతో, ఆ అబ్బాయిలకు, జట్టుకు మధ్య పెద్ద గొడవ మొదలవుతుంది. వారంతా మొదటిసారిగా ఒక జట్టుగా కలిసి పోరాడటాన్ని గమనించిన ఖాన్, సిబ్బంది ఎవరూ జోక్యం చేసుకోకుండా అడ్డుకుంటాడు; కేవలం ఒక వ్యక్తి క్రికెట్ బ్యాట్‌తో ఒక క్రీడాకారిణిని వెనుక నుండి కొట్టబోతుంటే మాత్రం అతన్ని అడ్డుకుంటాడు. ఈ గొడవ తర్వాత, ఆ మహిళలు ఖాన్ ఉద్దేశాలను అర్థం చేసుకుని, తమకు కోచ్‌గానే కొనసాగమని అతన్ని కోరుతారు.
జట్టు కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. మహిళల జట్టును వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా పంపడానికి త్రిపాఠి నిరాకరించినప్పుడు, ఖాన్ పురుషుల జట్టుతో మ్యాచ్ ఆడాలని ప్రతిపాదిస్తాడు. ఆ మ్యాచ్‌లో మహిళల జట్టు ఓడిపోయినప్పటికీ, వారి ప్రతిభను చూసి త్రిపాఠి వారిని ఆస్ట్రేలియా పంపడానికి అంగీకరిస్తాడు. తనని కాదని విద్యను కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు బింద్యా ఖాన్‌పై కోపంగా ఉంటుంది. ఆమె ప్రవర్తన కారణంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 7–0తో ఘోరంగా ఓడిపోతుంది. మైదానంలో ఆమె ప్రవర్తన గురించి ఖాన్ ప్రశ్నించినప్పుడు, ఆమె అతన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఖాన్ దానిని తిరస్కరించి, బింద్యాను ఆటకు దూరంగా ఉండమని ఆదేశిస్తాడు. ఖాన్ శిక్షణ కొనసాగించడంతో జట్టు ఇంగ్లాండ్, స్పెయిన్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, అర్జెంటీనాలపై విజయం సాధిస్తుంది. సౌత్ కొరియాతో మ్యాచ్‌కు ముందు, ఖాన్ బింద్యా దగ్గరకు వెళ్లి మళ్ళీ ఆడమని కోరుతాడు. కొరియన్ జట్టు అనుసరించే 'మ్యాన్ టు మ్యాన్ మార్కింగ్' వ్యూహాన్ని ఛేదించి మ్యాచ్ గెలవాలని చెబుతాడు. బింద్యా మైదానంలోకి దిగి, గుంజన్ లఖానీ సహాయంతో సౌత్ కొరియాను ఓడించి, జట్టును ఫైనల్స్‌కు చేరుస్తుంది.
ఫైనల్‌లో భారత్ మళ్ళీ ఆస్ట్రేలియాతోనే తలపడాల్సి వస్తుంది. జట్టు ప్రయోజనం కోసం కోమల్, ప్రీతిలు తమ విభేదాలను పక్కన పెట్టాలని ఖాన్ కోరతాడు. అభిమన్యుకు తన సత్తా చాటాలని, టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలవాలని ప్రీతి పట్టుదలతో ఉంటుంది. ఆట ముగియడానికి కొన్ని నిమిషాల ముందు భారత జట్టు 1-2తో వెనుకబడి ఉన్న సమయంలో, కోమల్ బంతిని ప్రీతికి పాస్ చేస్తుంది; ప్రీతి గోల్ కొట్టడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారితీస్తుంది. షూటౌట్‌లో మొదట 2-0తో వెనుకబడినప్పటికీ, అద్భుతంగా పుంజుకుని 3-2తో విజయం సాధించి, అన్ని అడ్డంకులను అధిగమించి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంటారు. జట్టు తిరిగి స్వదేశానికి చేరుకున్నప్పుడు, వారి కుటుంబ సభ్యులు వారిని ఎంతో గౌరవంతో చూస్తారు. తనపై ఉన్న నిందలు తొలిగిపోయి గౌరవం తిరిగి రావడంతో, కబీర్ ఖాన్ తన తల్లితో కలిసి తన సొంత ఊరికి, పూర్వీకుల ఇంటికి తిరిగి వెళ్తాడు; అక్కడ ప్రజలు అతన్ని మళ్ళీ గౌరవించడం ప్రారంభిస్తారు.
తారాగణం
[మార్చు]సినిమా విడుదలైన కొద్ది కాలానికే, క్రీడాకారిణులుగా నటించిన 16 మంది నటీమణులను మీడియా "చక్ దే! గర్ల్స్" అని పిలవడం ప్రారంభించింది.[8][9] స్క్రీన్ అవార్డుల న్యాయనిర్ణేతల బృందం కూడా ఇదే పదాన్ని ఉపయోగిస్తూ, 2008లో జరిగిన 14వ స్క్రీన్ అవార్డ్స్ వేడుకలో ఈ "చక్ దే! గర్ల్స్" అందరికీ కలిపి 'ఉత్తమ సహాయ నటి' అవార్డును అందించింది.[10]
జట్టు
[మార్చు]| నటుడు | పాత్ర. | రాష్ట్రం లేదా నగరం | స్థానం, సంఖ్య |
|---|---|---|---|
| షారుఖ్ ఖాన్ | కబీర్ ఖాన్ | భారత్ | ప్రధాన కోచ్ |
| విద్యా మాల్వాడే | విద్యా శర్మ | మధ్యప్రదేశ్[11] | కెప్టెన్, గోల్ కీపర్ (18) [11] |
| శిల్పా శుక్లా | బిందియా నాయక్ | మహారాష్ట్ర[11] | సెంటర్ హాఫ్ (5) [11] |
| నికోలా సెక్వీరా | నికోలా సెక్వీరా | యుటిలిటీ ప్లేయర్ (12) [8] | |
| సాగరికా ఘాట్గే | ప్రీతి సబర్వాల్ | చండీగఢ్[11] | సెంటర్ ఫార్వర్డ్ (9) [11] |
| చిత్రషి రావత్ | కోమల్ చౌతాలా | హర్యానా[11] | రైట్ ఇన్ (8) [11] |
| తాన్యా అబ్రోల్ | బల్బీర్ కౌర్ | పంజాబ్[11] | ఫుల్ బ్యాక్ (3) [11] |
| శుభీ మెహతా | గుంజన్ లఖానీ | ఆంధ్రప్రదేశ్[11] | రైట్ హాఫ్ (4) [11] |
| సాండియా ఫుర్టాడో | నేత్రారెడ్డి | లెఫ్ట్ ఔట్(11) [11] | |
| అనిత నాయర్ | అలియా బోస్ | పశ్చిమ బెంగాల్[11] | రైట్ ఔట్ (7) [11] |
| ఆర్య మీనన్ | గుల్ ఇక్బాల్ | ఉత్తర ప్రదేశ్[11] | లెఫ్ట్ ఇన్ (10) [11] |
| కిమి లాల్డావ్లా | మేరీ రాల్టే | మిజోరం[11] | పెనాల్టీ స్పెషలిస్ట్ (15) [11] |
| మసోచోన్ జిమిక్ | మోలీ జిమిక్ | మణిపూర్[11] | లెఫ్ట్ హాఫ్ (6) [11] |
| కింబర్లీ మిరాండా | రచనా ప్రసాద్ [12] | బీహార్[12] | యుటిలిటీ ప్లేయర్ (14) [8] |
| సీమా అజ్మీ | రాణి డిస్పోటా | జార్ఖండ్[11] | రైట్ డిఫెండర్ (2) [11] |
| నిషా నాయర్ | సోయిమోయ్ కెర్కేటా | సబ్స్టిట్యూట్ (17) [11] | |
| రేనియా మాస్చెర్నాస్ | రేనియా ఫెర్నాండెజ్ [12] | గోవా | యుటిలిటీ ప్లేయర్ (16) [8] |
సహాయక తారాగణం
[మార్చు]- అంజన్ శ్రీవాస్తవ -భారత హాకీ అధికారి విశాల్ త్రిపాఠి
- విభా చిబ్బర్ - భారత మహిళల ఫీల్డ్ హాకీ జట్టుకు అసిస్టెంట్ కోచ్ కృష్ణాజీ
- జావేద్ ఖాన్ - సుఖ్‌లాల్
- మోహిత్ చౌహాన్ - ఉత్తమ్ సింగ్ కబీర్ మాజీ హాకీ సహచరుడు, స్నేహితుడు
- వివాన్ భటేనా - భారత జాతీయ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, ప్రీతి కాబోయే భర్త అభిమన్యు సింగ్
- నకుల్ వైద్ - విద్యా భర్త రాకేష్ శర్మ
- జోయ్‌శ్రీ అరోరా -కబీర్ తల్లి
- రమాకాంత్ దయామ - అసోసియేషన్ సభ్యుడి
- రియో కపాడియా - వ్యాఖ్యాత
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]2002 కామన్వెల్త్ క్రీడలలో భారత మహిళల హాకీ జట్టు సాధించిన విజయం గురించి వచ్చిన ఒక చిన్న కథనం, స్క్రీన్‌రైటర్ జైదీప్ సాహ్నిని ఈ సినిమా రూపొందించడానికి ప్రేరేపించింది. ఆయన కబీర్ ఖాన్ పాత్రను హాకీ కోచ్ మహారాజ్ క్రిషన్ కౌశిక్ స్ఫూర్తితో తీర్చిదిద్దాడు. కథాంశాన్ని విన్న తర్వాత, 1982 ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌పై కావాలనే మ్యాచ్ ఓడిపోయారనే ఆరోపణలు ఎదుర్కొన్న హాకీ క్రీడాకారుడు మీర్ రంజన్ నేగిని కలవమని సాహ్నికి కౌశిక్ సూచించాడు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగంలో షారూఖ్ ఖాన్ మాట్లాడుతూ, "చక్ దే!" అనే పదం వాస్తవానికి "సిక్కు సైనికులు తమ యుద్ధ యాత్రల్లో శత్రువులపై పోరాడుతూ, నదులపై వంతెనలు నిర్మించడానికి మొద్దులను ఎత్తేటప్పుడు చేసే ఒక స్ఫూర్తిదాయకమైన యుద్ధ నినాదం" అని తెలిపాడు. దీని అర్థం "లేచి, పనిని విజయవంతంగా పూర్తి చేయాలనే పట్టుదల."[13]
సాహ్ని ప్రకారం, ఆయన స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నేగి పడిన కష్టాల గురించి ఆయనకు తెలియదు. నేగి జీవితంతో ఉన్న పోలికలన్నీ కేవలం యాదృచ్ఛికం మాత్రమే.[14] దీనికి నేగి కూడా అంగీకరిస్తూ, "నేను అనవసరమైన ప్రచారం కోరుకోవడం లేదు. ఈ సినిమా మీర్ రంజన్ నేగి జీవితంపై తీసిన డాక్యుమెంటరీ కాదు. నిజానికి ఇది నిరాశలో ఉన్న ఒక అమ్మాయిల బృందం, విజేతలుగా ఎలా ఎదిగారు అనే కథ" అని పేర్కొన్నాడు.[15][16] కబీర్ ఖాన్ పాత్రను నేగితో పోలుస్తూ వచ్చిన మీడియా కథనాలపై సాహ్ని స్పందిస్తూ: "మా స్క్రిప్ట్ ఏడాదిన్నర క్రితమే పూర్తయింది. మహిళా అథ్లెట్ల గురించి తీసిన ఒక చిత్రం, ఇప్పుడు కేవలం నేగి గురించిన అంశంగా మారిపోవడం చాలా దురదృష్టకరం" అని అన్నాడు.[17]
పాత్రలు
[మార్చు]
మొదట ఈ ప్రధాన పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినప్పటికీ, ఈ చిత్రం తన శైలి కాదని భావించి ఆయన దీనిని తిరస్కరించాడు. "అది చాలా సీరియస్ సినిమా, నేనేమో ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నాను" అని అతడు పేర్కొన్నాడు. మొదట్లో కరణ్ జోహార్ యొక్క 'కభీ అల్విదా నా కెహ్నా', ఫర్హాన్ అక్తర్ 'డాన్' చిత్రాల డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈ సినిమాను వదులుకున్న షారూఖ్ ఖాన్, ఆ తర్వాత కబీర్ ఖాన్ పాత్రకు ఖరారయ్యాడు.[18][19] షారూఖ్ తన కళాశాల రోజుల్లో హాకీ ఆడేవాడు, అది కూడా ఆయన ఈ పాత్రను అంగీకరించడానికి ఒక కారణం.[20] షారూఖ్ ఖాన్‌కు ఉన్న సాధారణ 'రొమాంటిక్ హీరో' ఇమేజ్‌కు భిన్నంగా ఉండటం, సినిమాలో ఆయనకు జోడీగా కథానాయిక లేకపోవడం, ఆయన పాడే పాటలు లేకపోవడంతో, మీడియా ఈ పాత్రను 'ఆఫ్-బీట్' (భిన్నమైనది) అని పేర్కొంది.[9]
హాకీ క్రీడాకారిణులుగా 16 మంది నటీమణులను ఎంపిక చేసే ప్రక్రియకు ఆరు నెలలకు పైగా సమయం పట్టింది. ఈ ఎంపిక ప్రక్రియ గురించి అమిన్ వివరిస్తూ, ఇది "చాలా కష్టతరమైనదీ, ఎంతో శ్రమతో కూడుకున్నదీనూ. ఎందుకంటే వారికి ఆడటంతో పాటు నటించడం కూడా వచ్చి ఉండాలి" అని పేర్కొన్నాడు. నటీమణుల కోసం నాలుగు నెలల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు; అక్కడ వారు ఆట నియమాలను నేర్చుకోవడంతో పాటు, నటనలో పాఠాలు తీసుకున్నారు. శిక్షణ సమయంలో కఠినమైన ఆహార నియమాలను పాటించారు. ఈ సమయంలో భద్రతా పరమైన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు.[21] అమిన్ ప్రకారం, నటులకు హాకీ ఆడటం నేర్పించడం "క్లిష్టమైన పని", అలాగే హాకీ క్రీడాకారులుగా ఉండి ఎంపికైన వారు నటనను నేర్చుకోవాల్సి వచ్చింది.[9] చిత్రషి, సాండియా, రేనియా వంటి కొందరు నటీమణులను వారు అప్పటికే హాకీ క్రీడాకారులు కావడంతో ఈ సినిమాలోకి తీసుకున్నారు.[22]
రాబ్ మిల్లర్ స్పోర్ట్స్ యాక్షన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ క్రీడా సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేశాడు. అలాగే నటీనటులకు శిక్షణ ఇవ్వడంలో నేగితో కలిసి పనిచేశారు.[23][24] షారూఖ్ ఖాన్‌తో కలిసి పనిచేయడం గురించి నేగి గుర్తుచేసుకుంటూ, "షారూఖ్ మిస్ చేసిన పెనాల్టీ స్ట్రోక్‌తో సహా ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేశాం. ఆ ఒక్క షాట్ తీయడానికే మాకు దాదాపు 20 గంటల సమయం పట్టింది, ఎందుకంటే ఆ సన్నివేశం చాలా సహజంగా ఉండాలని నేను పట్టుబట్టాను" అని తెలిపాడు.[25]
నేపథ్య సంగీతం
[మార్చు]చక్ దే! ఇండియా చిత్రానికి పాటలు, నేపథ్య సంగీతాన్ని సలీం-సులైమాన్ ద్వయం సమకూర్చారు. నటుడు షారూఖ్ ఖాన్‌తో ఈ సంగీత ద్వయానికి ఇదే మొదటి కలయిక. ఈ చిత్రంలోని అన్ని పాటలకు జైదీప్ సాహ్ని సాహిత్యం అందించాడు. ఈ ఆల్బమ్‌లో మొత్తం ఏడు ట్రాక్‌లు ఉన్నాయి, ఇందులో ఒక రీమిక్స్ సాంగ్, షారూఖ్ ఖాన్ చెప్పిన ఒక డైలాగ్ కూడా ఉన్నాయి. ఈ ఆల్బం 11 జూలై 2007న విడుదలైంది. విడుదలైన తర్వాత ఆల్బమ్ యొక్క 11,00,000 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది భారతీయ వాణిజ్య వెబ్సైట్ బాక్స్ ఆఫీస్ ఇండియా ప్రకారం, ఆ సంవత్సరంలో అత్యధికంగా అమ్ముడైన 11వ సౌండ్ట్రాక్ ఆల్బమ్‌గా నిలిచింది.[26] టైటిల్ ట్రాక్ పాట "చక్ దే! ఇండియా", ఇప్పుడు భారతదేశంలో క్రీడా గీతంగా ప్రాచుర్యం పొందింది.[3][4]
విడుదల
[మార్చు]చక్ దే! ఇండియా చిత్రం 13 ఆగస్టు 2007న లండన్‌లోని సోమర్‌సెట్ హౌస్‌లో జరిగిన 'ఫిల్మ్4 సమ్మర్ స్క్రీన్', 'ఇండియా నౌ' ఉత్సవాల సందర్భంగా 2,000 మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో ప్రదర్శించబడింది.[27][28][29] అంతకుముందు, 10 ఆగస్టు 2007న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యష్ రాజ్ ఫిల్మ్స్ గత రెండు చిత్రాలైన తా రా రమ్ పమ్, ఝూమ్ బరాబర్ ఝూమ్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, మొదట్లో ఈ సినిమాను భారతదేశంలో కేవలం 400 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు.[30]
భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, భారత చలనచిత్ర ఉత్సవాల డైరెక్టరేట్ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన వారం రోజుల 'స్వాతంత్ర్య దినోత్సవ చలనచిత్ర ఉత్సవం'లో భాగంగా, 17 ఆగస్టు 2016న ఈ చిత్రాన్ని న్యూఢిల్లీలో ప్రదర్శించారు.[31][32]
విమర్శనాత్మక స్పందన
[మార్చు]రివ్యూ అగ్రిగేటర్ వెబ్‌సైట్ రాటెన్ టొమాటోస్ లో 19 మంది విమర్శకుల సమీక్షలలో 89% సానుకూలంగా ఉన్నాయి. వెయిటెడ్ యావరేజ్‌ని ఉపయోగించే మెటాక్రిటిక్, నలుగురు విమర్శకుల అభిప్రాయాల ఆధారంగా ఈ చిత్రానికి 100కి 68 స్కోరును కేటాయించింది, ఇది ఈ చిత్రానికి "సాధారణంగా అనుకూలమైన" సమీక్షలు లభించాయని సూచిస్తుంది.
ముంబై మిర్రర్ కాలమిస్ట్ అసీమ్ ఛబ్రా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "చక్ దే! ఇండియా బాలీవుడ్ చట్రంలోనే ఉంటూ తీసిన ఒక విభిన్నమైన చిత్రం. ఇది వాస్తవిక సమస్యలను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా జట్టులోని ప్రతి క్రీడాకారిణికి తమ ప్రతిభను చాటుకునే అవకాశం దక్కడం నాకు బాగా నచ్చింది. వారి పాత్రలను చాలా చక్కగా తీర్చిదిద్దారు. సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కోచ్‌గా నటించినప్పటికీ, సినిమా అంతా తనే అన్నట్లుగా ఉండదు; ప్రతి సహాయక పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. ఇది భారతీయుల మనోభావాలను మార్చిన ఒక స్ఫూర్తిదాయక చిత్రం" అని పేర్కొన్నారు.[33] టైమ్స్ ఆఫ్ ఇండియా కు చెందిన నిఖత్ కజ్మీ ఈ చిత్రానికి 5 కి 4 స్టార్ రేటింగ్ ఇస్తూ, "తెలియని నటీనటులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన చిత్రం" అని కొనియాడారు. ఇండియా టుడే ఈ సినిమాను "బాలీవుడ్ నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన 'గర్ల్ పవర్' మూవీ" అని పేర్కొంది. ది హిందూ పత్రికకు చెందిన సుధీష్ కామత్ రాస్తూ, "చక్ దే మరో స్థాయిలో మహిళా విముక్తి గురించి మాట్లాడుతుంది. ఇది మన కాలంలోని అత్యంత ఉత్తమమైన ఫెమినిస్ట్ చిత్రాలలో ఒకటి" అని అభివర్ణించారు. CNN-IBN కు చెందిన రాజీవ్ మసంద్ 4/5 రేటింగ్ ఇస్తూ, "చక్ దే అన్ని విధాలా విజేత" అని పేర్కొన్నారు.[34][35][36][37]ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన శుభ్రా గుప్తా ఈ చిత్రాన్ని "భారతదేశం నిర్మించిన అత్యంత ప్రామాణికమైన, నిశితంగా పరిశోధించి తీసిన స్పోర్ట్స్ మూవీ" అని పిలిచారు.కోల్‌కతాకు చెందిన టెలిగ్రాఫ్ పత్రికలో భారతి ఎస్. ప్రధాన్ రాస్తూ, "బిగువైన స్క్రీన్‌ప్లే, సమర్థవంతమైన దర్శకత్వంతో పాటు, గ్లామర్ లేని 16 మంది కొత్త అమ్మాయిలు తమ నటనతో మిమ్మల్ని కట్టిపడేస్తారు. ఒకే ఒక్క సుపరిచిత నటుడు (షారూఖ్) కనురెప్ప వేయకుండా సినిమా చూసేలా చేస్తాడు" అని ప్రశంసించారు.[38] బీబీసీ కు చెందిన జస్ప్రీత్ పందోహర్ 4/5 స్టార్ రేటింగ్ ఇస్తూ, "అట్టడుగున ఉన్నవారు విజయం సాధించే కథలు కొత్తవి కాకపోయినా, జైదీప్ సాహ్ని స్క్రీన్‌ప్లే క్రికెట్ నీడలో వెనుకబడిపోయిన ఒక ప్రసిద్ధ భారతీయ క్రీడను అద్భుతంగా చూపించింది" అని పేర్కొన్నారు. 'ది న్యూయార్క్ టైమ్స్' కు చెందిన ఆండీ వెబ్‌స్టర్, ఈ చిత్రం సాధారణ స్పోర్ట్స్ సినిమాలకు భిన్నంగా కొత్తదనాన్ని ఇచ్చిందని రాస్తూ, దీనిని 1991 ఫిఫా మహిళల ప్రపంచ కప్‌లో అమెరికా సాధించిన విజయంతో పోల్చారు.[39] 'వెరైటీ'కి చెందిన డెరెక్ ఎల్లీ దీనిని "పాతకాలపు వినోదాన్ని పంచుతూనే దేశభక్తిని రగిలించే చిత్రం" అని పిలిచారు. 'ది హాలీవుడ్ రిపోర్టర్'లో కిర్క్ హనీకట్ రాస్తూ, "అద్భుతమైన సినిమాటోగ్రఫీ, చురుకైన ఎడిటింగ్, సాధన చేసే సన్నివేశాల్లోని సంగీతం, లొకేషన్ల ఎంపిక వంటి సాంకేతిక అంశాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి" అని కొనియాడారు.[40][41]
విమర్శకులే కాకుండా, మధుర్ భండార్కర్, డేవిడ్ ధావన్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, అనురాగ్ బసు, శ్రీరామ్ రాఘవన్ వంటి పలువురు బాలీవుడ్ దర్శకుల అభిప్రాయం ప్రకారం, 2007 సంవత్సరపు 'అత్యుత్తమ చిత్రం'గా చక్ దే! ఇండియా, తారే జమీన్ పర్ చిత్రంతో సమానంగా నిలిచింది.[42]
బాక్సాఫీస్
[మార్చు]ఈ చిత్రంపై విమర్శకుల నుండి వచ్చిన విశేష స్పందన కారణంగా, విడుదలైన మొదటి వారంతంలో సినిమా హాళ్లలో 80% ఆక్యుపెన్సీ నమోదైంది.[30]చక్ దే! ఇండియా మొదటి రెండు వారాల పాటు భారత బాక్స్ ఆఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలిచి, మొదటి రెండు నెలల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శించబడింది.[43][44] ఈ చిత్రం ముఖ్యంగా మెట్రో నగరాల్లో భారీ విజయాన్ని సాధించింది.[44] భారతదేశంలో ఆ సంవత్సరం ₹66,54,00,000 నికర ఆదాయాన్ని సాధించి, 2007లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది; బాక్స్ ఆఫీస్ వద్ద ఇది 'బ్లాక్ బస్టర్'గా ప్రకటించబడింది.[45] థియేటర్లలో విడుదలయ్యే సమయానికి, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹102 కోట్లు ($27.05 మిలియన్లు) వసూలు చేసింది. ఇందులో భారతదేశంలో లభించిన ₹85.86 కోట్ల గ్రాస్ (₹66.54 కోట్ల నెట్), విదేశాల నుండి వచ్చిన $3.94 మిలియన్ల (₹15.76 కోట్లు) వసూళ్లు ఉన్నాయి.[46]
ప్రశంసలు
[మార్చు]చక్ దే! ఇండియా 55వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో 'అత్యుత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం' కేటగిరీలో జాతీయ అవార్డును గెలుచుకుంది. 53వ ఫిలింఫేర్ అవార్డులలో ఈ చిత్రం పన్నెండు నామినేషన్లను పొంది ఐదు అవార్డులను కైవసం చేసుకుంది; వాటిలో ఉత్తమ చిత్రం (క్రిటిక్స్), ఉత్తమ నటుడు, ఉత్తమ యాక్షన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు ఉన్నాయి.
ఇతర పురస్కారాల విషయానికి వస్తే, 9వ ఐఫా (IIFA) అవార్డులలో ఈ చిత్రం పద్నాలుగు నామినేషన్లను పొంది తొమ్మిది అవార్డులను గెలుచుకుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఫిలిం అవార్డులలో పద్నాలుగు నామినేషన్లకు గాను ఎనిమిది అవార్డులు, స్క్రీన్ అవార్డులలో పన్నెండు నామినేషన్లకు గాను ఆరు అవార్డులు, స్టార్‌డస్ట్ అవార్డులలో ఏడు నామినేషన్లకు గాను మూడు అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే వి. శాంతారామ్ అవార్డులలో ఐదు పురస్కారాలను, జీ సినీ అవార్డులలో ఏడు నామినేషన్లకు గాను ఆరు అవార్డులను గెలుచుకుంది.
వారసత్వం
[మార్చు]శుభ్రా గుప్తా తన పుస్తకం '50 ఫిల్మ్స్ దట్ ఛేంజ్డ్ బాలీవుడ్, 1995–2015'లో చక్ దే! ఇండియాను చేర్చారు.[47] 2024లో, 'ఆగస్ట్ మాన్' హిందీ క్రీడా చిత్రాల జాబితాలో (మొత్తం 11 చిత్రాలలో) ఈ సినిమాకు #1 ర్యాంకు ఇచ్చింది. "సరైన మోతాదులో బాలీవుడ్ మసాలాను జోడిస్తూనే, ఒక స్వచ్ఛమైన స్పోర్ట్స్ మూవీకి ఉండాల్సిన అన్ని లక్షణాలతో పాటు, మహిళా సాధికారతను సూక్ష్మంగా విశ్లేషించిన ఈ చిత్రం తన కాలం కంటే ఎంతో ముందస్తుగా ఆలోచించి తీసినది" అని ఆ సంస్థ పేర్కొంది. తర్వాతి ఏడాది 2025లో, 'ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా' ఈ చిత్రాన్ని 21వ శతాబ్దపు భారతదేశపు 25 ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఎంపిక చేసింది. [48][49] చక్ దే! ఇండియా గురించి రాస్తూ, "ఈ చిత్రం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది; అది కేవలం అందులో ఒక సూపర్ స్టార్ ఉండటం వల్లనో లేదా నాటకీయమైన ముగింపు ఉండటం వల్లనో కాదు—ఒక భిన్నమైన భారతదేశాన్ని ఊహించే ధైర్యం చేసినందుకు" అని ప్రశంసించింది. అలాగే, 'టైమ్ అవుట్' తన "100 ఉత్తమ బాలీవుడ్ చిత్రాల" జాబితాలో ఈ సినిమాకు 35వ స్థానాన్ని ఇచ్చింది.[50][51]
మూలాలు
[మార్చు]- ↑ "Highest Budget Movies 2007: Box Office India". Box Office India. the original నుండి 3 October 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 September 2015.
- ↑ "Chak De India - Movie - - Box Office India". boxofficeindia.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2021-06-28.
- ↑ 3.0 3.1 "Shah Rukh Khan's 'Chak De! India' song was rejected 7 times film picked up after the iconic title track was played during 2007 India-Pakistan T20 match". The Times of India. September 29, 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: March 15, 2026.
- ↑ 4.0 4.1 "Chak De India - A new national anthem is born". Hindustan Times. 2007-12-31. ఒరిజినల్ నుండి 2024-01-18 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2024-10-07.
- ↑ 5.0 5.1 Kabir, Khan (13 December 2009). "Identity Proof". The Indian Express. ఒరిజినల్ నుండి 25 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2005.
- ↑ 6.0 6.1 Sivaswamy, Saisuresh (13 October 2007). "SRK and the M word". Rediff.com. ఒరిజినల్ నుండి 23 August 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 December 2008.
- ↑ Ganguly, Prithwish (28 December 2007). "Flashback 2007 – The religion factor in Chak De! India". Reuters. Reuters. the original నుండి 26 September 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 December 2008.
- ↑ 8.0 8.1 8.2 8.3 Piyushroy, Piyushroy (18 August 2007). "The Chak De Girls". The Indian Express. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ 9.0 9.1 9.2 Patel, Devansh (26 July 2007). "Chak De girls kicked my butt: Shah Rukh Khan". Sify. the original నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ "Taare, Chak De sweep Screen Awards". NDTV. 11 January 2008. ఒరిజినల్ నుండి 16 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2015.
- ↑ 11.00 11.01 11.02 11.03 11.04 11.05 11.06 11.07 11.08 11.09 11.10 11.11 11.12 11.13 11.14 11.15 11.16 11.17 11.18 11.19 11.20 11.21 11.22 11.23 "Chak De India: Official Website- Introduction and The Team: The Girls". Yash Raj Films. ఒరిజినల్ నుండి 7 July 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 August 2015.
- ↑ 12.0 12.1 12.2 Shimit Amin (Director) (2007). Chak De! India (Feature Film). India: Yash Raj Films. the original నుండి 7 July 2015 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Speech by Shah Rukh Khan on receiving an Honorary Degree from University Of Edinburgh". News. Times of India. 2015-10-16. ఒరిజినల్ నుండి 8 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2015-11-05.
- ↑ Kumar, Anuj (7 September 2007). "In the company of ideas". The Hindu. ఒరిజినల్ నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2008.
- ↑ Roy, Abhishek (18 August 2007). "Chak De! is not a documentary of my life". Hindustan Times. IANS. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ Agencies (5 June 2008). "Shah Rukh Khan - Q&A". News. CNN. ఒరిజినల్ నుండి 3 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ "Chak De: The real Kabir Khan?". Sports. NDTV. 31 October 2007. ఒరిజినల్ నుండి 3 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 August 2015.
- ↑ "When Salman Khan revealed why he rejected 'Chak De! India'". The Times of India. 27 January 2026. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 March 2026.
- ↑ "Chak De India: Lesser Known Facts". The Times of India. ఒరిజినల్ నుండి 13 March 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ "Chak De India takes SRK down memory lane". Hindustan Times. IANS. 6 August 2007. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ "Audiences are going to get their money's worth". Rediff.com. 7 August 2007. ఒరిజినల్ నుండి 13 January 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 April 2012.
- ↑ "Meet the Chak De women". Rediff.com. ఒరిజినల్ నుండి 22 April 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2008.
- ↑ Sawhney, Anubha (18 October 2007). "Helping stars make the right moves". The Times of India. ఒరిజినల్ నుండి 12 January 2009 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 May 2008.
- ↑ Thompson, Bill (13 September 2007). "'Pumpkin' in season at Charleston library:Going Bollywood". The Post and Courier. the original నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ Shrikant, B (26 June 2007). "More than reel life; the story of truth, lies & a man called Mir". Hindustan Times. the original నుండి 17 February 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2008.
- ↑ "Music Hits 2000–2009 (Figures in Units)". Box Office India. the original నుండి 24 June 2010 న ఆర్కైవు చెయ్యబడింది.
- ↑ "Over 2,000 attend Chak de... premiere". The Tribune. PTI. 2 October 2007. ఒరిజినల్ నుండి 4 March 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ "Square to showcase best of India". BBC. 2 October 2007. ఒరిజినల్ నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ "Indian Bollywood actor Shah Rukh Khan Arrives". Getty Images. 9 October 2007. ఒరిజినల్ నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ 30.0 30.1 Sheikh, Aminah (17 August 2007). "Waiting for a winning formula". Business Standard. ఒరిజినల్ నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ Hafeez, Sarah (2016-08-16). "Independence Day Film Festival: Ambedkar biopic pulls in crowd at Siri Fort Auditorium". Indian Express. ఒరిజినల్ నుండి 17 August 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-08-29.
- ↑ "DIRECTORATE OF FILM FESTIVALS & MINISTRY OF DEFENCE Presents Independence Day Film Festival" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ నుండి 9 September 2016 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-08-29.
- ↑ Palca, Joe (25 February 2009). "Singing The Praises Of Bollywood Films". WBUR-FM. NPR. ఒరిజినల్ నుండి 13 January 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2015.
- ↑ Swati Mathur; S. Sahaya Ranjit (7 September 2007). "Film reviews – Fast, Furious, Fun: Chak De! India". India Today. ఒరిజినల్ నుండి 6 June 2012 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 July 2011.
- ↑ Kamath, Sudhish (17 October 2007). "Fairy tale with logic". The Hindu. ఒరిజినల్ నుండి 29 November 2014 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2008.
- ↑ Masand, Rajeev (15 August 2007). "Chak De's... a winner all the way". News. CNN-IBN. ఒరిజినల్ నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ Gupta, Shubra (1 November 2007). "Chak De, India". The Indian Express. ఒరిజినల్ నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 21 August 2015.
- ↑ Pradhan, Bharathi (19 August 2007). "Shah Rukh scores, India adores". The Telegraph. the original నుండి 19 February 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 19 August 2015.
- ↑ Webster, Andy (11 October 2007). "You Go, Girl, as Translated into Hindi". Movie Review. ఒరిజినల్ నుండి 15 March 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 April 2008.
- ↑ Elley, Derek (15 October 2007). "Review". Movie Review. ఒరిజినల్ నుండి 27 March 2008 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2008.
- ↑ Honeycutt, Kirk (16 August 2007). "Review". Movie Review. ఒరిజినల్ నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 1 June 2008.
- ↑ "Taare Zameen Par, Chak De top directors' pick in 2007". Hindustan Times. 29 December 2007. the original నుండి 6 June 2011 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 April 2008.
- ↑ "Box Office Mojo: Chak De India". Box Office Mojo. ఒరిజినల్ నుండి 24 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2015.
- ↑ 44.0 44.1 Singh, Madhur (11 October 2007). "Bollywood Changes Its Tune". Time. the original నుండి 26 September 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 August 2015.
- ↑ "Box Office 2007:Total Net Gross". Box Office India. ఒరిజినల్ నుండి 5 August 2015 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 September 2015.
- ↑ "Chak De India Box Office Collection". Bollywood Hungama. 10 August 2007. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 February 2019.
- ↑ Gupta, Shubhra (2016). 50 Films That Changed Bollywood, 1995–2015. Harper Collins. ISBN 9789351778486.
- ↑ Hendriques, Princia (August 12, 2024). "11 Best Bollywood Sports Movies Ranked: 'Chak De! India', 'Lagaan' And More". August Man. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 11, 2025.
- ↑ "THR India's 25 in 25: The Best Indian Movies of the 21st Century". The Hollywood Reporter India. December 24, 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: March 10, 2026.
- ↑ Shankar, Ananya (November 10, 2025). "THR India's 25 in 25: Why 'Chak De! India' Still Scores High in Indian Hearts". The Hollywood Reporter. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: November 10, 2025.
- ↑ "The 100 best Bollywood movies". Time Out. 4 August 2025. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 November 2025.