చిత్తు నమూనా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్తు నమూనా (ఆంగ్లం: Sketch) అనునది వీలైనంత వేగంగా కేవలం చెయ్యి, వేసే పరికరం తప్పితే (స్కేలు, వృత్తలేఖిని వంటి ఏ ఇతర పరికరాలు ఉపయోగించకుండా) పూర్తి అవకుండా అసంపూర్ణంగా వదిలివేయబడ్డ ఒక రేఖాచిత్రం. ఒక చిత్రకారుడు చూచిన/చూస్తూ ఉన్న దృశ్యాన్ని చిత్రీకరించటానికి, ముందుగా చిత్తు ప్రతిని చిత్రీకరించి దానిని తర్వాత చిత్రపటంగా చిత్రీకరించటానికి ఒక కల్పిత దృశ్యాన్ని, లేదా ఉద్దేశ్యాన్ని, లేదా సిద్ధాంతాన్ని చిత్రీకరించటానికి ఉపయోగిస్తారు.

చిత్తు నమూనాని ఏ మాధ్యమంలో నైనా చిత్రీకరించవచ్చును. సిల్వర్ పాయింట్, గ్రాఫైట్, పెన్సిల్, చార్కోల్ లేదా పేస్టెల్ వంటివే కాకుండా కలం, సిరా, బాల్ పాయింట్ పెన్, వాటర్ కలర్ లేదా తైల వర్ణాల వంటి ఏ మాధ్యమాన్ని అయినా ఉపయోగించవచ్చును. శిల్పకళలో బంకమన్ను, మైనం ఉపయోగించి చేసే స్కెచ్ లని త్రీ-డి స్కెచ్ లుగా వ్యవహరిస్తారు.

ఉపయోగాలు[మార్చు]

చిత్తు నమూనాలు చిత్రలేఖనం, శిల్ప కళ వంటి కళలని అభ్యసిస్తున్న విద్యార్థులు నేర్చుకొనటం తప్పని సరి. కొద్ది నిముషాల వ్యవధిలో భంగిమ మార్చే ఒక మోడల్ ని ప్రత్యక్షంగా చిత్రీకరింఛటానికి చిత్తు నమూనాలని వాడుతారు. దీనినే క్రోకిస్ (croquis) అంటారు.

దృశ్య కళలకి సంబంధించిన చాలా మటుకు కళాకారులు సాధారణంగా తమ ఆలోచనలని, ఉద్దేశ్యాలని, భావాలని కాగితం పై నమోదు చేయటానికి చిత్తు నమూనాలని ఉపయోగిస్తారు. అటు తర్వాత వీటిని ఒక సంపూర్ణ చిత్రపటంగా అభివృద్ధి చేస్తారు. లియొనార్డో డావిన్సి, ఎద్గార్ డేగాస్ వంటి ప్రముఖులచే కొన్ని అసంపూర్ణంగా వదిలివేయబడి, కొన్ని అభ్యాసాల కొరకు చిత్రీకరించినవి, మరి కొన్ని పరిపూర్ణ చిత్రపటాలు గల చిత్తు నమూనాల పుస్తకాలు కళా విద్యార్థులకి శాశ్వత అభ్యాసాలుగా మిగిలిపోవటం ఆయా కళలలో చిత్తు నమూనాల ప్రాముఖ్యతకి నిదర్శనం.

నేరస్థులని పట్టుకొనేందుకు కూడా చిత్తు నమూనాలు ఉపయోగపడతాయి. వీటినే కాంపోజిట్ స్కెచ్ అంటారు. పలు విహార యాత్రా ప్రదేశాలలో నిముషాల వ్యవధిలోనే యాత్రికుల చిత్రపటాలని గీసి ఇచ్చే కళాకారులు కలరు.

చిత్రమాలిక[మార్చు]