Jump to content

జకార్తా

వికీపీడియా నుండి

జకార్తా ఇండోనేషియా దేశపు రాజధాని నగరం. ప్రావిన్షియల్ స్థాయిలో ఇది స్వయంప్రతిపత్తి కలిగిన ప్రాంతం కూడా. 1949 వరకు దీనిని బటేవియా అని పిలిచేవారు. ఇది ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ జనభా కలిగిన జావా దీవికి వాయువ్య తీరాన ఉంది. ఇండోనేషియాలో ఇది ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కేంద్రం. ఆగ్నేయాసియాలో పురాతన కాలం నుంచీ మానవ నివాసాలు ఉంటున్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి.[1] జకార్తా విస్తీర్ణం సుమారు 661 చ.కిమీ అయినప్పటికీ మెట్రోపాలిటన్ ప్రాంతం మొత్తాన్ని తీసుకుంటే 7076 చ.కి.మీ ఉంటుంది. 2022 నాటికి ఈ మెట్రోపాలిటన్ ప్రాంతపు జనాభా సుమారు 3.26 కోట్లు. ఇది ఇండోనేషియాలో అత్యంత జనాభా కలిగిన, ప్రపంచంలో రెండవ అత్యంత జనాభా కలిగిన పట్టణ ప్రాంతం. మానవ అభివృద్ధి సూచీ ప్రకారం ఇండోనేషియా ప్రావిన్సులలో ఇది ప్రథమ స్థానంలో ఉంది. జకార్తా వ్యాపార, ఉపాధి అవకాశాలు, ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే అధిక జీవన ప్రమాణాల కారణంగా, ఇండోనేషియా ద్వీపసమూహం అంతటా వలస వచ్చినవారిని ఆకర్షించి, ఇది అనేక సంస్కృతుల కలయికగా మారింది.

చరిత్ర

[మార్చు]

జకార్తాతో సహా పశ్చిమ జావా ద్వీపపు ఉత్తర తీరంలో సా.శ.పూ 400 నుంచి సా.శ 100 వరకు బుని సంస్కృతి పరిఢవిల్లింది.[2] ఆధునిక జకార్తా, దాని చుట్టుపక్కల ప్రాంతం ఇండోనేషియాలోని పురాతన హిందూ రాజ్యాలలో ఒకటైన తరుమనగర 4వ శతాబ్దపు సుండానీ రాజ్యంలో భాగంగా ఉంది.[3] టుగు చుట్టూ ఉన్న ఉత్తర జకార్తా ప్రాంతం 5వ శతాబ్దం ప్రారంభంలో ఒక జనావాస స్థావరం అయింది. ఉత్తర జకార్తా, కోజాలోని టుగు గ్రామంలోని బటుటుంబు కుగ్రామంలో కనుగొనబడిన తుగు శాసనం (ఇది బహుశా సా.శ. 417లో వ్రాయబడి ఉండవచ్చు) తరుమనగర రాజు పూర్ణవర్మన్ అతని రాజధాని సమీపంలోని చంద్రభాగ నది, గోమతి నది దగ్గర జలశక్తి పథకాన్ని చేపట్టాడని పేర్కొంది.[4] తరుమనగర ప్రాభవం కోల్పోయిన తరువాత, జకార్తా ప్రాంతంతో సహా దాని భూభాగాలు హిందూ రాజ్యమైన సుండాలో భాగమయ్యాయి. 7వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం ప్రారంభం వరకు, సుండా నౌకాశ్రయం శ్రీవిజయుని సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. సుమారు 1225 ప్రాంతంలో రాయబడిన చైనీస్ మూలం చు-ఫాన్-చి లో జావో రుకువో నివేదించిన ప్రకారం శ్రీవిజయుడు మలయా ద్వీపకల్పమైన సుమత్రా, జావా పశ్చిమ ప్రాంతాన్ని పరిపాలించేవాడు.[5] సుండా నౌకాశ్రయం ఒక వ్యూహాత్మకమైనదనీ, మంచి అభివృద్ధి సాధించిందనీ, సుండాలోని మిరియాలు అత్యున్నత నాణ్యత కలిగినదనీ ఈ మూలం తెలియజేస్తుంది. ఇక్కడి ప్రజలు వ్యవసాయం చేసేవారు. అక్కడి ఇళ్ళు చెక్కపలకలపైన కట్టుకునేవారు.[6]

మూలాలు

[మార్చు]
  1. "History of Jakarta". Jakarta.go.id. 8 March 2011. Archived from the original on June 8, 2014. Retrieved 17 June 2014.
  2. Zahorka 2007, p. ?.
  3. Ayatrohaédi 2005, p. ?.
  4. Hellman, Thynell & Voorst 2018, p. 182.
  5. Bunge & Vreeland 1983, p. 3.
  6. Ayatrohaédi 2005, p. 60.
"https://te.wikipedia.org/w/index.php?title=జకార్తా&oldid=4429998" నుండి వెలికితీశారు