జగద్గురు 8వ నృసింహ భారతీస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శృంగేరి శారదా పీఠం ఆలయం దృశ్యచిత్రం

శృంగేరి శారదా పీఠం లోని ప్రాచీనకాలం నుండి గురు పరంపర కొనసాగుతుంది. వీరిలో 32వ జగద్గురుగా 8వ నృసింహ భారతీ స్వామిని పేర్కొంటారు. వీరు భారతదేశమంతటా సంచరించి, శిష్యులకు ఉపదేశాలు చేసి సనాతన ధర్మ ప్రచారం చేశారు.

వీరు 1798లో జన్మించారు. చిన్నతనంలోనే కాలినడకన కాశీకి వెళ్ళి అచ్చటి పండితుల వద్ద శాస్త్రాల్ని అధ్యయనం చేశారు. శారదా పీఠం యొక్క ఆధిపత్యం పొందిన నాటిని వీరు వయస్సు 19 సంవత్సరాలు. పీఠాన్ని అలంకరించిన పిమ్మట బహుశాస్త్ర పారంగతులై నిత్యం యోగాభ్యాసంతో ఆహారం, నిద్రలను జయించారు. నిత్యం నృసింహుని ఉపాసనం వలన దివ్యతేజస్సు పొందారు. గురువులు తెలుగు, కన్నడం, తమిళం, మరాఠీ, హిందూస్తానీ, సంస్కృత భాషలలో అనర్గళంగా ఉపన్యసించేవారు.

జగద్గురువులు బెంగుళూరులో మకాం ఉన్నప్పుడు వీరిని గురించి వినిన కమీషనరు బౌరింగు ఒకనాటి నడిరాత్రి మారువేషములో గురువులను పరిశీలించుటకు వచ్చెను. తదేక ధ్యానంలో నిశ్చలంగా చంద్రమౌళీశ్వరుని పుష్పార్చన చేయుచున్న గురువులను చూచి, విస్మయం చెంది వారిపై విశేషమైన గౌరవ ప్రపత్తులు కలిగినవారైరి.

గురువులు ఉత్తరదేశ యాత్రలో నాగపూరులో ఉన్నప్పుడు, భోగ లాలసుడైన భోంస్లే రాజు వీరిని గౌరవించక అష్టకష్టాలు పడి చివరకు తన తప్పును తెలుసుకొని గురువుల అనుగ్రహం పొందాడు.

ఒకసారి రామేశ్వరం యాత్రలో వారి పరిచారికులు ఆలయ ప్రాంగణంలోని కోటి తీర్థం అనే బావిలో గురువుగారి స్నానానికి నీరు తోడుచుండగా దేవాలయ పాలకులు వద్దని వారించారు. తెలిసిన జగద్గురువులు సర్వ తీర్థం అనే బావిలో స్నానం చేసి, రామేశ్వర యాత్ర సర్వ తీర్థంలో స్నానంతోనే పూర్తవుతుందని ప్రకటించారు. జనమంతా గురువుగార్ని అనుసరించారు. దీనివలన కోటితీర్థం పాలకులు వృత్తిని కోల్పోయి గురువుల పాదాలపై పడ్డారు. వారు కరుణించి కోటితీర్థం బావిని పుణ్యోదకాలతో ప్రోక్షించి పునీతం చేసి మరళ జనాదరణ పొందినట్లుగా చేశారు.

రెండవసారి మధుర వెళ్ళినప్పుడు మీనాక్షి దేవాలయ అర్చకులు వారిని గర్భాలయంలోకి వెళ్ళనీయకపోగా, గురువులు రెండు టెంకాయలను తెప్పించి మీనాక్షి సుందరేశ్వరులను అందున ఆవాహనం చేసి గుమ్మం వద్దనే పూజించారు. ఆనాటి నుండి యాత్రికులు కూడా ఆలయం లోనికి వెళ్ళకుండా ఆ టెంకాయలకే అర్చన చేయసాగారు. పూజారులు పశ్చాత్తాపపడగా మూలవిరాట్టులకు శక్తిపాతం కల్పించారు.

ఒకసారి జగద్గురువులు మహారాష్ట్ర దేశంలో సంచారం చేస్తుంటే అటవికులు గురువుల వసతిలోని ద్రవ్యాన్ని దోచుకోడానికి వచ్చి, గురువుల ముఖం చూడగానే వారి మనస్సు మారి, గురువులకు మ్రొక్కి, శిష్యులై, అంగరక్షకులై వెంట ఉండి గురువులను అడవి దాటించారు.

సా.శ. 1831లో మైసూరు రాజ్యాన్ని లార్డు బెంటింగు బ్రిటిష్ పాలన క్రిందిని తెచ్చాడు. కాని శృంగేరి పీఠం పై భక్తిశ్రద్ధలు కలిగి సంస్థానికున్న హక్కులు అనగా పన్నులు లేకుండుట, శాంతి భద్రతలు కాపాడుకొనుట, ఆస్తి తగాదాలు పరిష్కరించుకొనుట వంటివి పీఠాధిపతులకే నిరాటంకంగా అమలుచేసుకునే హక్కు కలదని ప్రకటించాడు.

గురువులు ఉత్తరదేశ యాత్రలో కలక్టరు అలగ్జాండరు నిస్బెట్ గురువుల ప్రయాణానికి కావలసిన సదుపాయాలు కల్పించాడు. వీరు ద్వారక, కురుక్షేత్రం, కాశీ, బదరికాశ్రమము, పూరి జగన్నాథములలో సంచరించారు.

జగద్గురువులు నైజాం రాష్ట్రంలో మూడు సంవత్సరాలు సంచారం చేశారు. అప్పుడు హైదరాబాదు ప్రధానమంత్రి గోల్కొండ సుభాలోనున్న జాగీరుదార్లకు దేశముఖులకు, దేశపాండేలకు, పటేలులకు తాఖీదులు పంపి ఇతర మఠాధిపతులెవ్వరు శృంగేరి జగద్గురువుల వలె మహాబిరుదాలను ధరించరాదని, వీరి శిష్యుల నుండి కానుకలు వసూలు చేయరాదని ఉత్తరువులు జారీ చేశారు. సా.శ. 1843-45 సంవత్సరాలలో ఈ ఆదేశాలు పర్షియన్ భాషలో జారీ అయినాయి. హైదరాబాదు నవాబు జగద్గురువులకు నవరత్నములు పొదిగిన బంగారు కిరీటమును సమర్పించి తన ప్రగాఢ భక్తిని చాటుకున్నాడు.

మూలాలు

[మార్చు]
  • జగద్గురు 8వ నృసింహభారతీస్వాములవారు, తంగిరాల ఆంజనేయశాస్త్రి, 150 వసంతాల వావిళ్ల వైజయంతి, పేజీలు: 480-82.

బయటి లింకులు

[మార్చు]