Jump to content

జనవాణి

వికీపీడియా నుండి
జనవాణి
సంపాదకులుతాపీ ధర్మారావు నాయుడు
తరచుదనంవారపత్రిక
ప్రచురణకర్తతాపీ మోహనరావు
మొదటి సంచికఫిబ్రవరి 9, 1949; 76 సంవత్సరాల క్రితం (1949-02-09)
ఆఖరి సంచికఏప్రిల్ 1953 (1953-04)
దేశంభారతదేశం
కేంద్రస్థానంమద్రాసు
భాషతెలుగు

జనవాణి తాపీ ధర్మారావు నాయుడు సంపాదకత్వంలో వెలువడిన పత్రిక. మొదట ఇది కొంతకాలం దినపత్రికగా, తరువాత కొన్నాళ్ళకు వారపత్రికగా నడిచింది.

దినపత్రిక

[మార్చు]

పిఠాపురం రాజా తన పీపుల్స్ పార్టీ ప్రచారం కోసం 1936 లో ఈ దినపత్రికను ప్రారంభించాడు.[1][2] తాపీ ధర్మారావు నాయుడు సంపాదకుడిగా ఈ పత్రిక మూడేళ్ళు మాత్రమే మనగలిగింది. ఈ పత్రిక వ్యవహారిక భాషలో ప్రచురితమై ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. వ్యావహారిక భాషలో వచ్చిన తొలి దినపత్రిక అది.[1][3] ఈ పత్రికలో లంక సత్యం, నార్ల వెంకటేశ్వరరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, కప్పగంతుల సత్యనారాయణ, జి.వి.శేషయ్య, పి.శ్రీరాములు, బోయి భీమన్న మొదలైన వారు ఉపసంపాదకులుగా పనిచేశారు. ఎన్నికల కోసం ప్రారంభమైన పత్రిక కాబట్టి రాజకీయ వార్తలు ఎక్కువ మోతాదులో ఉన్నా అనేక సాంఘిక, సారస్వత విషయాలను కూడా ఈ పత్రిక ప్రచురిస్తూ ఉండేది. ఈ పత్రికలో మల్లంపల్లి సోమశేఖర శర్మ, మొక్కపాటి నరసింహశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలైనవారి వ్యాసాలు ప్రచురణ అయ్యాయి. 1937 ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచి పీపుల్స్ పార్టీ పరాజయం కావడంతో పాటు రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం కావడం, పత్రికలకు కాగితం కోటా బాగా తగ్గించడం కారణాలుగా ఈ దిన పత్రిక 1939లో నిలిచి పోయింది. ఈ స్వల్పకాలంలోనే ఈ పత్రిక వార్తా ప్రకటనలలోను, సంపాదకీయ వ్యాఖ్యలు, తదితర శీర్షికా సముదాయాలలోనూ కొత్త పోకడలను తెచ్చి తెలుగువారి ఆదరాభిమానాలను చూరగొన్నది.

వారపత్రిక

[మార్చు]

తాపీ ధర్మారావు 1949 లో వారపత్రికగా తిరిగి మద్రాసు నుండి ప్రారంభించాడు. తన కుమారుడు మోహనారావు, సెట్టి ఈశ్వరరావుల సహకారంతో ఈ పత్రికను నిర్వహించాడు. తొలి సంచిక 1949, ఫిబ్రవరి 8న వెలువడింది.[2] ఈ పత్రిక బి.ఎస్.మూర్తి నవజీవన్ ప్రెస్సులో కొంతకాలం, జనవాణి ప్రెస్సులో కొంతకాలం అచ్చయ్యింది.

1950లో ఆరంభమైన శాంతి ఉద్యమాన్ని ఈ పత్రిక ప్రతిబింబించిది. ఈ ఉద్యమాలంటేనే ఆనాడు పత్రికలు భయపడే దశలో ఉంటే జనవాణి ఆ వార్తలను, ఉద్యమాల వ్యాసాలనూ ప్రచురించేది. విదేశాలలో ఉన్న కొండేపూడి శ్రీనివాసరావు, కాట్రగడ్డ గంగయ్య, కొండపనేని రంగారావు మొదలైన వారు సేకరించి పంపిన ప్రపంచ వ్యాప్త శాంతి ఉద్యమ వార్తలను ఈ పత్రిక ప్రచురించింది. ఈ ఉద్యమాశయాలను ప్రతిబింబించే నాటికలు, నాటకాలు, నృత్యనాటికలు, కవితలు మొదలైనవి ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలోనూ ఈ పత్రిక ప్రముఖ పాత్ర వహించింది. అప్పటి రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై "రాష్ట్ర విభజనలు ఆత్రమా? అనర్థకమా?", "జే ఆంధ్రా", "ఆంధ్రులకానందం", "ద్రోహులున్నారు జాగ్రత్త", "ఛలోక్తా? ఖలోక్తా?", "అభాగ్య ఆంధ్ర", "అవశ్య కర్తవ్యం", "మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం", "నీటిలో నిప్పు", "ఆంధ్రులకు మరో పల్టీ", "శ్రీరాములు నిర్యాణం" వంటి అనేక సంపాదకీయాలను ఈ పత్రిక ప్రచురించింది. తాపీ ధర్మారావు తన స్వీయ చరిత్రను రాలూ - రప్పలూ పేరుతో ఈ వారపత్రికలో 8.2.52 సంచిక నుండి 4.2.53 సంచిక వరకూ ప్రకటించాడు. ఇతడు ఇంకా ఈ పత్రికలో లోకవిరోధి, ఉత్కోచరావు, ఎం.ఎస్.నారాయణ, సందేహి, ముకురం వంటి మారుపేర్లతో అనేక రచనలు చేశాడు.

ఆచార్య ఆత్రేయ వ్రాసిన ప్రగతి, ఎవరు దొంగ?, ఓటు నీకే, అంతర్యుద్ధం, విశ్వశాంతి, చావకూడదు అనే నాటికలు, అనిసెట్టి సుబ్బారావు వ్రాసిన బ్రతుకుబాట అనే నాటికా, లక్ష్మీకాంత మోహన్ వ్రాసిన కొన్ని నాటికలు జనవాణి వారపత్రికలోనే వెలుగు చూచాయి. ఆవంత్స సోమసుందర్ వ్రాసిన వజ్రాయుధం, వీణ, శ్రీశ్రీ మహాప్రస్థానం, కె.వి.రమణారెడ్డి వ్రాసిన అడవి, గంగినేని వెంకటేశ్వరరావు వ్రాసిన ఉదయిని మొదలైన పుస్తకాలపై ఈ పత్రికలో పసగలిగిన సమీక్షలు వెలువడ్డాయి.

శ్రీశ్రీ, ఆరుద్ర, విద్వాన్ విశ్వం, అనిసెట్టి, నార్ల చిరంజీవి మొదలైన కవులవే కాకుండా అనేక యువకవుల కవిత్వం సైతం ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. రష్యా, చైనా, జెక్ మొదలైన దేశాల కథలు, ముల్క్ రాజ్ ఆనంద్, కిషన్ చందర్‌ల కథలు అనువాదం చేసి ఈ పత్రికలో ప్రచురించారు. బొమ్మారెడ్డిపల్లి సూర్యారావు, పొట్లపల్లి రామారావు, గోపరాజు లవణం, ఉమారాజ్, దరిశి చెంచయ్య, వాసిరెడ్డి సీతాదేవి మొదలైన రచయితలు ఈ పత్రికలో వ్రాశారు.

శీర్షికలు

[మార్చు]

ఈ వారపత్రికలో సుమారు 20 వరకూ శీర్షికలు వచ్చాయి. వాటిలో కొన్ని[2]:

  • కదలిక
  • పొల్లు నెల్లు
  • కోదండరాయలుతో కొన్ని నిమిషాలు
  • కర్ణ పిశాచం
  • వెర్రివెధవ
  • పేలుడుగాయలు
  • ప్రపంచ సమీక్ష
  • జగత్ ప్రగతి
  • కొత్త పుంతలు
  • తెలుగు గడ్డ
  • కరువులో మా వూరు
  • వారం వారం
  • పద్యభిక్ష (ఈ శీర్షిక అంతకు ముందు కాగడా పత్రికలో వచ్చింది)
  • వాఙ్మయ గుళికలు
  • సాహిత్య మీమాంస (ఈ శీర్షికను విద్వాన్ విశ్వం నడిపాడు)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 తిరుమల, రామచంద్ర (1975). "శ్రీ తాపీ ధర్మారావు". మరపురాని మనీషి. హైదరాబాదు: యువభారతి ప్రచురణలు. p. 75.
  2. 2.0 2.1 2.2 ఏటుకూరి ప్రసాద్ (1989). తాపీ ధర్మారావు జీవితం - రచనలు (1 ed.). హైదరాబాదు: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ISBN 81-7098-156-5. Retrieved 18 February 2025.
  3. బూదరాజు, రాధాకృష్ణ (2003). బూదరాజు రాధాకృష్ణ రచనలు. హైదరాబాదు: మీడియాహౌస్ పబ్లికేషన్స్. p. 88.
"https://te.wikipedia.org/w/index.php?title=జనవాణి&oldid=4649335" నుండి వెలికితీశారు