జనానా
| సంపాదకులు | మల్లాది వెంకటరత్నం రాయసం వెంకటశివుడు కందుకూరి వీరేశలింగం పంతులు |
|---|---|
| తరచుదనం | మాసపత్రిక |
| స్థాపకులు | మల్లాది వెంకటరత్నం రాయసం వెంకటశివుడు కందుకూరి వీరేశలింగం పంతులు సత్యవోలు గున్నేశ్వరరావు |
| మొదటి సంచిక | 1893 జూలై |
| ఆఖరి సంచిక | 1907 జూలై |
| దేశం | బ్రిటిషు భారతదేశం |
| కేంద్రస్థానం | రాజమహేంద్రవరం విజయవాడ మద్రాసు రాజమహేంద్రవరం |
| భాష | తెలుగు |
మల్లాది వెంకటరత్నం ప్రారంభించిన మాసపత్రిక జనానా. "తెలుగు జనానా" అనే పేరుతో కూడా కొన్ని మూలాల్లో ప్రస్తావించడం కనిపిస్తుంది.[గమనిక 1] ఇది 1893 జూలైలో మొదలై, 1907 వరకు నడచిన సాహిత్య పత్రిక. స్త్రీలకు సంబంధించిన విషయాలను ఈ పత్రికలో ప్రచురించేవారు. స్త్రీల కోసం వెలువడ్డ రెండవ తెలుగు పత్రిక, జనానా.
చరిత్ర
[మార్చు]మల్లాది వెంకటరత్నం 1893 జూలైలో ఈ పత్రికను మొదలుపెట్టాడు. స్త్రీల కోసం వెలువడ్డ మొదటి తెలుగు పత్రిక సతీహితబోధిని కాగా, రెండవది, జనానా. ఒక సంవత్సరం తరువాత రాయసం వెంకటశివుడు సంపాదక, ప్రచురణ బాధ్యతలు చేపట్టాడు. ఈ మార్పుకు, కొత్తసంపాదకుల పేరుకూ పాఠకులు అలవాటు పడేంతవరకూ ఒక సంవత్సరం పాటు పత్రికపై ఇద్దరి పేర్లూ వేసేవారు, రచనలు మాత్రం వెంకటశివుడే చేసేవాడు.[1] వీరేశలింగం, వావిలాల వాసుదేవశాస్త్రిలు దీనిలో రచనలు చేసేవారు. మద్రాసు నుండి ఈ పత్రిక వెలువడేది.[2]
1901 జూన్ సంచికలో స్వవిషయము అనే శీర్షికక్రింద, అన్ని పనులూ తానొక్కడినే చేయవలసి రావడం వలన పత్రిక ప్రచురణ తనకు భారమైందనీ, ఇది తనకొక శిక్షగా మారిందనీ రాస్తూ తనకు సాయం కావాలని రాసాడు. "..ఎల్లకాలము నేకరీతిని కష్టపడుటకు మానవప్రకృతి యోరువఁ జాలదు! * * * కాఁబట్టి మా కీ సత్కార్యమున సహాయము చేయుడని యార్యులను విద్యాధికులను వేఁడుచున్నాము." అని ఆ అభ్యర్థనలో ఉంది. ఆ తరువాత రెండు నెలలకు పత్రిక ప్రచురణ భారాన్ని వీరేశలింగం పంతులుకు అప్పజెప్పాడు.[3]
1904 సెప్టెంబరు నుండి వెంకటశివుడుతో పాటు వీరేశలింగం పంతులు కూడా పత్రికకు సంపాదకత్వం వహించాడు.[4]
1905 జూలై నుండి పత్రిక ప్రచురణ ఆగిపోయింది. వీరేశలింగం పంతులుకు చెందిన చింతామణి ముద్రాక్షరశాలలో పత్రిక ముద్రణ ఆగిపోయింది. మళ్ళీ 1906 ఫిబ్రవరిలో పత్రికను మద్రాసులో ముద్రించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి పత్రికకు వెంకటశివుడు ఒక్కడే సంపాదకుడిగా ఉన్నాడు. మళ్ళీ 1906 నవంబరు నుండి సత్యవోలు గున్నేశ్వరరావు ప్రచురణకర్తగా రాజమండ్రిలో ఆయన ముద్రణాలయం లోనే ముద్రించడం మొదలుపెట్టారు. కానీ ఆయన కూడా ప్రచురణను కొనసాగించలేకపోయినందున పత్రిక 1907 జూలైలో మూతబడింది.[4]
రచనలు
[మార్చు]పత్రికలో స్త్రీలకు సంబంధించిన రచనలు ప్రధానంగా ఉండేవి. రచనలు చాలావరకు సంపాదకుడే రాసేవాడు. వీరేశలింగం పంతులు, గోటేటి కనకరాజు, వావిలాల వాసుదేవశాస్త్రి వంటి ఇతరులు కూడా రచనలు చేసారు. హౌస్ కీపింగ్ అనే ఇంగ్లీషు పుస్తకాన్ని వెంకటశివుడు "గృహనిర్వాహకత్వము" పేరుతో అనువదించి, పత్రికలో సీరియల్‌గా ప్రచురించాడు.[5] కొమర్రాజు లక్ష్మణరావు రాసిన “విశ్వము యొక్క విరాట్ న్వరూపము", "విశ్వము యొక్క బాల్యస్వరూవము" అనే వ్యాసాలను 1898 లో ప్రచురించారు.[6]
పత్రికలో ఇతర పత్రికల పరిచయాలు కూడా చేసేవారు. గౌతమి పత్రికను పరిచయం చేస్తూ, “ఈ యాగస్టు నెల మొదట గౌతమి యను పేరనొక యాంధ్రవారవత్రిక యనుదినమును రాజమహేంద్రవరమున బ్రచురమగుచున్నది. ఈ పత్రిక యొక్క 1,2,3 వ సంచికలు వందన పూర్వకముగా నందుకొన్నారము. పత్రిక అరఠావు కాగితము పరిమాణము గలది. ప్రతిసారినేదో యొక ముఖ్యవ్యాఖ్యానమును, కొన్ని చిన్న వ్యాసములను, వృత్తాంతములను ముద్రితములగుచున్నవి. అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రహసనములు గూడ గలవు.” అని రాసారు.[7]
వితంతు పునర్వివాహం వంటి సంస్కరణల విషయమై జనానాకు, సావిత్రి పత్రికకూ మధ్య విఉవాదాలు ఉండేవి. పెద్దయెత్తున పరస్పర విమర్శలు ప్రచురించేవి.[8][9]
గమనికలు
[మార్చు]- ↑ "తెలుగు జనానా" అనే పేరు కూడా కొన్ని మూలాల్లో కనిపిస్తుంది. కానీ, రాయసం వెంకటశివుడు తన ఆత్మచరిత్రములో జనానా అనే ఉటంకించాడు గానీ, తెలుగు జనానా అనలేదు.
మూలాలు
[మార్చు]- ↑ రాయసం, వెంకట శివుడు. "ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/"జనానాపత్రిక" - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-10-19.
- ↑ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు.
- ↑ "ఆత్మచరిత్రము/ద్వితీయభాగము : ఉపాధ్యాయదశ/వీరేశలింగముగారి సాయము - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-10-19.
- ↑ 4.0 4.1 "ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/"జనానాపత్రిక"(2) - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-10-19.
- ↑ కొలకులూరి ఇనాక్ (1980). తెలుగు వ్యాస పరిణామము. p. 499.
- ↑ కొత్తపల్లి, వీరభద్రరావు (1960). తెలుగు సాహిత్యంపై ఇంగ్లీషు ప్రభావం. హైదరాబాదు: కొత్తపల్లి వీరభద్రరావు. p. 531.
{{cite book}}: CS1 maint: date and year (link) - ↑ వేదగిరి, రాంబాబు (2012). తెలుగులో వార, మాస పత్రికలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 28.
- ↑ "ఆత్మచరిత్రము/తృతీయభాగము : ఉపన్యాసకదశ/"జనానాపత్రిక"(2) - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2025-10-19.
- ↑ ఎస్., మహబూబ్ బాషా (2007). "Against the Tides of Reform: Conservative Women's Journals in Colonial Andhra - the Story of "Savitri", 1904-1912". Proceedings of the Indian History Congress. 68: 1001–1020. ISSN 2249-1937.