జమాహారాలు

వికీపీడియా నుండి
(జన్యుపరంగా మార్చబడిన ఆహారం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బొప్పాయి పండ్లను రింగ్ స్పాట్ వైరస్ నుండి కాపాడుటకు జన్యుపరంగా తయారుచేసిన వంగడం.[1]

జమాహారాలు అంటే న్యుపరంగా మార్పులు పొందిన ఆహార పదార్థాలు (genetically modified foods or GM foods).

ప్రసక్తి[మార్చు]

దినుసులు, ధాన్యాలు, కూరగాయలు, పళ్లు, వగైరా లేకుండా మనకి రోజు గడవదు కదా. వీటి కోసం మొక్కలు పెంచుతాం. విత్తు నాటినది మొదలుకొని మొక్కలు ఎన్నో బాలారిష్టాలని ఎదుర్కుంటూ ఉంటాయి: ఫంగస్, వైరస్ చీడలతోపాటు పురుగులు (గొంగళి, నత్తగుల్ల), వగైరా ఎన్నో మొక్కల మీదకి దండెత్తి మొక్క ఎదుగుదలకి ప్రతిబంధకాలు కల్పిస్తూ ఉంటాయి. వీటికి తోడు కలుపు మొక్కల బెడద మరొక పక్క నుండి. వీటి బారి నుండి పంటలని కాపాడడానికి పురుగు మందులు (insecticides), కలుపు మందులు (herbicides), వగైరా రసాయనాలు వాడుతూ ఉంటాం. రసాయనాలు వాడడం ఇష్టం లేని వారు “మేలు జాతి” మొక్కలని సంపాదించి నాటవచ్చు. ఈ సందర్భంలో “మేలు జాతి” అంటే రసాయనాల అవసరం లేకుండా కాపుకి వచ్చేవి కాని, రసాయనాల ధాటికి తట్టుకుని పెరగగలిగేవి కాని, లేదా మనం ఎదురు చూసే మంచి లక్షణాలు ఉన్నవి కాని కావచ్చు.

మేలు జాతి మొక్కలని సంపాదించడం[మార్చు]

మేలు జాతి మొక్కలని ఎలా సంపాదించడం? ఒకచో, ఒక రైతు నాటిన చెరకు మొక్క నక్కలకి కొరుకుబడనంత గట్టిగా ఉందని వింటాం. మరొకరి ఇంట్లో కాసిన ద్రాక్షలో గింజలు లేవని వింటాం. అలా మంచి లక్షణం ఉన్న మొక్కలు కాకతాళీయంగా తారస పడ్డప్పుడు దాని విత్తో, కొమ్మో, మొలకో, పిలకో తెచ్చుకుని పాతుతాం. లేదా, మరొక మొక్కతో అంటు కడతాం. ఈ పద్ధతి ఒక్క మొక్కల యెడలే కాదు, జంతువుల యెడల కూడా పనిచేస్తుంది. ఈ పద్ధతిలోనే బాగా పాలిచ్చే జెర్సీ ఆవుల విత్తనాన్ని మనం అమెరికా నుండి తెచ్చుకున్నాం. మన ఒంగోలు గిత్తల విత్తు ప్రపంచం అంతా పాకిరింది. ఈ దృగ్విషయం అనాది కాలంలోనే మానవుడు అర్థం చేసుకున్నాడు. ఈ జ్ఞానం ఉపయోగించి బాగా పరిగెత్తగలిగే గుర్రాలని, వేటకి పనికొచ్చే కుక్కలని, గింజలు తక్కువగా ఉండే ఫలజాతులనీ, పొట్టిగా ఉండే కొబ్బరి చెట్లనీ, ఇలా ఎన్నింటినో తన మేథో లాఘవంతో సృష్టించుకున్నాడు, తన అవసరాలు తీర్చుకున్నాడు.

ఇక్కడ ఉదహరించిన పద్ధతులని సంకరీకరణం (hybridization) అని కాని, వరణాత్మక ప్రజననం (selective breeding) అని కాని సందర్భానుసారంగా అంటారు. పుర్వపు రోజులలో “హైబ్రిడ్” వరి, చెరకు, జొన్న దొరికేవి. వాటిని వాడడానికి ఆనాటి ప్రజలు అభ్యంతరం చెప్పినట్లు దాఖలాలు లేవు. ఇప్పుడు రోజులు మారేయి. ప్రజల శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది. ఎక్కడో, ఎప్పుడో కాకతాళీయంగా గింజలు లేని ద్రాక్ష కనిపించేవరకు ఇప్పుడు ఆగనక్కరలేదు. పనిగట్టుకుని ఆ రకం ద్రాక్షని ప్రయోగశాలలో సృష్టించవచ్చు. పంటకి తెగులు పట్టి నాశనం అయిపోతూ ఉంటే ఆ మొక్కల మీద రసాయనాలు జల్లనక్కర లేకుండా తెగులుని అడ్డుకోగలిగే సామర్ధ్యం ఉన్న కొత్త జాతి మొక్కలని సృష్టించవచ్చు. ఈ రకం వైదుష్యం ద్వారా నైసర్గికంగా మొక్కలలో కాని, జంతువులలోకాని ఉన్న జన్యు పదార్థాన్ని మన అవసరాలకి అనుకూలంగా మార్చడాన్ని జన్యు స్థాపత్యం (genetic engineering) అంటారు. సర్వసాధారణంగా ఒక జీవి లోని జన్యు పదార్థాన్ని ఇలా మార్చడానికి మరొక జీవి (అంటే, మొక్క, జంతువు, క్రిమి, కీటకం, సూక్ష్మజీవి, ఫంగస్, వైరస్, వగైరా) యొక్క జన్యు పదార్థం సహాయం అవసరం అవుతుంది. ఈ రకంగా మార్చబడ్డ ఆహార పదార్థాలని జన్యుపరంగా మార్చబడ్డ ఆహారాలు లేదా "జమాహారాలు" (లేదా, "జెనిటికల్లీ మోడిఫైడ్ ఫూడ్స్") అందాం.

‘జన్యుపరమైన మార్పు’కీ ‘సంకరీకరణానికీ’ మధ్య మౌలికమైన తేడా ఒకటి ఉంది. సంకరీకరణంలో మానవ ప్రమేయం ‘కావలసిన లక్షణాలు’ ఉన్న తల్లిదండ్రులని ఎంపిక చేసే వరకే. ‘జన్యుపరమైన మార్పు’ చేసినప్పుడు తల్లిదండ్రులిద్దరిలోనూ లేని కొత్త లక్షణాన్ని ‘బయటనుండి’ తీసుకు వచ్చి ప్రవేశపెడుతున్నాం. అంటే, సాధారణంగా సూక్ష్మజీవి, ఫంగస్, వైరస్, వగైరాల నుండి.

జన్యు స్థాపత్య విద్య[మార్చు]

అసంపూర్ణంగా మాత్రమే అర్థం అయిన ఈ జన్యు స్థాపత్య విద్యని మానవుడు శతాబ్దాల నుండి వాడుతూన్నా, ఆ శ్రమకి ఫలితం అతి నెమ్మదిగా కనిపించేది కనుక ఆ మార్పు ప్రజాబాహుళ్యపు అంగీకారం పొందవలసిన అవసరం ఉండేది కాదు. మార్పు స్పుటంగా కనిపించేసరికి నాలుగైదు తరాలు పట్టేది: కావలసిన లక్షణాలు ఉన్న తల్లిదండ్రులు దొరకాలి, వారికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలలో మనం వెతుకుతూన్న లక్షణాలు కనిపించాలి, అప్పుడు రెండో తరానికి వెళ్లాలి. ఇలా ఈ ప్రక్రియ కొన్ని తరాలు జరిగిన తరువాత మనకి కావలసిన లక్షణం ఆ సంతతిలో స్థిర పడుతుంది. అటువంటి మార్పు చూసేవారికి సహజంగానూ, నైసర్గికంగానూ కనిపిస్తుంది.

కాని ఇటీవలి కాలంలో జన్యు పదార్థపు నిర్మాణ శిల్పం పరిపూర్ణంగా అర్థం అయిన పిమ్మట, జన్యు పదార్థంలో ఉన్న అణువుల అమరిక సుబోధకం అయిన తరువాత, పైన చెప్పిన పని సాధించడానికి కొన్ని తరాలు వేచి ఉండడానికి బదులు కొద్ది సంవత్సరాలలో సాధిస్తున్నారు. అంటే ప్రకృతి నెమ్మదిగా పిల్లినడకలు వేస్తూ చేసే పనిని మానవుడు తన ప్రతిభ వల్ల ప్రయోగశాలలో త్వరిత గతిని సాధిస్తున్నాడు అన్న మాట.

జన్యు పదార్థం అంటే ఏమిటి? ప్రతి జీవకణం లోను ఆ జీవి యొక్క వారసవాహికలు (chromosomes or DNA) ఉంటాయి. ఈ వారసవాహికలలో ఉన్న పదార్థమే జన్యు పదార్థం (genome) అంటే. ఈ వారసవాహికల ద్వారానే తల్లిదండ్రుల నుండి సంతానానికి వారసత్వంగా లక్షణాలు సంక్రమిస్తాయి. ఇలా సంక్రమించిన లక్షణాలలో కొన్ని మంచివి ఉండొచ్చు, కొన్ని చెడ్డవి ఉండొచ్చు. తల్లిదండ్రుల నుండి పోలికలతోపాటు రోగాలు కూడా సంక్రమించడానికి కారణం ఇదే.

సవాళ్లు[మార్చు]

ఈ రకం జన్యుపరమైన సాంకేతిక మార్గానికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పద్ధతిలో పండించిన పంటలు అనారోగ్యాన్ని కలుగజేస్తాయని ఒకరంటే, అవి రైతుల ఆత్మహత్యలకి దారి తీస్తున్నాయని మరొకరు అంటూ ఉంటే నిజమేమిటో తెలియక ప్రజలు ఈ రకంగా తయారయిన కాయగూరలని, పళ్లనీ, దినుసులనీ, బహిష్కరిస్తున్నారు. ఈ భయానికి కారణం లేకపోలేదు కాని ఇక్కడ దోషం అంటూ ఉంటే అదెక్కడుందో కొంచెం ఓపికతో పరిశీలిద్దాం.

విత్తు నాటినది మొదలు పంట బజారుకి చేరే లోపున రైతు శత్రుగణాలని ఎదుర్కునే పోరాటం అసిధారావ్రతం లాంటిది: కలుపు మొక్కలని చంపడానికి పంట మీద కొన్ని రసాయనాలు జల్లవచ్చు. అలా జల్లినప్పుడు కలుపు మొక్క చావాలి, పంట మొక్క నిలవాలి. అందుకని కలుపు మొక్కలని చంపే మందు ధాటికి తట్టుకునే విధంగా పంట మొక్క జన్యువులలో మార్పులు తీసుకురావచ్చు. ఇలా మార్పులు తీసుకు వచ్చినప్పుడు ఆ కొత్త రకం మొక్కని సేద్యం చేసే పద్ధతిలో కొన్ని మార్పులు ఉండొచ్చు: పూర్వం కంటే ఎక్కువ నీరు పెట్టవలసి రావచ్చు. ఈ కొత్త పద్ధతి పూర్తిగా అర్థం కాక రైతు ఎప్పటిలాగే నీరు పెడితే, ఆ నీరు చాలక, పంట దిగుబడి తగ్గిపోవచ్చు. రైతుకి ధన నష్టం రావచ్చు. ఆ నష్టం భరించలేక రైతు ఆత్మహత్య చేసుకోవచ్చు. రైతు చనిపోవడం హృదయ విదారకమైన సంఘటనే. కాని ఆ మరణానికి కారణం కొత్త రకం మొక్కని సృష్టించిన “జమ సాంకేతిక” విద్య కాదు. సాంకేతిక విద్య తీసుకొచ్చే మార్పులతో సమవేగంగా సంఘం మారలేకపోవడం.

రైతు ఆత్మహత్యకి కారణం వెతుకుదాం. జమ సాంకేతిక విద్యని అవుపోశన పట్టి కొత్త రకం విత్తులు సృష్టించడం అనేది శ్రమతోటీ, ఖర్చుతోటీ కూడిన పని. కొత్త రకం విత్తనాలు సృష్టించడానికి ఏళ్ల తరబడి పరిశోధనలు చెయ్యాలి. వీటి వల్ల ప్రజల ఆరోగ్యానికి ఏ విధమైన హానీ కలగదని నిరూపించాలి. ఇదంతా చెయ్యడానికి ప్రభుత్వము, పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడుల మీద ఉత్తరోత్తర్యా లాభాలు రాకపోతే పెట్టుబడులు పెట్టేవారు ముందుకి రారు. అంటే దీనిని ఒక లాభదాయిక పరిశ్రమలా నడపాలి.

ఈ కంపెనీల వారు కోట్లకి కోట్లు పెట్టుబడి పెట్టి పరిశోధన చేసి, ఉత్పత్తి చేసిన విత్తనాలు అమ్మితేనే కదా వాళ్లకి లాభాలు వచ్చేది? అందుకని ఆ విత్తనాలు తయారు చేసే పద్ధతిని వారు పోటీదారులనుండి రక్షించుకోవాలి. ఆ గమ్యానికి సవాలక్ష మార్గాలు ఉండొచ్చు. ఒకటి, వారి పద్ధతిని వ్యాపార రహశ్యంగా దాచుకోవడం. రెండవ పద్ధతి, ఆ విత్తనాలని తయారు చేసే పద్ధతి యొక్క సర్వ హక్కులూ తమవే అని విశిష్టాధికారం (లేదా సన్నదు లేదా “పేటెంటు”) పుచ్చుకోవడం. ఆ పేటెంటు చెలామణీలో ఉన్నంత కాలం ఆ విత్తనాలు ఆ కంపెనీ దగ్గరే కొనాలి. ఆ విత్తనాలు నాటగా వచ్చిన పంటని తిరిగి విత్తనాలుగా వాడకూడదు. అంటే, ప్రతి ఏటా రైతు విత్తనాలని కంపెనీ వారి దగ్గరే కొనాలి. మరొక మార్గం లేదు. అంతే కాదు, ఆ విత్తనాలని వాడిన పొలాలలో కలుపు మొక్కలని చంపగలిగే మందు ఒక్క ఆ కంపెనీ వారి దగ్గరే దొరుకుతుంది. అంటే, ఒక విధంగా చూస్తే రైతు ఆ కంపెనీకి దాసుడు అయిపోయాడన్నమాట. అలా దాసుడు అయిపోయి కంపెనీ వారు చెప్పినట్లు చేస్తే ఆ రైతుకి మిక్కుటమైన దిగుబడి, లాభం వచ్చే సావకాశాలు ఉన్నాయి. అనగా, సాంకేతిక ప్రగతితో పాటు మన వ్యాపార దృక్పథం మారినప్పుడే పరిజ్ఞానం తెచ్చిపెట్టిన లాభాలని పూర్తిగా అనుభవించగలం.

ఈ కొత్త పద్ధతి వల్ల వచ్చిన పర్యవసానం రైతులకి అనుకూలంగా ఉన్నట్లు అనిపించడం లేదు కదా. వ్యాపారపరంగా ఆ కంపెనీలు చేసినదాంట్లో తప్పేమీ లేదు. కాని ఆ కంపెనీలతో పేచీ పడి, వారిని కోర్టులో ఎదుర్కొని రైతు గెలవలేడు. అప్పుడు ఏమిటి చెయ్యడం?

ఎవరికి తోచిన విధంగా వారు ఈ సమస్యని ఎదుర్కోవడం మొదలు పెట్టేరు. రైతుల ఆత్మహత్యలకి కారణం ఈ కంపెనీలే అని కొందరు అన్నారు. తప్పంతా “జమ సాంకేతిక” శాస్త్రానిదే అన్నారు మరికొందరు. ఈ కొత్త పద్ధతి వల్ల పెరిగిన పంటలు తింటే “కేన్సరు” వస్తోంది అని చాటించేరు, ఇంకొందరు. కాని ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తని అడిగినా "శాస్త్రంలో దోషం లేదు" అనే చెబుతున్నారు.

శాస్త్రవేత్తలు చేసే పనులలో తప్పులు ఉండవని అనడం కూడా సబబు కాదు. కాని ఏ ఆధారం చూపించకుండా మంత్రాలకి చింతకాయలు రాలుతాయని నమ్మే ప్రజలు ఎన్ని ఆధారాలు చూపించినా శాస్త్రం చెబుతూన్న విషయాన్ని నమ్మడానికి వెనుకాడతారు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ సందర్భంలోనే కాదు. ఎన్నో సందర్భాలలో ఈ దృగ్విషయం కనిపిస్తూనే ఉంటుంది. ఈ రకం అవిద్యని ప్రజలనుండి తొలగించాలంటే “శాస్త్రీయ పద్ధతి” (scientific method) అంటే ఏమిటో ప్రజలకి తెలియాలి.

మూలాలు[మార్చు]

  1. Gonsalves, D. (2004). "Transgenic papaya in Hawaii and beyond". AgBioForum. 7 (1&2): 36–40. Archived from the original on 2010-07-06. Retrieved 2013-01-20.

వర్గం: జీవ శాస్త్రం[మార్చు]

వర్గం: జన్యు శాస్త్రం[మార్చు]