జపాన్ సముద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జపాన్ సముద్రం
జపాన్ సముద్రం
జపాన్ సముద్రం

జపాన్ ద్వీప సముదాయానికి, సఖాలిన్ దీవికి, ఆసియా ప్రధాన భూభాగానికి మధ్యన ఆవరించి వున్న సముద్రాన్ని జపాన్ సముద్రం (Sea of Japan) అంటారు. ఈ సముద్రాన్ని జపాన్ ద్వీప సముదాయం పసిఫిక్ మహాసముద్రం నుండి వేరు చేస్తుంది. ఈ సముద్రానికి జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యాలు సరిహద్దు తీర దేశాలుగా ఉన్నాయి. ఈ సముద్రం తాతర్ జలసంధి, లా పెరోస్ జలసందుల ద్వారా ఒఖోటోస్క్ సముద్రంతో అనుసంధానమైంది. అదేవిధంగా కొరియా జలసంధి ద్వారా తూర్పు చైనా సముద్రం (East China Sea) తోను, సుగరు జలసంధి (Tsugaru strait) ద్వారా పసిఫిక్ మహాసముద్రంతోను అనుసంధానమైంది. జపాన్ సముద్రాన్ని కొరియాలో 'తూర్పు సముద్రం' (East Sea) గా పిలుస్తారు.

దీని చుట్టూరా గల దీవుల వలన ఈ సముద్రం పసిఫిక్ మహాసముద్రంతో దాదాపుగా వేరుపడుతున్నట్లుగా వుంటుంది. దాని వలన మధ్యధరా సముద్రం వలెనే ఈ జపాన్ సముద్రంలో కూడా అలల తాకిడి దాదాపుగా కనిపించదు.[1] ఈ ఏకాంతత వలన పసిఫిక్ మహాసముద్రంతో పోలిస్తే ఈ సముద్రపు నీటిలో లవణీయత తక్కువగా ఉండటమే కాకుండా ఇక్కడి సముద్ర జంతు జాలంలో జీవ వైవిధ్యత కనిపిస్తుంది. జపాన్ సముద్రంలో పెద్ద దీవులు, అఖాతాలు (Bay), అగ్రాలు (Capes) మొదలైనవి ఏర్పడలేదు. పొరుగున వున్న సముద్రాలు, పసిఫిక్ మహాసముద్రంను అనుసంధానిస్తున్న జలసంధులు ద్వారా జరిగే నీటి ప్రవాహ రాకపోకలు (inflow and outflow) ఈ సముద్రజలాల సమతుల్యతను నిర్ణయిస్తాయి. మొత్తం మీద కొన్ని నదులు ఈ సముద్రంలోకి ప్రవహిస్తాయి అయితే మొత్తం జలరాశి మార్పిడిలో ఈ నదుల ద్వారా జరిగేది కేవలం 1% కన్నా తక్కువగా వుంటుంది.

ఈ సముద్రపు జలాలలో కరిగివున్న ఆక్సిజన్ శాతం ఎక్కువగా వుండటంతో జీవ సంబంధ ఉత్పాదన (biological productivity) ఎక్కువగా వుంటుంది. ఫలితంగా ఈ సముద్ర తీర ప్రాంతాలలో మత్స్య పరిశ్రమ, దాని ఎగుమతుల మీద ఆధారపడిన చెందిన ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా కేంద్రీకృతమైనాయి. అయితే రాజకీయ సమస్యలవల్ల ఈ సముద్రంలో ఎగుమతుల మితంగానే జరుగుతున్నాయి. తూర్పు ఆసియా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిన ఫలితంగా ఇది క్రమేణా పెరుగుతూ ఉంది.

భౌతిక లక్షణాలు[మార్చు]

 • జపాన్ సముద్రం సుమారుగా 9,78,000 చదరపు కి.మీ. వైశాల్యంతో నాలుగు దేశాల (జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, రష్యా) ల మధ్య ఆవరించబడివుంది. ఉత్తరం నుంచి దక్షిణానికి 2255 కి.మీ., తూర్పు నుంచి పడమరకు 1070 కి. మీ. దూరం వ్యాపించి ఉంది. ఈ సముద్రంనకు తూర్పున సఖాలిన్ దీవి (రష్యా), హోక్కైడో, హోన్షు, క్యుషు దీవులు (జపాన్) ఆవరించి ఉన్నాయి. పశ్చిమాన్న కొరియా ద్వీపకల్పం, రష్యా ప్రధాన భూభాగాలు ఆవరించి ఉన్నాయి. వీటి మధ్య విస్తరించిన ఈ సముద్రం చుట్టుకొలత సుమారు 7600 కి.మీ.
 • జపాన్ సముద్రం సగటు లోతు 1,752 మీటర్లు, గరిష్ఠ లోతు 3,742 మీటర్లు.
 • ఈ సముద్రపు లవణీయత 33.7 % నుంచి 34.8 % మధ్యలో వుంటుంది.
 • సాధారణంగా జపాన్ సముద్రపు ఉత్తర భాగంలో శీతాకాలంలో సముద్ర జలాలు ఘనీభవించడం జరుగుతుంది.
 • జపాన్ సముద్రాన్ని మూడు ప్రధాన బేసిన్ లుగా విభజించవచ్చు. అవి యమాటో బేసిన్, జపాన్ బేసిన్, సుషిమా బేసిన్. వీటిలో యమటో బేసిన్ లోతు తక్కువ. జపాన్ బేసిన్ లోతైనది. సుషిమా బేసిన్ లోతు సమతలంగా వుంటుంది.
 • జపాన్ ద్వీప వక్రతకు వెనుక భాగంలో అనగా జపాన్ ద్వీప వక్రతకు ఆసియా ఖండ ప్రధాన భూభాగానికి మధ్య విస్తరించిన ‘జపాన్ బేసిన్’ బ్యాక్ ఆర్క్ బేసిన్ అవుతుంది. ఇది అక్రియాశీలక తరగతి (Non active) కి చెందినది.

వివిధ పేర్లు[మార్చు]

ఈ సముద్రానికి అంతర్జాతీయ అధికారిక నామం “జపాన్ సముద్రం” (Sea of Japan) అయినప్పటికీ, ఆ గుర్తింపుతో నిమిత్తం లేకుండా దీని సమీప తీర దేశాలలో వివిధ స్థానిక భాషా పేర్లు వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు దక్షిణ కొరియాలో ఈ సముద్రాన్ని “తూర్పు సముద్రం” (East sea) అనే అర్ధంలో Donghae (동해) అని, ఉత్తర కొరియాలో “కొరియన్ తూర్పు సముద్రం” (Korean East sea) అనే అర్ధంలో Joseon Donghae (조선동해) అని, జపాన్ లో Nihonkai 日本海 గాను, రష్యాలో “జపాన్ సముద్రం” అనే అర్ధంలో Yaponskoye more (Японское море) అని, చైనాలో కూడా “జపాన్ సముద్రం” అనే అర్ధంలో Rìběn hǎi (日本海) అనే పేర్లతో పిలుస్తారు.

నామకరణ వివాదం[మార్చు]

ఈ సముద్రానికి అంతర్జాతీయంగా “జపాన్ సముద్రం” (Sea of Japan) పేరు అధికారిక నామం వున్నప్పటికీ, ఆ గుర్తింపుతో నిమిత్తం లేకుండా ఈ సముద్రాన్ని దక్షిణ కొరియాలో “తూర్పు సముద్రం” (East Sea) గాను, ఉత్తర కొరియాలో “ కొరియా తూర్పు సముద్రం” (East Sea of Korea) గా పిలుస్తారు. అయితే ప్రపంచ హైడ్రో గ్రాఫిక్ ఆర్గనైజేషన్ (World Hydrographic Organization) 1928 లో ఈ సముద్రానికి 'జపాన్ సముద్రం' అనే పేరుని ఖరారు చేసింది. ఈ సముద్రానికి “జపాన్ సముద్రం” అని పేరు పెట్టడం పై ఉభయ కొరియా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. కొరియా దేశం జపానీస్ వలసరాజ్య పాలనలో మగ్గిన కాలంలో, జపాన్ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సముద్రానికి అంతర్జాతీయ సంస్థలు 'జపాన్ సముద్రం' అనే పేరును అధికారికంగా ఖాయం చేసాయి. అయితే స్వాతంత్ర్యానంతరం కొరియా దేశాలు ‘జపాన్ సముద్రం’ అనే పేరును ‘వలస పాలనా అవశేషం’గా భావించాయి. అంతర్జాతీయ నామకరణం విషయంలో జపాన్ దేశం “ జపాన్ సముద్రం” అనే పేరును బలపరిస్తే, ఉభయ కొరియా దేశాలు "తూర్పు సముద్రం" పేరును బలపరుస్తూ వచ్చాయి. ఈ సముద్రం యొక్క అంతర్జాతీయ అధికారిక పేరును 'తూర్పు సముద్రం' గా తిరిగి మార్చడంపై ఉభయ కొరియా దేశాలు ఎన్ని ప్రతిపాదనలు చేసినప్పటికీ, జపాన్ దేశం వాటిని తిరస్కరిస్తూ వస్తున్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా, అధికార రీత్యా ప్రపంచ అట్లాస్ లలో జపాన్ సముద్రం అనే పేరు మాత్రమే ఎక్కువగా వాడుకలో ఉంది. ఇదేవిధంగా కొరియా జలసంధి సమీపంలో గల సముద్ర బేసిన్ కు 'సుషిమా బేసిన్' అనే పేరును 1978 లో జపాన్ అంతర్జాతీయ హైడ్రోగ్రాఫిక్ బ్యూరో వద్ద రిజిస్టర్ చేయించింది. దానికి ప్రతిచర్యగా దక్షిణ కొరియా 'అలాంగ్ బేసిన్' (Ulleung Basin) పేరును రిజిస్టర్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నించడంతో కొద్దికాలం రెండు దేశాల మధ్య దౌత్య ప్రతిష్టంభన ఏర్పడింది.

తీర దేశాలు[మార్చు]

జపాన్ సముద్రానికి ఉత్తర సరిహద్దుగా 51O 45' N అక్షాంశ రేఖ, దక్షిణ సరిహద్దు రేఖగా క్యుషు దీవి-గోటో దీవులు-జేజు దీవి-దక్షిణ కొరియా ద్వీపకల్పం లను కలిపే రేఖ ఉన్నాయి. జపాన్ సముద్రానికి జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. ఉత్తరాన్న తాతర్ (లేదా తార్ తార్) జలసంధి, తూర్పు వైపున సఖాలిన్ దీవి (రష్యా), జపాన్ కు చెందిన హోక్కయిడో, హోన్షు దీవులు, దక్షిణాన్న క్యుషు దీవి (జపాన్), పడమరలో దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, రష్యా దేశాలు వ్యాపించి ఉన్నాయి.

తీర నదులు[మార్చు]

ఆసియా ప్రధాన భూభాగం నుండి కొన్ని చిన్న చిన్న పర్వతీయ నదులు తూర్పుగా ప్రవహించి జపాన్ సముద్రంలో కలుస్తున్నాయి. అవి తుమెన్ (Tumen లేదా Tumannaya), రష్యా భూభాగం నుండి రుడ్నాయ (Rudnaya), సమర్గా (Samarga), పార్టిజన్స్కాయా (Partizanskaya), తుమ్నిన్ (Tumnin) నదులు జపాన్ సముద్రంలో కలుస్తున్నాయి . వీటిలో తుమెన్ నది పెద్దది. కొరియాలో 3వ అతి పొడవైన నది అయిన తుమెన్ నది ఉత్తర కొరియాకు చైనా, రష్యా లతో ఈశాన్య సరిహద్దు నదిగా ప్రవహిస్తుంది. ఇది కున్ సోం దీవి (Kun-som) వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది.

జపాన్ కు చెందిన హొక్కయిడో, హోన్షు దీవుల నుంచి అనేక పెద్ద నదులు పశ్చిమంగా ప్రవహించి జపాన్ సముద్రంలో కలుస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి

 • ఇషికారి నది (Ishikari) : హొక్కైడొ దీవిలో అతి పొడవైన నది. ఇది ఇషికారి అఖాతం వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది.
 • షినానొ నది (Shinano) : చికుమా (Chikuma) నది అని కూడా పిలవబడే షినానో నది జపాన్ లో అతి పొడవైన నది. ఇది హోన్షు దీవిలో ప్రవహిస్తూ నిగట నగరం (Nigata) వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది.
 • అగానొ నది (Agano) ː ఇది కూడా హోన్షు దీవిలో ప్రవహించి నిగట నగరం వద్దనే జపాన్ సముద్రంలో కలుస్తుంది.
 • మొగామి నది (Mogami) ː ఇది హోన్షు దీవిలో ప్రవహించి సకత (Sakata) నగరం వద్ద జపాన్ సముద్రంలో కలుస్తుంది.
 • జపాన్ కు చెందిన పై నాలుగు అతి పెద్ద నదులు జపాన్ సముద్రంలోనే కలుస్తున్నాయి.

దక్షిణ కొరియాలో నాక్డాంగ్ (Nakdong) నది తూర్పుగా ప్రవహించి బుసాన్ నగరం వద్ద జపాన్ సముద్రంలో కలుస్తున్నది. ఇది తప్ప దక్షిణ కొరియా నుంచి ప్రవహించి కలిసే ప్రధాన నదులు (Hyeongsan నదులు లాంటివి తప్ప) పెద్దగా ఏమీ లేవు. మొత్తం మీద జపాన్ సముద్రంలో చేరవేయబడుతున్న తీర నదీ జలాలు సగటున ఏడాదికి 210 ఘనపు కిలోమీటర్లు.

తీర నగరాలు-నౌకాశ్రయాలు[మార్చు]

జపాన్ సముద్ర తీరంలో వున్న ప్రధాన ఓడరేవులు: వ్లాడివోస్తోక్, నఖొడ్కా, వనినో, సోవెట్‌స్కాయా గావన్, సఖలిన్‌స్కి, ఖోల్మస్క్, నిగటా, సురుగ, మైజురు, బుసాన్, వోన్‌సాన్, హిన్నమ్, చోంగ్జిన్ మొదలైనవి. ఇవి నౌకాశ్రయాలుగాను, కీలక మిలటరీ నౌకా స్థావరాలుగాను, పారిశ్రామిక కేంద్రాలు గాను అభివృద్ధి చెందాయి. వీటిని దేశాల వారీగా పరిశీలిస్తే

జపాన్[మార్చు]

జపాన్ సముద్రం జపాన్ పశ్చిమ తీర రేఖను సరిగా చీలకపోవడం వలన జపాన్ పశ్చిమ తీరంలో పెద్ద పెద్ద ఓడరేవులు, నౌకాశ్రయాలు ఏర్పడలేదు.
హోక్కైడో దీవి:
వక్కానై రేవు (Wakkanai port)
ఒటారు రేవు (Otaru port) ː ఇది జపాన్ లో 4వ అతిపెద్ద నగరం (Sappora) యొక్క రేవు అవసరాలను తీరుస్తుంది.

హోన్షు దీవిː

 • నిగటా (Nigata) : నిగట నగరం సమీపంలో జపాన్స దేశపు అతిపెద్ద సహజ వాయు ఉత్పత్తి క్షేత్రం ఉంది. పైగా ఈ నగరం షినానో, అగానొ అనే రెండు నదీ జలాల సంగమ ప్రాంతంలో వుండటంతో వ్యవసాయాభివృద్ధికి అవకాశాలేర్పడి ఫలితంగా ఈ నగరంలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమలు కేంద్రీకరించబడ్డాయి.
 • సురుగ రేవు (Tsuruga) : సురుగ నగరంలో న్యూక్లియర్ విద్యుత్కేంద్రం ఏర్పాటు చేయబడింది.
 • మైజురు (Maizuru) : మిలటరీ నౌకా స్థావరం

క్యుషు దీవి:

 • ఫుకౌకా రేవు (Fukuoka) ː ఇది 25 లక్షల పైగా జనాభాతో జపాన్ లో 4వ అతిపెద్ద నగరంగా ఉంది.
 • కిటాక్యుషు రేవు (kitakyushu)
 • ఫ్యూక్ రేవు (Fukue port) ː గోటో (Goto) దీవులలో గల ప్రధాన రేవు.

దక్షిణ కొరియా[మార్చు]

బుసాన్ నౌకాశ్రయం
 • బుసాన్ రేవు (Busan) : ఇది సుమారు 46 లక్షల జనాభాతో దక్షిణ కొరియాలో రెండవ అతిపెద్ద నగరం మరియి ప్రధాన పారిశ్రామిక నగరం.
 • ఉల్సాన్ రేవు (Ulsan) : ఆటోమొబైల్ పారిశ్రామిక కేంద్రం. ఇక్కద హ్యుండై కార్ల కంపెనీ కేంధ్రం, ఆయిల్ రిఫైనరీ మొదలైనవి నెలకొన్నాయి.
 • పొహాంగ్ రేవు (Pohang) : స్టీల్ ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన 'పోస్కో' (Pohang steel company - POSCO) ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంది.
 • జేజు నగరం (Jeju) ː కొరియా జలసంధి వద్ద జేజు (Jeju) దీవిలో ఈ నగరం ఉంది. ఇది అతి పెద్ద విహార, వినోద కేంద్రం. ఏడాదికి సుమారు కోటి మందకి పైగా టూరిస్టులు ఈ నగరాన్ని సందర్శిస్తారు.
 • సెగువైపో (seoɡwipo) ː జేజు దీవిలో రెండవ ప్రధాన నగరం. టూరిస్టు కేంద్రం.

ఉత్తర కొరియా[మార్చు]

 • వోన్‌సాన్ రేవు (wonsan) : మిలిటరీ నౌకా స్థావరం
 • హిన్నమ్ రేవు (Hŭngnam) : ఇది హాంహంగ్ (Hamhung) నగరానికి చెందిన సాటిలైట్ రేవు.

ఇంకా సింపో (Sinpo), టాంకన్ (tanchon), చోంగ్జిన్ (chongjin) ఇతర ముఖ్య రేవులుగా ఉన్నాయి.

రష్యా[మార్చు]

నఖొడ్కా రేవు
 • వ్లాడివోస్తోక్ (Vladivostak) ఇది రష్యాకు పసిఫిక్ తీరం లోని పెద్ద నౌకాశ్రయం, పసిఫిక్ ఫ్లీట్‌కు సంబంధించిన కీలక మిలటరీ నౌకా స్థావరం
 • నఖొడ్కా (Nakhodka) : పసిఫిక్ తీరంలో రష్యాకు చెందిన పెద్ద అంతర్జాతీయ ఓడరేవు.
 • వోస్తోక్ని రేవు (Vostochny) : రష్యాకు చెందిన అంతర్జాతీయ ఓడరేవు
 • సోవెట్‌స్కాయా గావన్ రేవు (Sovetskaya Gavan), వనీనో రేవు (Vanino port) ఇవి రెండూ టార్టరీ జలసంది వద్ద ఉన్నాయి.
 • అలెగ్జాండ్రోవిస్క్ సఖలిన్‌స్కి రేవు (Alexandrovsk-Sakhalinsky) : ఇది సఖాలిన్ దీవికి పశ్చిమ తీరంలో ఉంది.
 • ఖోల్మస్క్ రేవు (Kholmsk) : ఇది సఖాలిన్ దీవికి నైరుతి దిశలో ఉంది.

దీవులు[మార్చు]

రేబన్ ద్వీపం (రిషిరి దీవి నుండి చూస్తున్నప్పుడు)

జపాన్ సముద్రంలో పెద్ద దీవులు ఎక్కువగా ఏర్పడలేదు. చుట్టూరా ఆవరించి వున్న హోక్కైడో, హోన్షు, క్యుషు దీవుల సమీపంలో, కొరియా జల సంధిలో చిన్న చిన్న దీవులు మాత్రమే ఏర్పడ్డాయి. ఒక్క అలెంగ్ దీవి తప్ప మిగిలిన దీవులు దాదాపుగా తీర ప్రాంత సమీపంలోనే ఏర్పడ్డాయి.

 • హోక్కైడో దీవి సమీపంలో ఓకుషిరి దీవి (Okushiri), రిషిరి దీవి (Rishiri), రేబన్ దీవి (Rebun)
 • హోన్షు దీవి సమీపంలో సాడో దీవి (Sado island), ఒకి దీవులు (oki Islands)
 • కొరియా జల సంధిలోని ప్రధాన దీవులుː

సుషిమా దీవి (జపాన్)
ఇకి దీవి (Iki) (జపాన్)
గోటో దీవులు (Goto Islands) (జపాన్) ː140 కి పైగా గల దీవుల సముదాయం. వీటిలో ఫ్యూక్ దీవి (Fukue), హిసుకా దీవి (Hisuka), నారు దీవి (Naru), వాకమత్సు దీవి (Wakamatsu), నకోదోరి దీవి (Nakodori) అనేవి ప్రధానమైనవ 5 దీవులు.
జేజు లేదా జేజుడో దీవి (Jeju or Jejudo) (దక్షిణ కొరియా) ː ఇది దక్షిణ కొరియాకు చెందిన అతి పెద్ద దీవి. అగ్నిపర్వతీయ దీవి.

 • దక్షిణ కొరియా ద్వీపకల్పానికి తూర్పు వైపున గల దీవులుː

అలెంగ్ (Ulleng) దీవి (దక్షిణ కొరియా) ː ఇది కూడా అగ్నిపర్వతీయ దీవి. ఇది జపాన్ సముద్ర మధ్యభాగంలో ఏర్పడింది.
లియాన్ కోర్ట్ రాక్స్ (Liancourt Rocks) ː దక్షిణ కొరియాకు తూర్పు చివరలో జపాన్ సముద్రంలో గల చిన్న చిన్న దీవుల సముదాయం. సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా ల మధ్య వివాదాస్పద దీవులు ఇవి. ప్రస్తుతం దక్షిణ కొరియా అధీనంలో ఉన్నాయి.

 • సఖాలిన్ దీవి సమీపంలో మొనెరాన్ (Moneron) దీవి ముఖ్యమైనవి

ప్రాంతాలు(regions)[మార్చు]

జలసంధులు[మార్చు]

తాతర్ జలసంధి

జపాన్ సముద్రం 6 జలసంధుల ద్వారా ఇతర సముద్రాలతో అనుసంధానించబడింది.

 • టార్టరీ లేదా తాతర్ జలసంధి (Tartary Strait) ː అత్యంత పొడవైన ఈ జలసంది జపాన్ సముద్రానికి ఉత్తర కొసన ఉంది. ఇది రష్యా ప్రధాన భూభాగాన్ని సఖాలిన్ దీవిని వేరు చేస్తుంది. జపాన్ సముద్రాన్ని ఒఖోటోస్క్ సముద్రంతో కలుపుతుంది
 • లా పెరోస్ జలసంధి (La Perouse Strait) : ఇది సఖాలిన్ దీవి (రష్యా), హోక్కైడో దీవి (జపాన్) లను వేరు చేస్తుంది. ఇది కూడా జపాన్ సముద్రాన్ని ఒఖోటోస్క్ సముద్రంతో కలుపుతుంది. దీనికే సోయా జలసంధి అని మరో పేరు ఉంది.
 • సుగరు జలసంధి (Tsugaru Strait) ː హోక్కైడో దీవి, హోన్షు దీవుల మధ్యన ఉంది. ఇది జపాన్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. హోక్కైడో, హోన్షు దీవులను కలుపుతూ ఈ జలసంది వద్ద సముద్రగర్భంలో సీకన్ రైల్వే సొరంగం (Seikan Tunnel) నిర్మించబడింది.
 • కన్మోన్ జలసంధి (Kanmon Starit) : హోన్షు దీవి, క్యుషు దీవులను వేరు చేస్తుంది. ఇది జపాన్ సముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది.
 • సుషిమా జలసంధి (Tsushima Strait) : క్యుషు దీవి, సుషిమా దీవుల మధ్య ఉంది. ఇది జపాన్ సముద్రాన్ని తూర్పు చైనా సముద్రంతో కలుపుతుంది.
 • కొరియన్ జలసంధి (Korean Strait or passage) : సుషిమా దీవులకు, కొరియా ద్వీపకల్పానికి మధ్యన ఉంది. ఇది కూడా జపాన్ సముద్రాన్ని తూర్పు చైనా సముద్రంతో కలుపుతుంది.

పాక్షిక పరివేష్టిత సముద్రంనకు (semi-enclosed sea) చక్కని ఉదాహరణ జపాన్ సముద్రం. జపాన్ సముద్రానికి దాని చుట్టూ ఆవరించి వున్న సమీప సముద్రాలకు మధ్య జరిగే జల ప్రవాహ రాకపోకలను (inflow and outflow) ఈ సముద్ర సరిహద్దులలో ఏర్పడిన సన్నని జలసంధులు చక్కగా నియంత్రిస్తాయి. ఈ జలసంధుల ద్వారా జరిగే నీటి ప్రవాహ రాకపోకలే ఈ జపాన్ సముద్ర జలాల సమతుల్యతను నిర్ణయిస్తాయి.

ఇతర సముద్ర జలాలు ప్రధానంగా కొరియా జలసంధి, సుషిమా జలసంధుల ద్వారా జపాన్ సముద్రం లోనికి ప్రవేశిస్తాయి. సన్నని, లోతులేని తాతర్ జలసంధి ద్వారా ఇతర సముద్రాల నుండి జపాన్ సముద్రంలోనికి ప్రవేశించే సముద్ర జలాలు అతి తక్కువగా వుంటాయి. లా పెరోస్ జలసంధి, సుగారు జలసందుల ద్వారా జపాన్ సముద్రం బయటకు ప్రవహిస్తుంది.

ఈ జలసందులన్నీ ఇటీవలి సినోజోయిక్ భౌమ మహా యుగంలో (Cenozoic Era) ఏర్పడ్డాయి. వీటిలో పురాతనమైనవి సుగరు జలసంధి, సుషిమా జలసంధులు. ఇవి రెండూ నియోజిన్ పిరియడ్ ( 26 లక్షల సంవత్సరాల క్రితం) చివరలో ఏర్పడ్డాయి. ఈ జలసంధులు ఏర్పడిన తరువాత ఏనుగులు ఆసియా ప్రధాన భూభాగం నుండి హోన్షు దీవులలోనికి వలస రావడానికి ఆటంకం కలిగింది. లా పెరోస్ జలసంధి ఇటీవలి కాలానికి చెందినది. ఇది 60,000 నుండి 11,000 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ జలసంధి ఏర్పడటంతో అప్పటి వరకూ హోక్కైడో దీవిలోనికి సంచరిస్తున్న మామూత్ అనే భారీ ఏనుగుల ప్రవేశ మార్గం మూసుకుపోయింది. వీటి శిలాజాలు హోక్కైడో దీవిలో బయల్పడ్డాయి.

అఖాతాలు (Bays) , గల్ఫ్ (Gulfs)[మార్చు]

పీటర్ ది గ్రేట్ అఖాతం (రష్యా), జపాన్ సముద్రం
వ్లాడివోస్తోక్ నగరంలో వున్న గోల్డెన్ హార్న్ బే (Golden Horn Bay) పరిసరప్రాంతాలు

జపాన్ సముద్రంలో పెద్ద పెద్ద అఖాతాలు (Bay), అగ్రాలు (Capes) మొదలైనవి ఏర్పడలేదు.
రష్యా:

 • పీటర్ ది గ్రేట్ గల్ఫ్: దీనిని మురవ్యోవ్- అమురస్కి (Muravyov-Amursky) ద్వీపకల్పం రెండుగా విభజిస్తుంది. ఈ ద్వీపకల్పానికి పశ్చిమ భాగంలో వున్న గల్ఫ్ ప్రాంతాన్ని అముర్ అఖాతం (Amur bay), తూర్పు భాగంలో వున్న గల్ఫ్ ప్రాంతాన్ని ఉస్సురి అఖాతం (Ussuri Bay) గా వ్యవహరిస్తారు. వ్లాడివోస్తోక్ (Vladivostak) నగరం ఈ ద్వీపకల్పం మీదనే ఉంది. ఈ రెండు అఖాతాల తీర ప్రాంతాలు ప్రముఖ రిసార్ట్స్ కేంద్రాలుగా పేరుగాంచాయి.
 • జోలటాయ్ రాగ్ అఖాతం (Zolotoy Rog bay) : వ్లాడివోస్తోక్ నగరంలో వున్న కొమ్ము (horn) ఆకారంలో వంపు తిరిగివున్న ఒక అఖాతం.దీన్నే గోల్డెన్ హార్న్ బే (Golden Horn Bay) అని కూడా పిలుస్తారు.
 • లాజుర్నాయా అఖాతం (Lazurnaya Bay) : ఉస్సురి అఖాతంలో ఒక చిన్న భాగం. మురవ్యోవ్-అమురస్కి ద్వీపకల్పానికి తూర్పున ఉంది. హాలిడే రిసార్ట్స్ ప్రాంతం.
 • వొస్తోక్ అఖాతం (Vostok Bay) : ఇది వేసవి విడిది ప్రాంతాలకు నిలయం
 • నఖోడ్క అఖాతం లేదా గల్ఫ్ (Nakhodka Bay or Nakhodka Gulf) : ఈ అఖాతంలో పసిఫిక్ సముద్ర జలాలు శీతాకాలంలో కూడా ఘనీభవించవు. ఈ ప్రత్యేక పరిస్థితులున్నందువల్ల ఇక్కడి నఖోడ్క నౌకాశ్రయంలో నౌకల ట్రాఫిక్ చాలా ఎక్కువగా వుంటుంది. రష్యా దూర ప్రాచ్యంలో అతిపెద్ద రవాణా జంక్షన్లలో నఖోడ్క రేవు ఒకటి.

ఇవే కాకుండా రష్యా తీరం లోని ఓల్గా అఖాతం, వ్లాదిమిరా అఖాతం, పోసెట్ అఖాతం (Posyet bay), సోవెట్‌స్కాయా గావన్ అఖాతం (Sovetskaya Gavan bay) లు మరికొన్ని ముఖ్యమైనవి.

జపాన్:
హోక్కైడో దీవికి సంబంధించిన అఖాతాలుː ఇషికారి అఖాతం (Ishikari bay), సోయా అఖాతం (Soya bay)
హోన్షు దీవికి సంబంధించిన అఖాతాలుː టోయమా అఖాతం (Toyama bay), వకాసా అఖాతం (Wakasa bay), మిహో అఖాతం (Miho bay)

ఉత్తర కొరియా:
తూర్పు కొరియా అఖాతం (East Korea bay) ː వాన్ సాన్ రేవు (wonsan), హిన్నం (Hŭngnam, సింపో (Sinpo), టాంకన్ (Tanchon) మొదలైన రేవు లన్నీ ఈ అఖాతంలోనే ఉన్నాయి.

ప్రముఖ అగ్రాలు (Capes)[మార్చు]

హోక్కైడో దీవికి సంబంధించిన అగ్రాలు:
హోక్కైడో దీవికి ఉత్తరాన్న కేప్ సోయా (Cape Soya), తూర్పున కేప్ నోసప్పు (Cape Nosappu), దక్షిణాన్న కేప్ శిరాకమ్ల్ (Cape Shirakaml) లు ఉన్నాయి. రేబన్ (rebun) దీవికి సంబంధించి అగ్రాలలో కేప్ సుకోటన్ (Cape sukoton), కేప్ గోరోటో (Cape Goroto), కేప్ సుకై (Cape Sukai) లు ముఖ్యమైనవి.

రష్యాకు సంబంధించిన అగ్రాలుː
కేప్ లాజరేవా (Cape Lazareva) ː రష్యా ప్రధాన భూభాగంలో తాతర్ జలసంధి వద్ద ఉంది.
కేప్ పోజుబై (Cape Pogibi) ː సఖాలిన్ దీవిలో తాతర్ జలసంధి వద్ద ఉంది.
కేప్ పోవరోట్ని (Cape povorotny)
కేప్ క్రిలాన్ (Cape krilyon or Crillon) ː సఖాలిన్ దీవికి దక్షిణ అగ్రం

సముద్ర జలాంతర్గత నిమ్నోన్నతాలు (Submarine relief)[మార్చు]

జపాన్ సముద్రపు నిమ్నోన్నతాలు (Relief)

జపాన్ సముద్రం యొక్క నిమ్నోన్నత స్వరూపం ఖండ తీరం, ఖండ తీరపు అంచు (Continental Shelf), ట్రెంచ్ లు, సముద్ర అంతర్గత పర్వతాలు (Sea Mountains), రిడ్జ్ లతో కూడివుంది.

జపాన్ సముద్రపు తూర్పు తీరంలో, ఖండతీరపు అంచు ఎక్కువ వెడల్పుతో విస్తారంగా వుంటుంది. కాని పశ్చిమ తీరంలో ముఖ్యంగా కొరియా తీరం ఇరుకుగా వుండి సగటున సుమారు 30 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే కలిగి వుంటుంది. జపాన్ సముద్రపు ఖండ తీరపు అంచులో ఆయిల్, సహజ వాయువు, మాగ్నటైటు ఇసుక వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. సముద్రానికి తూర్పున వున్న జపాన్ దీవుల తీరం కూడా సమతలంగాను, తక్కువ ఖండతీరపు వాలుతో వుంటుంది. కాని పశ్చిమ తీరంలో ముఖ్యంగా కొరియా తీరంలో ఖండ తీరం నిట్రం (steep slope) గాను, ఎగుడుదిగుడులతోను, రాతిమయం గాను ఏర్పడింది.

గతంలో మంచు యుగం ఉచ్ఛ స్థితిలో వున్నప్పుడు సముద్ర జలమట్టం ప్రస్తుతమున్న సముద్రమట్టాలకంటే తక్కువగా వుండేది. ఆ సమయంలో జపాన్ దీవులు ఆసియా ప్రధాన భూభాగంతో కలిసిపోయి వుండేవని, ఆ విధంగా కలసిపోయినప్పుడు జపాన్ సముద్రం ఒక భూపరివేష్టిత సముద్రంగా (ప్రస్తుత కాస్పియన్ సముద్రం వలె) వుండేదని భూగర్భ శాస్రవేత్తలు భావిస్తున్నారు.[2]

జపాన్ సముద్ర గర్భంలో ఏర్పడిన సీ మౌంటైన్స్ లలో యమాటో, కిటా-ఒకిలు ముఖ్యమైనవి. ట్రెంచ్ లలో ఒకి ట్రెంచ్ (గరిష్ఠ లోతు 3699 మీ.), హోన్షు ట్రెంచ్ (3063 మీ.), సుషిమా ట్రెంచ్ (2300 మీ.) లు ముఖ్యమైనవి.

జపాన్ సముద్రపు బేసిన్ సినోజోయిక్ మహా యుగంలో ఏర్పడింది. ఖండ భాగాలు దూరంగా జరుగుతూ, ఆసియా ప్రధాన ఖండం నుండి విడిపోవడంతో ఇది ఏర్పడింది. జపాన్ సముద్రాన్ని మూడు ప్రధాన బేసిన్ లుగా విభజించవచ్చు. అవి యమాటో బేసిన్, జపాన్ బేసిన్, సుషిమా బేసిన్. వీటిలో యమాటో బేసిన్ లోతు తక్కువ. జపాన్ బేసిన్ లోతైనది. సుషిమా బేసిన్ లోతు సమతలంగా వుంటుంది. యమాటో బేసిన్ (Yamato Basin) ఆగ్నేయంగా విస్తరించి ఉంది. ఇక్కడ సముద్ర జలాల లోతు తక్కువ. సముద్ర మట్టం నుండి 285 మీటర్ల లోతు లోపలనే సముద్రపు అడుగు భాగం కనిపిస్తుంది.
జపాన్ బేసిన్ (Japan Basin) : ఉత్తరంగా విస్తరించి ఉంది. చాలా లోతైనది. పురాతనమైనది. జపాన్ ద్వీప వక్రతకు వెనుక భాగంలో అనగా జపాన్ ద్వీప వక్రతకు ఖండాలకు మధ్యన స్పష్టంగా విస్తరించిన ‘జపాన్ బేసిన్ ’ బ్యాక్ ఆర్క్ బేసిన్ అవుతుంది. పురాతనమైన ఈ జపాన్ బేసిన్ అడుగుభాగం రిడ్జ్ లతోను బసాల్ట్ శిలలను విస్తారంగా కలిగివుంది. ఇది అక్రియాశీలక తరగతి (Non active) కి చెందినది.
సుషిమా బేసిన్ (Tsushima Basin) : నైరుతిగా విస్తరించి ఉంది. కొరియా జలసంధి సమీపంలో ఈ బేసిన్స సమతలంగా విస్తరించింది. దీనినే కొరియాలో అలాంగ్ బేసిన్ (Ulleung Basin) అని పిలుస్తారు.

సముద్ర జల వ్యవస్థలు[మార్చు]

జపాన్ సముద్రం, జపాన్ ద్వీప సముదాయం పరిసర ప్రాంతాలలో సముద్ర ప్రవాహాలు : 1. కురోషియో కవోష్ణ ప్రవాహం 2. కురోషియో పొడిగింపు 3. కురోషియో వ్యతిరేక ప్రవాహం 4. సుషిమా కవోష్ణ ప్రవాహం 5. సుగారు ప్రవాహం 6. సోయా ప్రవాహం 7. ఒయోషియో ప్రవాహం 8. లీమన్ శీతల ప్రవాహం

సముద్ర జల ప్రవాహాలు (Oceanic currents)[మార్చు]

జపాన్ సముద్రంలో సముద్ర జల ప్రవాహాలు (సుషిమా కవోష్ణ ప్రవాహం, లీమన్ శీతల ప్రవాహం తదితర సముద్ర ప్రవాహాలు) సాధారణంగా అపసవ్యదిశలో ప్రవహిస్తాయి. ఉత్తర పసిఫిక్ భూమధ్యరేఖా కవోష్ణ సముద్ర ప్రవాహంలో కొంత భాగం కురోషియో కవోష్ణ ప్రవాహం (Kuroshiyo Warm current) (లేదా జపాన్ ప్రవాహం) రూపంలో జపాన్ తూర్పు తీరం వైపుగా ప్రవహిస్తుంది. ఈ కురోషియో కవోష్ణ సముద్ర ప్రవాహంలో కొంతభాగం కొరియా జలసంధి వద్ద చీలి సుషిమా కవోష్ణ ప్రవాహం (Tsushima Warm current) గాను, తూర్పు కొరియా కవోష్ణ ప్రవాహం (East korea warm current) గాను జపాన్ సముద్రంలోనికి ప్రవేశిస్తాయి. జపాన్ సముద్రంలో ప్రవేశించిన సుషిమా కవోష్ణ ప్రవాహం జపాన్ పశ్చిమ తీరం వైపుగా ప్రవహిస్తూ జపాన్ పశ్చిమ తీర ప్రాంత శీతోష్ణస్థితిని అతిశీతల ప్రభావానికి గురికాకుండా మృదువుగా వుంచడానికి దోహదం చేస్తింది. తూర్పు కొరియా కవోష్ణ ప్రవాహం కొరియా ద్వీపకల్పానికి ఆగ్నేయంగా ప్రవహిస్తుంది. ఈవిధంగా సుషిమా కవోష్ణ ప్రవాహం, తూర్పు కొరియా కవోష్ణ ప్రవాహాలు రెండూ జపాన్ సముద్రంలో ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ తమతోపాటు లవణీయత కాస్త ఎక్కువగా వున్న కవోష్ణ సముద్ర జలాలను జపాన్ సముద్రంలోనికి చేరవేస్తాయి. ఈ సముద్ర ప్రవాహాలు ఒకవైపు నుండి సుగారు జలసంధి ద్వారా సుగారు ప్రవాహం (Tsugaru current) గా పసిఫిక్ మహాసముద్రంలోనికి, మరోకవైపు నుండి లా పెరోస్ జలసంధి ద్వారా సోయా ప్రవాహం (Soya current) గా ఒఖోటోస్క్ సముద్రంలోనికి ప్రవహిస్తాయి.

జపాన్ సముద్రం యొక్క ఉత్తరం వైపు నుండి మూడు శీతల సముద్ర ప్రవాహాలు తాతర్ జలసంధి గుండా జపాన్ సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి-లీమన్ శీతల ప్రవాహం (Liman cold current), ఉత్తర కొరియా శీతల ప్రవాహం (North korea cold current-NKCC), మధ్య జపాన్ శీతల ప్రవాహం (Mid Japan cold current) లు ఆసియా ప్రధాన భూభాగపు తీరం వైపుగా ప్రవహిస్తూ తమతోపాటు లవణీయత కాస్త తక్కువగా వున్న శీతల సముద్ర జలాలను జపాన్ సముద్రంలోనికి తీసుకువస్తాయి.

సముద్ర జల రాశులు (Water masses)[మార్చు]

జపాన్ సముద్రం దాదాపుగా భూ పరివేష్టిత సముద్రంగా వుండటం, విభిన్నమైన మూడు ప్రధాన సముద్ర బేసిన్లు కూడివున్న కారణంగా ఈ సముద్రంలో మూడు విభిన్న జలరాశులు (water masses) ఏర్పడతాయి. వేసవికాలంలో అధిక వాయు ఉష్ణోగ్రతల కారణంగా ఈ సముద్ర ఉపరితల జలాలు బాగా వేడెక్కుతాయి. దీని వల్ల ఉపరితల జలరాశి (Surface water masses) కి మధ్య జలరాశి (Middle water masses) ల యొక్క నీటి పొరలను వేరు చేస్తూ అధిక ఉష్ణోగ్రత, అధిక లవణీయత లతో కూడిన ఒక విభిన్నమైన ఉష్ణోగ్రతా ప్రవణత (Thermal gradient) ఏర్పడుతుంది. ఈ మధ్య జలరాశికి మూలస్థానం శీతాకాలంలోను, వసంతకాలంలోను క్యుషు దీవి తీర సమీపంలో ప్రవేశిస్తున్న సుషిమ కవోష్ణ సముద్ర ప్రవాహం యొక్క మధ్యంతర నీటి పొరలలో ఉంది. మూడవది అయిన లోతైన జలరాశి (deep water masses) ముఖ్యంగా ఫిబ్రవరి, మార్చి నెలలలో ఏర్పడుతుంది. ఈ నెలలలో జపాన్ సముద్రపు ఉత్తర భాగంలో గడ్డకట్టుకుపోయే అతిశీతల పరిస్థితులు ఏర్పడటంతో లోతైన జలరాశి ఏర్పడుతుంది. ఈ జలరాశి ఉష్ణోగ్రతలు 0oC నుండి 0.5 oC కనిష్ఠం వరకూ చేరుకొంటాయి. ఈ అతిశీతల జలరాశి వల్ల నీటిలో కరిగివున్న ఆక్సిజన్ శాతం బాగా పెరుగుతుంది. ఫలితంగా జపాన్ సముద్రంలో మత్స్య ఉత్పాదకత అధికంగా పెరగడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి.

శీతోష్ణస్థితి[మార్చు]

జపాన్ సముద్రం, జపాన్ దేశపు శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తుంది. జపాన్ సముద్ర జలాలు సాపేక్షంగా కాస్త వెచ్చగా వుంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో కూడా బాష్పీభవనం (evaporation) గమనించదగిన స్థాయిలో వుంటుంది. ఈ ప్రాంతంలో ధ్రువ ప్రాంతపు అతిశీతల శుష్క వాయు రాశి (Cold, dry polar air mass), ఆయనరేఖా ప్రాంతపు కవోష్ణ ఆర్ద్ర వాయు రాశులు (Warm, moist tropical air mass) కలుస్తాయి. దీనివలన వాటి మధ్య పరస్పర చర్య జరిగి తత్ఫలితంగా వాతావరణంలోనికి పెద్ద ఎత్తున నీటి ఆవిరి చేరుతుంది. ఇవన్నీ జపాన్ దేశపు ముఖ్యంగా పశ్చిమ జపాన్ శీతోష్ణస్థితిని ప్రభావితం చేస్తాయి.

డిసెంబరు నుండి మార్చి మధ్యకాలంలో ఖండాంతర ధ్రువ ప్రాంతాలనుంచి వీచే అతి శీతల శుష్క వాయురాశులు, వాయవ్య ఋతుపవనాల కారణంగా జపాన్ సముద్రపు వెచ్చని జలాలపై వీస్తాయి. దీని వలన జపాన్ పశ్చిమ తీర ప్రాంతంలో పర్వతాల వెంబడి మంచు పేరుకుపోతుంది.

వేసవికాలంలో ఉత్తర పసిఫిక్ మహాసముద్రం నుండి ఆసియా ఖండ ప్రధాన భూభాగానికి దక్షిణ ఆయనరేఖా ఋతుపవనాలు (southerly tropical monsoon) వీస్తాయి. ఇవి కవోష్ణ ఆర్థ పవనాలను మోసుకువస్తాయి. అదే సమయంలో జపాన్ సముద్ర ఉత్తర భాగపు జలాలలో శీతల సముద్ర ప్రవాహాలు ప్రవహిస్తాయి. ఈ కవోష్ణ ఆర్థ పవనాలు శీతల సముద్ర ప్రవాహాలపైన వీయడం వల్ల దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది.

సాధారణంగా శీతాకాలంలో వీచే రుతుపవనాలు జపాన్ సముద్రాన్ని కల్లోలభరితం చేస్తాయి. ఫలితంగా జపాన్ పశ్చిమ తీరం వెంబడి తీర ప్రాంతం తీవ్రమైన కోతకు గురవుతుంది.

శీతాకాలంలో జపాన్ సముద్రపు ఉత్తర భాగంలో గడ్డ కట్టుకు పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా సైబీరియా తీరం, తాతర్ జలసంధి ప్రాంతం, ఉత్తర హోక్కైడో ప్రాంతాలలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 0oC కన్నా దిగువకు పడిపోవడం వలన ఉత్తర జపాన్ సముద్రం ఘనీభవిస్తుంది. ఇలా శీతాకాలంలో ఘనీభవించిన సముద్రం తిరిగి వసంతకాలంలో సంవహన ప్రక్రియ వలన కరగడం ప్రారంభిస్తుంది. వసంతకాలంలోను, తదనంతర వేసవికాలంలోను కరిగిన ఈ మంచు, జపాన్ సముద్రంలో ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణించే శీతల సముద్ర ప్రవాహాలకు కావలిసిన శీతల జలాలను సమకూరుస్తుంది.

ఆర్ధిక ప్రాముఖ్యత[మార్చు]

జపాన్ సముద్ర వనరులు రెండు రకాలుగా ఉన్నాయి. అవి 1. మత్స్య వనరులు 2. ఖనిజ నిక్షేపాలు.

మత్స్య వనరులు[మార్చు]

దక్షిణం నుంచి ప్రవహించే కవోష్ణ సముద్ర ప్రవాహం, ఉత్తరం నుంచి ప్రవహించే శీతల సముద్ర ప్రవాహం ఈ జపాన్ సముద్రంలో కలియడం వలన జపాన్ సముద్ర జలాలలో మత్స్య సంబంధిత జీవ ఉత్పాదన ఎక్కువగా వుంటుంది. శీతల జలాలలో లభించే చేపలు, కవోష్ణ జలాలలో లభించే చేపలు ఇక్కడ లభ్యం అవుతాయి. జపాన్ సముద్ర తీర దేశాలలో సముద్ర చేపల వేట ప్రధాన ఆర్థిక రంగం. వీటి వల్ల జపాన్ సముద్రం ప్రపంచ మత్స్య ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా పేరుగాంచింది. 2009 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా లభించిన చేపల ఉత్పత్తిలో 5 శాతం వాటా ఈ సముద్రం నుండే లభించింది.

ముఖ్యంగా జపాన్ సముద్రపు ఉత్తర భాగం, ఆగ్నేయ భాగంలలో చేపలు పుష్కలంగా లభిస్తాయి. అందువలన ఈ సముద్ర తీర దేశాలలో (జపాన్, రష్యా, ఉభయ కొరియా దేశాలు) మత్స్య పరిశ్రమ ఒక ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. ఈ సముద్రంలో చేపలు పుష్కలంగా లభించే ప్రాంతాలకు సమీపంలో వున్నటువంటి కొన్ని చెదురుమదురు దీవుల పైన రేగుతున్న వివాదాల బట్టే ఇక్కడి మత్స్య వనరుల ప్రాధాన్యత అవగతమవుతుంది. ఉదాహరణకు దక్షిణ కొరియాకు చెందిన డొకోడొ (Dokodo) దీవులు లేదా తకెషిమా (Takeshima) దీవుల పై దక్షిణ కొరియా-జపాన్ దేశాల మధ్య వివాదం ఉంది. అదే విధంగా ప్రస్తుతం దక్షిణ కొరియా ఆధీనంలో వున్న లియాన్ కోర్ట్ రాక్స్ (Liancourt Rocks) ల హక్కులపై దక్షిణ కొరియా-జపాన్ దేశాల మధ్య 1950 నుంచీ సుదీర్ఘ వివాదం నెలకొంది.

జపాన్ సముద్ర ప్రాంతంలో లభించే చేపలు:
పెలాజిక్ (సముద్ర పై పొరలలో సంచరించే) చేపలలో మెకేరళ్ (Mackeral), హార్స్ మెకేరళ్, సార్డైన్ (Saardain), అంకోవీస్ (Anchovies), హెర్రింగ్ (Herring), sea bream, స్క్విడ్ (Squid) రకాలు ముఖ్యమైనవి. Demersal (సముద్రపు అడుగుభాగంలో సంచరించే) చేపలలో కాడ్ చేప (Cod), అలస్కా పొలాక్ (Alaska Pollack), అట్కా మెకేరళ్ (Atka mackerel) రకాలు ముఖ్యమైనవి. స్క్విడ్ చేపల వేట ముఖ్యంగా సముద్ర మధ్య భాగంలో జరుగుతుంది. సాల్మన్ చేపలు గుంపులు గుంపులుగా ఉత్తర, నైరుతి జపాన్ సముద్ర భాగాలలో లభిస్తాయి. క్రస్టేషియస్ తరగతికి చెందిన ష్రిమ్ప్ (Shrimps), పీతలు లోతైన సముద్ర జలాలలో లభిస్తాయి.

ఖనిజ వనరులు[మార్చు]

జపాన్ సముద్రం ఖనిజ వనరులకు ముఖ్యంగా సముద్ర అడుగు భాగంలో లభించే మాగ్నటైటు ఇసుక (Magnatite sand) కు ప్రసిద్ధి చెందింది. జపాన్ తీర ప్రాంతానికి దూరంగా వున్న లియాన్ కోర్ట్ రాక్స్ (Liancourt Rocks) వంటి ప్రాంతాలలో నేచురల్ గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా సఖాలిన్ దీవిలో నేచురల్ గ్యాస్ నిక్షేపాలుతో పాటు పెట్రోలియం నిక్షేపాలు కూడా ఉన్నాయి.

నౌకా వాణిజ్య మార్గంగా జపాన్ సముద్రం[మార్చు]

జపాన్ సముద్రం, దాని చుట్టూ ఆవరించి వున్న తీర దేశాల (జపాన్, రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా) మధ్య ముఖ్యమైన నౌకా వాణిజ్య మార్గంగా ఉంది. అయితే ఇక్కడి ఓడరేవుల ద్వారా జరిగే నౌకా వాణిజ్యం ఎక్కువగా ఆయా దేశపు రేవులకే పరిమితంగా ఉంది.

జపాన్ అంతర్జాతీయ వాణిజ్యం ఎక్కువగా తీర ప్రాంతం లేని దేశాలతో జరుగుతుండటం వలన, జపాన్ లోని ప్రధాన ఓడరేవులన్నీ పసిఫిక్ మహాసముద్రం తీరంలోనే కేంద్రీకరించబడ్డాయి. అందువల్ల జపాన్ సముద్ర తీరంలో (జపాన్ పశ్చిమ తీరంలో) చెప్పుకోతగ్గ అంతర్జాతీయ ఓడరేవులు అభివృద్ధి చెందలేదు.

దక్షిణ కొరియాకు చెందిన ప్రధాన రేవులు బుసాన్, ఉల్సాన్, పోహాంగ్ రేవులు. అయితే ఈ రేవుల ద్వారా జరిగే నౌకా వాణిజ్యం కూడా చుట్టూరా వున్న తీర దేశాలకు కాకుండా దక్షిణ కొరియా ఇతర రేవులకే పరిమితమవుతున్నాయి.

రష్యా ఓడరేవులలో వ్లాడివోస్తోక్ రేవు గుండా జరిగే వాణిజ్యం ఇతర రష్యన్ రేవులకే పరిమితం. నఖొడ్కా, వోస్తోక్ని రేవుల ద్వారా మాత్రం అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతుంది.

అయితే దక్షిణ కొరియా సాధించిన ఆర్థికాభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలలో రష్యా కనపరుస్తున్న ఆసక్తి ముఖ్యంగా తూర్పు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో జపాన్ సముద్ర తీర దేశాల మధ్య అంతర్జాతీయ వాణిజ్యం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది.

వీటిని కూడా చూడండి[మార్చు]

జపాన్

రిఫరెన్స్‌లు[మార్చు]

 • Sea of Japan [1] Encyclopedia Britanica
 • Japanese Sea [2] Great Soviet Encyclopedia (in Russian)
 • Majid Husain (2002) Fundamentas of Physical Geography (2nd ed)

వెలుపలి లింకులు[మార్చు]

 • The Issue of the Name of the Sea of Japan [3] Ministry of Foreign Affairs of Japan
 • The Name - Sea of Japan (Japan Sea) [4] Hydrographic and oceanographic department, Japan
 • Sea of Japan photos [5]
 • SEA OF JAPAN COAST [6]
 • of Japan vs. East Sea Center for security studies 25 July 2012
 • General Information on Climate of Japan [7]
 • Sea of Japan (Large Marine Ecosystems) [8] Archived 2019-03-25 at the Wayback Machine One shared ocean
 • Sea of Japan [9] (in Russian)

సూచికలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Tides in Marginal, Semi-Enclosed and Coastal Seas – Part I: Sea Surface Height". ERC-Stennis at Mississippi State University. Archived from the original on 2004-03-18. Retrieved 2017-01-03.
 2. Totman, Conrad D. (2004). Pre-Industrial Korea and Japan in Environmental Perspective.