జలియన్ వాలాబాగ్ దురంతం

వికీపీడియా నుండి
(జలియన్ వాలా బాగ్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దుర్ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత దృశ్యం

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు.[1]

నేపథ్యం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులు భారతీయులను సహాయం కోసం అడిగితే తిరుగుబాటు చేస్తారనుకున్నారు. కానీ వారి భయానికి విరుద్ధంగా ప్రధాన రాజకీయ నాయకత్వాల నుంచి విశేషంగా స్పందన లభించింది. వారికి ఆ యుద్ధంలో సహాయపడటం ద్వారా వారి నుంచి స్వాతంత్ర్యం పొందాలని వారి ఆలోచన. యుద్ధానికి భారతీయ సైన్యాలను పంపించి వారికి సాయం చేశారు. దాదాపు 13 లక్షల మంది భారతీయ సైనికులు యూరోపు, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో తమ సేవలందించారు. భారతీయ రాజులు తమ శక్తి మేరకు ధనాన్ని, ఆహారాన్ని, ఆయుధాలను పంపించారు. కానీ బెంగాల్, పంజాబ్ లలో మాత్రం వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. బెంగాల్‌లో ఉగ్రవాద తరహా దాడులు, పంజాబ్ లో నానాటికీ పెరుగుతున్న అశాంతి, ఆయా ప్రాంతీయ పరిపాలనా విభాగాలను ఇరుకున పెట్టాయి.[2][3] ఈ యుద్ధం ప్రారంభం నుంచే అమెరికాలోనూ, కెనడా, జర్మనీలలో ఉంటున్న కొద్దిమంది భారతీయులు బెర్లిన్ కమిటీ, గదర్ పార్టీ నేతృత్వంలో, ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ, జర్మన్, టర్కీల సహకారంతో 1857 సిపాయిల తిరుగుబాటు తరహాలోనే ఉద్యమం లేవదీయాలని చూశారు. దీన్నే హిందూ జర్మన్ కుట్ర అని కూడా అంటారు.[4][5][6] దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ను కూడా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నించారు.[7] బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు విఫల యత్నాలు చేశారు వీటిలో గద్దర్ కుట్ర, సింగపూర్ కుట్ర ప్రధానమైనవి. కానీ ఈ ఉద్యమాలు విస్తృతమైన గూఢచార సమాచారంతో, కఠినమైన రాజకీయ శాసనాలతో అణచివేయడం జరిగింది. ఈ చట్టాలు దాదాపు పదేళ్ళపాటు అమలులో ఉన్నాయి.[8][9]

యుద్ధం తరువాత

[మార్చు]

యుద్ధం తరువాత చాలామంది క్షతగాత్రులయ్యారు. ద్రవ్యోల్బణం అధికమైంది. దానితోపాటు అధిక పన్నులు ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. అంటువ్యాధులు ప్రభలాయి. వాణిజ్య వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రజలు అనేక బాధలకు లోనయ్యారు. భారతీయ సైనికులు ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి చాటుమాటుగా ఆయుధాలు తరలించడం మొదలుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ లోని మితవాదులు, అతివాదులు తమలో తామే భేదాలను పరిష్కరించుకోవడంతో యుద్ధానికి పూర్వం ప్రారంభమైన జాతీయవాద ఉద్యమం మళ్ళీ తిరిగి పుంజుకుని ఒక ఐక్యకూటమిగా ఏర్పడింది. 1916 లో ముస్లిం లీగ్ తో రాజకీయ అధికారం పైన ప్రాంతంలోని ముస్లింల భవిష్యత్తు గురించి తాత్కాలికంగా లక్నో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సుదీర్ఘంగా కొనసాగుతున్న పోరాటానికి నిధులు, మానవ వనరులూ సమకూరుతూనే ఉన్నాయి. ఆంగ్లేయులు భారతదేశంలో ఉన్నకొద్దీ భారతీయుల అసహనం ఎక్కువకాసాగింది. భారతదేశం ఆంగ్లేయులకు భారీగా సైనికులను, ధనాన్ని సరఫరా చేయడమే కాకుండా దాదాపు 43,000 మంది సైనికుల్ని కోల్పోయింది.

యుద్ధానంతర మార్పులు

[మార్చు]

భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆంగ్లేయులకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా భారతీయులు తమకు పూర్తి స్వాతంత్ర్యం కాకపోయినా కనీసం పరిపాలనలో తమ మాట చెల్లుబాటు కావాలని భావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బ్రిటీష్ ప్రభుత్వం పరిపాలనలో మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను ప్రవేశపెట్టింది. కానీ భారతీయ స్వాంతంత్ర్యోద్యమ నాయకురాలు మేడమ్ భికాజీ కామా భారతీయులకు ఆ సంస్కరణలు ఏమాత్రం సరిపోవని వ్యాఖ్యానించింది. దీంతో అప్పటిదాకా రగులుతున్న పోరాటానికి ఆజ్యం పోసినట్లయింది.

రౌలట్ కమిటీ

[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రూపొందించబడిన గదర్‌ కుట్ర (Ghadar conspiracy), మహేంద్ర ప్రతాప్ ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ఆపద్ధర్మ ప్రభుత్వం, రష్యాతో దానికిగల సంబంధాలు, పంజాబ్, బెంగాల్ లో నానాటికీ పెచ్చరిల్లుతున్న విప్లవోద్యమం, భారత ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తి (ముఖ్యంగా బాంబే మిల్ వర్కర్స్ లో), మొదలైన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ ప్రభుత్వం 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తియైన సిడ్నీ రౌలట్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనినే రౌలట్ కమిటీ అంటారు. ఈ కమిటీ భారతదేశంలో (ముఖ్యంగా పంజాబ్, బెంగాల్ ప్రాంతాలలో) మిలిటెంట్ ఉద్యమానికీ, రష్యా, జర్మనీకి ఏదైనా సంబంధం ఉందేమో బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

రౌలట్ చట్టం

[మార్చు]

రౌలట్ కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్ ప్రభుత్వం 1915లో ఏర్పాటు చేయబడ్డ భారతీయ రక్షణ చట్టానికి అదనంగా రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించింది.[10][11][12][13] ఈ చట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచివేయడానికి వైస్రాయ్ లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. ప్రెస్ నోళ్ళను కట్టేయడానికీ, విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, తిరుగుబాటు దారునిగా అనుమానితులైన వ్యక్తులను వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం పై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

దుర్ఘటన

[మార్చు]
తోటలో గల అమరవీరుల స్మారక బావి

1919, ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ లోగల స్వర్ణ దేవాలయం పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అది వైశాఖ మాసం, సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన రౌలట్ చట్టం క్రింద సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.

జలియన్ వాలాబాగ్ లో తుపాకి బుల్లెట్ల గుర్తులు

వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు సురక్షిత వాహనాలు (armoured cars అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి.

కాల్పుల కారణంగా వందలమంది మరణించారు. గాయపడినవారి సంఖ్య వేలల్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారం మొత్తం 379 మంది (337 పురుషులు, 41 మంది బాలురు, 6 వారాల పసికందు) మరణించారు, 200 మంది గాయపడ్డారు. అక్కడ స్మారక చిహ్నంపైన వ్రాసిన సమాచారం ప్రకారం అక్కడి బావిలోంచి 120 శవాలను బయటకు తీశారు. అయితే అధికారిక గణాంకాలు సరికాదని వాదనలున్నాయి. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున గాయపడినవారని ఆసుపత్రులకు తీసికొని వెళ్ళడం సాధ్యం కాలేదు.

తన ఆఫీసులో బ్రిగేడియర్ జనరల్ రెజినాల్డ్ డయ్యర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అతనికి తిరుగుబాటు విప్లవకారుల సేన ఎదురైనందున కాల్పులు జరుపవలసి వచ్చింది. డయ్యర్‌కు పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓ డ్వయర్ ఇచ్చిన టెలిగ్రాములో "నీ చర్య సరైనదే. దానిని లెఫ్టినెంట్ గవర్నర్ సమర్ధిస్తున్నాడు" అని వ్రాసి ఉంది.[14]

ఈ ఉదంతంపై విచారణ జరపడానికి 1919లో "హంటర్ కమిషన్" ఏర్పరచారు. ఆ కమిషన్ సమక్షంలో డయ్యర్ - తనకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసిందనీ, దానిని నిలపడానికి తానేవిధమైన ప్రయత్నమూ చేయలేదనీ, అక్కడ సమావేశమైన గుంపు గనుక కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే తాను అక్కడికి వెళ్ళాననీ - చెప్పాడు.

"బహుశా కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టడం సాధ్యం అయ్యుండవచ్చునని నేను భావిస్తున్నాను. కాని వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేసేవారు. నేను చేతగానివాడినయ్యుండేవాడిని." — (హంటర్ కమిషన్ సమక్షంలో డయ్యర్ స్పందన)

అంతే గాకుండా ఆ స్థలంలోనికి వాహనాలు వెళ్ళగలిగితే తాను మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరలేదని చెప్పాడు. జనం చెల్లా చెదురైనా గాని కాల్పులు ఆపలేదని, కొద్దిపాటి కాల్పులవల్ల ప్రయోజనం లేదని, జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం తన బాధ్యత అని చెప్పాడు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం తన బాధ్యత కాదు గనుక అలాంటి ప్రయత్నమేమీ చేయలేదని, ఆసుపత్రులు తెరచి ఉన్నందున వారే వెళ్ళవచ్చునని కూడా అన్నాడు.

ప్రతి చర్య

[మార్చు]

భారతదేశంలో దీనికి ప్రతిగా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంజాబ్ లో జరుగుతున్న స్వాతంత్ర్యోద్యమానికి మరింత ఆజ్యం పోసింది. 1920 లో గాంధీజీ ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించడానికి నాంది పలికింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారడానికి కూడా ఈ సంఘటనే కారణం. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్, బ్రిటీష్ ప్రభుత్వం తనకిచ్చిన సర్ బిరుదును ఇంగ్లండు ప్రభువుకు తిరిగి ఇచ్చివేశాడు. మొత్తమ్మీద ఈ సంఘటన స్వాతంత్ర్యోద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చి వేగవంతం చేసిందని చెప్పవచ్చు.

1920లో హంటర్ కమిషన్ రిపోర్టు వెలువడింది. డయ్యర్‌ను క్రింది పదవికి మార్చారు. అతని ఆరోగ్యం కూడా క్షీణించి ఉండడం వలన తరువాత అతనిని వైద్య సదుపాయాలున్న ఓడలో ఇంగ్లాండుకు పంపేశారు. కొద్దిమంది బ్రిటిష్ అధికారులు మరొక భారత సైనిక తిరుగుబాటును అణచివేసినందుకు అతనిని ప్రశంసించారు. బ్రిటిష్ పార్లమెంటులో అతని చర్యను నిరసిస్తూ తీర్మానాలు చేశారు. ఇది చాలా దారుణమైన, అసాధారణమైన చర్య అని చర్చిల్ అభివర్ణించాడు. 1920లో డయ్యర్ పదవికి రాజీనామా చేశాడు.

కొందరు బ్రిటిష్‌వారు, కొంత బ్రిటిష్ పత్రికారంగం డయ్యర్ కర్తవ్య నిరతిని మెచ్చుకొన్నారు కూడాను. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. అమృత్‌సర్ నుండి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ పరదాల అవతల నుండి ఒక మిలిటరీ ఆఫీసర్ గట్టిగా ఇలా మాట్లాడడం విన్నానని తన ఆత్మకథలో వ్రాశాడు - "పట్టణం అంతా నా దయమీద ఆధారపడి ఉంది. దానిని బూడిద చేసేద్దామనుకొన్నాను గాని దయతలచి వదిలేశాను" - ఈ మాటలు అన్న వ్యక్తి స్వయంగా డయ్యరే. అదే రైలులో ప్రయాణం చేస్తున్నాడు[15]

స్మారక చిహ్నాలు

[మార్చు]
జలియన్ వాలాబాగ్ దురంత స్మారక స్తూపం

1920లో ఈ దుర్ఘటన జరిగిన స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడానికి భారత జాతీయ కాంగ్రెస్ తీర్మానించింది. 1923లో ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. అమెరికాకు చెందిన బెంజమిన్ పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్ 13న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ చేతులమీదుగా, జవహర్ లాల్ నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపం ఆవిష్కరింపబడింది. నిరంతరాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను తరువాత జోడించారు. ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్ గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. బులెట్‌ల నుండి తప్పించుకోవడానికి తొక్కిడిలో అనేకులు దూకి మరణించిన భావి కూడా ఇప్పుడు ఒక సంరక్షిత స్మారక చిహ్నం.

1982లో రిచర్డ్ అటెన్‌బరో సినిమా "గాంధీ"లో ఈ ఘటనను చిత్రీకరించారు. "రంగ్ దే బసంతి", "ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్" సినిమాలలో కూడా ఈ దృశ్యం చూపారు.

మూలాలు

[మార్చు]
  1. Home Political Deposit, September, 1920, No 23, National Archives of India, New Delhi; Report of Commissioners, Vol I, New Delhi
  2. Gupta 1997, p. 12
  3. Popplewell 1995, p. 201
  4. Strachan 2001, p. 798
  5. Hoover 1985, p. 252
  6. Brown 1948, p. 300
  7. Strachan 2001, p. 788
  8. Hopkirk 2001, p. 41
  9. Popplewell 1995, p. 234
  10. Lovett 1920, p. 94, 187-191
  11. Sarkar 1921, p. 137
  12. Tinker 1968, p. 92
  13. Popplewell 1995, p. 175
  14. Disorder Inquiry Committee Report, Vol II, p 197
  15. Nehru, An Autobiography. p. 29

బయటి లింకులు

[మార్చు]