జానపద సంగీతం
జానపద సంగీతం | |
---|---|
Traditions | List of folk music traditions |
Musicians | List of folk musicians |
Instruments | Folk instruments |
జానపద సంగీతం యొక్క అర్ధమే గ్రామీణ జనుల సంగీతం. ‘జనానాం పదం జానపదం ’ అని దానికి శబ్దార్ధం. దీనినే హిందీలో “లోక గీత్” అని, ఆంగ్లంలో ఫోక్ మ్యూజిక్ అంటారు. జానపదులు అంటే పల్లె ప్రజలు. వారు పాడేది జానపదం.
మన దేశంలో జానపద సంగీతానికి ప్రత్యేక స్థానముంది. ఈ సంగీతం కష్టపడి తయారుచేయబడింది కాదు. జనాల హృదయాల్లోంచి స్వేచ్ఛగా పుట్టినది. ఈ సంగీతానికి నియమ నిబంధనలు లేవు. ఎవరి చిత్తానుసారం వారు పాడుకోగలిగినది.
సంగీతం, దాని వివిధ శాఖలు బాగా అభివృద్ధి చెంది, ప్రచారంలోకి రాకముందే ఈ జానపద సంగీతం ప్రచారంలో ఉంది. దీనికి ప్రత్యేకించి ప్రచారం అవసరంలేదు. పూర్వం, ఆధునిక (శాస్త్రీయ) సాంకేతిక జ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో వ్యవసాయం లాంటి శారీరిక శ్రమ కలిగిన వృత్తులే జీవలోపాధిగా ఉండేవి. జనం ఆ శారీరక శ్రమనుండి ఉపశమనం కోసం రకరకాల పాటలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. అవే జానపద గీతాలు. వీటినే పల్లెపాటలు అనేవారు. ఇవి ఒక ప్రత్యేకమైన అంశం గురించి కూర్చబడినవి కావు. పని చేసుకునేవారు ఈ పని చేస్తూ ఉంటే అదే అంశంగా పాట కూర్చి పాడుకునేవారు. జానపదుల సంగీతం సజీవ స్రవంతి లాంటిది. ఇతరేతర ప్రభావాలకు అతీతంగా నిలిచి ప్రవహించే జీవధార జానపద సంగీతం.
ఈ సంగీతం లక్ష్యం కేవలం వినోదం, ఉల్లాసం అందించడమే కాదు. తెలియకుండానే మనిషిలో మానవీయ సంస్కారాన్ని ఇనుమడింపజేస్తుంది. శ్రమతో జీవితాన్ని ఉద్దీపింపజేసుకోవడం అలవరుస్తుంది. సమూహంలో భాగస్వామి అయి పరులు మేలు తలచడంలోనే బతుక్కి సార్థకత వుందని తెలియజేస్తుంది. జానపద గీతాల్లో లయ చాలా ప్రధానమైనది. ఈ పాటలలోని లయే ఉత్సాహాన్ని కలిగించే అంశం. ఒక ప్రత్యేక లయ అనిగాని, రాగం అని గాని తెలిసి పాడుకునేవారు కారు. వారికి ఇష్టం వచ్చినట్లు రాగయుక్తంగా పాట సాగేది. ఐనా అందులోనే మంచి లయ, రాగం దాగి ఉండేవి.
పంట విత్తనాలు వేసేటప్పుడు పాటలు, పంట చేతికొచ్చినప్పుడు పాటలు, పండుగల పాటలు, వారి పశువులకి సంబంధించిన పాటలు, వాన పాటలు, పడవ పాటలు, గొబ్బిళ్ళ పాటలు.. ఇదీ అదీ అని కాకుండా వివిధ అంశాల గురించి ఆనందంగా వారికొచ్చిన భాషలో పాడుకునేవారు. ఇలాంటి సంగీతం జానపదుల గీతాల్లో, నృత్యాల్లో, ఉత్సవాల్లో ప్రతిఫలిస్తుంది. పండుగలో మిళితమై వున్న పాటల్లో, నర్తనంలో ఇమిడివున్న సంగీతమే ఇందుకు దాఖలా. ప్రకృతితో, ప్రకృతిలోని పూలతో, పూల పరిమళా లతో అనుసంధానమై వున్న బతుకమ్మను కేంద్రంగా చేసుకొని వందలపాటలు వచ్చాయి. ఆ పాటలకీ, సంగీతానికీ అవినాభావ సంబంధం ఉంది. సంగీతంలోని రాగం, తాళం, పల్లవి, జతి, లయ వంటి అంశాలు ఈ పాటలతో అనుసంధానమై ఉన్నాయి. నిజానికి సాహిత్యం, నృత్యం వంటి ప్రక్రియలతో కలగలిసి వుండటం భారతీయ సంగీతం ప్రత్యేకత. జీవితంలోని ప్రతి సందర్భాన్ని పాటలతో, సంగీతంతో దీప్తిమంతం చేయడం జనజీవన సంస్కృతిలో అంతర్భాగం.