జానా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానా కృష్ణమూర్తి
[[Image:జానా కృష్ణమూర్తి|225x250px|జానా కృష్ణమూర్తి]]

పదవీ కాలం
2001–2002

వ్యక్తిగత వివరాలు

జననం 1928 మే 24
మదురై, భారతదేశం
మరణం 2007 సెప్టెంబరు 25(2007-09-25) (వయసు 79)
చెన్నై, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
మతం హిందూమతం

కె.జానా కృష్ణమూర్తి (1928 మే 24 – 2007 సెప్టెంబరు 25) 2001లో భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవికి ఎన్నుకోబడిన రాజకీయ నాయకుడు. ఇతడు అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు. కామరాజ్ నాడార్ తరువాత తమిళనాడు నుండి ఒక జాతీయ స్థాయి రాజకీయపార్టీ అధ్యక్ష పదవికి ఎన్నుకోబడిన రెండవ వ్యక్తి జానా కృష్ణమూర్తి.

ఆరంభ జీవితం

[మార్చు]

జానా కృష్ణమూర్తి 1928న మే 24న తమిళనాడు రాష్ట్రంలోని మదురై పట్టణంలో కృష్ణస్వామి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇతని మాతృభాష తెలుగు. ఇతని ప్రాథమిక, కళాశాల విద్యలు మదురైలోని ఎం.సి.హైస్కూలులోను, మదురై కాలేజీలోను జరిగింది. మద్రాసు లా కాలేజీ నుండి బి.ఎల్. పూర్తి చేశాడు. 1965 వరకు లా ప్రాక్టీస్ చేసి మంచి న్యాయవాదిగా పేరు గడించాడు. ఇతడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధిపతి ఎం.ఎస్.గోల్వాల్కర్ ప్రోద్బలంతో రాజకీయాలలోకి అడుగు పెట్టాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1940 నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్న కృషమూర్తి, అటల్ బిహారీ వాజపేయి ప్రోద్భలంతో, తమిళనాడులో భారతీయ జన సంఘ్ యొక్క ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాడు. ఈయన దక్షిణ భారతదేశంలో పెద్దగా గుర్తింపులేని భారతీయ జన సంఘ్ పార్టీ నిర్మాణానికి క్రియాశీలకంగా కృషిచేశాడు.

1975లో అత్యయిక పరిస్థితి విధించినప్పుడు, అందుకు వ్యతిరేకతా ఉద్యమానికి తమిళనాడులో కార్యదర్శిగా ఉన్నాడు. 1977లో భారతీయ జనసంఘ్, జనతా పార్టీలో విలీనమైనప్పుడు, జనతాపార్టీ యొక్క తమిళనాడు విభాగానికి ప్రధానకార్యదర్శి అయ్యాడు. 1980లో అటల్ బిహారీ వాజపేయి, లాల్ కిషన్ అద్వానీ, ఎస్.ఎస్.భండారీ, కుష్‌భావూ ఠాక్రే, జగన్నాథరావు జోషీ తదితరులతో కలిసి భారతీయ జనతాపార్టీ స్థాపనకు సహాయం చేశాడు. ఈయన పార్టీకి వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి. 1983లో ప్రధాన కార్యదర్శుల్లో ఒకడిగానూ, 1985 నుండి పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేశాడు.

1980 నుండి 1990 వరకు కృష్ణమూర్తి, భారతీయ జనతా పార్టీని దక్షిణాది రాష్ట్రాలైన, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో విస్తరింపజేయటానికి కృషిచేశాడు.

1993లో ఎల్.కే.అద్వానీ కోరిక మేరకు ఢిల్లీ వెళ్ళి, అక్కడ ఆర్ధిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాలపై విధానాలను రూపొందించేందుకు భాజపా మేధోవర్గాలను స్థాపించాడు. 1995 నుండి భాజపా ప్రధానకార్యాలయపు నిర్వహణాబాధ్యతలు చూసుకొన్నాడు. కొంతకాలం పార్టీ ప్రధానగళంగా కూడా పనిచేశాడు. 1998లో కృష్ణమూర్తి, దక్షిణ చెన్నై నియోజకవర్గం నుండి లోక్‌సభకు పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 2001 మార్చి 1న పార్టీ అధ్యక్షపదవి బంగారు లక్ష్మణ్ నుండి తీసుకొని, 2002 జూన్ వరకు భాజపా అధ్యక్షుడిగా కొనసాగాడు.

కృష్ణమూర్తి, ఆ తర్వాత అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖామంత్రిగా పనిచేశాడు. ఒక సంవత్సరం తర్వాత అనారోగ్య కారణాల వళ్ళ పదవీవిరమణ చేశాడు. ఈయన గుజరాత్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యాడు.[1] రాజ్యసభలో ఉండగా విదేశీవ్యవహారాలు, రక్షణ వ్యవహారాల పార్లమెంటు కమిటీలలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేశాడు. ఈయన ఫిర్యాదుల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కాలంలో పెట్రోలు కల్తీపై నిర్మొహమాటమైన నివేదికను సమర్పించి అందరకీ చిరస్మరణీయమైనాడు.

కుటుంబం

[మార్చు]

ఇతనికి 1964, ఆగస్టు 24న భాగ్యలక్ష్మితో వివాహం జరిగింది. ఇతనికి ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మరణం

[మార్చు]

కృష్ణమూర్తి, హృదయ శ్వాసకోశ దిగ్భంధనంతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో 2007 సెప్టెంబరు 25న మరణించాడు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rajya Sabha members". Archived from the original on 2019-02-14. Retrieved 2009-12-31.

బయటి లింకులు

[మార్చు]