జాయప సేనాని

వికీపీడియా నుండి
(జాయపసేనాని నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
జాయప సేనాని

జాయప సేనాని సూర్యవంశానికి చెందిన కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని వద్ద పనిచేసిన సేనాధిపతి. ప్రాచీన పత్రాల్లో ఇతడిని జాయప నాయుడు అని, జాయన అనీ కూడా ఉదహరించారు. జాయప దుర్జయ వంశము అయ్య పరివారమునకు చెందినవాడు. తండ్రి పిన్న చోడుడు. తాత నారప్ప. ఈతను దివిసీమను పాలించాడు. ఇతని తాత ముత్తాతలది వెలనాడు లోని 'క్రోయ్యూరు'. ఈతని తండ్రి తాతలు చందవోలు రాజధానిగా తెలుగు దేశమును పరిపాలించిన వెలనాటి చోళ మహీపతులను సేవించారు. కొడుకులు చోడ, పిన్న చోడ, భీమ, బ్రహ్మ వెలనాటి చోడులవద్ద సైన్యంలో పనిచేసారు.

వెలనాటి రెండవ చోళుని కాలములో, కృష్ణా నది సముద్రమున కలియు చోటనున్న దీవిలో నారప్ప ఒక నగరాన్ని నిర్మించాడు. అప్పటి నుండి వీరు అక్కడే నివసింప సాగారు. క్రీ. శ. 1203లో కాకతి గణపతిదేవ చక్రవర్తి ఈ దీవిపై దండెత్తి, అయ్య కులజుడైన పిన్న చోడుని (జాయన తండ్రి) ఓడించి దీవిని వశపరచుకొన్నాడు. కాని, అతను అయ్యకులజుల పరాక్రమాదులను మెచ్చుకొని వారితో సఖ్యము చేసికొన్నాడు. అంతేకాక, జాయన ఇద్దరు అక్కలను - నారమ, పేరమ అనువారిని - పెళ్ళి చేసుకున్నాడు.[1] అప్పటికి జాయన చాలా చిన్నవాడు. అతని సౌమ్యాకారమును, నయ వినయ శౌర్య గాంభీర్యములను గమనించిన గణపతి దేవుడు వానికి ఆందోళీకాతపత్రాది గౌరవములను ప్రసాదించి, గజ సైన్యాధిపతిని కావించి, క్రీ. శ. 1213లో 'తామ్రపురి'ని (నేటి ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లాలోని చేబ్రోలును పరిపాలింపనిచ్చెను. (Epi. Ind. Vol. V, PP - 142, 143). అంతేకాక, కౌమార దశ నుండి జయన ప్రతిజ్ఞాశయముల నెరింగిన, గణపతి దేవుడు స్వయముగా శ్రద్ధ వహించి, గుండా మాత్యుల వారిచే జాయనకు కళల నేర్పించెను. (1-13)

1241 లో వెలనాటి చోడులపై గణపతి దేవుడు విజయము సాధించిన తర్వాత వెలనాడు, కమ్మనాడు లోని వీరులందరు ఓరుగల్లుకు తరలిపోయారు. వారిలో జాయప ఒకడు. గణపతి దేవుడు ఆతనిని చక్రవర్తి గజబలగానికి అధిపతిగా చేశాడు. జాయప చెల్లెళ్ళగు నారమ్మ పేరమ్మలను క్షత్రియుడైన గణపతిదేవుడు పెండ్లి చేసుకున్నాడు. హనుమంతరావు గారి అభిప్రాయము ప్రకారము కమ్మ నాయకులకు జాయప ఆద్యుడు.

కళింగదేశ దండయాత్ర లో పాల్గొని విజయం సాధించిన జాయపకు గణపతిదేవుడు 'వైరిగోధూమ ఘరట్ట' అను బిరుదు ఇచ్చాడు. 1231 లో మహారాజు పై గౌరవపూర్వకముగా ఇప్పటి కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం లోని గణపేశ్వరంలో గణపేశ్వరునిపేరుపై గుడి కట్టించి గ్రామాలను దానమిచ్చాడు. తన తండ్రి పేరుమీద చేబ్రోలు లో చోడేశ్వరాలయము కట్టించి గుడి ఖర్చులకు మోదుకూరు గ్రామమము రాసి ఇచ్చాడు. 1325 చేబ్రోలు శాసనము ప్రకారము గుడి ముందు రెండు వరుసలలో రెండంతస్థుల ఇళ్ళు కట్టించి దేవదాసీలకు ఇచ్చాడు. జాయప భారతదేశమందలి నాట్యములపై నృత్యరత్నావళి అను సంస్కృత గ్రంథము వ్రాశాడు. దీనినిబట్టి జాయప నాట్యములో, నాట్యశాస్త్రములో నిష్ణాతుడని తెలుస్తుంది.

"ప్రేక్ష్యప్రజ్ఞామతిశ యవతీం స్వామిభక్తించహర్షాత్

ఆ కౌమారాత్ గణపతినృపోజాయనం సమర్ప్య

గుండామాత్యే సకలసుమనస్సేవ్యమానేజయంతం

వాచాంపత్యౌ హరిరివ కలాం శ్లాఘనీయాం వ్యనైషీత్. "

జాయన గణపతి దేవుని ఆజ్ఞచే నృత్త లీలలకు రత్నదర్పణము వంటి "నృత్త రత్నావళి"ని (క్రీ. శ. 1253-54) (కలియుగం 4355) లో రచించాడు. అనగా, అప్పటికి జాయన సుమారు 60 ఏండ్ల వయసువాడై ఉండవచ్చు. ఈ గ్రంథ రచనలో జాయనకు నాటికి వెలువడిన శాస్త్ర గ్రంథములు, లోకమందు ప్రసిద్ధి వహించిన దేశి నృత్యములు మాత్రమే కాక, రామప్ప గుడి వంటి దేవాలయము లందలి నృత్య శిల్పములు తోడ్పడి యుండును.

కాకతీయుల నృత్య కళాభిమానం[మార్చు]

కాకతీయ ప్రభువులు సంగీత సాహిత్యములను అత్యధికముగా ఆదరించినట్లు చరిత్ర వలన తెలుస్తోంది. ప్రథమ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1158 - 1195) విద్యాభూషణ బిరుదాంచితుడు. నీతిసారాది గ్రంథకర్త. కాకతీయ చక్రవర్తులలో సుప్రసిద్ధుడు గణపతిదేవుడు. యితడు అరువది సంవత్సరములు పైగా రాజ్యమును పరిపాలించి, దేశమును సుభిక్షమొనరించెను. ఇక రెండవ ప్రతాపరుద్రుడు (క్రీ. శ. 1290 - 1326) పండితులలో పండితుడు, కవులలో కవి, సంగీత రహస్య మెరిగిన గాయక శిరోమణి, చిత్ర కళావేత్త. కావుననే ఈ కాలము లలితకళలకు, ముఖ్యముగా నృత్యమునకు, నవ వసంతోదయమైనది. రాజులు, రాజబంధువులు, మహామాత్యులు, సేనానులు స్వయముగా కళావేత్త లైనారు. కాకతీయులనాటి నృత్య కళా చరిత్ర మువ్విధములుగా - శాసనములు, శిల్పములు, సాహిత్యము ద్వారా వెలుగులోకి వచ్చింది. గణపతి దేవుడు జాయపసేనాపతికి చేబ్రోలు నొసంగినట్లు తెలియజేసెడి శాసనం (Epi. Ind. Vol. VI - 38ff) లో 16 మంది దేవదాసీలను దానము చేసినట్లు ఉంది. శిల్పములు కూడా ముఖ్యముగా దేవాలయములకు సంబందినవి ఉన్నాయి. ఈ దేవాలయములలో ప్రధానమైనవి వరంగల్లు లోని వేయి స్థంబాల గుడి, పాలంపేట లోని రామప్ప గుడి. రామప్ప గుడి రుద్రేశ్వరాలయంగా పేరుపొందింది. గణపతిదేవుని సేనాని, మంత్రి రేచర్ల రుద్రదేవుడు క్రీ. శ. 1213లో నిర్మించిన ఈ దేవాలయములోని ప్రతీ భాగమూ ఒక అపురూప శిల్పకళాఖండము. కాకతీయుల నృత్యకళాభిమానానికి ఇది పరాకాష్ఠ. ఇంకా సాహిత్యానికి సంబంధించిన సాక్ష్యములలో తిక్కన, పాల్కురికి సోమనాథుల తెలుగు రచనలు తెలిసినవే. ఇంక సంస్కృత భాషలో వెలిసిన ఉత్తమోత్తమ గ్రంథము జాయసేనాపతిగా పేరుపొందిన జాయపసేనాని రచించిన "నృత్త రత్నావళి". ఆంధ్రుడు రచించిన శాస్త్రమని అసందిగ్ధముగా చెప్పదగిన తొలి గ్రంథము జాయన కృతమగు "నృత్త రత్నావళి". గణపతిదేవుని బావమరిది జాయపసేనాని "నృత్తరత్నావళి"ని రచించాడు.


వనరులు[మార్చు]

(మూలం : జాయసేనాపతి విరచిత - నృత్త రత్నావళి - సంస్కృతం: జాయ సేనాపతి; తెలుగు: రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ)

ప్రచురణ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2007. (ప్రచురణ - 306)

మూలాలు[మార్చు]

  1. హల్ట్ష్, ఇ, ed. (1979). ఎపిగ్రాఫియా ఇండికా. Vol. 3. న్యూ ఢిల్లీ: డైరెక్టర్ జనరల్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. pp. 126, 127.