జావా (ద్వీపం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox Islands జావా (మూస:Lang-id) అనేది ఇండోనేషియాలో ఒక ద్వీపం, దేశ రాజధాని నగరం జకార్తా ఈ ద్వీపంలోనే ఉంది. ఒకప్పుడు శక్తివంతమైన హిందూ-బౌద్ధ సామ్రాజ్యాలు, ఇస్లామిక్ సామ్రాజ్యాలకు, వలసరాజ్య డచ్ ఈస్ట్ ఇండీస్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న జావా ఇప్పుడు ఇండోనేషియా ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో ఆధిపత్య పాత్ర పోషిస్తోంది. 2006లో ఈ ద్వీపంలో 130 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు[1], ఇది ప్రపంచంలో అత్యధిక జనాభాగల ద్వీపంగా గుర్తించబడుతుంది, జపాన్ ప్రధాన ద్వీపం హోన్షు దీని తరువాతి స్థానంలో ఉంది. భూమిపై అత్యధిక జనసాంద్రత గల ప్రాంతాల్లో జావా కూడా ఒకటి.

ఎక్కువగా అగ్నిపర్వత విస్ఫోటనాలు ఫలితంగా ఏర్పడిన జావా ప్రపంచంలో 13వ అతిపెద్ద ద్వీపంగా మరియు ఇండోనేషియాలో ఐదో పెద్దద్వీపంగా ఉంది. ద్వీపంలోని అగ్నిపర్వతాల శ్రేణిని తూర్పు-పశ్చిమ వెన్నుముకగా పరిగణిస్తున్నారు. ఇక్కడ మూడు ప్రధాన భాషలు ఉన్నాయి, జావానీస్ ఆధిపత్య భాషగా ఉండటంతోపాటు, ఇండోనేషియాలో 60 మిలియన్ల మంది పౌరులకు మాతృ భాషగా ఉంది, వీరిలో ఎక్కువ మంది జావా ద్వీపంలోనే నివసిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పౌరులు రెండు భాషలను మాట్లాడగలరు, ఇండోనేషియన్ వారి ప్రథమ లేదా ద్వితీయ భాషగా ఉంది. జావాలో ఎక్కువ మంది పౌరులు ముస్లింలుకాగా, ఇక్కడ అనేక భిన్నమైన మత విశ్వాసాలు, జాతులు మరియు సంస్కృతుల మేళనం కనిపిస్తుంది.

పద చరిత్ర[మార్చు]

'జావా' అనే పదం యొక్క మూలాలు స్పష్టంగా లేవు. భారతదేశం నుంచి వచ్చిన ఒక మొదటి ప్రయాణికుడు జావా-వుత్ అనే చెట్టు పేరు మీదగా ఈ ద్వీపానికి ఆ పేరు పెట్టాడని, ఆ సమయంలో ఈ ద్వీపంలో జావా వుత్ చెట్లు ఎక్కువగా కనిపించేవనే భావన ఉంది, ఈ ప్రాంతానికి భారతీయ సామ్రాజ్యాల విస్తరణకు ముందు ద్వీపానికి వివిధ పేర్లు ఉన్నాయి.[2] ఈ పేరుకు ఇతర సంభావ్య మూలాలు కూడా ఉన్నాయి; అవి జావు మరియు దాని వైవిధ్యాలు, వీటికి "ఆవల" మరియు "సుదూర" అనే అర్థాలు ఉన్నాయి.[3] సంస్కృతంలో యావా అంటే బార్లీ, బార్లీ ధాన్యానికి ఈ ద్వీపం ప్రసిద్ధి చెందింది.[3] జావా అనే పదం "నివాసం" అనే అర్థాన్ని ఇచ్చే ప్రోటో-ఆస్ట్రోనేషియన్ మూల పదం నుంచి స్వీకరించబడిందని మరో ఆధారం సూచిస్తుంది.[4]

భౌగోళిక స్థితి[మార్చు]

తూర్పు జావాలో సెమురు మరియు బ్రోమో పర్వతాలు

జావా ద్వీపం సుమత్రాకు పశ్చిమ మరియు బాలీకి తూర్పు ప్రాంతాల మధ్యలో ఉంది. ఈ ద్వీపానికి ఉత్తరంగా బోర్నెయో మరియు దక్షిణంగా క్రిస్మస్ ఐల్యాండ్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో 13వ అతిపెద్ద ద్వీపంగా గుర్తించబడుతుంది.

జావా భూభాగంలో ఎక్కువ భాగం దాదాపుగా అగ్నిపర్వతాల విస్ఫోటన ఫలితంగా ఏర్పడింది; ఇక్కడి తూర్పు-పశ్చిమ వెన్నుముకగా పరిగణించబడుతున్న పర్వతశ్రేణిలో ముప్పై-ఎనిమిది పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకానొక సమయంలో క్రియాశీల అగ్నిపర్వతాలుగా ఉన్నాయి. జావాలో అతిపెద్ద అగ్నిపర్వతం సెమెరు (3,676 మీ). జావాలో మరియు ఇండోనేషియాలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం మౌంట్ మెరాపీ (2,968 మీ). జావాలో అగ్నిపర్వతాలు చూడండి. ఇతర పర్వతాలు మరియు ఎత్తైన ప్రదేశాలు జావా భూభాగాన్ని వరి సాగుకు అనువైన ఒక వరుస సాపేక్ష వివిక్త ప్రాంతాలుగా విభజిస్తున్నాయి; జావాలో వరి భూములు ప్రపంచంలోనే అత్యంత సారవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి.[5] ఇండోనేషియన్ కాఫీని మొట్టమొదటిసారిగా పండించిన ప్రదేశం కూడా జావా కావడం గమనార్హం, ఇక్కడ దీని సాగు 1699లో ప్రారంభమైంది. ప్రస్తుతం, కాఫీ అరేబికాను ఐజున్ పీఠభూమిపై చిన్న రైతులు మరియు పెద్ద రైతులు పండిస్తున్నారు.

జాపా విస్తీర్ణం సుమారుగా 139,000 కిమీ2.[6] ద్వీపంలోని అతిపెద్ద నది బెంగావన్ సోలో నది, దీని పొడవు 600 కిమీ.[7] మధ్య జావాలోని లావు అగ్నిపర్వతం వద్ద ఈ నది జన్మస్థానం ఉంది, ఇది ఇక్కడి నుంచి ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలవైపు ప్రవహించి చివరకు సురాబాయా నగరం వద్ద జావా సముద్రంలో కలుస్తుంది. ద్వీపం నాలుగు పరిపాలక ప్రావీన్స్‌లుగా, (బాంటెన్, పశ్చిమ జావా, మధ్య జావా, మరియు తూర్పు జావా), ఒక ప్రత్యేక ప్రాంతంగా (యోగ్యకార్తా) విభజించబడివుంది, అంతేకాకుండా దీనిలో ఒక ప్రత్యేక రాజధాని జిల్లా (జకార్తా) కూడా ఉంది.

చరిత్ర[మార్చు]

మధ్య జావాలోని 9వ శతాబ్దపు బోరోబుదుర్ బౌద్ధ స్థూపం.

అగ్నిపర్వతాల శ్రేణి మరియు అనుబంధ ఎత్తైన భూములు జావాలో అంతటా కనిపిస్తాయి, తద్వారా దీని అంతర్గత ప్రాంతాలు మరియు పౌరులు వేర్వేరుగా మరియు సంబంధం లేకుండా ఉంటాయి.[8] జావాలో అనేక నదులు పొడవు తక్కువగా ఉన్నప్పటికీ, ఇస్లామిక్ రాజ్యాలు మరియు ఐరోపా వలసరాజ్యాల ఏర్పాటుకు ముందు ఈ నదులే ప్రధాన రవాణా వ్యవస్థలుగా ఉపయోగపడ్డాయి. బ్రాంటాస్ మరియు సాలా నదులు మాత్రమే సుదూర-ప్రయాణాలకు వీలు కల్పిస్తున్నాయి, ఈ నదుల లోయలు ప్రధాన సామ్రాజ్యాల కేంద్రాలకు మద్దతుగా నిలిచాయి. రోడ్ల వ్యవస్థ, శాశ్వత వంతెనలు, టోల్ గేట్‌లు జావాలో మొట్టమొదట 17వ శతాబ్దం మధ్య కాలంలో ఏర్పాటు చేయబడినట్లు తెలుస్తోంది. వర్షాకాలంలో తరచుగా ఈ మార్గాలు పాడవుతుంటాయి, అందువలన రోడ్ల వినియోగం ఎప్పటికప్పుడు మరమత్తులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా, జావా జనాభా మధ్య సమాచార ప్రసారం కష్టంతో కూడుకొనివుంటుంది.[9]

4వ మరియు 16వ శతాబ్దం మధ్యకాలంలో శక్తివంతమైన హిందూ-బౌద్ధ సామ్రాజ్యాలు జావాలో ఏర్పాటయ్యాయి. జావాలో ఉన్న పురాతన సామ్రాజ్యాలు తారుమనగారా, సుండా, మాతరం, కెదిరి, సింఘాసారి మరియు మజాపాహిత్, ఇవన్నీ ప్రధానంగా వరి వ్యవసాయంపై ఆధారపడ్డాయి, ఇండోనేషియా ద్వీపసమూహంలో మరియు చైనా మరియు భారతదేశంతో వాణిజ్యం సాగించేవి. ఈ పురాతన సామ్రాజ్యాల కాలంలో ప్రసిద్ధ స్మారక కట్టడాలు నిర్మించబడ్డాయి, మధ్య జావాలోని 9వ శతాబ్దపు బారోబుదుర్ మరియు ప్రాంబనాన్‌లు వీటికి ఉదాహరణలు.

చుట్టూ వరి పొలాలతో మెర్బాబు పర్వతం. జావా అగ్నిపర్వత నైసర్గిక స్వరూపం మరియు సారవంతమైన వ్యవసాయ భూములు దీని యొక్క చరిత్రలో ప్రధాన భాగంగా ఉన్నాయి

16వ శతాబ్దం ముగిసే సమయానికి, మతమార్పిళ్లు జరగడంతో హిందూ మతం మరియు బౌద్ధ మతాలను అణిచివేసి జావా పౌరుల్లో ఇస్లాం ఆధిపత్య మతంగా మారింది. 1596లో, కార్నెలీస్ డి హౌట్మాన్ నేతృత్వంలోని నాలుగు-నౌకల అన్వేషక బృందం ద్వారా ఇండోనేషియాతో మొట్టమొదటిసారి డచ్‌వారికి సంబంధాలు ఏర్పడ్డాయి.[10] 19వ శతాబ్దం ప్రారంభ సమయానికి, డచ్‌వారు అంతర్గత భూభాగంలోని సుల్తానేట్‌లపై (రాజ్యాలు) తమ ఆధిపత్యాన్ని విస్తరించారు.[11]

1815లో, జావాలో 5 మిలియన్ల మంది పౌరులు ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.[12] 18వ శతాబ్దం ద్వితీయార్ధ భాగంలో, ఉత్తర-మధ్య జావా తీరవ్యాప్తంగా జిల్లాల్లో జనాభా ఆకస్మికంగా వృద్ధి చెందడం ప్రారంభమైంది, 19వ శతాబ్దంలో ద్వీపమంతటా జనాభా వేగంగా పెరిగింది. డచ్‌వారు జావాలో పౌర యుద్ధాన్ని ముగిసేలా చేయడం, వరి సాగు పరిధిలోని భూభాగం పెరగడం, కసావా మరియు మొక్కజొన్న వంటి ఆహార మొక్కలు పరిచయం కావడం, ఇవి బియ్యం కొనుగోలు చేసే స్తోమత లేని జనాభా మనుగడకు వీలు కల్పించడం జనాభా ఎక్కువగా పెరగడానికి కారణాల్లో భాగంగా ఉన్నాయి[13] పన్ను భారాలు పెరగడం మరియు వ్యవసాయ వ్యవస్థలో ఉపాధి విస్తరించడం కూడా జనాభా పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి, జంటలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడమంటే, పన్ను చెల్లించడం మరియు వస్తువులు కొనుగోలు చేయడంలో తమ కుటుంబ సామర్థ్యాన్ని పెంచడమేనని భావించాయి.[14] గతంలో దున్నపోతులు మరియు బండ్లు మాత్రమే ఉన్న ఈ ప్రాంతంలో వలసరాజ్యాల ప్రభుత్వాల హయాంలో ట్రక్కులు మరియు రైళ్లు, టెలిగ్రాఫ్ వ్యవస్థలు మరియు ఇతర సమన్వయ పంపిణీ వ్యవస్థలు అందుబాటులోకి రావడంతో జావాలో కరువును తొలగించడానికి తోడ్పడ్డాయి, ఇది చివరకు జనాభా అభివృద్ధికి దారితీసింది. 1840 నుంచి 1940వ దశకంలో జపనీయుల ఆక్రమణ వరకు జావాలో ప్రధానమైన కరువులేవీ ఏర్పడలేదు.[15] జనాభా వృద్ధిలో మానవజాతి కారణాల పాత్ర కూడా ఉందనే భావన ఉంది. జావాలో, పురుషులకు సంపూర్ణమైన ప్రాధాన్యత లేదు, ఈ ప్రాంతంలో వ్యవసాయం పురుష మరియు మహిళా కార్మికులు ఇద్దరిపై ఆధారపడివుంది. అంతేకాకుండా, 19వ శతాబ్దంలో మొదటి వివాహ వయస్సు గణనీయంగా తగ్గించబడింది, దీని వలన మహిళలు శిశువులకు జన్మనిచ్చే వయస్సులో ఉండే కాలం పెరిగింది.[15]

జనాభా[మార్చు]

సెంట్రల్ జకార్తా

ఇండోనేషియాలో అత్యధిక జనాభాగల ద్వీపం జావా, దేశం యొక్క మొత్తం జనాభాలో 62% మంది ఈ ద్వీపంలోనే నివసిస్తున్నారు,[16] ప్రపంచంలో అత్యధిక జనాభాగల ద్వీపంగా కూడా ఇది గుర్తింపు పొందింది. ప్రతి కిమీ² (చదరపు కిలోమీటర్‌)కు 1026 మంది జనసాంద్రతతో 130 మిలియన్ల మంది పౌరులు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు, ప్రపంచంలో అత్యధిక జనసాంద్రతగల ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. ఇది ఒక దేశం అయినట్లయితే, కొన్ని చిన్న నగర-రాష్ట్రాలను మినహాయిస్తే, బంగ్లాదేశ్ తరువాత రెండో-అత్యంత జనసాంద్రతగల దేశంగా పరిగణించబడేది.[17] ఇండోనేషియా జనాభాలో సుమారుగా 45% మంది జావా జాతీయులు ఉన్నారు.[18]

1970వ దశకం నుంచి 1998లో సుహార్తో ప్రభుత్వం కూలిపోయే వరకు, ఇండోనేషియా ప్రభుత్వం ట్రాన్స్‌మైగ్రేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించింది, జావాలోని జనాభాను ఇండోనేషియాలో తక్కువ జనసాంద్రత గల ద్వీపాల్లో స్థిరపడేలా చేయడం ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఈ కార్యక్రమానికి మిశ్రమ ఫలితాలు వచ్చాయి; కొన్నిసార్లు స్థానికులు మరియు కొత్తగా వచ్చిన వలసదారులకు మధ్య ఘర్షణలకు కూడా కారణమయ్యాయి.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

యోగ్యకార్తాలోని ప్రాంబనాన్ సమీపంలో వరిపొలంలో నారు నాటుతున్న జావానీస్ మహిళలు

మొదట జావా ఆర్థిక వ్యవస్థ బాగా ఎక్కువగా వరి వ్యవసాయంపై ఆధారపడివుండేది. తారుమనగారా, మాతరం మరియు మజాపాహిత్ వంటి పురాతన సామ్రాజ్యాలు వరి దిగుబడి మరియు పన్నులపై ఆధారపడ్డాయి. జావా పురాతన కాలం నుంచి వరి సమృద్ధ దిగుబడులు మరియు వరి ఎగుమతికి బాగా ప్రసిద్ధిగాంచింది, జావాలో జనాభా వృద్ధికి వరి వ్యవసాయం తోడ్పడింది. భారతదేశం మరియు చైనా వంటి ఆసియాలోని మిగిలిన ప్రాంతాలతో వాణిజ్యం 4వ శతాబ్దం నుంచి వర్థిల్లింది, ద్వీపంలో కనిపించే చైనీస్ పింగాణీ పాత్రలపై దీనికి సంబంధించిన ఆధారాలు లభిస్తున్నాయి. పురాతన మజాపాహిత్ శకం నుంచి అంతర్జాతీయ మలుకు సుంగధ ద్రవ్య వాణిజ్యంలో జావా పాలుపంచుకుంది, VOC శకంలో కూడా ఇది కొనసాగింది.

డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 17వ శతాబ్దంలో బటావియాపై కాలుమోపింది, వీరి తరువాత 18వ శతాబ్దంలో నెదర్లాండ్స్ ఈస్ట్ ఇండీస్ ఇక్కడ అడుగుపెట్టింది. వలసరాజ్యాల కాలంలో డచ్‌వారు చెరుకు, రబ్బరు, కాఫీ, టీ మరియు క్వినైన్ వంటి వాణిజ్య పంటల సాగును జావాకు పరిచయం చేశారు. 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు జావా కాఫీ అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది, అందువలన ప్రస్తుతం "జావా" పేరు కాఫీకి పర్యాయపదంగా మారింది.

నెదర్లాండ్ ఈస్ట్ ఇండిస్ కాలం నుంచి ఆధునిక ఇండోనేషియా శకం వరకు ఇండోనేషియాలో అత్యంత అభివృద్ధి చెందిన ద్వీపంగా జావా పరిగణించబడుతుంది. పురాతన కాలం నుంచి రోడ్డు రవాణా వ్యవస్థలు ఇక్కడ ఉన్నాయి, 19వ శతాబ్దం ప్రారంభంలో డెండెల్స్ చేత జావా గ్రేట్ పోస్ట్ రోడ్డు నిర్మించబడటంతో ఈ వ్యవస్థ అనుసంధానించబడటంతోపాటు, సరిదిద్దబడింది. కాఫీ వంటి వాణిజ్య ఉత్పత్తులను ద్వీపంలోని అంతర్గత భాగాల్లో ఉన్న పెంపక ప్రదేశాల నుంచి నౌకాశ్రయానికి రవాణా చేయడానికి ఏర్పడిన అవసరం జావాలో రైల్వే వ్యవస్థ నిర్మాణానికి తోడ్పడింది. ప్రస్తుతం పరిశ్రమ, వ్యాపారం మరియు వాణిజ్యం మరియు సేవలు జావాలోని ప్రధాన నగరాల్లో వర్థిల్లుతున్నాయి, జకార్తా, సురబాయా, సెమరాంగ్ మరియు బాండుంగ్ వంటి నగరాలు దీనికి ఉదాహరణలు; కొన్ని సంప్రదాయ సుల్తానేట్ నగరాలైన యోగ్యకార్తా, సురకార్తా మరియు సిరెబోన్‌లలో రాజ ఉత్తరదాయిత్వం సంరక్షించబడింది, తద్వారా ఇవి జావా ద్వీపంలో కళలు, సంస్కృతి మరియు పర్యాటకానికి ప్రసిద్ధి చెందాయి. జావా ఉత్తర తీర ప్రాంతంలోని పట్టణాల్లో పారిశ్రామిక వాడలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా సెలెగోన్, టాంగెరాంగ్, బెకాసీ, కారావాంగ్, గ్రెసిక్ మరియు సిడోయార్జో ప్రాంతాల్లో ఈ ధోరణిని గమనించవచ్చు. టోల్ రోడ్ల రహదారి వ్యవస్థలు సుహార్తో శకం నుంచి ఇప్పటివరకు నిర్మించబడ్డాయి మరియు విస్తరించబడ్డాయి, ఇవి ప్రధఆన పట్టణ కేంద్రాలను మరియు పరిసర ప్రాంతాలను, ఉదాహరణకు జకార్తా మరయు బాండుంగ్ పరిసరాల్లో, అనుసంధానం చేస్తున్నాయి; సిరెబోన్, సెమారాంగ్ మరియు సురబాయా నగరాల్లో కూడా ఇటువంటి రహదారి వ్యవస్థలను చూడవచ్చు.

Java Transportation Network.svg

జాతి మరియు సంస్కృతి[మార్చు]

భారీ జనాభా ఉన్నప్పటికీ, ఇండోనేషియాలోని మిగిలిన ద్వీపాలకు భిన్నంగా, జావాలో ఏకజాతీయ సమ్మేళనం ఎక్కువగా ఉంటుంది. ద్వీపంలో రెండు జాతి సమూహాలు మాత్రమే స్థానిక జాతులుగా పరిగణించబడుతున్నాయి- అవి జావానీయులు మరియు సుండానీయులు. మూడో సమూహం మదురీయులు, ఈ జాతీయులు జావా ఈశాన్య తీరంలోని మదురా ద్వీపానికి చెందినవారు, 18వ శతాబ్దం నుంచి భారీ సంఖ్యలో ఈ జాతి పౌరులు తూర్పు జావాకు వలసవచ్చారు.[19] ద్వీపం మొత్తం జనాభాలో మూడింట రెండు వంతుల మంది జవానీయులు ఉంటారు, సుండానీయులు మరియు మదురీయులు వరుసగా 20% మరియు 10% మేర ఉంటారు.[19]

ద్వీపంలో నాలుగు ప్రధాన సాంస్కృతిక ప్రాంతాలు ఉన్నాయి: అవి కెజావెన్ లేదా జావానీయుల ప్రధాన భూభాగం, పాసిసిస్ ప్రాంత ఉత్తర తీరం, పశ్చిమ జావాలోని సుండా భూములు మరియు తూర్పు ప్రాంతం, దీనిని బ్లాంబాగాన్‌గా కూడా గుర్తిస్తారు. జావా తీర ప్రాంతంతో దగ్గరి సాంస్కృతిక సంబంధాలు కలిగివుండటంతో, మదురా కూడా ఐదో భాగంగా పరిగణించబడుతుంది.[19] కెజావెన్ జావానీయుల సంస్కృతి ద్వీపంలో అత్యంత ప్రధానమైనదిగా ఉంది. జావా యొక్క మిగిలిన ఉన్నతవర్గాలు ఈ ప్రాంతంలోనే ఉంటున్నాయి, ఎక్కువ భాగం ఇండోనేషియా సైన్యం మరియు వ్యాపారం మరియు రాజకీయ కేంద్ర మూలాలు ఇక్కడే ఉన్నాయి. దీని భాష, కళలు మరియు శిష్టాచారాలు ద్వీపంలో ఎక్కువగా ఆచరించబడుతున్నాయి.[19] పశ్చిమ ప్రాంతంలోని బాన్యుమాస్ నుంచి తూర్పున ఉన్న బలితార్ వరకు ఉన్న భూభాగం ఇండోనేషియాలో అత్యంత సారవంతమైన మరియు జనసాంద్రత ఎక్కువగా ఉన్న వ్యవసాయ ప్రాంతంగా పరిగణించబడుతుంది.[19]

సాధారణంగా బాన్యుమసాన్ ప్రాంతంగా పిలిచే మధ్య జావాలోని నైరుతీ భాగంలో సాంస్కృతిక సమ్మేళనం జరిగింది; జావానీయుల సంస్కృతి మరియు సుండానీయుల సంస్కృతి కలిసి ఇక్కడ బాన్యుమసాన్ సంస్కృతి ఏర్పడింది.[ఉల్లేఖన అవసరం] మధ్య జావానీయుల నగరాలు యోగ్యకార్తా మరియు సురకార్తా సమకాలీన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వలసరాజ్యపూర్వ ఇస్లామిక్ సామ్రాజ్యాలతో అనుబంధం కలిగివున్నారు, తద్వారా ఈ ప్రాంతాలు సంప్రదాయ జావానీయుల సంస్కృతికి బలమైన కేంద్రాలుగా గుర్తింపు పొందాయి. గామెలాన్ సంగీతం మరియు వేయాంగ్ తోలుబొమ్మలాటలు తదితరాలు జావా సంప్రదాయ కళలుగా ఉన్నాయి.

ఆగ్నేయాసియా ప్రాంతంలో అనేక ప్రభావవంతమైన సామ్రాజ్యాలకు జావా కేంద్రంగా ఉంది,[20] దీని ఫలితంగా, జావానీస్ రచయితలు అనేక సాహిత్య గ్రంథాలు రాశారు. కెన్ అరోక్ మరియు కెన్ డెడెస్ వీటిలో ఒకటి, ఇది పురాతన జావానీస్ సామ్రాజ్యంలో ఒక అనాథ తన రాజును గద్దెదించి రాణిని వివాహం చేసుకున్న కథను వివరిస్తుంది; రామాయణం మరియు మహాభారత ఇతిహాసాల అనువాదాలు కూడా ఉన్నాయి. ప్రమోద్య అనంత టోయెర్ ఒక ప్రఖ్యాత సమకాలీన ఇండోనేషియా రచయిత, జావాలో పెరిగిన ఆయన తన అనుభవాలపై అనేక కథలు రాశారు, ఆయన కథల్లో జావా జానపద గాథలు మరియు చారిత్రక దిగ్గజాల నుంచి అనేక అంశాలను గుర్తించవచ్చు.

భాషలు[మార్చు]

జావాలో మాట్లాడే భాషలు (జావానీస్ మాట్లాడే భూభాగం తెలుపులో ఉంది)

జావాలో మూడు ప్రధాన భాషలు ఉన్నాయి, అవి జావానీస్, సుండానీస్ మరియు మదురీస్. ఇక్కడ మాట్లాడే ఇతర భాషలు బెటావీ (జకార్తా ప్రాంతానికి పరిమితమైన ఒక మాలే మాండలికం), ఓసింగ్ మరియు టెంగెరీస్ (జావానీస్‌కు బాగా దగ్గరగా ఉంటుంది), కాంజియానీస్ (మదురీస్‌కు బాగా దగ్గరిగా ఉంటుంది), బాలినీస్ మరియు బాన్యుమాసన్[21], అనేక మంది ప్రజలు ఇండోనేషియన్ భాషను తరచుగా తమ ద్వితీయ భాషగా మాట్లాడుతున్నారు.

మతం[మార్చు]

జావాలో 90 శాతం కంటే ఎక్కువ మంది పౌరులు ముస్లింలు, ఇక్కడ అబాంగాన్ (మరింత నామమాత్ర లేదా ఆధునిక భావాలు కలిసిన) మరియు శాంట్రీ (సాంప్రదాయకమైన) మధ్య విస్తృత అవిభక్తత ఉంది. అతికొద్ది స్థాయిలో హిందూ వర్గాలు కూడా జావావ్యాప్తంగా అక్కడక్కడా కనిపిస్తుంటాయి, అయితే బాలీ సమీపంలో తూర్పు తీరవ్యాప్తంగా, ముఖ్యంగా బాన్యువాంగీ పట్టణ పరిసరాల్లో భారీ హిందూ జనాభా నివసిస్తుంది. ఈ ద్వీపంలో క్రైస్తవ సమూహాలు కూడా ఉన్నాయి, ఎక్కువగా పెద్ద నగరాల్లో వీరిని గుర్తించవచ్చు, అంతేకాకుండా దక్షిణ-మధ్య జావాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బలమైన రోమన్ కాథలిక్ వర్గం ఉంది. ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా చైనీస్ ఇండోనేషియన్ వర్గంలో బౌద్ధమత పౌరులు కూడా ఉన్నారు. ఇండోనేషియా రాజ్యాంగం ఆరు అధికారిక మతాలను గుర్తించింది. (ఇండోనేషియాలోని మతాలు చూడండి.)

మతాలు మరియు సంస్కృతులకు జావా కీలక ప్రదేశంగా ఉంది, ఇది విస్తృతమైన మత విశ్వాసాలను సృష్టించింది. మొదట భారతీయ ప్రభావాల వలన ఇక్కడి సమాజంలో శైవమతం మరియు బౌద్ధమతం బాగా లోతుగా విస్తరించాయి, తద్వారా ఈ ప్రాంతం భారతీయ సంప్రదాయం మరియు సంస్కృతిలో మిళితమైంది.[22] దీనితో ఏర్పడిన ఒక వర్గం సన్యాసులు, వీరిని రెసీ లుగా పిలుచేవారు, వీరు మర్మవిద్యలు నేర్చుకునేవారు. రెసీ వద్ద విద్యార్థులు ఉండేవారు, రెసీ రోజువారీ అవసరాలను వీరు తీర్చేవారు. రెసీ యొక్క అధికారులు కేవలం కర్మసంబంధ వ్యవహారాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. కోర్టుల్లో, బ్రాహ్మణ అధికారులు మరియు పుడ్జాంగా (పవిత్రమైన సాహితీవేత్తలు) చట్టబద్ధమైన పాలకులుగా ఉండేవారు, వీరు హిందూ ఖగోళశాస్త్రాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించేవారు.[22]

హిందూమతం తరువాత ఇక్కడకు వ్యాపించిన ఇస్లాం ఈ సంప్రదాయ మత క్రమం యొక్క నిర్మాణాన్ని పటిష్ఠపరిచింది. హిందూ ప్రభావాలు తగ్గిపోవడంతో న్యాయస్థానాల్లో (క్యాయీ ) ముస్లిం పండితులు కొత్త మతపెద్దలుగా అవతరించారు. మత పెద్దల యొక్క అధిక్రమం లేదా అధికారిక గురువుహోదాల్లో దేనికి గుర్తింపు ఇవ్వలేదు, అయితే డచ్ వలసరాజ్య ప్రభుత్వం మసీదు మరియు ఇతర ఇస్లామిక్ బోధన పాఠశాలల్లో ఒక విస్తృతమైన హోదాను ఏర్పాటు చేసింది. జావానీయుల పాసెంట్రెన్‌లో (ఇస్లామిక్ పాఠశాలల్లో), క్యాయీ రెసీ సంప్రదాయాన్ని కొనసాగించడం జరిగింది. చుట్టూ ఉండే విద్యార్థులు ఆయన అవసరాలు తీర్చేవారు, పాఠశాల చుట్టూ ఉండే కుటుంబాలు కూడా క్యాయీ అవసరాలను తీర్చేవి.[22]

ఇస్లామిక్-పూర్వ జావాన్ సంప్రదాయాలు ఇస్లాంను ఒక రహస్య దిశలో ప్రోత్సహించాయి. జావాలో దీనితో క్యాయీ ల చుట్టూ తిరిగే బలహీనమైన మత నాయకత్వ సమాజం ఏర్పాటయింది, ఇస్లామిక్-పూర్వ మరియు ఇస్లామిక్ శాస్త్రం, విశ్వాసం మరియు ఆచరణలో వివిధ స్థాయిల పాండిత్యం ఏర్పడింది.[22] గ్రామీణ ప్రజానీకానికి మరియు అధిదైవిక రాజ్యం మధ్య ప్రధాన మధ్యవర్తులుగా క్యాయీలు వ్యవహరించేవారు. అయితే క్యాయీ నాయకత్వం యొక్క ఈ బలహీన నిర్మాణం మతభేదాన్ని ప్రోత్సహించింది. కేవలం ఇస్లామిక్ చట్టాన్ని మాత్రమే బోధించే సాంప్రదాయిక క్యాయీలు మరియు మార్మిక విద్యను బోధించినవారు మరియు ఆధునిక శాస్త్రీయ భావాలతో ఇస్లాం సంస్కరణలను కోరుకున్న వారి మధ్య తరచుగా తీవ్ర విభేదాలు ఏర్పడేవి. దీని ఫలితంగా, ఇస్లామిక్ విశ్వాసం మరియు ఆచరణలో సాంప్రదాయవాదులుగా ఉన్న శాంట్రీ లు, ఇస్లామిక్-పూర్వ జంతు ఆరాధన మరియు హిందూ-భారతీయ భావాలను ఇస్లామిక్ విశ్వాసాలతో మిళితం చేసిన అబాంగాన్‌ ల మధ్య ఒక విభజన ఏర్పడింది.[22]

ఈ విభజన యొక్క విస్తృత ప్రభావం కారణంగా అనేక వర్గాలు ఏర్పడ్డాయి. 1956 మధ్యకాలంలో, యోగ్యకార్తాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ రిలీజియస్ ఎఫైర్స్ జావాలో అధికారిక ఇండోనేషియా మతాలు కాకుండా 62 మత వర్గాలు ఉన్నట్లు గుర్తించింది. వీటిలో 35 మధ్య జావాలో, 22 పశ్చిమ జావాలో మరియు 6 వర్గాలు తూర్పు జావాలో ఉన్నట్లు సూచించింది.[22] కెజావెన్, సుమురా, సుబుద్ తదితరాలు వీటికి ఉదాహరణలు. ఈ మతాచారాలను పాటించే వారి సంఖ్యను అంచనా వేయడం కష్టం, ఎందుకంటే వీటిని ఆచరించేవారు, తమనితాము అధికారిక భాషల్లో ఏదో ఒకదానికి చెందినవారిగా గుర్తించుకుంటున్నారు.[23]

వీటిని కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. పేజి 6
 2. రాఫెల్స్, థామస్ ఇ. : " ది హిస్టరీ ఆఫ్ జావా". ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1965. పేజి 2
 3. 3.0 3.1 రాఫెల్స్, థామస్ ఇ. : "ది హిస్టరీ ఆఫ్ జావా". ఆక్స్‌ఫోర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1965 . పేజి 3
 4. హాట్లే, ఆర్., షిల్లెర్, జే., లూకాస్, ఎ., మార్టిన్ షిల్లెర్, బి., (1984). "మ్యాపింగ్ కల్చరల్ రీజియన్స్ ఆఫ్ జావా" ఇన్: అదర్ జావాస్ అవే ఫ్రమ్ క్రాటన్. పేజీలు. 1–32.
 5. Ricklefs, M.C. (1991). A History of Modern Indonesia since c.1300 (2nd edition). London: MacMillan. p. 15. ISBN 0-333-57690-X.
 6. Monk,, K.A. (1996). The Ecology of Nusa Tenggara and Maluku. Hong Kong: Periplus Editions Ltd. p. 7. ISBN 962-593-076-0. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)CS1 maint: extra punctuation (link)
 7. మేనేజ్‌మెంట్ ఆఫ్ బెంగవాన్ సోలో రివర్ ఏరియా Archived 2007-10-11 at the Wayback Machine. జాసా తీర్తా I కార్పొరేషన్ 2004. జూలై 26, 2006న సేకరించబడింది.
 8. రిక్‌లెఫ్స్ (1991), పేజీలు 16–17
 9. రిక్‌లెఫ్స్ (1991), పేజి 15.
 10. Ames, Glenn J. (2008). The Globe Encompassed: The Age of European Discovery, 1500-1700. p. 99.
 11. జావా - కల్చర్ & హిస్టరీ Archived 2009-10-04 at the Wayback Machine.. Theage.com.au.
 12. జావా (ఐల్యాండ్, ఇండోనేషియా). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.
 13. టైలర్ (2003), పేజి 253.
 14. టైలర్ (2003), పేజీలు 253-254.
 15. 15.0 15.1 టైలర్ (2003), పేజి 254.
 16. "ఎంబసీ ఆఫ్ ఇండోనేషియా, ఒట్టావా". మూలం నుండి 2010-06-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-30. Cite web requires |website= (help)
 17. Calder, Joshua (3 May 2006). "Most Populous Islands". World Island Information. Retrieved 2006-09-26. Cite web requires |website= (help)
 18. CIA factbook
 19. 19.0 19.1 19.2 19.3 19.4 Hefner, Robert (1997). Java. Singapore: Periplus Editions. p. 58. ISBN 962-593-244-5.
 20. సీ వాలెస్ స్టీవెన్స్ పోయెమ్ "టీ" ఫర్ ఎన్ అఫ్రిషియేటివ్ అల్యూషన్ టు జావనీస్ కల్చర్.
 21. లాంగ్వేజెస్ ఆఫ్ జావా అండ్ బాలీ – ఎత్నోలాగ్. ఇతర మూలాలు వీటిని భాషలుగా కాకుండా మాండలికాలుగా సూచించవచ్చు.
 22. 22.0 22.1 22.2 22.3 22.4 22.5 van der Kroef, Justus M. (1961). "New Religious Sects in Java". Far Eastern Survey. 30 (2): 18–15. doi:10.1525/as.1961.30.2.01p1432u.
 23. బెట్టీ, ఆండ్ర్యూ, వెరైటీస్ ఆఫ్ జావానీస్ రిలీజియన్: ఎన్ ఆంత్రోపోలాజికల్ అకౌంట్ , కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ 1999, ISBN 0-521-62473-8

సూచనలు[మార్చు]

 • Taylor, Jean Gelman (2003). Indonesia: Peoples and Histories. New Haven and London: Yale University Press. ISBN 0-300-10518-5.

మరింత చదవడానికి[మార్చు]

 • Cribb, Robert (2000). Historical Atlas of Indonesia. London and Honolulu: RoutledgeCurzon Press, University of Hawaii Press. ISBN 0-8248-2111-4.

బాహ్య లింకులు[మార్చు]

 • మూస:Indonesia