జీవిత నౌక (1951 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జీవిత నౌక
(1951 తెలుగు సినిమా)
Jeevitha Nouka.jpg
దర్శకత్వం వరహాలరాజు
తారాగణం వరహాలరాజు,
ఎ. కమలాదేవి
సంగీతం ఎస్. వేదాచలం
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
నిర్మాణ సంస్థ కె & కె ప్రొడక్షన్స్
తిరుమలై పిక్చర్స్
భాష తెలుగు

జీవిత నౌక (ఆంగ్లము: Jeevitha Nouka or The Boat of Life) 1951 లో విడుదలైన తెలుగు సినిమా. మొట్టమొదట మలయాళంలో తీసిన ఈ సినిమా మంచి "సూపర్ హిట్" విజయం సాధించి 284 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.[1][2] ఆ కాలంలో ఈ సినిమా 5 లక్షల కలెక్షన్లు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సమయంలో చిత్రించారు. ఆ తరువాత హిందీలోకి డబ్బింగ్ చేసి అదే సంవత్సరం విడుదల చేశారు.[3] ఈ సినిమా కేరళలోని ఒక చిన్న పల్లెలో జీవన విధానం ఆధారంగా తీయబడింది. మలయాళ మూలంలో సుకుమారన్ నాయర్ మరియు బి.ఎస్.సరోజ ప్రధాన పాత్రలను పోషించగా; తెలుగులో వరహాలరాజు సోము పాత్ర పోషించి దర్శకత్వం నిర్వహించగా; లక్ష్మి పాత్రను కమలాదేవి ధరించారు.[4] తెలుగు సినిమాకు ఎస్. వేదాచలం సంగీతాన్ని అందించగా, మాటలు మరియు పాటలను బలిజేపల్లి లక్ష్మీకాంత కవి అందించారు.

కథ[మార్చు]

లక్ష్మీ తక్కువ జాతికి చెందిన ఒక బీదయింటిపిల్ల. ఆట, పాట, గొడుగులు కట్టి అమ్మడం వాళ్ళ కులవృత్తి. తండ్రి కేశవుడు తల్లి లేని పిల్ల కావడంతో ఆమెను గారాబంగా పెంచుతాడు. ఆవూరి మొఖాసాదారు విద్యావిహీనుడు, వయస్సుమళ్ళిన వాడైనా యువకుడిలాగా కనిపించాలని జట్టుకు మసిపూసుకుంటూ ఉంటాడు. ఈడొచ్చిన ఆడ పిల్లలపై ఆయనకు వ్యామోహం. ఆయన్ని చెట్టుక్రింద వకీలు ఒకాయన యిష్ట మొచ్చినట్టు ఆడిస్తుంటాడు. మొఖాసాదారు వ్యవహారాలు ఆఫీసు మేనేజరు రాజు చక్కబెడుతూవుంటాడు. రాజు గౌరవమైన కుటుంబంలోని వాడు. కానీ, పెళ్ళాం ముందర పిల్లి, ఆమె పేరు జానకి, పరమ గయ్యాళి. చచ్చిపోయేటప్పడు రాజు తలిదండ్రులు చంటి పిల్లవాడైన సోమాన్ని రాజుకి ఆప్పగిస్తారు. కష్టపడి తమ్మడికి చదువు చెప్పిస్తూ వుంటాడు రాజు. డబ్బు కావలిస్తే దొంగ లెక్కలు వ్రాసి మొఖాసాదారుని దోచుకోమని వకీలు రాజుకి సలహాయిస్తాడు, కానీ రాజు దానికి అంగీకరించడు.

ఒకనాడు రాజు యింటిదగ్గర ముద్దుగా నాట్యం చేస్తున్న లక్ష్మిని సోము చూస్తాడు. ఆ చిన్ని హృదయాల్లో అనురాగం అంకురిస్తుంది. సోమ పైచదువు కోసం పట్నానికి వెళ్తాడు. సోము, లక్ష్మీ ఇద్దరూ యౌవన వంతులవుతారు. పట్నం నుంచి అతను పంపించే కానుకలు అందుకుని మురిసిపోతుంది లక్ష్మి. సోము చదువు ముగించి ఇంటికి వచ్చేసరికి కేశవుడు మరణిస్తాడు. లక్ష్మీ దిక్కులేనిదౌతుంది. సోము ఆమెకు ధైర్య చెప్పి అండగా నిలుచుంటాడు. కళాశాల వార్షికోత్సవంలో సోము లక్ష్మి చేత మేరీ మెగ్డలిన్ కథ నాట్యం ఆడిస్తాడు. ఒక పేద పిల్ల ధనానికి తన శీలాన్ని బలిచేసి, క్రైస్తు ఆదేశంపై పశ్చాత్తాపం చెంది ముక్తి పొందడం ఈ కథ. ఆనాడు ఆ లేత హృదయాల్లో అంకురించిన ఆనురాగం క్రమంగా ప్రేమ అవుతుంది. జాతివిభేదాన్ని ఖండించి లక్ష్మిని పెళ్ళాడ్డానికి నడుంకడతాడు సోము. కాని, రాజు ఆ ఇద్దరి ప్రేమను సమ్మతించడు. జానకి కూడా సోముకి చీవాట్లు పెట్టి లక్ష్మి ఇంటికివెళ్ళి నోటితోనూ, చేత్తోనూ కూడా ఆమెను పరాభస్తుంది. విడిపోయిజీవించలేమని సోము, లక్ష్మి ఒకేసారి కొండ విూదినుంచి దూకిచావాలని బయలుదేరగా రాజు వాళ్ళని వారించి, లక్ష్మి ఇంట్లో వెట్టి చాకిరీకి పనికొస్తుందని చెప్తూ ఒక నెక్లేస్ తో భార్యను సమాధానపరచి, వాళ్ళకు వివాహం చేస్తాడు.

లక్ష్మికి ఒక కొడుకు పుడతాడు. వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసి జానకి కళ్ళు కుడతాయి. సోమాన్నీ, లక్ష్మీనీ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని భర్తతో పోరు పెడుతుంది. భర్తతో లక్ష్మికి రానికి కూడా కడుతుంది. లక్ష్మిని తిడుతుంది, కొడుతుంది. ఆ నరకం సహించలేక లక్ష్మీ భర్తతో కలిసి తన పాతగుడిసెకు పోతుంది. తిండి లేక మాడుతున్న అమ్మనీ, అన్న శంకరాన్నీ యింట్లోకి చేరదీస్తుంది జానకి. తనకి వచ్చీరాని పాఠాలు ఇంట్లో పిల్లలకి చెప్తూ వుంటాడు శంకరం. సోము ఉద్యోగం అన్వేషిస్తూ బయలుదేరి, నానా దేశాలూ తిరిగి, ఓ కారు క్రిందపడతాడు. ఆ కారు ఒక జమీందారిణిది. ఆమె సోమాన్ని ఇంటికి తీసుకు వెళ్ళి, గాయాలు నయం చేయించి తన ఎస్టేటుకు మేనేజరుగా నియమిస్తుంది. సోము లక్ష్మీకి పట్నం నుంచి ప్రతినెలా పంపించే మనియార్డర్లు జానకి, శంకరం ఆందుకొని పంచుకుంటూ వుంటారు. ఒక నాడు శంకరం లక్ష్మిని బలాత్కరించడానికి ఇంటికి వెళ్ళి దూలగుండు తగుల్చుకొని తిరిగివస్తాడు. శంకరం ఆమెను విడవకుండా మళ్ళీ వెళ్ళి ఒక రూపాయి విసిరి రమ్మంటాడు - ఈ ఘోరం మనవిచేసు పోవడానికి మొఖాసాదారు దగ్గరకు లక్ష్మి వెళ్తే, మొఖాసాదారు ద్రవ్యాశ చూపి లక్ష్మిని బలాత్కరించి, ఆమె చేత తాపులు తిని, ఆమె కొంపకి అగ్గి పెట్టిస్తాడు. ఆమెను వూళ్ళోనుంచి గెంటించేస్తాడు. పసిపిల్లాడిని కాపాడుకుంటూ లక్ష్మి తిరగరాని దేశాలు తిరిగి, ఆఖరికి రైల్వేస్టేషను ప్లాట్ ఫారంపై పళ్ళు అమ్ముకుంటూ జమీందారిణి కూతురుతో కూడి రైలుబండి ఎక్కుతూ వున్న సోమాన్ని చూస్తుంది. బండి కదిలిపోతుంది. తల్లి, కొడుకు బండి వెంట పరుగు పెడతారు కాని నిష్ప్రయోజనమౌతుంది.

భర్త సౌఖ్యం కోసం లక్ష్మీ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధపడుతుంది. కానీ, పిల్లాణ్ణి చూస్తూ చావలేకపోతుంది. పట్నంలోకి వెళ్ళి తనలాగే దిక్కుమాలిన నిరుపేదలని చూసి, వాళ్ళ పోషణ కోసం అనాథ శరణాలయం స్థాపిస్తుంది. దాన్ని ఉద్ధరించడానికి నాటకం కంపెనీలో చేరుతుంది. పదిహేను ఎకరాలు బంజరు ఇప్పిస్తానని చెప్పి వకీలు ఒక రైతు దగ్గిర నూరు రూపాయలనోటు చెక్కేస్తాడు. రాజు అదిచూచి, వకీలు దగ్గిరనుంచి ఆ నోటు తన్ని లాక్కుంటాడు. ఆ కక్ష మీద వకీలు దస్తూరితో మొఖాసాదారు చిట్టాలో దొంగ లెక్క ఎక్కించి, మొఖాసాదారు చేత రాజు విూద అరెస్టు వారెంటు బనాయిస్తాడు. హరిశ్చంద్ర మొదలైన నాటకాలు ఆడుతూ, కంపెనీ సోము వున్న పట్టణానికి వస్తుంది. ఆ రోజున అంతిప్పాశ అనే నాటకం ప్రదర్శిస్తూ ఉంటాడు. అంతిప్పాశుడు అన్నగారి భార్యతో సల్లాపం ఆడగా, జాన్ ప్రవక్త ఆతణ్ణి దూషించి నీతి చెప్తాడు. జాన్ ప్రవక్త పాత్ర ధరించినది లక్ష్మి. సోము, జమీందారిణి కూతురు నాటకం చూస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసి కూర్చోడం లక్ష్మి చూస్తుంది. ఆవేశంతో లక్ష్మి కూలబడుతుంది. ప్రవక్త ఆంతిప్పాశునితో ఆడిన మాటకు సోమ చలించి జమీందారిణి వద్ద సెలవు తీసుకొని స్వగ్రామానికి బయలుదేరుతాడు.

రాజు శిక్ష తప్పించుకోడానికి భార్య జానకిని డబ్బు అడుగుతాడు. ఆమె చిల్లి గవ్వైనా యివ్వదు సరిగదా, వకీలు సలహాపైని నగదు పుట్టింటికి నడిపేయడానికి, రాత్రికి రాత్రి శంకరం సహయంతో బయలుదేరుతుంది. సోము ఇంటికి వస్తాడు, పెళ్ళాం పిల్లాడు కనిపించరు. వదినె గారే వాళ్ళదుర్గతికి కారణమని గ్రహించి ఆమెను దూషిస్తాడు. అన్నగార్ని కూడా నిందిస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి రాజును అరెస్టు చేస్తారు. శంకరం, జానకీ ఇంటికి వెళ్ళేమార్గంలో ముసుగుమనుష్యులు వాళ్ళను అడ్డుకుంటారు. వారిలో ఒకడు శంకరాన్ని పొడిచి చంపుతాడు. చివరకు ఏమైంది అన్నది మిగతా కథ.

నటీనటులు[మార్చు]

ఈ జాబితాలో మలయాళ మూలంలోని నటుడు, పోషించిన పాత్ర మరియు తెలుగు సినిమాలో అదే పాత్రపోషించిన నటుల వివరాలు ఉన్నాయి.[5]

 • తిక్కురిసి సుకుమారన్ నాయర్ - సోము - వరహాలరాజు
 • కుంజు కుంజు భాగవతార్ - రాజు - కాటూరి మోహన్
 • బి.ఎస్.సరోజ - లక్ష్మి - ఎ. కమలాదేవి
 • పంకజవల్లి - జానకి - రేడియో భానుమతి
 • ఆదిమూలం - కేశవుడు - వి.వి.టి.చారి
 • ముదుకుళం రాఘవం పిళ్ళై - వకీలు - టి.వి.రమణారెడ్డి
 • ఎస్.పి.పిళ్ళై - శంకరం - ఆర్.కె.రావు
 • మాదప్పన్ - కుంజు - పి.కృష్ణమూర్తి
 • నానుకుట్టన్ - మొఖాసాదారు - ఎం.కృష్ణమూర్తి

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

 1. ఆనందకిషోరా వెన్నతినర రా ఆనంద శ్రీకృష్ణ ఆగడమా
 2. ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై - జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు

మూలాలు[మార్చు]

 1. Thoraval, Yves (1998). The cinemas of India (Les Cinemas de L lnde) (in French). France: Macmillan India. ISBN 0-333-93410-5. 
 2. Kerala Sahitya Academy (1998). Malayalam literary survey Volume 20, Issue 1. Malayalam literary survey. India: Macmillan India. p. 23. 
 3. B. Vijayakumar (16 August 2008). "Jeevitha Nouka 1951". The Hindu. 
 4. National Film Development Corporation of India (1991). Cinema in India: Volume 2. Cinema in India. India. ISBN 0-333-93410-5. 
 5. జీవిత నౌక (1951) సినిమా పాటల పుస్తకం.

బయటి లింకులు[మార్చు]