జులాయి
జులాయి (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
---|---|
నిర్మాణం | ఎస్ రాధాకృష్ణ (చినబాబు) |
కథ | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
చిత్రానువాదం | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
తారాగణం | అల్లు అర్జున్ ఇలియానా సోనూ సూద్ రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిశోర్ |
సంగీతం | దేవి శ్రీ ప్రసాద్ |
సంభాషణలు | త్రివిక్రమ్ శ్రీనివాస్ |
ఛాయాగ్రహణం | చొటా కె. నాయుడు శ్యాం కె నాయుడు |
కూర్పు | ప్రవీణ్ పూడి |
నిర్మాణ సంస్థ | హారిక & హాసిని క్రియేషన్స్ |
భాష | తెలుగు |
జులాయి 2012 లో హారిక & హాసిని క్రియేషన్స్ పతాకం పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్, ఇలియానా, సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలు పొషించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2012 ఆగస్టు 9 న విడుదలై ఘనవిజయాన్ని సాధించింది.
కథ
[మార్చు]అధికారపక్ష శాసన సభ్యులు, విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధినేత అయిన వరదరాజులు (కోట శ్రీనివాసరావు) తన సహచరుడు బిట్టు (సోనూ సూద్)తో కలిసి ఆ బ్యాంకులో ఉన్న 1500 కోట్లను దొంగిలించాలనుకుంటాడు. రవీంద్ర నారాయణ (అల్లు అర్జున్) తెలివైన నేటి తరం కుర్రాడు..అయితే కష్టపడకుండా రాత్రికి రాత్రే ధనవంతుడైపోవాలనే కోరిక ఉన్నవాడు. అది అతని తండ్రి నారాయణ మూర్తి (తనికెళ్ల భరణి)కి నచ్చదు. ఓ రోజు తండ్రితో ఎప్పటిలాగే తగువు పడి పదివేలు పట్టుకెళ్లి ఐదు లక్షలుతో తిరిగివస్తానని క్రికెట్ బెట్టింగ్ కి వెళతాడు. అనుకోకుండా రవి, బిట్టుల దారులు కలిసి బిట్టుని రవికి ఆ రాత్రి ఒక పబ్ దాకా లిఫ్ట్ ఇచ్చేలా చేస్తాయి. ఇంతలో రవి ద్వారా ఐపీఎల్ మ్యాచ్లలో జరిగే బెట్టింగ్ గురించి తెలుసుకున్న బిట్టు రవిని దింపేసాక పోలీసులకి ఫోన్ చేసి సగం మందిని పబ్ దగ్గరకి, సగం మందిని తూర్పు విశాఖకి పంపించి మధ్యలో ఉన్న విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉన్న 1500 కోట్లను తన తమ్ముడు లాలా (షఫీ) సహాయంతో దోచుకుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి తనని వాడుకున్నాడని తెలుసుకున్న రవి సిటీ కమిషనర్ రాజ మాణిక్యం (రావు రమేష్)తో కలిసి బిట్టుని పట్టుకునేందుకు బయలుదేరతాడు. బిట్టుని పట్టుకునే ప్రయత్నంలో లాలా రవి చేతిలో హత్యకు గురౌతాడు. పోలీసులు బిట్టుని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. కానీ దేవయాని (షీతల్ మీనన్) సహాయంతో బిట్టు తప్పించుకుంటాడు. తన సభ్యులతో కలిసి విశాఖ నగర డంపింగ్ యార్డుకి వెళ్ళి తను అక్కడ దాచిన 1500 కోట్లు తగలబడిపోతున్న దృశ్యాన్ని చూస్తాడు. రవిపై పగతో రగులుతున్న బిట్టు నుంచి కాపాడటానికి రాజ మాణిక్యం రవిని భయస్తుడూ, మంచివాడూ, హైదరాబాదు సిటీ కమిషనర్ సీతారాం (రాజేంద్ర ప్రసాద్) ఇంటికి పంపిస్తాడు. హైదరాబాదుకి చేరుకునే ముందు రవి కారు ప్రమాదంలో చనిపోయినట్టు వార్తలను సృష్టించి, వాటిని పేపరులో ముద్రణకు ఇచ్చి హైదరాబాదుకు బయలుదేరతాడు. రవి చనిపోయాడని నమ్మిన బిట్టు తన వాళ్ళతో సహా విదేశాలకు పారిపోవాలనే యత్నాల్లో తలమునకలై ఉంటాడు. ఇదిలా ఉండగా ట్రావెల్స్ మూర్తి (బ్రహ్మాజీ) ఆఫీసులో పనిచేసే మధు (ఇలియానా) అనే అమ్మాయిని రవి ప్రేమిస్తాడు. సీతారాం సహాయంతో తన మనసును గెలుచుకున్న రవి తన ఆఫీస్ కార్డ్ ద్వారా బిట్టు, తన గ్యాంగ్ విదేశాలకు పారిపోవాలని యత్నిస్తున్నట్టు తెలుసుకుంటాడు. పారిపోయే రోజున బిట్టు మధు ఆఫీసుకి పిజ్జా డెలివరీ బాయ్ వేషంలో వచ్చి, మధుని స్పృహ తప్పిపోయేలా చేసి, ఎయిర్ పోర్టుకి బయలుదేరతాడు. మధుని తన భార్యగా చూపించాలని బిట్టు ఉద్దేశం అని తెలుసుకొని సీతారాం, రవి కలిసి బిట్టుని వెంబడిస్తారు. ఫలానా చోట ట్రావెల్స్ మూర్తిని దింపేసి వేరే దారిలో వెళ్ళి పోలీసులని తప్పుద్రోవ పట్టించాలనుకుంటాడు. బిట్టు కదలికను గమనించిన రవి తనని వెంబడిస్తూ వెళ్ళి తనకి ఎదురు నిలుస్తాడు. కానీ మధుని కాపాడుకునే క్రమంలో బిట్టుని వదిలేయాల్సి వస్తుంది. ఆ క్షణం నుంచి బిట్టు రవిపై పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తాడు. రవి కుటుంబాన్ని కిడ్నాప్ చేయాలనుకునే సమయానికి రవి తన తండ్రికి ఫోన్ చేసి అందరినీ హైదరాబాదుకి మొదట రైల్లో, తరువాత క్యాబులో రమ్మని చెప్తాడు. వరదరాజులుని సహాయం అడిగేందుకు వెళ్ళి తనని అవమానించిననందుకు చంపేస్తాడు. కానీ వరదరాజులు చనిపోయే ముందు 1500 కోట్లు రాజ మాణిక్యం ఆధీనంలో ఉన్నాయని చెప్తాడు. దానితో రాజ మాణిక్యంతో బేరం కుదుర్చుకుని రవిని మాణిక్యాన్ని కారులో బాబు పెట్టి చంపినట్టు తతంగాన్ని జరిపి జైలులో పెట్టిస్తాడు. కానీ సీతారాం సహాయంతో రవి బెయిల్ తీసుకుని బైటికొస్తాడు. ట్రావెల్స్ మూర్తి నుంచి తన కుటుంబాన్ని, మధుని కాపాడుకోగలిగిన రవి తన తండ్రిని మాత్రం ట్రావెల్స్ మూర్తి తుపాకి బుల్లెట్ నుంచి కాపాడలేకపోతాడు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక నారాయణ రవిని ఆ 1500 కోట్లను తిరిగి బ్యాంకులోకి చేర్చమని కోరతాడు. తన తండ్రి ద్వారా తన తప్పు తెలుసుకున్న రవి తన తండ్రికి మాటిస్తాడు. ఇంతలో రవి చెల్లెలు రాజిని ట్రావెల్స్ మూర్తి, రాజ మాణిక్యం ద్వారా బిట్టు విశాఖలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న రవి సీతారాం, వాల్మీకి (ఎం.ఎస్.నారాయణ)లతో కలిసి హెలికాప్టరులో విశాఖకు బయలుదేరతారు. అక్కడ 3 కంటైనర్లలో ఒక దానిలో డబ్బుని ఓడరేవుకు తీసుకెళ్తున్నట్టు తెలుసుకున్న సీతారాం, రవికి ఈ విషయాన్ని చెప్తాడు. సీతారాం హెలికాప్టర్ ద్వారా ఆ కంటైనరును అనుసరిస్తుండగా రవి ఒక కారులో తన స్నేహితుల సహాయంతో ఆ కంటైనర్ దారిని మళ్ళించి బ్యాంకు ఎదురుగా ఆగేటట్టు చేస్తాడు. డబ్బులు చేరాయని తెలిసిన రవి పోర్టుకు వెళ్ళి బిట్టుని ఎదిరిస్తాడు. బిట్టు చనిపోయే ముందు చెప్పిన దాన్ని బట్టి తన చెల్లెలు విశాఖ లైట్ హౌస్ వద్ద ఉందని తెలుసుకుంటాడు. రవి రాజిని కాపాడాక సీతారాం దేవయానిని అరెస్ట్ చేస్తాడు. సీతారాం ధైర్యవంతుడిగా మారటం, రవి తన ఆలోచనలను మార్చుకుని కష్టపడి బ్రతకడాన్ని నమ్మి ఒక ఇంటర్వ్యూకి బయలుదేరటంతో సినిమా సుఖాంతమౌతుంది.
నటీనటులు
[మార్చు]- అల్లు అర్జున్ - రవీంద్ర నారాయణ్
- ఇలియానా - మధు
- గద్దె రాజేంద్ర ప్రసాద్ - సీతారాం
- సోనూ సూద్ - బిట్టు
- రావు రమేష్ - రాజ మాణిక్యం
- కోట శ్రీనివాసరావు - వరదరాజులు
- బ్రహ్మాజీ - ట్రావెల్స్ మూర్తి
- తనికెళ్ల భరణి - నారాయణ మూర్తి
- శ్రీముఖి - రాజీ
- బ్రహ్మానందం - బాబాయి
- షఫి - లాలా
- ఎం.ఎస్.నారాయణ - వాల్మీకి
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం - మధు తండ్రి
- శీతల్ మీనన్ - దేవయాని
- తులసి - కామేశ్వరి
- పోసాని కృష్ణమురళి
- హేమ - సుజాత
- గిరిధర్
- నారిపెద్ది శివన్నారాయణ - టీ కొట్టు యజమా
- మాచిరాజు ప్రదీప్ - రేడియో జాకీ
- రజిత
- కల్పిక గణేష్[1][2]
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గీత రచన | గాయకులు | నిడివి | |||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "జులాయి" | రామజోగయ్య శాస్త్రి | సుచిత్ సురేశన్, ప్రియా హిమేష్ | 4:22 | |||||
2. | "ఓ మధూ" | దేవి శ్రీ ప్రసాద్ | అద్నాన్ సామి | 4:05 | |||||
3. | "ఒసేయ్ ఒసేయ్" | శ్రీ మణి | జెస్సీ గిఫ్ట్ | 4:14 | |||||
4. | "చక్కని బైకుంది" | శ్రీ మణి | టిప్పు, మేఘ | 4:05 | |||||
5. | "మీ యింటికి ముందు" | శ్రీ మణి | సాగర్, రాణినారెడ్డి | 3:52 | |||||
6. | "పకడో పకడో" | రామజోగయ్య శాస్త్రి | మాల్గాడి శుభ, దేవి శ్రీ ప్రసాద్ | 4:00 | |||||
24:38 |
విమర్శకుల స్పందన
[మార్చు]123తెలుగు.కామ్ వారు తమ సమీక్షలో "జులాయి చిత్రం మొత్తం పూర్తి హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ చిత్రం మీకు మంచి పాజిటివ్ నవ్వులను పంచుతుందని ఖచ్చితంగా చెప్పగలము." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3.25/5 రేటింగ్ ఇచ్చారు.[3] సినీవనం.కామ్ వారు తమ సమీక్షలో "ఈజీ మనీ కోసం ప్రయత్నిస్తే ఎన్ని అగచాట్లకు గురవ్వాల్సి వస్తుందనేది ఇందులో త్రివిక్రమ్ చెప్పిన నీతి. ముఖ్యంగా ఈ సినిమా అల్లు అర్జున్, త్రివిక్రమ్ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది." అని వ్యాఖ్యానించారు[4] నమస్తే అమెరికా వారు తమ సమీక్షలో "వినోదం మాయలో కొట్టుకుపోయాయి కానీ కథలో, కథనంలో లోపాలున్నాయి. కానీ సరిపడా వినోదాన్నిచ్చారు కాబట్టి ప్రేక్షకుడు ఇలాంటి తప్పులన్నింటినీ క్షమించేస్తాడు. కాబట్టి జులాయికి బాక్సాఫీసులో ఢోకా లేదు." అని వ్యాఖ్యానించి ఈ సినిమాకి 3/5 రేటింగ్ ఇచ్చారు.[5] ఏపీహెరాల్డ్.కామ్ వారు తమ సమీక్షలో "అల్లు అర్జున్ డాన్సులు, త్రివిక్రమ్ మాటలు కోసం ఈ సినిమాను చూడవచ్చు." అని వ్యాఖ్యానించారు.[6] వన్ ఇండియా వారు తమ సమీక్షలో "రెగ్యులర్ ధోరిణిలో కాకుండా ఓ కొత్త కథతో సినిమా చేయటానికి ప్రయత్నించినందుకు త్రివిక్రమ్ ని అబినందించాలి. అయితే త్రివిక్రమ్ నుంచి రెగ్యులర్ గా ఆశించే పంచ్ లు కోసం కామెడీ కోసం వెళితే కాస్త నిరాస వస్తుంది. అల్లు అర్జున్ కొత్త సినిమా... చూద్దాం అని వెళితే ఓకే అనిపిస్తుంది.. అంతే." అని వ్యాఖ్యానించారు.
పురస్కారాలు
[మార్చు]- నంది పురస్కారం - 2012 నంది పురస్కారాలులో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ కొరియోగ్రాఫర్ (జానీ- మీ ఇంటికి ముందో గేటు) విభాగంలో అవార్డులు వచ్చాయి.[7][8][9][10]
- సైమా అవార్డులు (2012): ఉత్తమ సహాయనటుడు (రాజేంద్రప్రసాద్)
మూలాలు
[మార్చు]- ↑ The Times of India, Entertainment (15 June 2019). "Kalpika Ganesh of 'Sita on the Road' fame looks fabulous and droolworthy in her latest photo-shoot" (in ఇంగ్లీష్). Archived from the original on 21 May 2020. Retrieved 21 May 2020.
- ↑ The Hindu, Entertainment (28 December 2018). "Driven by the love of cinema: Kalpika Ganesh". Y. Sunita Chowdhary. Archived from the original on 28 December 2018. Retrieved 21 May 2020.
- ↑ "సమీక్ష: జులాయి – 100% త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్". 123తెలుగు.కామ్. Retrieved 9 August 2012.
- ↑ "జులాయి రివ్యూ". సినీవనం.కామ్. Retrieved 10 August 2012.[permanent dead link]
- ↑ "జులాయి రివ్యూ". నమస్తే అమెరికా. Archived from the original on 2012-11-04. Retrieved 9 August 2012.
- ↑ "జులాయి: రివ్యూ". ఏపీహెరాల్డ్.కామ్. Retrieved 9 August 2012.
- ↑ "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 30 June 2020.
- ↑ మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- ↑ నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 30 June 2020.
- All articles with dead external links
- 2012 తెలుగు సినిమాలు
- నంది ఉత్తమ చిత్రాలు
- రాజేంద్ర ప్రసాద్ నటించిన సినిమాలు
- తనికెళ్ళ భరణి సినిమాలు
- కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు
- అల్లు అర్జున్ నటించిన సినిమాలు
- ఇలియానా నటించిన సినిమాలు
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం నటించిన సినిమాలు
- పోసాని కృష్ణ మురళి సినిమాలు
- త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు