జైన హస్తప్రతులు

జైన చిత్రకళ 2వ శతాబ్దం లో పశ్చిమ భారతదేశం లో విలసిల్లిన చిత్రకళా శైలి.[1] ఇది ఒక సాంప్రదాయిక సూక్ష్మచిత్రకళ. 2వ శతాబ్దంలో మొదలైన ఈ శైలి 12–16వ శతాబ్దం వరకు మనుగడలో ఉంది. ఇది ఎక్కువగా గుజరాత్ లో కనిపించినా, ఉత్తర ప్రదేశ్, ఒడిశా వంటి ప్రాంతాల్లో కూడా దీని ఆనవాళ్ళు కలవు. ఐదవ శతాబ్దంలో వచ్చిన కరువు, జైన ఆధ్యాత్మికత, పదమూడవ శతాబ్దం లో ముస్లింల దండయాత్రలు, గుజరాత్ దురాక్రమణ, మొఘల్ చిత్రకళ, పర్షియన్ చిత్రకళల ప్రభావం, ఇటువంటి క్లిష్ట పరిస్థితులో కూడా జైన మత ప్రచారం ఆగకూడదన్న జైనుల ధృఢ విశ్వాసం, తాళపత్రాలు-కాగితం సంధికాలం లో ఈ శైలి దినదినప్రవర్థమానం అవ్వటం, వంటి పరిస్థితులు జైన చిత్రకళకు ఊపిరి పోయటమే కాక, పురోగమిస్తూ క్రొత్త సొబగులు అద్దుకొంది.[2][3][4]
చరిత్ర
[మార్చు]బుద్ధుణ్ణి, అతని బోధనలను రాబోయే తరాలు మరచిపోతారనే భయంతో ఎలాగైతే పాల చిత్రకళ ఉద్భవించిందో, మహావీరుడు, అతని బోధనలు రాబోయే తరాలు మరచిపోతారనే భయంతో నే జైన కళ కూడా ఉద్భవించటం విశేషం.[2]
ఐదవ శతాబ్దంలో వచ్చిన తీవ్రమైన కరువుకు జ్ఞానులు ఐన పలువురు జైన భిక్షువులు మరణించారు. ఈ సాంప్రదాయాన్ని కోల్పోతాం అనే భయమే జైన చిత్రకళకు మూల కారణం.[2] అప్పటి కాలంలో జైన సమాజ గ్రంథాలయాల్లో భద్రపరచబడటం వలనే ప్రస్తుత కాలంలో ఈ జైన హస్తప్రతులు బయటపడుతోన్నాయి.[3]
పదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు చాళుక్యులు గుజరాత్, రాజస్థాన్, మాల్వా ప్రదేశాలను పాలించారు. పలు జైన మందిరాలు, గ్రంథాలయాలను నిర్మించి జైన మతాన్ని విస్తారంగా వ్యాపింపజేసారు. పన్నెండవ శతాబ్దానికి చెందిక కుమారపాలుడు విరివిగా నిధులు ధారపోసి కల్పసూత్ర యొక్క వందలాది ప్రతులను ముద్రింపజేసాడు.[4]
- కాళక చర్య కథ నుండి కొన్ని చిత్రలేఖనాలు
- సాధువుకు పలకబడుతోన్న ఘనస్వాగతం
- తీర్థంకర వృషభుని జననం
- మహావీరుణ్ణి స్తుతిస్తున్న ఇంద్రుడు
- సోదరీమణులతో స్థూలభద్రుడు
సంస్కృతి
[మార్చు]
ధార్మిక రచనలు ఆదేశిస్తే పుణ్యం సంపాదించవచ్చు అనేది జైనుల నమ్మకం. [3] జ్ఞాన సారం ఉన్న పుస్తకాల యొక్క పూజ జ్ఞానపూజగా పరిగణించబడేది. [4] ఐదవ శతాబ్దం వరకు జైన దేవాలయాల క్రింద ఉన్న సొరంగాలలో జైన భండారాలలో జైన సాహిత్యం, ఈ శైలి చిత్రకళలు భద్రపరచబడ్డాయి.[2] గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన రాజులు, వ్యాపారవేత్తల ఆధ్యాత్మిక చింతన వలన, ఆర్థిక సహాయసహకారాల వలన పదవ శతాబ్దం నుండి ఈ భాండారాలు దినదిన ప్రవర్థమానాలు అయ్యాయి. జైన ఆధ్యాత్మిక చింతనలో శ్వేతాంబర శాఖలో వార్షికంగ జరిపే పర్యుషణ పండుగకు కల్పసూత్ర ను పూజించటం నాటికి, నేటికి కూడా సాంప్రదాయమే. స్వర్గంలో నివసించే జైనులను పాలించే ఇంద్రుడు జైన మందిరాలలో నివసిస్తాడనే నమ్మకంతో ఈ పండుగకు జైన మందిరాలను వస్త్రం పై చేయబడ్డ చిత్రకళలతో అలంకరించి, ఈ హస్తప్రతులను ఖరీదైన వస్త్రాలలో ఉంచి, వాటిని పూజించటం సంప్రదాయం.[4]
శైలి
[మార్చు]ఉపయోగించబడిన పదార్థాలు
[మార్చు]12 x 4 అంగుళాల (30 x 10 సెంటీమీటర్ల) పరిణామాలు గల దీర్ఘచతురస్రాకార తాళపత్రాలపై, తర్వాతి కాలంలో కాగితం పై ఈ హస్తప్రతులు చిత్రీకరించబడ్డాయి. [2] [3]
అంశాలు
[మార్చు]తొలుత రచించబడ్డ హస్తప్రతులలో చిత్రకళకు పెద్దగా ప్రాధాన్యత లేదు. క్రీ.శ 1100వ సంవత్సరంలో రచించబడ్డ హస్తప్రతి నిశ్చితచరణ లో అలంకారోద్దేశ్యంతో కేవలం కొన్ని రేఖాగణితాంశాలు, సరళమైన పుష్ప చిత్రకళలతో వ్రాయబడ్డవి. పన్నెండవ శతాబ్దం నుండి ఈ హస్తప్రతులలో దైవికాంశాలు కూడా చిత్రీకరించబడ్డవి. పధ్నాలుగవ శతాబ్దం లో సుల్తాను హయాం లో గుజరాత్ లో రూపొందిన హస్తప్రతి కల్పసూత్ర కాగితంపై చేయబడ్డనూ, తాళపత్రాలు 1450 వరకూ ఉపయోగించబడ్డవి. [2]
కల్పసూత్రాలు పూర్వీకుల వంశావళి, తీర్థంకరుల కథలు తెలుపగా, కాళకచర్య కథ లో తన సోదరిని అపహరించిన ఒక రాజు నుండి ఆమెను కాపాడటానికి విదేశీయులైన శకులను ఆహ్వానించి ఆ రాజ్యం పై దాడి చేయించి తన సోదరిని రక్షించుకొంటాడు.[2]
కాగితం ఆవిష్కరణతో జైన చిత్రకళ క్రొత్త సొబగులు అందుకొంది. పదిహేనవ శతాబ్దం లో ఇస్లామిక్ హస్తప్రతుల ప్రభావం తో అంచుల వెడల్పు పెరిగింది. నీలి, ఎరుపు వర్ణాలలో క్రొత్త ఉపవర్ణాలు, అక్కడక్కడా స్వర్ణం, వెండిల అద్దకాలతో మరింత లావణ్యం తో ఈ శైలి కొత్త పుంతలు తొక్కింది. [2]
సరళి
[మార్చు]
జైన చిత్రకళ లో హిందూ మత అంశాలే చిత్రీకరించబడినవి. ఐహిక ప్రపంచాన్ని మించిన దృష్టిని ఇవి కలిగి ఉండేవి.[1]
సన్నని సరళ రేఖలు, కోణాకార రేఖాచిత్రణ తో జైన చిత్రకళ చాలా సులువుగా కనబడ్డనూ, ప్రారంభ యుగ భారతీయ కుడ్య చిత్రాలలో కనబడ్డ సహజత్వం వీటిలో లోపించిననూ, అత్యంత సంప్రదాయబద్ధంగా రూపుదిద్దుకొన్న ఆకృతులు, ప్రకాశవంతమైన రంగులు, ఉట్టిపడే జీవకళ, కంటికి ఇంపైన భంగిమలు, లయబద్ధమైన కూర్పు ఈ శైలి యొక్క ప్రత్యేకతలు. [3]శరీరం మొత్తం ముందు వైపు చూపుతున్నట్టు చిత్రీకరించినను, తల మాత్రం ప్రక్కవైపు నుండి చూపుతున్నట్టు చిత్రీకరించబడుతుంది. ముఖాకృతులలో మొనదేలిన ముక్కులు, ముఖానికి అటుప్రక్క ఉన్న కన్ను పొడుచుకొని వచ్చినట్టు కనబడే కంటి రూపం ఈ శైలిలో గమనించవచ్చు.[3]
పదమూడవ శతాబ్దం చివర్లో గుజరాత్ పై ముస్లిం ల ఆక్రమణల కారణంగా కొత్త దేవాలయాల నిర్మాణం తగ్గిపోవటంతో, సంపన్న దాతలు ఈ హస్తప్రతులలో స్వర్ణం కూడా ఒక రంగుగా ప్రవేశపెట్టటం జరిగింది. [3] [4]
పదహరవ శతాబ్దం నుండి కల్పసూత్ర పై ఆసక్తి తగ్గి, దాని స్థానే హైందవ అంశాలు సరిక్రొత్త శైలి లో చిత్రీకరించబడ్డాయి.[2]
ప్రభావిత శైలులు
[మార్చు]తర్వాత వచ్చిన రాజపుత్ చిత్రకళ (రాజస్థానీ, మాల్వా), అవధ్ శైలి, చౌరపంచాశిఖ చిత్రకళకు జైన చిత్రకళయే మూలం అయ్యింది.[1]
- జైన చిత్రకళ
- మహావీరుని జన్మవృత్తాంతం
- తండ్రి ఒడిలో బాల మహావీరుడు
- దేవానందుడికి వచ్చిన 14 కలలు మహావీరుని జననం గురించి ముందే తెలిపిన దృశ్యం
- మహావీరునికి నివాళులు అర్పిస్తున్న ఇంద్రుడు
- కల్పసూత్రుల వీరోచిత గాథలు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- 1 2 3 Doordarshan National (2014-07-21), Paintings of India - Exuberance of Life, ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-04-12
- 1 2 3 4 5 6 7 8 9 "Jain and Buddhist Manuscript Painting | Encyclopedia.com". www.encyclopedia.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-04-20.
- 1 2 3 4 5 6 7 Britannica. "Western Indian Painting". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-04-20.
{{cite web}}: CS1 maint: url-status (link) - 1 2 3 4 5 Guy, John (2012-01-01). "Jain Manuscript Painting - The Metropolitan Museum of Art". www.metmuseum.org (in ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-04-20.